• facebook
  • whatsapp
  • telegram

శాసన ఉల్లంఘన ఉద్యమం - 2

విముక్తి కాంక్ష‌ను ర‌గిలించిన పోరాటం!

 

  అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, ఆస్తుల స్వాధీనాలు, అన్యాయమైన ఆంక్షలు, అమానుష కాల్పుల మధ్య అత్యంత కఠినంగా ఆ ఉద్యమాన్ని అణచి వేయాలని ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రబలమైన ప్రజల జాతీయవాద శక్తికి తల వంచాల్సి వచ్చింది. తప్పనిసరిగా ఒప్పందం కుదుర్చుకొని, సమావేశాలకు మహాత్ముడిని స్వాగతించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే శాసనోల్లంఘన ఉద్యమం. తర్వాతి దశలో పలు కారణాలతో బలహీన పడినప్పటికీ, పరాయి పాలన నుంచి విముక్తి పొంది తీరాలనే కాంక్షను బలంగా ప్రజల్లో రగిలించింది. పోరాటాల కష్టాలను తట్టుకొని నిలబడగలిగే సహనాన్ని వారికి సమకూర్చింది. ఈ పరిణామాలను, వాటి ఫలితాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 

  శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు గాంధీజీ బ్రిటిష్‌ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చారు. ప్రజాక్షేమం దృష్ట్యా 11 కనీస చర్యలను ప్రకటించి, ప్రభుత్వం వాటికి సమ్మతించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అప్పటి వైస్రాయ్‌ (రాజప్రతినిధి) ఆ డిమాండ్లలో వేటికీ స్పందించకపోవడంతో శాసనోల్లంఘనకు ఉపక్రమించారు. ఉప్పుపై పన్ను శాసనాన్ని తొలుత ఉల్లంఘించాలని నిర్ణయించారు. 1930, మార్చి 12న 78 మంది సుశిక్షితులైన అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరిన గాంధీజీ గుజరాత్‌ పశ్చిమ తీరంలోని దండి గ్రామానికి ఏప్రిల్‌ 6న చేరుకున్నారు. అక్కడ ఉప్పు తయారు చేయడంతో ఉద్యమం ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక యాత్రలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎర్నేని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గాంధీజీ దండి యాత్రకు దారి పొడవునా జనసందోహం జయజయధ్వానాలతో మద్దతు తెలిపారు. ప్రజల్లో స్వాతంత్య్ర దీక్ష వెల్లివిరిసింది. 

 

  ఉద్యమంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను గాంధీÅజీ నిర్దేశించారు. అవన్నీ అహింసా పద్ధతిలోనే జరగాలన్నారు. ఉద్యమంలో ప్రధాన అంశం ఉప్పు సత్యాగ్రహం, చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేయడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ధరించడం, హిందూ-ముస్లిం ఐక్యత, పన్నుల చెల్లింపు నిరాకరణ, అంటరానితనం నిర్మూలనను పాటించాలని సూచించారు. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైలులో నిర్బంధించింది. ఆ తర్వాత ఉద్యమానికి అబ్బాస్‌ థ్యాబ్జి, సరోజినీ నాయుడు వరుసగా నాయకత్వం వహించారు. సరోజినీ నాయుడు నాయకత్వంలో మే 21న సత్యాగ్రహులు ప్రభుత్వ ఉప్పు డిపోపై దాడి చేశారు.

 

ఉద్యమ వ్యాప్తి: శాసనోల్లంఘన ఉద్యమం దేశమంతా త్వరగా వ్యాపించింది. విద్యార్థులు, కార్మికులు, శ్రామికులు, రైతులు ముఖ్యంగా మహిళలు విశేషంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతిచోటా హర్తాళ్లు, విదేశీ వస్త్ర బహిష్కరణ, పన్నుల నిరాకరణ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. చక్రవర్తి రాజగోపాలాచారి తంజావూర్‌ తీరంలో తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు; మలబారు తీరంలో కెల్లప్పస్‌ కాలికట్‌ నుంచి పయన్నూర్‌ వరకు సత్యాగ్రహులతో పాదయాత్ర చేసి, ఉప్పు తయారుచేసి శాసనాన్ని ఉల్లంఘించారు. వాయవ్య ప్రాంతంలో సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ ‘ఖుదాయి కిద్‌మత్‌గార్‌’ అనే ప్రతిఘటన సంస్థను స్థాపించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సంస్థ సభ్యులను ప్రజలు ‘రెడ్‌ షర్ట్స్‌’ అనేవారు. నాగాలాండ్‌కు చెందిన రాణి గైడెన్‌ అనే ధీర వనిత 13 ఏళ్ల ప్రాయంలోనే గాంధీజీ పిలుపునకు స్పందించి, విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్ష అనుభవించింది.

 

ఆంధ్రాలో ఉద్యమం: ఆంధ్ర ప్రాంతంలో శాసనోల్లంఘన ఉద్యమ బాధ్యతలను కాంగ్రెస్‌ కొండా వెంకటప్పయ్యకు అప్పగించింది. ఆయన ప్రతి జిల్లాలో నాయకుడిని నియమించి, శిబిరం ఏర్పాటు చేసి, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యమం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య; గుంటూరు జిల్లాలో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీబాయమ్మ; గోదావరి జిల్లాల్లో బులుసు సాంబమూర్తి, విశాఖ జిల్లాలో తెన్నేటి విశ్వనాథం, నెల్లూరు జిల్లాలో బెజవాడ గోపాలరెడ్డి, రాయలసీమలో కల్లూరి సుబ్బారావు, మద్రాసు నగరంలో టంగుటూరి ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు తదితర నాయకులు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేశారు.

 

ప్రభుత్వ వైఖరి: ఉద్యమకారుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. లాఠీఛార్జీలు, అక్రమ నిర్బంధాలు, ఉద్యమకారుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, నిరాయుధులైన ఉద్యమకారులపై కాల్పులు నిత్యకృత్యం అయ్యాయి. కాంగ్రెస్‌ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించారు. జాతీయవాద పత్రికలపై ఆంక్షలు విధించారు. 1930 చివరి నాటికి దేశవ్యాప్తంగా లక్షల మంది నిర్బంధంలో ఉన్నారు.

 

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు: ఈలోగా బ్రిటన్‌లో సైమన్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భవిష్యత్తులో చేపట్టబోయే రాజ్యాంగ సంస్కరణల గురించి భారత నాయకులతో చర్చించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం లండన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేసింది. 1930, నవంబరు 12న నాటి బ్రిటిష్‌ చక్రవర్తి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ పార్టీల నుంచి 16 మంది, భారత రాష్ట్రాల నుంచి 16 మంది, బ్రిటిష్‌ ఇండియా నుంచి 57 మంది వివిధ రాజకీయ పక్షాలకు/సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ బహిష్కరించింది. దాంతో రాజకీయ సంస్కరణల విషయంలో ఈ సమావేశం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. భారతదేశంలో అత్యధిక ప్రజాబాహుళ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ పాల్గొనని ఆ సమావేశం నిష్ప్రయోజనమని భావించింది. 1931, జనవరి 19న సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది.

 

గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక: కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రహించింది. తేజ్‌బహదూర్‌ సప్రూ, డాక్టర్‌ ఎం.ఆర్‌.జయకర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలకు రాజీ కుదిరింది. దీని ఫలితంగా గాంధీతో సహా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులందరినీ విడుదల చేశారు. 1931, మార్చి 5న వైస్రాయ్‌ ఇర్విన్, గాంధీజీ మధ్య ఒప్పందం కుదిరింది.

 

ముఖ్యాంశాలు: * హింసకు బాధ్యులైన వారిని తప్ప, మిగతా రాజకీయ ఖైదీలను విడుదల చేస్తారు. జప్తు చేసిన వారి ఆస్తులు పునరుద్ధరిస్తారు. 

 

* సారాయి, నల్లమందు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ప్రశాంతంగా పికెటింగ్‌కు, నిబంధనలకు లోబడి ఉప్పు తయారీకి అనుమతిస్తారు. 

 

* కాంగ్రెస్‌ కూడా తన వంతుగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు అంగీకరించింది. 1931, మార్చిలో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం దీన్ని ఆమోదించింది.

 

రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. కాంగ్రెస్‌ ప్రతినిధిగా మహాత్మాగాంధీ పాల్గొన్నారు. జాతీయవాదుల ప్రధాన డిమాండ్లను, తక్షణ అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్‌ స్టేటస్‌) ఇచ్చే అంశాన్ని ఈ సమావేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం విస్మరించి అజెండాను పక్కదారి పట్టించింది. భారతదేశ రాజకీయ సంస్కరణల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గ్రహించిన గాంధీ స్వదేశానికి తిరిగివచ్చారు. వచ్చీ రావడంతోనే రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిష్ప్రయోజనమైందని ప్రకటించారు. శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునరుద్ధరించారు.

 

మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం: ఇది 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనడం వల్ల సాధించేదేమి ఉండదని భావించి కాంగ్రెస్‌పార్టీ దీన్ని బహిష్కరించింది.  

 

  ఇంతలో భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ స్థానంలో లార్డ్‌ వెల్లింగ్టన్‌ నియమితులయ్యారు. ఆయన కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు.  ఉద్యమకారులను అణచివేసేందుకు పోలీసులు హింసాత్మక చర్యలకు దిగారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, మతతత్వ రాజకీయాలు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఐకమత్య లోపం, ప్రభుత్వ అణచివేత విధానాలతో ఉద్యమం బలహీనమైంది. కాంగ్రెస్‌ ఈ ఉద్యమాన్ని 1933, మేలో నిలిపేసింది. 1934లో అధికారికంగా ఉపసంహరించుకుంది.

 

ఉద్యమ ఫలితాలు: సంపూర్ణ స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. భారతీయులు పరాయి పాలనను, వలసవాదుల చట్టాలను భరించే స్థితిలో ఏమాత్రం లేరని చాటింది. వాటి నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పానికి ప్రతిరూపమే శాసనోల్లంఘన ఉద్యమం. స్వరాజ్య భావన, పోరాట స్వభావం ప్రజల్లో నాటుకుపోయింది. సమాజంలోని అనేక వర్గాలతో పాటు, రైతులు, వ్యాపారులు, పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొని ఉద్యమ సామాజిక పరిధిని విస్తృతం చేశారు. ఉద్యమకారులు కేవలం బ్రిటిష్‌ చట్టాలకు సహాయ నిరాకరణ మాత్రమే కాకుండా, బ్రిటిష్‌ చట్టాలను ఉల్లంఘించి తమ స్వరాజ్య కాంక్షను విస్పష్టం చేశారు. ఈ ఉద్యమం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, స్థానిక కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చింది. రాజకీయ పోరాటాల్లో బాధలు తట్టుకునే శక్తిని, సహనాన్ని భారతీయులకు అలవాటు చేసింది. తర్వాతి రోజుల్లో క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలకు వారిని సిద్ధం చేసింది.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌