• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ మలిదశ ఉద్యమం - అనూహ్య పరిణామాలు

 మలుపులు తిరిగి.. మహోద్ధృత పోరుగా మారి!

 

  

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అందరూ అంగీకరిస్తున్నారు. అయినా అడుగు ముందుకు పడటం లేదు. రాజీనామాలు చేసినా, రకరకాల ఒత్తిడులు తెచ్చినా ఫలితం ఉండటం లేదు. ఆ దశలో 2009లో చకచకాజరిగిన అనేక పరిణామాలు మలి దశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృత స్థాయికి చేర్చాయి. హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌పై సుప్రీంకోర్టు తీర్పు, సిద్దిపేట సింహగర్జన, అన్నింటికీ మించి కేసీఆర్‌ ఆమరణ దీక్ష, విద్యార్థుల త్యాగాలతో కేంద్రం దిగివచ్చి అత్యంత కీలకమైన ప్రకటన చేయాల్సి వచ్చింది. అనంతరం సంయుక్త కార్యాచరణ కమిటీ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, తెలంగాణ ఆవిర్భావ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా వడి వడిగా నడిపించాయి.


 సార్వత్రిక ఎన్నికల అనంతరం 2004లో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ భాగస్వామిగా చేరింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాల పర్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చింది. దాంతో యూపీఏ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడలేదు. ఇంతలో 2009 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. 2008లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి రోశయ్య కమిటీని నియమించారు. తాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని రాజశేఖర్‌రెడ్డి కూడా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు రోశయ్య కమిటీని కంటితుడుపు కమిటీగా విమర్శించారు.

* తెలుగుదేశం పార్టీ 2008, అక్టోబరు 18న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఆ మేరకు పార్టీ లేఖను విధానసభ మాజీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడి ద్వారా ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి సమర్పించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2009 ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు.

2009 రాష్ట్ర విధానసభ ఎన్నికలు - చతుర్ముఖ పోటీ (కాంగ్రెస్‌ (యూపీఏ) - మహాకూటమి - ప్రజారాజ్యం - లోక్‌సత్తా): టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలైన తెలుగుదేశం, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని మహాకూటమిలో చేరింది. అంతకుముందే సినీ నటి విజయశాంతి ఏర్పాటుచేసిన తల్లి తెలంగాణ పార్టీ టీఆర్‌ఎస్‌లో విలీనమైంది.


ప్రజారాజ్యం పార్టీ: 2008, ఆగస్టు 26న చలనచిత్ర నటుడు చిరంజీవి సామాజిక న్యాయ సాధన కోసం ‘ప్రజారాజ్యం’ అనే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్, మహాకూటమి పార్టీలకు దీటుగా ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర మాజీ హోం మంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ స్థాపించిన నవ తెలంగాణ పార్టీ ప్రజారాజ్యంలో విలీనమైంది.

లోక్‌సత్తా పార్టీ: మాజీ ఐఏఎస్‌ అధికారి ఎన్‌.జయప్రకాశ్‌ నారాయణ్‌ 2006లో స్థాపించిన లోక్‌సత్తా పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ అనివార్యమైంది.

2009 ఎన్నికల పోలింగ్‌ తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్‌ 16న, ఆంధ్రా ప్రాంతంలో ఏప్రిల్‌ 23న ముగిసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర విధానసభలో కాంగ్రెస్‌ 156, తెలుగుదేశం 92, ప్రజారాజ్యం 18, టీఆర్‌ఎస్‌ 10, ఎంఐఎం 7, సీపీఐ 4, సీపీఎం 1, లోక్‌సత్తా 1, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 33, తెలుగుదేశం 6, ఎంఐఎం 1, టీఆర్‌ఎస్‌ 2 సీట్లు దక్కించుకున్నాయి. టీఆర్‌ఎస్‌ గెలిచిన వాటిలో ఒకటి కె.చంద్రశేఖర్‌రావు (మహబూబ్‌నగర్‌), మరొకటి విజయశాంతి (మెదక్‌) ఉన్నాయి. ఆ ఎన్నికల తర్వాత రాష్ట్ర విధానసభలో ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. శాసనసభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చర్చించాలని పట్టుబట్టారు. దానికి నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అంత సుముఖత వ్యక్తం చేయలేదు. 2009, సెప్టెంబరు 2న నల్లమల్ల కొండల్లోని పావురాలగుట్ట ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ మరణించడంతో, సెప్టెంబరు 3న కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


మలి ఉద్యమకాలంలో మరో మైలురాయి - హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చిన పేరా 14 ఎఫ్‌: 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు 2009 నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని 6 జోన్లుగా మాత్రమే విభజించాయి. ఈ ఉత్తర్వుల్లో హైదరాబాద్‌ నగరాన్ని ఫ్రీ జోన్‌ అని గానీ, ఏడో జోన్‌ అని గానీ ఎక్కడా పేర్కొనలేదు. కానీ నాటి పాలకులు, అధికారులు పేరా 14 ఎఫ్‌ను ఆధారం చేసుకొని హైదరాబాదును 7వ జోన్‌ అంటూ, ఫ్రీ జోన్‌గా ప్రకటించి అన్ని రకాల పోస్టులకు వర్తింపజేశారు. దాంతో హైదరాబాద్‌లోని స్థానిక అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఇక్కడి పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ శాఖలన్నింట్లో స్థానికేతరులు పెద్దఎత్తున నియమితులయ్యారు. నిజానికి 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా 14 ఎఫ్‌  హైదరాబాదు పోలీసు శాఖలోని సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మాత్రమే సంబంధించింది. అంటే హైదరాబాదు నగరంలోని ఆ పోలీసు ఉద్యోగాలకు స్థానికత వర్తించదు. రాష్ట్రంలోని అన్ని జోన్ల అభ్యర్థులు వాటికి పోటీ పడవచ్చు. 14 ఎఫ్‌ పేరాలోని ఈ అంశం రాజ్యాంగ బద్ధతను పి.వి.రాధాకృష్ణ, ఇతరులు నాటి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ట్రైబ్యునల్‌లో సవాలు చేశారు. ‘14 ఎఫ్‌ పేరా’ రాజ్యాంగ వ్యతిరేకమని ధర్మాసనం తీర్పుచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తూ 2009, అక్టోబరు 9న సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఆ తీర్పుతో హైదరాబాద్‌ స్థానికులు ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు నిరసనగా తెలంగాణలోని ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సమ్మెలు, బంద్‌లను నిర్వహించారు.

సిద్దిపేట సింహగర్జన (2009, అక్టోబరు 21):  సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా పేరా 14 ఎఫ్‌ను రద్దు చేయాలని, హైదరాబాద్‌ను 6వ జోన్‌లో అంతర్భాగంగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సిద్దిపేటలో 2009, అక్టోబరు 21న బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్‌ అధ్యక్షత వహించిన ఈ సభకు పెద్దసంఖ్యలో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు హాజరయ్యారు. కేసీఆర్‌ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం పేరా 14 ఎఫ్‌ను రద్దు చేయడానికి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

* 2009, అక్టోబరు 28న తెలంగాణ వ్యాప్తంగా జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లో భారీ ఊరేగింపు, బహిరంగ సభ జరిగాయి. ఈ సభలోనే కేసీఆర్‌ ప్రసంగిస్తూ ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ జరుగుతుందన్నారు. 14 ఎఫ్‌ రద్దు కోసం తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు.

* కేంద్ర ప్రభుత్వం 2009, నవంబరు 28లోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే 29 నుంచే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నవంబరు 5న కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ వస్తే జైత్ర యాత్ర, లేదంటే శవయాత్ర జరపాలని చెప్పారు.


కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష

కేంద్ర ప్రభుత్వం 14 ఎఫ్‌ రద్దు చేయకపోవడంతో కేసీఆర్‌ 2009, నవంబరు 29న సిద్దిపేట పట్టణ పరిసరాల్లోని రంగధాంపల్లి గ్రామ శివారులో ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లు చేయించారు. నవంబరు 26న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ చేరుకుని 3 రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించారు. 29న ఉదయం రంగధాంపల్లికి బయలుదేరారు. కరీంనగర్‌ - సిద్దిపేట మార్గంలోని అలుగునూరు చౌరస్తా చేరుకోగానే పోలీసులు కేసీఆర్‌ వాహనాన్ని ఖమ్మం వైపు మళ్లించారు. ఖమ్మం చేరగానే ఆయన్ని అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ కేసీఆర్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఆదేశించడంతో ఖమ్మం జిల్లా జైల్లో ఉంచారు. కేసీఆర్‌ జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించారు. ఆయన నిర్బంధానికి నిరసనగా నవంబరు 30 నుంచి తెలంగాణ అంతటా సమ్మెలు, బంద్‌లతో అట్టుడికి పోయింది.

* నవంబరు 30న హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌ చౌరస్తాలో శ్రీకాంతాచారి అనే విద్యార్థి శరీరానికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. (ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ చౌరస్తాకు శ్రీకాంతాచారి చౌరస్తా అని పేరు పెట్టింది.) తీవ్ర గాయాలపాలైన శ్రీకాంతాచారిని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ డిసెంబరు 3న చనిపోయాడు.

* ఖమ్మం జైల్లో కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో డిసెంబరు 3న భారీ బందోబస్తుతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ కూడా కేసీఆర్‌ పరిస్థితి మరింతగా క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. డిసెంబరు 9న నాటి కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్‌కు  ప్రొఫెసర్‌ జయశంకర్‌ పళ్ల రసం ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేశారు. చిదంబరం ప్రకటనకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌తో అనేక సార్లు చర్చించింది. ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మినహాయించి మరే అంశాన్ని అంగీకరించడం కుదరదు’ అని ఆయన స్పష్టం చేయడంతో కేంద్రం దిగొచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది.

* కేంద్రం ప్రకటనతో తెలంగాణ ప్రాంతమంతా సంబురాలు మిన్నంటాయి. కానీ ఆంధ్ర ప్రాంతంలో సమ్మెలు, బంద్‌లు జరిగాయి. దాంతో అక్కడి శాసనసభ్యులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన విధానసభ సభ్యులంతా పార్టీలకు అతీతంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను నాటి విధానసభ స్పీకర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డికి సమర్పించారు. కానీ ఆయన వాటిని ఆమోదించలేదు. మరోవైపు ఆంధ్రా ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు, డిసెంబరు 9 నాటి ప్రకటనను విరమింపజేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబరు 23న రాత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన మరో ప్రకటన చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు 9 నాటి ప్రకటన తర్వాత మారిన పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలతో విస్తృత చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత వర్గాల ప్రజలందరితో చర్చించి నిర్ణయిస్తుంది’ అని స్పష్టం చేశారు. డిసెంబరు 23 నాటి కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాదులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. అదేరోజు అర్ధరాత్రి కేసీఆర్, ప్రొఫెసర్‌ జయశంకర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కె.జానారెడ్డి ఇంట్లో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు.

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీపీజేఏసీ) 2009: జానారెడ్డి ఇంట్లో డిసెంబరు 23న సమావేశమైన కేసీఆర్, కె.జయశంకర్‌ తదితరులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను సంఘటితం చేసుకుని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సారథ్యం వహించాలని జయశంకర్‌ను కోరగా, ఆయన ఆ బాధ్యతను తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు అప్పగించారు.

* 2009, డిసెంబరు 24న తెలంగాణ ప్రాంతంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం (ఎమ్‌.ఎల్‌.), న్యూడెమోక్రసీలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తున్న అన్ని ప్రజాసంఘాల నాయకులు కలిసి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సమావేశమయ్యారు..కోదండరామ్‌ను టీపీజేఏసీ కన్వీనర్‌గా, సీనియర్‌ జర్నలిస్టు, ఉద్యమకారుడు మల్లేపల్లి లక్ష్మయ్యను కో-కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

* తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం మొదటిసారిగా 2009, డిసెంబరు 25న బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో కోదండరామ్‌ అధ్యక్షతన జరిగింది. అందులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొనసాగించే ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. టీపీజేఏసీ ఏర్పాటైన తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం కీలక మలుపు తిరిగింది. తదనంతర కాలంలో ఈ కమిటీ సహాయ నిరాకరణోద్యమం, మిలియన్‌ మార్చ్, సకలజనుల సమ్మె, వంటావార్పు, పల్లె పల్లె పట్టాలపైకి మొదలైన ప్రజా పోరాటాలు నిర్వహించింది. ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతమంతా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవాన్ని సాకారం చేసే దిశగా నడిపించింది.

రచయిత: ఎ.ఎం.రెడ్డి

Posted Date : 04-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌