• facebook
  • whatsapp
  • telegram

1990 దశకంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మేధావులు, విద్యార్థుల పాత్ర

వేదికలెక్కి.. వాదం చేసి!

ఆరు దశాబ్దాలుపైగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో భాగస్వాములయ్యారు. ఎన్నో త్యాగాలు చేశారు. అందులో మేధావులు, విద్యార్థులు చేసిన పోరాటాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా మలిదశ ప్రారంభానికి ముందు ఒక దశాబ్ద కాలంపాటు వారు వేదికలు, సదస్సులు, సమావేశాల ద్వారా తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేసిన తీరు తర్వాత కాలంలో ఉద్యమం బలపడటానికి ప్రధాన కారణంగా నిలిచింది. అన్యాయాలను, అసమానతలను అధికారిక గణాంకాలతో మేధావులు వివిధ వేదికలపై తమ ప్రసంగాల్లో, పరిశోధన పత్రాల్లో వివరించి జనాన్ని జాగృతం చేస్తే, సమస్యలపై పోరాటాల్లో విద్యార్థులు సమరశీల పాత్ర పోషించారు. కళాకారులు, ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నేతలూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు విశేష కృషి చేశారు. 


తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచి అంటే 1952లో, తర్వాత 1969లో, మళ్లీ 1980, 1990 దశకాల్లో, 2001-2014 మధ్య మలిదశ ఉద్యమకాలంలో మేధావులు, విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా 1990 దశాబ్దంలో తెలంగాణ ప్రభాకర్, ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రతాప్‌ కిశోర్, ఇ.వి.పద్మనాభం, కాళోజి నారాయణరావు, గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, గద్దర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్‌ సింహాద్రి, ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు లాంటి మేధావులు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను, పాలకుల వివక్షను ప్రజలకు తెలియజేసి జాగృతం చేయడానికి పలు సంస్థలను ఏర్పాటుచేశారు. పరిశోధనాత్మక వ్యాసాలను, గ్రంథాలను ప్రచురించారు.


1996, ఆగస్టు 15న నాటి ప్రధాని దేవేగౌడ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై సానుకూలతను ప్రకటించారు. దాంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువాదుల ఆశలు చిగురించాయి. సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ విద్యార్థుల ఐక్య వేదిక, తెలంగాణ కళా సమితి, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం వంటి సంస్థల ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ ప్రజల్లోకి వెళ్లింది. నాటి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ వాళ్లు కూడా ప్రత్యేక రాష్ట్రవాదానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

 

సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ (1997, ఆగస్టు 16, 17)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను, ఎదురవుతున్న అసమానతలను పరిశోధనాత్మకంగా, ప్రభుత్వ గణాంకాలతో సహా అధ్యయనం చేసి ప్రజలకు తెలియజేయడానికి సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ను స్థానిక మేధావులు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1997, ఆగస్టు 16, 17 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ జనరల్‌ లైబ్రరీ భవనంలో ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్‌ సింహాద్రి సదస్సు నిర్వహించారు. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ హనుమంతరావు అధ్యక్షత వహించారు. అందులో తెలంగాణ మేధావులు, విద్యార్థులు రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించిన అంశం ‘ప్రాంతీయ అసమానతలు, తెలంగాణ అభివృద్ధి ప్రత్నామ్నాయాలు’ (రీజనల్‌ ఇంబ్యాలెన్సెస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆల్టర్నేటివ్స్‌ ఇన్‌ తెలంగాణ). వివిధ రంగాల్లో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న అసమానతలు, అన్యాయాలు, వివక్షలపై పలువురు విద్యావేత్తలు ప్రసంగించి పరిశోధనా పత్రాలను సమర్పించారు. వీటన్నింటినీ ఆ తర్వాత కాలంలో ‘రీజినల్‌ ఇంబ్యాల్సెన్సెన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆల్టర్నేటివ్స్‌ ఇన్‌ తెలంగాణ’ పేరుతో గ్రంథంగా ప్రచురించారు. ప్రొఫెసర్‌ కె.జయశంకర్, పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, సింహాద్రి, సి.హెచ్‌.హనుమంతరావు, కంచె ఐలయ్య, పాశం యాదగిరి, నారం కృష్ణారావు లాంటి పలువురు విద్యావేత్తల వ్యాసాలు అందులో ఉన్నాయి. ఈ సంస్థ ప్రచురించిన మరో గ్రంథం ‘తల్లడిల్లుతున్న తెలంగాణ’.

 

తెలంగాణ ఐక్యవేదిక (1997, అక్టోబరు 14, 15, 16)

1990 దశకంలో ముఖ్యంగా 1995 తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రత్యేక తెలంగాణవాదులు ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా రూపొందించడానికి పలు పౌర సమాజాలను (సివిల్‌ సొసైటీస్‌), తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణవాదాన్ని బలోపేతం చేయడానికి వేదికలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విధంగా 1997 అక్టోబరు నాటికి తెలంగాణ ప్రాంతంలో 28 పౌర సమాజ వేదికలు ఏర్పాటయ్యాయి. వాటిలో తెలంగాణ ఫోరం, తెలంగాణ దళిత రచయితల సంఘం, తెలంగాణ గిరిజన విద్యార్థి యువజన సంఘం, తెలంగాణ వీఆర్‌ఏల సంఘం, తెలంగాణ బహుజన పోరాట సమితి, తెలంగాణ రాష్ట్ర సాధన సమితి, తెలంగాణ పట్టభద్రుల సంఘం మొదలైనవి ఉన్నాయి. 1997లో భువనగిరి, సూర్యాపేట తెలంగాణ మహాసభలు విజయవంతమవడంతో ఈ 28 సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, పాశం యాదగిరి తదితర మేధావులు సంకల్పించారు. వారి కృషి ఫలితంగా తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది. 1997, అక్టోబరు 14, 15 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ జనరల్‌ లైబ్రరీ భవవనంలో ఈ 28 పౌరసంఘాల నేతలు సమావేశమై ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశం ఏర్పాటుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. అక్టోబరు 16వ తేదీ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. ఆ వేదిక ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉమ్మడిగా పోరాటం చేయడం. అయితే ఈ ఐక్యవేదికకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అనే ఆఫీస్‌ బేరర్స్‌ లేకుండా అన్ని సంఘాలు సమష్టిగా కృషి చేయాలనే ఉద్దేశంతో రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. అవి 1) ఆర్గనైజింగ్‌ కమిటీ, 2) స్టీరింగ్‌ కమిటీ. ఆర్గనైజింగ్‌ కమిటీలో 28 సంఘాల ప్రతినిధుల సభ్యులకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. స్టీరింగ్‌ కమిటీ విధాన నిర్ణయాలను, మార్గదర్శకాలను రూపొందించి ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించింది. స్టీరింగ్‌ కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్‌ జయశంకర్, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్, భూపతి కృష్ణమూర్తి, తేజావత్‌ బెల్లయ్య నాయక్‌ తదితరులు వ్యవహరించారు.


          తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 1997, నవంబరు 1న దాదాపు మూడు వేల మందితో, నిజాం కాలేజీ నుంచి సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ అమరుల స్తూపం వరకు భారీ ఊరేగింపు జరిగింది. దీన్ని 1969 తెలంగాణ ఉద్యమాల తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం నిర్వహించిన మొదటి ర్యాలీగా పేర్కొనవచ్చు. అమరవీరుల స్తూపం వద్ద జరిగిన బహిరంగ సభలో కాళోజి నారాయణరావు, కొండా లక్ష్మణ బాపూజీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితరులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రసగించారు. ఆ ఊరేగింపులో పాల్గొన్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ ట్యాంక్‌బండ్‌ సమీపంలో ఉన్న జలదృశ్యం అనే తన నివాస భవనాన్ని తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా ఇచ్చారు. తర్వాత కాలంలో ఈ జలదృశ్యం భవనమే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఏర్పడిన తర్వాత పార్టీ కార్యాలయంగా మారింది. టీఆర్‌ఎస్‌ పార్టీలో తెలంగాణ ఐక్యవేదిక విలీనమైంది. తెలంగాణ ఐక్యవేదిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నిర్వహణతో పాటు, తెలంగాణ ప్రాంతంలో ఆపదలో ఉన్న ప్రజలకు అనేక దాతృత్వ కార్యకలాపాలు కూడా నిర్వహించింది. స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కరవు పీడిత ప్రాంతంలోని ప్రజలకు ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం లాంటి కార్యకలాపాలు నిర్వహించింది. ఈ వేదిక ఏర్పడిన నాటి నుంచి 2001 వరకు తెలంగాణ జిల్లాల్లో అనేక సభలు, సమావేశాలను నిర్వహించి, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసింది. అందుకే 2001 తర్వాత జరిగిన మలి ఉద్యమానికి గట్టి పునాదులు నిర్మించిన సంస్థగా దీన్ని పేర్కొంటారు.

 

తెలంగాణ విద్యార్థుల ఐక్య వేదిక

దేశంలో 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల అమలును నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో వేగవంతం చేసింది. ఫలితంగా తెలంగాణ ప్రాంతం ఆర్థిక సంస్కరణల ప్రయోగశాలగా మారింది. ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. పారిశ్రామికీకరణ, అవస్థాపనా సౌకర్యాల విస్తరణ వల్ల ప్రజలు వ్యవసాయ భూములను కోల్పోవడంతో రైతులకు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. పెరుగుతున్న నిరుద్యోగాన్ని చూసి ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రత్యామ్నాయంగా కొంతమంది విద్యార్థులు, పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నక్సల్‌ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. దీనికంతటికీ పరిష్కారం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటేనని భావించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థుల వేదిక (టీవీవీ)ను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన నినాదం ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం - మా జన్మ హక్కు’. ఈ వేదిక ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని కార్యోన్ముఖులను చేయడానికి సదస్సులు నిర్వహించింది. అందులో భాగంగా 2006లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సదస్సును జరిపింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేసింది. అది 3 కోట్ల ప్రజల ఆకాంక్ష అని  చాటింది.

 

తెలంగాణ కళా సమితి

పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నక్సల్‌ భావజాలానికి ప్రేరణ పొందిన కొంతమంది కళాకారులు తెలంగాణ జనసభకు అనుబంధంగా 1998లో తెలంగాణ కళాసమితిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తమ కళారూపాల ద్వారా కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉండటంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా వీరి కార్యకలాపాలపై అనేక నిర్బంధాలు అమలు చేసింది. ఈ కళాసమితికి బెల్లి లలిత సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఆమె తెలంగాణ ఉద్యమం గొంతుగా మారి తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచేవారు. వారిని ఉద్యమం బాట పట్టించేవారు. ఆమెను తెలంగాణ కోయిలగా కొందరు అభివర్ణించారు. కొంతకాలం తర్వాత ఆమె భువనగిరిలో దారుణహత్యకు గురయ్యారు.

 

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం

తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అమెరికాలోని తెలంగాణవాదులు అమెరికాలో స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం. ఇది తెలంగాణ ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం అందించేది. ఈ సంస్థలోని మధు కె.రెడ్డి, మారోజు వెంకట్‌ తదితరులు అమెరికాలోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల మద్దతు కూడగట్టడానికి కృషి చేశారు.

 

కాంగ్రెస్‌ శాసనసభ్యుల కృషి

తెలంగాణ ప్రాంతానికి జరిగే అన్యాయాలు, వివక్షలను ప్రశ్నించేందుకు 1990-92 మధ్య కాలంలో కె.జానారెడ్డి ఆధ్వర్యంలో  కొందరు కాంగ్రెస్‌ శాసన సభ్యులు తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం ద్వారా కొంతకాలం కృషి చేశారు. ఆ తర్వాత 1997, ఫిబ్రవరి 26న జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, రాష్ట్ర విధాన సభలో ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలంగాణకు జరిగే అన్యాయాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన 41 మంది రాష్ట్ర విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) 2000, ఆగస్టు 11న ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఒక వినతిపత్రం సమర్పించారు. దీనికి స్పందించిన సోనియా గాంధీ తెలంగాణ సమస్య తనకు తెలుసని పేర్కొంటూ, ఈ సమస్యను అధ్యయనం చేయడానికి పార్టీపరంగా, ప్రణబ్‌ ముఖర్జీ, మన్మోహన్‌ సింగ్, గులాంనబీ ఆజాద్‌లతో త్రిసభ్య కమిటీని నియమించారు. అంతేకాకుండా నాటి కేంద్ర హోంమంత్రి ఎల్‌.కె.ఆడ్వాణీకి చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఒక లేఖను రాశారు. దానికి ఆడ్వాణీ స్పందించి చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం స్థానిక నాయకుల ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేశారు. అందుకే 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటైనప్పటికీ తెలంగాణపై ఎలాంటి ప్రకటన రాలేదు. 


బీజేపీ మద్దతు

1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాకినాడలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ ‘ఒక ఓటు - రెండు రాష్ట్రాలు’ నినాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. కానీ 1998లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణవాదాన్ని విస్మరించింది. దీనికి కారణం నాటి బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పాటు కావడమే. ఆ తర్వాత 2004, 2009ల్లో వచ్చిన యూపీఏ ప్రభుత్వాల కాలంలో బీజేపీ ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు ఇచ్చింది.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించింది.

రచయిత: ఎ.ఎం.రెడ్డి

 

 

Posted Date : 26-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌