• facebook
  • whatsapp
  • telegram

కులతత్వం

* 'సోషల్ ఎక్స్‌క్లూజన్‌'లో ముఖ్యాంశం
* మెరుగైన అవగాహనతోనే మంచి మార్కులు

  సోషల్ ఎక్స్‌క్లూజన్ (సామాజిక వెలి) విభాగంలో అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాల్లో కులతత్వం ఒకటి. ఈ అంశంపై మంచి అవగాహన సాధిస్తే అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు తెలుస్తాయి. కులతత్వం మూలాలు, ప్రబలుతున్న తీరు,
సామాజిక - ఆర్థిక పరిస్థితులు.. లాంటివాటిపై మెరుగైన పరిజ్ఞానం కోసం ఈ వ్యాసం..
హి ందూ సామాజిక వర్ణచట్రం నుంచి ఆవిర్భవించిన సాంఘిక నిర్మితికి ఒక రూపం కులం. ఒక కులం ప్రజలు మరో కులం వారిని పీడిస్తూ, వారిపై పెత్తనం ప్రదర్శించే ఆధిపత్య ధోరణిని 'కులతత్వం' అంటారు. పరిమిత వనరులు, వాటి అసమతౌల్య పంపిణీ, పెత్తనం చేసేందుకు, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కులతత్వాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా ఉంది. కులతత్వానికి కారణాలను విశ్లేషిస్తే...

 

నిరూపించుకోవాలనే తాపత్రయం

  కులం ఏర్పడటానికి మూల కారణం వృత్తి. కుల నిర్మాణంలో వృత్తిపరమైన విభేదమే కుల అంతరాలకు కారణం. జీవనోపాధికి వృత్తేఆధారం. ఇది ఇచ్చే ఆదాయం, అలౌకిక జ్ఞానం లాంటి అంశాల ఆధారంగా కాలక్రమేణా కుల సోపానాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో వృత్తి రహస్యాలు కాపాడుకునే ప్రయత్నం, తమ వృత్తి ఇతర వృత్తుల కంటే గొప్పదని నిరూపించుకునే సందర్భంలో.. ఇతర కులాలు, వాటి వృత్తుల్లోని లోపాలను వెతకడం, తక్కువగా చూడటం లాంటి పరిణామాల నేపథ్యంలో 'కులతత్వం' పెరుగుతుంది. వృత్తిస్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించినప్పటికీ.. కులతత్వాన్ని వివిధ రూపాల్లో పోషిస్తూ, ఇతర కులాలపై ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల కూడా ఇది పెరుగుతూనే ఉంది. తమ వృత్తుల పరిధిలోకి ఇతర కులాల వారిని రాకుండా నియంత్రించే నేపథ్యంలో సామాజిక మినహాయింపు ద్వారా కులతత్వం మరింత బలపడింది.

 

అంతర్వివాహ నియమం

  కుల నియంత్రణ అయిన 'అంతర్వివాహ' నియమం కూడా కులతత్వానికి మరో కారణం. ఈ నియమం వల్ల సామాజిక కులచట్రం దృఢపడింది. ఒక కులం మరో కులంతో సమ్మిళితమయ్యే అవకాశాలు తగ్గాయి. వృత్తి రహస్యం, సామాజిక హోదా, కలుషితం కాకపోవడం లాంటి లక్ష్యాల సాధనకు అంతర్వివాహ నియమాన్ని కఠినంగా పాటిస్తున్నారు. దీనివల్ల కూడా కులతత్వం ప్రబలుతోంది. వేరే కులం వారిని వివాహం చేసుకుంటే వెలివేయడం, అలాంటి వారిని సామాజికంగా తక్కువగా చూడటం వంటివి కూడా కులతత్వం కొనసాగడానికి కారణమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో వెనుకబడిన, బలహీన కులాలవారు తమ రక్షణ, హక్కులు, అధికారం కోసం సంఘటితం కావడం గమనిస్తున్నాం. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆయా వర్గాలు ప్రత్యేక రక్షణలు పొందడం లాంటివి కూడా కులతత్వం పెరగడానికి కారణమవుతున్నాయి.
వెనుకబడిన, బలహీన కులాలు బలపడుతుండటంతో.. తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రకులాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు 'అంతర్వివాహ నియమాన్ని సడలించుకుంటున్నాయి. క్రమేపీ 'బహిర్వివాహం వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే రాజ్యాధికారం, ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిలో కూడా కులతత్వం ప్రబలుతూనే ఉంది.

 

గ్రామీణ ప్రాంతాల్లో..

  రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం బాగా పెరిగింది. గ్రామాలు స్థిర సమాజాలు, పట్టణాలు గతిశీలక సమాజాలు. గ్రామాల్లో అల్పవృద్ధి రేటు కారణంగా పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి కల్పనలో పట్టణాలు ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదు. పట్టణాల్లోని పరిమిత వనరులు ప్రజల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. స్థిర సమాజాలైన గ్రామాల్లో అనాదిగా ఉన్న కులతత్వం యథాతథంగా కొనసాగుతూనే ఉంది. పట్టణాల్లోని వనరులపై పట్టు కోసం కూడా కులతత్వం పాగా వేస్తోంది. పట్టణాల్లో కులసంఘాల ఏర్పాటు ద్వారా గ్రామాల అనుసంధానంలో వారు సంఘటితం అవుతున్నారు. ఈ పరిణామాలతో కులతత్వం మరింతగా బలపడుతూనే ఉంది.

 

'సాంకేతిక' కారణాలు

  సమాచార సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ప్రజల మధ్య భౌగోళిక దూరం బాగా తగ్గింది. మేమంతా మానసికంగా చాలా దగ్గరగా ఉన్నామనే భావన వారిలో ఏర్పడింది. సామాజిక మాధ్యమాల ద్వారా వారికి సంఘటితమయ్యే అవకాశం ఏర్పడింది. సామాజిక మాధ్యమాల ద్వారా స్వోత్కర్ష భావజాలం, ఇతర కులాలను నిందించడం లాంటి సామాజిక వైపరీత్యాలతో కులతత్వం మరింతగా పెరుగుతూనే ఉంది.

 

హక్కుల దుర్వినియోగం

  రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సంక్రమించిన వివిధ రక్షణలను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆయా హక్కులను వారు ఇతర కులాలపై ఆధిపత్యం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో బాధిత వర్గాలు తమని తాము రక్షించుకోవడం కోసం సంఘటితం అవుతున్నాయి. ఇదికూడా కులతత్వానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. పరస్పర దాడులు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పనిచేయడం లాంటి లక్షణాల వల్ల సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంది.

 

ఓటు రాజకీయాలు

  ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కూడా కులతత్వం మరింతగా దృఢపడుతోంది. రాజకీయపార్టీలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఆయా కులాలను తమవైపునకు తిప్పే ఒక తంత్రాన్ని బహిరంగంగానే అమలు చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన స్థానాలు (సీట్లు), మంత్రిత్వ శాఖలను కేటాయిస్తున్నాయి. వీటివల్ల సమాజంలో స్పష్టమైన కుల విభజన చేయడం వల్ల అంతరాలు పెరిగి, కులతత్వం ముదురుతుంది.

 

లబ్ది కోసం..

  ప్రభుత్వం ప్రకటించే పథకాలు, రిజర్వేషన్ల ద్వారా లబ్ది పొందేందుకు ఆయా కులాలవారు ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. ద్వేషాలు పెంచుకుంటున్నారు. తమ వర్గానికి లబ్ది చేకూరేలా సంఘటితం కావడం తప్పుకాదు. కానీ లబ్దిదారులను చూసి ఇతరులు ద్వేషభావాలు పెంచుకోవడం వల్ల కులతత్వం ప్రబలుతోంది.

 

చట్టాల ఉల్లంఘన

  వివిధ సందర్భాల్లో కులతత్వంతో వ్యవహరించిన వ్యక్తులకు సకాలంలో సరైన శిక్షలు పడటం లేదు. దాంతో వారు యథేచ్చగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.

 

ఎన్నికల వ్యవస్థ నిస్సహాయత

  ఎన్నికల వ్యవస్థ నిస్సహాయత వల్ల రాజకీయ పార్టీలు కులాల ప్రాతిపదికన చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వాటిపై చర్యలు ఉండటం లేదు. దీంతో కొన్ని పార్టీలు కులతత్వాన్ని పెంచుతూనే ఉన్నాయి.

 

విలువల పతనం

  సమాజంలో నానాటికీ 'విలువలు పడిపోతున్నాయి. ఇళ్లు, పాఠశాలలు, సామాజిక స్థాయుల్లో తగిన శిక్షణ లోపిస్తోంది. ఫలితంగా కులం ఒక హోదా, పీడన సాధనంగా మారింది.

 

దుష్ఫలితాలు

* కులతత్వం వల్ల సమాజంలో సామరస్య వాతావరణం బలహీనపడుతుంది. అనిశ్చితి అశాంతిని పురిగొల్పుతుంది.
* కులతత్వం అప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఫలితాలను తారుమారు చేయగలదు.
* రాజ్యాంగ స్ఫూర్తికి 'కులతత్వం ప్రతిఘాతం. రాజ్యాంగం సమానత్వాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థను ప్రతిపాదించింది. కులతత్వం వల్ల సమానత్వానికి విఘాతం ఏర్పడమే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తి బలహీనపడుతుంది.
* జాతి సమైక్యతకు కులతత్వం సవాలు విసురుతుంది. భారత జాతీయత మాత్రమే ఈ దేశాన్ని సంఘటితంగా ఉంచగలదు. కులతత్వం సూక్ష్మ సంఘటితత్వాన్ని ఏర్పరుస్తుంది. కానీ విశాల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది.
* కులతత్వం మతమార్పిడులకు కారణం అవుతుంది. బాహ్య ప్రలోభాలు లేనంతవరకు 'మత మార్పిడులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కే. కానీ కులతత్వం బాహ్య ప్రలోభమే కాబట్టి, మత మార్పిడులు ఉద్రిక్తతలకు కారణమవుతాయి. హిందూ సామాజిక చట్రంలో దళితులు క్రైస్తవ మతమార్పిడి చేసుకోవడానికి కారణం అగ్ర కులతత్వమే

 

అనేది ఒక భావన.

* కులతత్వం వ్యక్తులను ప్రేరేపించి పాలనలో అనేక అక్రమాలకు కారణమవుతోంది. తమ కులస్థుల కోసం నిబంధనలు ఉల్లంఘించేలా చేస్తుంది. ఇతర కులాలవారికి ప్రభుత్వ ప్రతిఫలాలు అందకుండా అడ్డుకునేలా వారిని పురిగొల్పుతుంది. అవినీతి చర్యలకు పాల్పడేందుకు తోడ్పడుతుంది.
* కులతత్వం వల్ల సంఘర్షణలు ఏర్పడితే ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. పెట్టుబడులు మందగించడం వల్ల ఉపాధి కల్పన తగ్గుతుంది. నిరుద్యోగం పెరుగుతుంది.
* దేశ ఉత్పాదకత క్షీణిస్తుంది. లాభం లేకపోయినా కులతత్వం వల్ల ప్రజలు ఆయా వృత్తులను అంటిపెట్టుకుని ఉంటారు.

Posted Date : 08-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌