• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనుల పరిపాలన - సామాజిక పరిస్థితులు

  మౌర్య సామ్రాజ్య విచ్ఛిన్నంతో దక్షిణాపథంలో శాతవాహనులు, చోళ, చేర, పాండ్య రాజులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు. శాతవాహనుల పరిపాలనకు పూర్వమే దక్షిణాపథం రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిందని అజ్ఞాత గ్రీకు నావికుడు రాసిన ''పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ", మెగస్తనీస్ ఇండికా గ్రంథాలను బట్టి తెలుస్తోంది. చారిత్రక యుగ ఆవిర్భావం నుంచి దక్షిణాన వివిధ వంశాలు పాలన సాగించాయని గ్రీకు రచనలు, అశోకుడి శాసనాలు తెలుపుతున్నాయి.

  శాతవాహనులు మౌర్యుల పాలన విధానాన్నే అనుసరించారని రామ్‌శరణ్ శర్మ అనే చరిత్రకారుడి అభిప్రాయం. ఎందుకంటే - మౌర్యులు, శాతవాహనులు ఇద్దరి భాషా ప్రాకృతమే. మౌర్యులకు సామంతులు శాతవాహనులు. శాతవాహనుల కాలంలో కూడా మైసూర్‌లో చుటునాగులు, నాగార్జున కొండలో ఇక్ష్వాకులు, నాసిక్‌లో అభీరులు మొదలైన సామంత రాజ్యాలు ఉన్నాయి.

  కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మౌర్యులు, శాతవాహనుల పాలనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. వారిద్దరి పరిపాలనలో అనేక తేడాలున్నాయి.. మౌర్యులది కేంద్రీకృత పాలనా వ్యవస్థ కానీ శాతవాహనులది వికేంద్రీకృత పాలనా వ్యవస్థ.
రాజు ఆధీనంలో ఉన్న భూమిని మౌర్యుల కాలంలో 'రాజ్యక్షేత్ర' అని, శాతవాహనుల కాలంలో 'రాజకంఖేట' అని పిలిచేవారు. మౌర్యుల కాలంలో చాలామంది ఉద్యోగులతో కూడిన బృంద వ్యవస్థ ఉండేది. శాతవాహనుల కాలంలో ఇది తక్కువ. మౌర్యుల కాలంలో గనుల శాఖ, ఉప్పు శాఖ ఉండేవి. కానీ శాతవాహనుల కాలంలో ప్రత్యేక శాఖలనేవి లేవు. అందుకే చరిత్రకారులు మౌర్యులకు - శాతవాహనులకు పరిపాలనలో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

 

పరిపాలన విభాగాల పేరు - అధికారి
* ఆహారాలు (రాష్ట్రాలు) - అమాత్య
* నిగమాలు (పట్టణాలు) - నాగరికుడు
* గ్రామం - గుళ్మిక (గ్రామాధికారి)

 

మూడో పులోమావి వేయించిన 'మ్యాకదోని' శాసనంలో కింది ఆహారాల ప్రస్తావన కనిపిస్తుంది.
* శాతవాహనీహార - కర్ణాటకలోని బళ్లారి ప్రాంతం
* గోవర్ధనహార - మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం
* మమాలహార - పూనాలోని సతారా
* సోమారహార - మహారాష్ట్రలోని రేసామారక రేవు పట్టణ సమీప ప్రాంతం
* కపూరచార - గుజరాత్ ప్రాంతం మొదలైనవి.

   కుబేరకుని భట్టిప్రోలు శాసనం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల ఆధారంగా నాడు పట్టణ పాలన (నిగమాలు) ఉండేదని తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యజమానులైన 'గహపతులు' నిగమాలలో సభ్యులుగా వ్యవహరించేవారు.

 

ఉద్యోగి బృంద వ్యవస్థ

* అమాత్య - ఆహారాలుగా పిలిచే రాష్ట్రానికి అధికారి
* లేఖక్ - రాజు అంతరంగిక అధికారి
* అక్షపటలక - రికార్డులను భద్రపరిచే అధికారి
* రాయబారి - దూత
* భాండాగారికుడు - ధాన్యరూపంలో వసూలైన శిస్తును భద్రపరిచే అధికారి
* హేరణిక - ధన రూపంలో వసూలైన శిస్తును భద్రపరిచే అధికారి
* రజ్జు - కొలమానం (తాడు)
* రజ్జుగాహక - శిస్తు వసూలు చేసే అధికారి
* స్కందవారం - తాత్కాలిక సైన్యం (సైనిక శిబిరం)
* కటకం - ఆయుధాగారం (శాశ్వత సైన్యం)

  శాతవాహుల కాలంలో సైనిక వ్యవస్థ ఉండేదని మెగస్తనీస్ 'ఇండికా' గ్రంథం, అమరావతి శిల్పాల ఆధారంగా తెలుస్తోంది.

 

సాంఘిక పరిస్థితులు

  నాటి సాంఘిక పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి హాలుని గాథాసప్తసతి (ప్రధాన ఆధారం), గుణాడ్యుని బృహత్కథ, గ్రీకు అజ్ఞాత నావికుడి ''పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ", అమరావతి శిల్పాలు మొదలైన ఆధారాలు తోడ్పడుతున్నాయి.

* పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో 'కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం' అనే ప్రస్తావన కనిపిస్తుంది.
* రాజులను దైవాంశ సంభూతులుగా భావించేవారు. గౌతమీ బాలశ్రీ తన నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని రామ-కేశవులతో పోల్చింది.
* ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నట్లు హాలుని గాథాసప్తశతి, విధికుడు అనే చర్మకారుని అమరావతి/ ధాన్యకటక శాసనం తెలుపుతున్నాయి. వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ లేవు. శ్రేణుల వ్యవస్థ ఉండేది.

 

వర్ణ వ్యవస్థ లేదనటానికి కారణాలు:

1) దక్షిణాంధ్ర దేశంలో మొదటిసారిగా శాతవాహనుల కాలంలోనే జైన-బౌద్ధమతాలు ఆవిష్కృతమయ్యాయి.
2) బ్రాహ్మణులైన శాతవాహనులకు, క్షత్రియులైన శకులకు మధ్య వైవాహిక సంబంధాలున్నాయి. వీరికి జన్మించిన సంతానానికి పెట్టిన 'శక శాతకర్ణి', 'ఛత్రపర్ణి శాతకర్ణి' అనే పేర్లు వంశ విలీనాన్ని సూచిస్తున్నాయి.
3) శాసనాల్లో ఇంద్రదత్త, ధమ్మదేవ అనే గ్రీకుల పేర్లను ప్రస్తావించారు.
4) నహపాణుడి కుమార్తె దక్షమిత్ర, అల్లుడు ఋషభదత్తుడు శాతవాహన రాజులకు బహుమానాలు పంపి 'బ్రాహ్మణ క్షత్రియులుగా' పేరుగాంచారు. ఋషభదత్తుడి 'నాసిక్ శాసనం' అతడు కొలికుల శ్రేణి వారికి 2000 కర్షఫణాలు (వెండి నాణేలు) అప్పుగా ఇచ్చి వారి వద్ద 12% వడ్డీ వసూలు చేసి, ఆ వడ్డీనే బౌద్ధ భిక్షువులకు దానం ఇచ్చినట్లు తెలియజేస్తోంది.
5) 'విధికుడు' అనే చర్మకారుడి ఇంటిలో వివిధ వృత్తుల వారు ఉండేవారని, ధాన్యకటక బౌద్ధ స్తూపానికి పూర్ణకుంభం విరాళంగా ఇచ్చినట్లు ధాన్యకటక శాసనంలో ఉంది.
* నాడు ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి. బాల్య వివాహాలు లేవు.
 * బహుభార్యత్వం ఉన్నత వర్గాల్లో మాత్రమే కనిపిస్తుంది.
 * వితంతు పునర్వివాహాలు లేవు. ఎక్కడైనా వితంతు పునర్వివాహం జరిగితే 'పునర్భు వివాహం' అని పిలిచేవారు.
* స్త్రీ బానిస వ్యవస్థ ఉండేది.
 * అనులోమ, విలోమ వివాహాలు జరిగేవి. స్త్రీలకు ఎరుపు, ఊదారంగు వస్త్రాలన్నా, మల్లెపూలన్నా ఇష్టం.
* స్త్రీ బానిసలను, విలాస వస్తువులను వర్తక వ్యాపారులు గుజరాత్‌లోని 'భరుకచ్ఛ' రేవు పట్టణానికి తీసుకువెళ్లే వారు. అందమైన స్త్రీలను, పాటలు పాడే యువ కళాకారులను రాజులు బహుమానంగా స్వీకరించారని 'పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్‌సీ'లో పేర్కొన్నారు.
* నాటి స్త్రీలు 64 కళల్లో ఆరితేరినవారు. అపస్తంభుని న్యాయస్మృతి ప్రకారం స్త్రీకి వ్యక్తిగత ఆస్తిహక్కు ఉండేదని తెలుస్తోంది.

 

వినోదాలు

  కోడి పందేలు, ఎడ్ల పందేలు, జంట నృత్యాలు (కార్లే, కొండానే గుహల్లో) నాటి వినోద కార్యక్రమాలు. హోలి పండుగ రోజు స్త్రీలు, పురుషులు మత్తు పానీయాలు సేవించి, బురద చల్లుకునేవారు.

 

శ్రేణులు

'విశవట్టి శాసనం' శ్రేణుల గురించి వివరిస్తుంది.

¤ హాలికులు - వ్యవసాయదారులు
¤ కొలికులు - నేతపనివారు
¤ తిలపిసకలు - నూనెగానుగలు తయారు చేసేవారు
¤ మాలకార - పూల వ్యాపారులు
¤ ధంజుక - ధాన్యపు వ్యాపారులు
¤ కులారా - కుమ్మరి వృత్తివారు
¤ కమర - కమ్మరి వృత్తివారు
¤ సేలవథికులు - శిల్పకారులు
 ¤ వథికులు - వడ్రంగులు
¤ గంధరులు - సుగంధ పరిమళాలు తయారు చేసేవారు
¤ ఛస్మక - చేపలు పట్టేవారు
¤ పసకరులు - మేదరివారు
 యజ్ఞాని అనే పండితుడు కుమ్మరి వృత్తివారిని శిల్పకారులతో పోల్చాడు. కర్ణాటకలోని మస్కి, మెదక్‌లోని కొండాపూర్, మహారాష్ట్రలోని పైఠాన్ మొదలైన ప్రాంతాల్లో లభ్యమైన మృణ్మయ శకలాలను పరిశీలిస్తే వారు శిల్పకారులకు ఏమాత్రం తీసిపోరని పేర్కొన్నాడు.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌