• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ప్రజా సమితి పగ్గాలు

ఉద్యమ పర్వంలో చెన్నారెడ్డి
జల ప్రవాహంలా నిశ్శబ్దంగా మొదలై.. అలలా ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దిల్లీలో సైతం రాజకీయాన్ని వేడెక్కించిన టీపీఎస్ ప్రభావం, ఆ సంస్థ.. ఆ పార్టీ ముఖ్యనేత మర్రి చెన్నారెడ్డి పాత్ర.. 1969 ఉద్యమంలో అత్యంత కీలకాంశాలు. సారథి లేకుండానే దూసుకెళుతున్న ఉద్యమ రథం పగ్గాలు చేపట్టిన చెన్నారెడ్డి ఉద్యమాన్నెలా నడిపించాలనుకున్నారు? ఎలా నడిపారు? తదితర అంశాలతో కూడిన ఉద్యమ ప్రస్థానంపై రాజకీయ పరిశీలకులు, ఆచార్య జయశంకర్ పరిశోధనాభివృద్ధి సంస్థ సంచాలకులు వి.ప్రకాశ్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభకు ప్రత్యేకం..

     రక్షణల కోసం అంటుకున్న నిప్పు దావానలంలా మారింది.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అంతటా రగిలింది.. లాఠీ ఛార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులు నిత్యకృత్యమై 1969 ఉద్యమం హింసాత్మక రూపం సంతరించుకుంటున్న దశ అది. అలాంటి సమయంలో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే సంస్థ, సమన్వయం చేయగల నేత, గల్లీ నుంచి దిల్లీ స్థాయిలోనూ తెలిసిన సమర్థ నాయకుడి ఆవశ్యకత స్పష్టంగా కనిపించింది. ఆ క్రమంలో అప్పట్లో బలంగా వినిపించిన, కనిపించిన పేరు మర్రి చెన్నారెడ్డి. కరుడుగట్టిన తెలంగాణవాదిగా చెన్నారెడ్డికి అప్పటికే పేరొచ్చింది. నిజానికి ఉద్యమంలోకి చెన్నారెడ్డిని తీసుకు వచ్చే ప్రయత్నాలు ముందు నుంచే చాలా జరిగాయి. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం పట్టుబట్టి, ఆంధ్రప్రదేశ్‌తో విలీనాన్ని తుదికంటా వ్యతిరేకించి, గత్యంతరం లేని పరిస్థితుల్లో పెద్దమనుషుల ఒప్పందంపై అయిష్టంగా సంతకం చేసిన నాయకుడిగా చెన్నారెడ్డికి పేరుంది. అంతేకాదు.. కేంద్రంలో ఇందిరాగాంధీ సహా ఉన్నతస్థాయి నాయకులతో నేరుగా సంప్రదించగలిగిన స్థాయి ఉన్న నేత కూడా ఆయనే. తెలంగాణ నుంచి గట్టి నాయకుడు చెన్నారెడ్డి అనే సంగతి ఇందిర గాంధీ సహా కేంద్రంలోని నాయకులు కూడా అప్పటికే గుర్తించారు. అలాంటి నేత ఉద్యమానికి సారథ్యం వహిస్తే బాగుంటుందని కొందరంటే.. చెన్నారెడ్డి అవినీతిపరుడనీ, కోర్టు నుంచి చివాట్లు తిన్నాడని, రాజకీయనేత కాబట్టి తన ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని తాకట్టుపెట్టే అవకాశాలున్నాయని కొందరు వ్యతిరేకించేవారు. ఎవరి వాదనెలా ఉన్నా.. అటు చెన్నారెడ్డి కూడా ఆ సమయంలో వ్యక్తిగతంగా క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
 

చెన్నారెడ్డి చేతికి టీపీఎస్

     1969 ఉద్యమం ఊపందుకుంటున్న సమయానికి చెన్నారెడ్డి ఒక రకంగా రాజకీయ వనవాస స్థితిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించింది. అంతకుముందు 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనపై పోటీచేసి ఓడిపోయిన వందేమాతరం రామచందర్‌రావు - చెన్నారెడ్డి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో అప్పటి జిల్లా ఎస్పీ పవిత్రన్ సాక్ష్యం చెప్పారు. వందేమాతరం కేసు నెగ్గారు. (అంతకుముందు ఎన్నికల్లో వీబీ రాజుపై కూడా పోటీచేసి ఓడిపోయి.. నిబంధనలు ఉల్లంఘించారంటూ రాజుపై పదేళ్లపాటు నిషేధం వేటు పడేలా చేసిన చరిత్ర వందేమాతరం రామచందర్‌రావుకు ఉంది.) కోర్టులో కేసు వేసిన నాటి నుంచీ తీర్పు వచ్చేనాటికి మధ్యకాలంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చెన్నారెడ్డి తాండూరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో ఆయనకున్న వివాదాల కారణంగా ఇందిరాగాంధీ ఆయన్ను రాజ్యసభకు పోటీ చేయించింది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఉక్కుశాఖ మంత్రిని చేసింది. కానీ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు - ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకూడదు, ఏ రాజకీయ పదవి తీసుకోకూడదని అనర్హత తీర్పు రావడంతో చెన్నారెడ్డి ఆశలపై నీళ్లుజల్లినట్లయింది. అలా క్రియాశీల రాజకీయాలకు చెన్నారెడ్డి బలవంతంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే 1969 జనవరి నుంచే విద్యార్థుల ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన ఎస్.వెంకట్రామ్ రెడ్డి (ఉమా వెంకట్రామ్ రెడ్డి భర్త) ఉద్యమంలోకి చెన్నారెడ్డి రాక విషయంలో కీలక పాత్ర పోషించారు. అప్పటికే టీపీఎస్ అధ్యక్షుడిగా ఉన్న మదన్‌మోహన్ కూడా చెన్నారెడ్డిని ఆహ్వానించారు. ఆయన వస్తే ఉద్యమం బలోపేతమవుతుందని వారు భావించారు. విద్యార్థులు చేస్తున్న ఉద్యమంలో జోక్యం చేసుకోవడానికి మొదట్లో చెన్నారెడ్డి ఇష్టపడలేదు. రోజురోజుకూ ఉద్యమం విస్తరించడం, హింసాత్మకంగా మారి కాల్పుల్లో ఉద్యమకారులు మరణిస్తుండటంతోపాటు బలమైన సారథి లేకుంటే ఉద్యమం ఓ పద్ధతి ప్రకారం సాగడం కష్టమన్న సహచరుల ఒత్తిడి కారణంగా చెన్నారెడ్డి పునరాలోచనలో పడ్డారు. ఏప్రిల్ 4న సికింద్రాబాద్‌లో సినిమా చూసి వస్తుంటే ఆర్పీ రోడ్డులో జరిగిన కాల్పుల సంఘటన ఆయన్ను కలచి వేసిందని చెబుతారు. దీంతో ఏప్రిల్ 5న కొండా లక్ష్మణ్ బాపూజీతో సమావేశమై తెలంగాణలో పర్యటనకు సిద్ధమయ్యారు. 12 నుంచి వారం రోజుల పాటు జిల్లాల్లో పర్యటించి వచ్చిన తర్వాత ఉద్యమం తీవ్రత అవగతమవడంతో తొలిసారిగా టీపీఎస్ సారథ్యానికి చెన్నారెడ్డి సిద్ధమయ్యారు. మే 22న తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్) అధ్యక్షుడిగా చెన్నారెడ్డి బాధ్యతలు చేపట్టారు. చెన్నారెడ్డే టీపీఎస్‌ను ప్రారంభించారని చాలామంది అనుకుంటుంటారు. అది నిజం కాదు. మదన్‌మోహన్ అధ్యక్షుడిగా మార్చి 25న ఏర్పడిన టీపీఎస్‌కు రెండు నెలల తర్వాత చెన్నారెడ్డి అధ్యక్షుడిగా వచ్చారు. అప్పటికి టీపీఎస్ అనేది ఓ సంస్థ మాత్రమే. రాజకీయ పార్టీ కాదు. టీపీఎస్ సారథిగా చెన్నారెడ్డిని వ్యతిరేకించిన సోషలిస్టు ప్రభావిత నేతలు శ్రీధర్‌రెడ్డి తదితరులు వెంటనే పోటీ ప్రజాసమితిని ఆరంభించారు. దీని వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు కాళోజీ.
 

అహింసా మార్గంలోనే..
అలా అప్పటిదాకా పేరున్న నేత లేకుండా ఆందోళనలు, కాల్పులు, బాష్పవాయు ప్రయోగాలతో అట్టుడుకుతున్న ఉద్యమానికి చెన్నారెడ్డి రూపంలో ఓ రాజకీయ నేత లభించారు. 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే! లేదంటే ఈ పరిస్థితిని నక్సలైట్లు ఉపయోగించుకుంటారు అని మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో చెన్నారెడ్డి హెచ్చరించారు. ఉద్యమాన్ని ఉద్ధృతంగా.. హింసాత్మకం కాకుండా, దశలవారీగా అహింసా పద్ధతుల్లో నడిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, సాధ్యమైనంత వరకు సామాన్యులు హింసకు బలి కాకుండా చూడాలని ఆయన భావించారు. అందుకే మే 26 నుంచి రెండోదశ తెలంగాణ ఉద్యమం ఆరంభమవుతుందంటూ ప్రకటించారు. తొలుత సత్యాగ్రహాలతో మొదలు పెట్టాలనుకున్నారు. సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తూ అహింసా పద్ధతుల్లో వెళ్లాలని, బంద్‌లకు అప్పుడే దిగొద్దని భావించారు. మే 26న సత్యాగ్రహాలు మొదలై కొనసాగుతున్న దశలో.. మే 31న చంచల్‌గూడా జైలులో ఆంధ్ర, తెలంగాణ ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. 70 మందికి పైగా తెలంగాణ ఖైదీలకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి పంపకపోవడంతో చెన్నారెడ్డి జైలు వద్దకు వెళ్లి హెచ్చరించారు. దీంతో వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జైలు సంఘటనకు నిరసనగా జూన్ 3న బంద్‌కు శ్రీధర్‌రెడ్డి పిలుపిచ్చారు. దీన్ని చెన్నారెడ్డి వ్యతిరేకించారు. ఉద్యమంలో అప్పుడే బంద్‌లు వద్దన్నారు. కాకుంటే జూన్ 2న నిరసన దినం జరపాలని నిర్ణయించారు. జూన్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాటిని అడ్డుకోవడం కూడా శ్రీధర్‌రెడ్డి బృందం బంద్ పిలుపునకు మరో కారణం. పరీక్షలకు వెళ్లవద్దని, ప్రశ్నపత్రాలు చించిపారేయాలని విద్యార్థి నేత మల్లికార్జున్ పిలుపిచ్చారు. మరోవైపు పీవీ రంగారావు (పీవీ నరసింహారావు కుమారుడు) సారథ్యంలో తల్లిదండ్రుల సంఘం పేరుతో నిజాం కాలేజీ నుంచి ఉస్మానియా దాకా పరీక్షలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
 

హుటాహుటిన ఇందిర రాక

     చెన్నారెడ్డి రాకతో తెలంగాణ ఉద్యమం బలపడుతుందని భావించిన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దాన్ని గట్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. జూన్ రెండో తేదీన నిరసన దినం రోజు హైదరాబాద్‌లోని కొన్ని గూండా గ్యాంగులు విద్యార్థులపై విరుచుకు పడ్డాయి. ఆ రోజు 12 సార్లు కాల్పులు జరిగాయి. ప్రభుత్వం అయిదుగురు చనిపోయారని ప్రకటించింది. అంతకంటే ఎక్కువమందే ప్రాణాలు కోల్పోయారు. ఆబిడ్స్ దుర్గా విలాస్ హోటల్‌లో ప్రేమ్‌కిశోర్ అనే యువకుడిని గూండాలు కత్తులతో పొడిచి చంపారు. దీంతో మూడో తేదీన బంద్‌కు చెన్నారెడ్డి కూడా పిలుపిచ్చారు. మరుసటి రెండ్రోజులు (జూన్ 3, 4న) కూడా విధ్వంసం కొనసాగింది. అంతకుముందు రోజు కంటే ఎక్కువ మంది మరణించారు. ప్రభుత్వమే 30 మంది మరణించినట్లు చెప్పినా మూడు రోజుల్లో 60 మంది హతులయ్యారని ఉద్యమకారుల అంచనా. చాలామందిని పోస్ట్‌మార్టమ్ లేకుండానే దహనం చేయించారు. కర్ఫ్యూతో హైదరాబాద్ స్తంభించిపోయింది. ఈ సంఘటనల సెగ దిల్లీని తాకింది. అప్పుడు (జూన్ 4న) తెలంగాణ ప్రాంతీయ కమిటీ నేత చొక్కారావు, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దిల్లీలో ఉన్నారు. హైదరాబాద్‌లో చేజారిన పరిస్థితిని ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి చొక్కారావు తీసుకెళ్లారు. జూన్ 4వ తేదీ సాయంత్రం బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్ రాగా.. రాత్రి 11 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఇందిరాగాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో దిగి రాజ్‌భవన్‌లో బసచేశారు. తాను మాట్లాడాలనుకుంటున్న వారందరి జాబితా ఇచ్చి పిలుచుకు రమ్మన్నారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ కొనసాగుతుండటంతో పోలీసులే ఒక్కొక్కరిని జీపుల్లో రాజ్‌భవన్‌కు తీసుకొచ్చారు. టీఎన్‌జీవో నేత ఆమోస్ తప్ప ఆమె పిలిచిన వారంతా అందుబాటులోకి వచ్చారు. 'ఈ వచ్చేదేదో మీరు పొద్దున వచ్చి ఉంటే వందమంది ప్రాణాలు బతికేవి అంటూ చెన్నారెడ్డి ఆమెతో వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి ప్రత్యేక విమానంలో వచ్చి స్వయంగా నేతలందరితో సంప్రదింపులు జరుపుతున్నారంటే ఏదో జరుగుతుందని చెన్నారెడ్డి తదితరులు ఆశించారు. కానీ వారి ఆశ అడియాసే అయ్యింది. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు దాదాపు 150 మందితో (కమ్యూనిస్టు, జన్‌సంఘ్, విద్యార్థి సంఘాల నేతలు, జర్నలిస్టులతో) తెల్లవారుజామున 3 గంటల దాకా సంప్రదింపులు జరిపారు. 'నేనిప్పటికిప్పుడు సమస్యకు పరిష్కారం చూపించలేకపోతున్నాను. రేపు ఉదయమే ఆఫ్గానిస్థాన్ వెళుతున్నాను. వచ్చాక చూస్తాను. ప్రస్తుతానికి ప్రత్యేక తెలంగాణ తప్పించి మరేదైనా అడగండి. న్యాయం చేస్తాం. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. తీవ్రతను తగ్గించాలనే వచ్చానిక్కడికి. ఈలోపు హోంమంత్రి చవాన్‌తో మాట్లాడండి. ఆయన్ను పంపిస్తున్నాను.. అని చెప్పి ఇందిరాగాంధీ దిల్లీ వెళ్లిపోయారు. ఏదో హామీ వస్తుందనుకున్న నేతలంతా ఉసూరుమన్నారు. మరుసటి రోజు ఒక కాల్పుల సంఘటన తప్పిస్తే పెద్దగా ఏమీ జరగలేదు. ఇందిర హామీ మేరకు చవాన్ 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించారు. ఉద్యోగుల సమ్మె కారణంగా నగరమంతా చెత్తాచెదారం ఉండటంతో ఆమోస్ తదితర ఉద్యోగ నేతలతో కూడా ఆయన చర్చించారు. పదో తేదీ నుంచి ప్రతిపాదించిన సమ్మెను విరమించుకోవాలంటూ టీఎన్జీవోలకు విజ్ఞప్తి చేశారు. కానీ వారు అంగీకరించలేదు.
 

వెనక్కి తగ్గిన ఇందిర
     ఆఫ్గానిస్థాన్ నుంచి రాగానే ఇందిర మళ్లీ తెలంగాణపై దృష్టి సారించారు. తెలంగాణ ఇవ్వడమా లేదంటే రాష్ట్రపతి పాలనపెట్టి సర్దుబాటు చేయడమా.. ఈ సూచనలు ఇందిర ముందుకొచ్చాయి. ఆ క్షణంలో రాష్ట్రపతి పాలనకు ఆమె మొగ్గు చూపించినట్లు సమాచారం. ఆమేరకు బ్రహ్మానందరెడ్డికి సంకేతాలు కూడా వెళ్లాయంటారు. దీనిపై నిర్ణయం కోసం జూన్ 16న కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు, 19న సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. 13న దిల్లీ రావాల్సిందిగా బ్రహ్మానందరెడ్డికి పిలుపందింది. కానీ అప్పటికే అసలు విషయం ఉప్పందిన ఆయన 'రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు.. రెండ్రోజుల తర్వాత వస్తానంటూ సందేశం పంపించారు. ఈ రెండ్రోజుల్లో తనకు మద్దతుగా ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ, దిల్లీలో తనకు అనుకూలురైన వారితో ఎంపీలపై ఒత్తిడి తెప్పించారు. ఆ లాబీయింగ్ ఫలించి బ్రహ్మానందరెడ్డికి ఎంపీల్లో, సీడబ్ల్యూసీలో మద్దతు లభించింది. దీంతో ఇందిర కూడా బ్రహ్మానందరెడ్డిపై చర్యకు వెనక్కి తగ్గారు. అప్పటికే అఖిల భారత కాంగ్రెస్‌లో చీలికకు అవకాశాలను పసిగట్టడం, రాబోయే రాష్ట్రపతి ఎన్నికలో బ్రహ్మానందరెడ్డి అవసరం ఉండటం.. ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌తో కూడా చిక్కులుండటంతో రాష్ట్రపతి పాలనపై ఇందిర వెనక్కి తగ్గారు. చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీలను కూడా సీడబ్ల్యూసీలో తమ వాదన వినిపించాలంటూ పిలిచారు. ఏం జరుగుతోందో, తెలంగాణకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో వారు వివరించారు. 16న పార్లమెంటరీ పార్టీ సమావేశం నాడే తెలంగాణలో టీపీఎస్ పిలుపు మేరకు బంద్ జరిగింది. తమవైపు నుంచి ఎలాంటి చర్య, ప్రతిచర్య ఉండకుండా, ఎదుటివారే దోషులుగా నిలబడేలా వ్యవహరించాలని ఇరుపక్షాలూ వ్యూహం రచించాయి. దీంతో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా చోటు చేసుకోలేదు. దీన్ని బ్రహ్మానందరెడ్డి తనకు అనుకూలంగా మలచుకున్నారు. తాను సమర్థంగా నియంత్రించానంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రకటించారు. మరో మూడు నెలల గడువిస్తే అంతా సద్దుమణిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. హోంమంత్రి చవాన్ కూడా అందుకు మద్దతుగా మాట్లాడారు. 'హింస జరగొద్దని మాకు చెప్పొద్దు.. ముఖ్యమంత్రికి చెప్పండి అని చెన్నారెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వానికి స్పష్టం చేశారు.

దూరంగా రాజమండ్రి జైలుకు..
     సీడబ్ల్యూసీ తర్వాత చెన్నారెడ్డి తదితరులను దిల్లీలోనే ఉంచి మొరార్జీ దేశాయ్, నిజలింగప్ప (కాంగ్రెస్ అధ్యక్షుడు) నాలుగైదు రోజులు సంప్రదింపులు జరిపారు. 'రెండ్రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడుతాను. అక్కడే కలుద్దాం.. మీరు వెళ్లండి అంటూ పంపించిన మొరార్జీ దేశాయ్ - చెన్నారెడ్డి బృందం ఇక్కడ దిగకముందే తన హైదరాబాద్ పర్యటన రద్దయిందని దిల్లీలో ప్రకటించారు. ఇందిర ఎన్నడూ తెలంగాణ ఇవ్వబోమని తమతో ఖరాఖండిగా చెప్పకపోవడం, మధ్యేమార్గంగా.. అనునయించి మాట్లాడుతుండటంతో తెలంగాణ నేతలు ఆశతోనే ఉంటూ వచ్చారు. జూన్ 24న ముషీరాబాద్ జైలులో తెలంగాణ ఖైదీలపై దాడి జరిగి 70 మంది గాయపడటంతో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. జూన్ 25న బంద్‌కు చెన్నారెడ్డి పిలుపిచ్చారు. జూన్ 24వ తేదీ రాత్రి చెన్నారెడ్డి సహా ఉద్యమ నేతలందరినీ అరెస్టు చేసి, రాజమండ్రి జైలుకు తరలించారు. అది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చేసింది కాదని.. వారం రోజుల ముందు నుంచే రాజమండ్రి జైలులో కొన్ని గదులు ఖాళీ చేసి, పరిశుభ్రం చేసి పెట్టారన్న వార్తలొచ్చాయి. మొత్తానికి జూన్ 24వ తేదీ రాత్రి అరెస్టయిన చెన్నారెడ్డి ఇతర ముఖ్య నేతలంతా ఆగస్టు 25 దాకా జైల్లోనే ఉన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు అరెస్టులు జరిగాయని బ్రహ్మానందరెడ్డి చెబితే.. మేము చెప్పలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడం విశేషం. మొరార్జీ దేశాయ్ సూచనల మేరకు ఇది జరిగిందని తెలంగాణ నేతల అనుమానం. ఈ రెండు నెలల్లో ఉద్యమం స్తబ్దుగా మారడం గమనార్హం.
 

బ్రహ్మానందరెడ్డి పైఎత్తు
నాయకులంతా అరెస్టయి, ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఉద్యమకారులు వ్యూహాన్ని మార్చారు. తెలంగాణ మంత్రులపై దృష్టి సారించి వారిపై ఒత్తిడి పెంచారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ నిలదీయడం, అడ్డుకోవడం, అసభ్యపదజాలం వాడటంతో వారు ఇళ్ల నుంచి కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జూన్ 27 సాయంత్రం వీబీ రాజు తెలంగాణ మంత్రులతో తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు. పీవీ నరసింహారావు, జేవీ నరసింగరావులు కూడా ఫోన్‌లో తమ మద్దతు తెలిపారు. ఈ ఎనిమిది మందిలో ఒకరు బ్రహ్మానందరెడ్డికి విషయం తెలియజేశారు. దీంతో అప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తు వేసిన బ్రహ్మానందరెడ్డి, 28వ తేదీ ఉదయం 8 మందిలో ఒకరైన మంత్రి గురుమూర్తితో అందరికంటే ముందు రాజీనామా చేయించారు. కొద్దిసేపటి తర్వాత మీడియా సమావేశం పెట్టి స్వయంగా తన రాజీనామాను ప్రకటించి, మిగిలిన తెలంగాణ మంత్రులందరికీ షాకిచ్చారు. తాము చేయకముందే ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతో ఒత్తిడి తేవాలన్న వారి వ్యూహం ఫలించలేదు. బ్రహ్మానందరెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్పకు పంపి, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించాలని కోరడం, వెంటనే ఒకటో తేదీన పార్లమెంటరీ పార్టీ సమావేశం పెడుతున్నట్లు నిజలింగప్ప ప్రకటించడం విశేషం. అయినా తెలంగాణకు చెందిన 8 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికిచ్చి గవర్నర్‌కు పంపాలంటూ కోరారు. అలాగే చేసిన బ్రహ్మానందరెడ్డి - తాత్కాలికంగా, ఏర్పాట్లు చేసేదాకా వీరిని పదవుల్లో కొనసాగించాలని గవర్నర్ కందూబాయి దేశాయ్‌ని కోరారు.

ఎటూ తేల్చని సమావేశం
     పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఏమీ తేల్చలేదు. సమస్య పరిష్కారానికి నిజలింగప్ప, కామరాజ్ నాడార్‌లను హైదరాబాద్‌కు పంపించారు ఇందిరాగాంధీ. వాళ్లిద్దరి సమక్షంలో జులై 6న సీఎల్పీ సమావేశంలో పీవీ నరసింహారావుతో బ్రహ్మానందరెడ్డి తనపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టించారు. దానికి మద్దతు లభించింది. అయితే కొన్నాళ్ల తర్వాత బ్రహ్మానందరెడ్డి స్థానంలో తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆ సమావేశంలో తీర్మానం చేయడం విశేషం. ఆనాటికి 9 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందరెడ్డి తన మంత్రివర్గాన్ని 18న విస్తరించారు. వెంగళరావు, రోడామిస్త్రీ, సంజీవరెడ్డి (కార్మికనాయకుడు), ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పీవీకి విద్యాశాఖ ఇచ్చారు.

ఉపశమన చర్యలతో..

     అటు రాజకీయ ప్రత్యర్థులతో పాటు ఉద్యమాన్ని కూడా సద్దుమణిగేలా చేయడానికి బ్రహ్మానందరెడ్డి నడుం బిగించారు. తెలంగాణలో ఉపశమన చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యనేతలు అరెస్టయి జైళ్లలో ఉండటంతో ఉద్యమంలో నెలకొన్న స్తబ్దతను తన మంత్రుల ద్వారా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. పోచంపాడు ప్రాజెక్టుకు నిధులు పెంచారు. పీవీ వరంగల్‌కు వెళ్లి కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు పెంచారు. 8 సూత్రాల పథకంలో చెప్పినట్లుగా అన్ని కమిటీలు పడి విచారణ సాగుతోంది. సమ్మెలోకి దిగి జీతాల్లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్థులతో మాట్లాడి జీతాలిస్తామని, క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. కళాశాలలు, బడులు తెరిపించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అప్పటికే ఏడాది విద్యాసంవత్సరం కోల్పోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లోనూ నిరాసక్తత ఆవహించింది. సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థల్ని తెరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా కాల్పులు, ఘర్షణలు లేకుండా ముఖ్యమంత్రి జాగ్రత్త వహించారు. మరోవైపు.. ఖమ్మంలో హోంమంత్రి జలగం వెంగళరావుకు సన్మానసభ ఏర్పాటైంది. అక్కడ ఉద్యమకారులు నిరసన తెలిపి ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. అరెస్టు కాకుండా బయట ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఆగస్టు 14న అసెంబ్లీలో గవర్నర్ ఉభయసభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మొదటి వాక్యం, చివరి వాక్యం చదివి గవర్నర్ తన ప్రసంగం ముగిసిందని వెళ్లిపోయారు. పరిస్థితి గమనించిన బ్రహ్మానందరెడ్డి పట్టుదలకు పోకుండా ఎమ్మెల్యేలను శాంతింపజేయడానికి ఆగస్టు 16న స్వయంగా తానే తెలంగాణ అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అందరినీ శాంతింప జేశారు. ముఖ్య నేతలంతా రాజమండ్రి జైల్లో ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలతో ఉద్యమం క్రమంగా నీరసించి స్తబ్దుగా మారింది.
 

దిల్లీలో చెన్నారెడ్డి విడుదల
     రాజమండ్రి జైలులో ఉన్న చెన్నారెడ్డి తదితరులు హైకోర్టులో.. 'మా కేసును మేమే వాదించుకుంటాం అంటూ పిటిషన్ వేశారు. నిబంధనల మేరకు ఉండటంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. తద్వారా రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం నేతలకు లభించింది. చెన్నారెడ్డి తదితర నేతలు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు - చెన్నారెడ్డి తదితర ముఖ్యనేతలను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి, మిగిలిన వారిని హైకోర్టుకు తీసుకెళ్లాలని చెప్పడంతో ఆగస్టు 25న చెన్నారెడ్డి తదితరులను దిల్లీలో సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. అదేరోజు ఉదయం హైకోర్టులో న్యాయమూర్తి - అరెస్టుకు సహేతుక కారణాలు లేవంటూ కేసును కొట్టివేశారు. కేసులోని వారందరినీ విడుదల చేశారు. అందులో చెన్నారెడ్డి తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. దాంతో సుప్రీంకోర్టులో వాదించుకోవాల్సిన అవసరం వారికి కలగలేదు. అలా చెన్నారెడ్డి తదితర ముఖ్య నేతలు రెండు నెలల తర్వాత ఆగస్టు 27, 28న దిల్లీలో విడుదలయ్యారు. అనంతరం రైలులో హైదరాబాద్‌కు వచ్చారు. దారిలో బలార్షా నుంచి హైదరాబాద్‌కు చేరుకునేలోపు ప్రతి స్టేషన్‌లోనూ చెన్నారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ నుంచి చార్మినార్ దాకా భారీగా ఊరేగింపు జరిపారు. జనమైతే వచ్చి జేజేలు పలికారు గానీ మళ్లీ ఉద్యమాన్ని లేవదీయడానికి చెన్నారెడ్డి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రజల్లో అసంతృప్తి ఉన్నా.. ఉద్యమం చప్పబడిపోయింది. మల్లికార్జున్ కూడా ఉద్యమాన్ని లేపడానికి కష్టపడ్డారు. 1969, అక్టోబరు 10న సికింద్రాబాద్ ప్యారడైజ్ గాంధీ బొమ్మ వద్ద మల్లికార్జున్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. తెలంగాణ డిమాండ్ చేస్తూ జరిగిన తొలి దీక్ష ఇది. 23 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆయన స్ఫూర్తితో రమాదేవి అనే 15 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రుల అనుమతితో వైఎంసీఏ జంక్షన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. ఆరోగ్యం పాడవటంతో ఆమెను అరెస్టు చేసి చికిత్స చేశారు. వారికి మద్దతు బాగానే లభించినా ఉద్యమం మాత్రం ఊపందుకోలేదు.
 

బడులపై బాంబు దాడులు
     సెప్టెంబరు 1 నుంచి బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఎత్తుగడలతో, తెలంగాణ నేతలు మంత్రివర్గంలో చేరవద్దంటే చేరారని అప్పటికే ఆగ్రహంతో, అసహనంతో ఉన్న ఉద్యమకారుల్లో కొంతమంది విద్యాసంస్థల పునఃప్రారంభాన్ని అడ్డుకోవాలని భావించారు. పలు విద్యాసంస్థలపై తరగతుల ఆరంభానికి రెండు రోజుల మందు బాంబులు వేసి భయపెట్టారు. మరోవైపు వరంగల్‌లో కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యార్థి సంఘ నేతలు కొల్లూరి చిరంజీవి, శ్రీనివాసులు తదితరులు తరగతుల పునఃప్రారంభానికి పిలుపునిచ్చారు. 'స్టడీ అండ్ స్ట్రగుల్ (చదువుతూ ఉద్యమిద్దాం) అంటూ వారు సెప్టెంబరు 18న కాకతీయ మెడికల్ కాలేజీని తెరిపించారు. అలా కాస్త ఆలస్యంగానైనా విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. ఏం చేయాలో తెలియని అశక్తత, ఆందోళనతో తానే బాంబు దాడులు చేయించానని ఉద్యమ నేత సదాలక్ష్మి తర్వాత తన ఆత్మకథలో రాసుకున్నారు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌