• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర

ప్రజాభీష్టమే శిరోధార్యమై!

 

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ మలిదశ ఉద్యమంలో జనబాహుళ్యంలోకి విస్తృతంగా చొచ్చుకొని వెళ్లింది. ప్రజాభీష్టమే శిరోధార్యంగా మెజార్టీ పార్టీలు తెలంగాణకు జై కొట్టాయి. రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పుట్టిన తెరాస ప్రత్యేకవాదాన్ని ఉద్యమ నినాదంగా మారుమోగించింది. భావసారూప్య పార్టీలన్నీ తెలంగాణ రాజకీయ సమితిలో భాగమయ్యాయి. ఐకాస ఇచ్చిన ఒక్క పిలుపుతో ప్రజా సంఘాలు, పార్టీలు కదిలివచ్చాయి. తమ తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ క్రతువులో పార్టీల వారీగా భాగస్వామ్యం, అవి అవలంబించిన విధానాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009, డిసెంబరు 23న నాటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ప్రకటించారు. ఆ వెంటనే తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి (ఐకాస) ఏర్పాటైంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ని నియమించారు. ఈయన తెలంగాణలోని రాజకీయ పార్టీలను, ఉద్యమ సంఘాలను సంఘటితం చేశారు. అన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, తెలంగాణ ఉద్యమాన్ని అహింసా మార్గంలో కొనసాగించి రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు. రాజకీయ ఐకాసలో కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ఉద్యోగ, కుల, వృత్తి, పౌరసమాజ, కార్మిక సంఘాలు ఏకమై ప్రత్యేక తెలంగాణవాదమే లక్ష్యంగా పోరాటం సాగించాయి.


ముఖ్యమైన పార్టీలు-వాటి వైఖరులు: ఉద్యమం సమయానికి తెలంగాణలో ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ (ఎం.ఎల్‌) న్యూ డెమోక్రసీ, ఎమ్‌ఐఎమ్, లోక్‌సత్తా, పీఆర్‌పీ, వైఎస్‌ఆర్‌సీపీ మొదలైన పార్టీలు ఉన్నాయి. వీటిలో టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ మాత్రమే మొదటినుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు పలికాయి. మిగిలిన పార్టీలు సందర్భానుసారంగా తమ వైఖరిని వెల్లడిస్తూ వచ్చాయి.


టీఆర్‌ఎస్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ. ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు చేసిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో తెలంగాణ ప్రజలను జాగృతం చేసింది. తెలంగాణ అస్థిత్వ నినాదంతో తెలంగాణ సాంస్కృతిక విశిష్టతను పలురూపాల్లో ప్రదర్శించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సమ్మెలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అనుకూలంగా సమాజంలోని అన్నివర్గాల మద్దతు కూడగట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించింది. కవులు, కళాకారుల ధూం ధాం ప్రదర్శన, వంటావార్పు, రాస్తారోకో, రైల్‌ రోకో, సకలజనుల సమ్మె మొదలైన కార్యక్రమాలతో ప్రజలందరినీ ఉద్యమంలో భాగస్వాములను చేసింది. తెలంగాణ అంశాన్ని జాతీయస్థాయిలో చర్చనీయాంశం చేయడంలో టీఆర్‌ఎస్‌ సఫలీకృతమైంది. వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాలను సంఘటితం చేసి ప్రజా ఉద్యమంగా విస్తరింపజేయడంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ వ్యూహాత్మకంగా కృషి చేసింది. 2009, నవంబరు 29 నుంచి డిసెంబరు 9 వరకు కేసీఆర్‌ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది.


తెలంగాణ కాంగ్రెస్‌: ఈ పార్టీ 1990 దశకం నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదాన్ని మొదలుపెట్టింది. 1990లో జానారెడ్డి కన్వీనర్‌గా ఏర్పడిన కాంగ్రెస్‌ తెలంగాణ ఫోరం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుకు వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జి.చిన్నారెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం 2001, ఆగస్టు 11న అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం సమర్పించింది. దీనికి స్పందించిన సోనియా నాటి కేంద్ర హోంమంత్రి ఎల్‌.కె.ఆడ్వాణీ దృష్టికి తెలంగాణ అంశాన్ని తీసుకెళ్లారు. తర్వాత 2014లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు, సొంత పార్టీ సభ్యులు వ్యతిరేకించిన్పటికీ బిల్లును ఆమోదింపజేసి 58 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 2004 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షతన ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం తన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌)లో తెలంగాణ అంశాన్ని పొందుపరిచింది. నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని చేర్చింది.


బీజేపీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ పార్టీ మొదటినుంచి పరోక్షంగా మద్దతిస్తూ వచ్చింది. 1998లోనే కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో ‘ఒక ఓటు - రెండు రాష్ట్రాలు’ అనే నినాదాన్ని ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం దేశంలో చిన్న రాష్ట్రాలు అవసరమని బీజేపీ భావించింది. 2000లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసే సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గింది. 2008, నవంబరు 13న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో 2009 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఎల్‌.కె.ఆడ్వాణీ చేసిన ప్రకటనతో తెలంగాణకు బీజేపీ అనుకూలమని స్పష్టమైంది. 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలంగాణ పోరు యాత్ర నిర్వహించడమే కాకుండా దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తెలంగాణ పోరు దీక్ష జరిపారు.


* 2014లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లును ఆమోదించినప్పుడు సుష్మాస్వరాజ్, ఫిబ్రవరి 20న రాజ్యసభలో అరుణ్‌ జైట్లీ ప్రధానపాత్రలు పోషించారు.


టీడీపీ: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి 2008, అక్టోబరు 18న లేఖ ఇచ్చింది. అంతేకాకుండా 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో జత కట్టి తెలంగాణవాదానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 2014లో రాష్ట్ర శాసనసభలో, పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీడీపీకి చెందిన తెలంగాణ సభ్యులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారు.


సీపీఐ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదటి నుంచి మద్దతుగా నిలిచింది.


సీపీఐ(ఎం): పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తటస్థంగా వ్యవహరించింది.


సీపీఐ(ఎం.ఎల్‌.): న్యూ డెమోక్రసీ: ఈ పార్టీ తెలంగాణ వాదాన్ని మొదటి నుంచి బలపరిచింది.


ఎంఐఎం: ఈ పార్టీ మొదట సమైక్య వాదాన్ని, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు తర్వాత రాయల తెలంగాణ వాదాన్ని బలపరిచింది. చివరకు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది.


వైఎస్‌ఆర్‌సీపీ: ఈ పార్టీ మొదటి నుంచి తెలంగాణవాదాన్ని వ్యతిరేకించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించింది.


లోక్‌సత్తా: ఈ పార్టీ తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపలేకపోవచ్చని పేర్కొంది.


పీఆర్‌పీ: సామాజిక తెలంగాణవాదాన్ని బలపరుస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది.


తెలంగాణ ప్రజా ఫ్రంట్‌: గద్దర్‌ ఏర్పాటుచేసిన ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంపూర్ణంగా సమర్థించింది.


ఎంఎస్‌పీ (మహాజన సోషలిస్ట్‌ పార్టీ): మందకృష్ణ మాదిగ స్థాపించిన ఈ పార్టీ ప్రత్యేక తెలంగాణ వాదాన్ని బలపరించింది.


తెలంగాణ బహుజన సంఘం: ఈ పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసింది. 


తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌: కేశవరావు జాదవ్‌ అధ్యక్షుడిగా, అరుణోదయ విమలక్క ఉపాధ్యక్షురాలిగా, శాసనమండలి సభ్యులు దిలీప్‌కుమార్‌ సెక్రటరీ జనరల్‌గా ఏర్పాటైన ఈ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసింది. 


‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన’ అనే బలమైన ఆకాంక్ష, రాజకీయ పార్టీలు తమ ఇతర సిద్ధాంతాలను పక్కనపెట్టి ఉమ్మడి వేదికపై పోరాడే విధంగా చేసింది. ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని తెలంగాణ నలుమూలల్లోకి విస్తరింపజేసి, ప్రజా బాహుళ్యాన్ని ఉద్యమంలో క్రియాశీల భాగస్వాములను చేసే విధంగా రాజకీయ పార్టీలు పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహించాయి. ప్రత్యేక తెలంగాణ మలి దశ ఉద్యమ కాలంలో ఇక్కడి రాజకీయ పార్టీలన్నీ క్రియాశీలకంగా పనిచేశాయి.

రచయిత: ఎ.ఎం.రెడ్డి

Posted Date : 11-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌