• facebook
  • whatsapp
  • telegram

చోళులు

భారతదేశ చరిత్ర

 


దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో చోళులు ప్రముఖులు. వీరు క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి క్రీ.శ. 13వ శతాబ్దం వరకు తమిళ రాజ్యాన్ని పాలించారు. చోళ రాజ్య స్థాపకుడు విజయాలయ చోళుడు. ఈ సామ్రాజ్యం రాజరాజ, రాజేంద్ర చోళుల కాలంలో గొప్పగా విరాజిల్లింది. వీరు అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పటిష్ట పాలనను అందించారు. చోళులు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు. స్థానిక స్వపరిపాలనా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేశారు.

చారిత్రక నేపథ్యం

చోళుల గురించిన ప్రస్తావన మొదటగా ‘సంగం యుగ’ సాహిత్యంలో కనిపిస్తుంది. అయితే ప్రాచీనకాలంలోనే మహాభారతం, అశోకుడి శిలాశాసనాలు, మెగస్తనీస్‌ రచనల్లో వీరి గురించి ఉంది.

బౌద్ధ గ్రంథాలైన మహావంశం, దీపవంశం; టాలమీ రచనలు; ‘పెరిప్లస్‌-ఆఫ్‌-ది-ఎరిత్రియన్‌-సి’ గ్రంథాల్లో చోళుల ప్రస్తావన ఉంది. 

క్రీ.శ.1వ శతాబ్దం నుంచే చోళులు రాజకీయంగా అనేక మంది రాజుల వద్ద సేనాధిపతులుగా పనిచేశారు. క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి ‘కరికాల చోళుడు’ ప్రాచీన చోళసామ్రాజ్యాన్ని స్థాపించి, గొప్ప వీరుడిగా పేరొందాడు. 

ఇతడు ‘వెన్ని’ యుద్ధంలో చేర-పాండ్య కూటమిపై గెలిచాడు. తర్వాత సింహళ రాజును ఓడించి, 1200 మందిని యుద్ధ ఖైదీలుగా బంధించాడు. వారితో కావేరీ నదిపై ఆనకట్టలు కట్టించాడు.

ఇతడి తర్వాత ‘నెడుమికిల్లి’ రాజయ్యాడు. ఇతడి కాలంలో కలభ్రులు, సముద్రపు దొంగలు, పల్లవులు, కేరళీయులు, పాండ్యులు చోళ రాజధానిపై దాడి చేశారు. దీంతో ప్రాచీన చోళసామ్రాజ్యం పతనమైంది. 

క్రీ.శ. 9వ శతాబ్దంలో విజయాలయ చోళుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో చోళ పాలన పునరుద్ధరణ జరిగింది.

రాజకీయ చరిత్ర

విజయాలయ చోళుడు

క్రీ.శ. 850 నుంచి క్రీ.శ. 870 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదట్లో పల్లవులకు సామంతుడిగా ఉన్నాడు.

విజయాలయుడు క్రీ.శ. 850లో పాండ్య సామంతుడు ‘ముత్తరయార్‌’ను ఓడించి, తంజావూరును ఆక్రమించాడు. అక్కడ ‘విసంభసూధిని’ అనే దేవాలయాన్ని కట్టించాడు.

ఆ సమయంలో పల్లవులు, పాండ్యుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా చేసుకున్న విజయాలయ చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని స్వతంత్ర చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

మొదటి ఆదిత్య చోళుడు 

క్రీ.శ. 870 నుంచి క్రీ.శ. 907 వరకు రాజ్యపాలన చేశాడు. 

పల్లవరాజు నందివర్మ మరణించాక అతడి కుమారులైన నృపతుంగవర్మ, అపరాజితవర్మ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. దీనికి ‘శ్రీపురంజియం’ యుద్ధం అని పేరు. ఇందులో ఆదిత్య చోళుడు అపరాజితవర్మకు సహాయం చేయగా, నృపతుంగవర్మకు పాండ్యరాజు వరగుణవర్మ సాయం చేశాడు.

ఆదిత్య చోళుడు వరగుణవర్మను ఓడించి అపరాజితవర్మ విజయానికి సాయం చేశాడు. దీంతో అతడు తంజావూరు పరిసర ప్రాంతాలను పొందాడు. తర్వాత ఆదిత్య చోళుడు అపరాజితవర్మను ఓడించి కంచిని ఆక్రమించి, తన రాజ్యంలో కలుపుకున్నాడు. 

పాండ్యుల నుంచి కోయంబత్తూరు, సేలంను ఆక్రమించాడు. ఇతడు రాతితో ఎత్తయిన శివాలయాలు నిర్మించాడు.

పరాంతక చోళుడు 

క్రీ.శ. 907 నుంచి క్రీ.శ. 955 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు మొదటి ఆదిత్య చోళుడి కుమారుడు. 

క్రీ.శ. 910లో పాండ్యరాజు మారవర్మ రెండో రాజసింహుడ్ని ఓడించి, మధురైను స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఇతడికి ‘మధురై కొండ’ అనే బిరుదు వచ్చింది.

ఇతడి కాలంలో రాష్ట్రకూటులతో వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు పశ్చిమ గాంగుల సాయంతో పరాంతకుడిపై దండెత్తాడు. పరాంతక చోళుడు వారిని ‘పల్లాల యుద్ధం’లో ఓడించాడు. దీనికి గుర్తుగా ఇతడు చిదంబరంలోని నటరాజ దేవాలయ పైకప్పుకి బంగారుపూత పూయించాడు. 

క్రీ.పూ. 949లో మూడో కృష్ణుడు తక్కోళం యుద్ధంలో పరాంతకుడ్ని ఓడించాడు. ఇతడి జైత్రయాత్ర రామేశ్వరô వరకు సాగింది. అక్కడ మూడో కృష్ణుడు విజయస్తంభం వేయించాడు.

పరాంతకుడు మరణించాక (క్రీ.శ. 955-985 చోళ సామ్రాజ్యం బలహీనమైంది. 

పరాంతకుడి తర్వాత గండరాదిత్య, అరింజయ, రెండో పరాంతక, రెండో ఆదిత్య ఉత్తమ చోళులు రాజ్యపాలన చేశారు. 

ఉత్తమ చోళుడి కుమారుడు రాజరాజ - 1 కాలంలో చోళ సామ్రాజ్యం మళ్లీ శక్తిమంతమైంది. ఉత్తమ చోళుడికి మరో పేరు సుందర చోళుడు.

మొదటి రాజేంద్ర చోళుడు

క్రీ.శ. 1014 నుంచి క్రీ.శ. 1044 వరకు రాజ్యపాలన చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై విజయం సాధించాడు. 

కల్యాణి చాళుక్యులను అనేకసార్లు ఓడించి, వేంగి రాజ్యంపై చోళప్రాబల్యం పెంచాడు. 

క్రీ.శ.1018లో సింహళరాజు అయిదో మహేంద్రుడ్ని ఓడించాడు. క్రీ.శ. 1019లో పాండ్య, చేర రాజ్యాలపై దండెత్తి జయించాడు.

వేంగిరాజు రాజరాజ నరేంద్రుడికి తన కుమార్తె ‘అమ్మంగదేవి’ని ఇచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయిన రాజరాజనరేంద్రుడికి తిరిగి వేంగి సింహాసనాన్ని అప్పగించాడు.

బెంగాల్‌ పాలకుడు ‘మహిపాలుడ్ని’ ఓడించి ‘గంగైకొండన్‌’ అనే బిరుదు పొందాడు. 

వ్యాపారాభివృద్ధి కోసం మలయా, సుమిత్రాలను పాలిస్తున్న శైలేంద్ర వంశీయుడు శ్రీవిజయోత్తమవర్మను ఓడించాడు. క్రీ.శ. 1025లో అతని రాజధాని ‘కడారం’ను ఆక్రమించి, ‘కడారం కొండ’ అనే బిరుదు పొందాడు. 

క్రీ.శ. 1041లో శ్రీలంకను ఆక్రమించాడు. దీంతో ఇతడికి బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలపై ఆధిపత్యం దక్కింది. ‘త్రి సముద్రాధీశ్వర’ అనే బిరుదు పొందాడు.

రాజేంద్ర చోళుడు ‘గంగైకొండ చోళపురం’ అనే కొత్త పట్టణాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే గొప్ప తటాకాన్ని నిర్మించాడు. వేద, వ్యాకరణ, న్యాయ మీమాంస శాస్త్రాల బోధనకు 14 మంది ఉపాధ్యాయులను నియమించాడు. 

నౌకాబలాన్ని అభివృద్ధి చేసి, చైనాకు వ్యాపారాభివృద్ధి కోసం రాయబారులను పంపాడు. 

ముడికొండ (కేరళ, పాండ్య, సింహళ రాజులను జయించినవాడు), గంగైకొండ (గంగాపరీవవాహ ప్రాంతాన్ని జయించినవాడు), కడారకొండ (శ్రీవిజయరాజ్య రాజధాని ‘కడారం’ విజేత) అనే బిరుదులు ఇతడి విజయాలను సూచిస్తున్నాయి. 

ఇతడికి రాజాధిరాజు ఖి, రెండో రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజాధిరాజు - I

క్రీ.శ. 1044 నుంచి క్రీ.శ. 1052 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలం మొత్తం యుద్ధాలతో గడిచింది.

ఇతడు వేంగిపై దండెత్తి, పశ్చిమ చాళుక్యరాజు విక్రమాదిత్యుడ్ని ‘ధాన్యకటక’ యుద్ధంలో ఓడించి, ‘కొల్లిపాక’ను ధ్వంసం చేశాడు. 

చాళుక్య సామంతులను ఓడించి, ‘కంపిలి’పై అధికారం చెలాయించాడు. యాతగిరి (యాగ్గిరి) ప్రాంతంలో తన విజయాలకు చిహ్నంగా ‘పులిగుర్తుతో’ స్తంభాన్ని వేయించాడు. 

కల్యాణి పట్టణాన్ని ఆక్రమించి ‘విజయరాజేంద్ర’ అనే బిరుదు పొందాడు. ఇక్కడి నుంచే ‘ద్వారపాలక’ ప్రతిమను తెచ్చి తంజావూరులోని ‘ధారాసురం’ దేవాలయంలో నెలకొల్పినట్లు తమిళ శాసనంలో ఉంది. 

ఈ సమయంలో మధుర, సింహళంలో తిరుగుబాట్లు చెలరేగగా, వాటిని అణచివేశాడు. క్రీ.శ. 1052లో చాళుక్యులతో జరిగిన ‘కొప్పం యుద్ధం’లో మరణించాడు.

రెండో రాజేంద్ర చోళుడు 

క్రీ.శ. 1052 నుంచి క్రీ.శ.1064 వరకు రాజ్యపాలన చేశాడు. కొప్పం యుద్ధంలో రాజాధిరాజు మరణించినప్పటికీ, రాజేంద్ర చోళుడు యుద్ధం కొనసాగించి, విజయం సాధించాడు. 

ఇతడికి యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం జరిగింది. ఇతడు ‘కొల్లాపురం’లో విజయస్తంభం వేయించాడు. 

క్రీ.శ. 1062లో ‘కూడలి సంగం’ యుద్ధంలో చాళుక్య సేనలను పూర్తిగా ఓడించాడు.

చివరి చోళ రాజులు

రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని కడపటి చోళరాజులు అని పేర్కొంటారు.

రెండో రాజేంద్రుడి తర్వాత వీరరాజేంద్ర 

క్రీ.శ.1064-70, ఆదిరాజేంద్ర (క్రీ.శ. 1070), కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070-1120) పాలించారు. కులోత్తుంగ చోళుడి తల్లిదండ్రులు రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవి.

చోళ వంశంలో చివరివాడు మూడో రాజేంద్రచోళుడు. ఇతడు క్రీ.శ. 1256-70 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కాకతీయ రాజైన గణపతిదేవుడ్ని ఓడించాడు. 

పాండ్యరాజు కులశేఖర కాలంలో చోళ సామ్రాజ్యం పాండ్యరాజ్యంలో విలీనమైంది. దీంతో చోళుల పాలన అంతమైంది.

రాజరాజ చోళుడు - 

క్రీ.శ. 985 నుంచి క్రీ.శ. 1014 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి పాలనాకాలంలో చోళ సామ్రాజ్య కీర్తిప్రతిష్ఠలు పెరిగాయి. 

రాజరాజ చోళుడు గొప్పయోధుడు. ఇతడు మొదట పాండ్య, కేరళ, సింహళ రాజ్యాలపై దాడిచేశాడు. రెండోసారి పాండ్య, కేరళ రాజులను కండలూర్, విలినమ్‌ యుద్ధాల్లో ఓడించాడు. 

ఇతడు నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు. సింహళరాజు అయిదో మహేంద్రను ఓడించి, అనురాధాపురాన్ని కొల్లగొట్టాడు. సింహళంలో తాను ఆక్రమించిన భూభాగానికి ‘పోలోన్నరువ’ను రాజధానిగా చేశాడు. 

క్రీ.శ. 991లో గాంగవాడి, నోళంబవాడి, తడిగైపవాడి, మైసూరును జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.

తూర్పు చాళుక్యులను ఓడించి, వేంగిని  ఆక్రమించిన తెలుగు జటాచోడ భీముడ్ని 

క్రీ.శ. 1000లో ఓడించాడు. శక్తివర్మకు వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. శక్తివర్మ తమ్ముడు విమలాదిత్యుడికి తన కుమార్తె కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దీంతో చోళ, చాళుక్య రాజ్యాల మధ్య మైత్రి బలపడింది.

కల్యాణి చాళుక్య రాజు సత్యాశ్రయుడు క్రీ.శ. 1006లో వేంగిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడ్ని ఓడించాడు. 

క్రీ.శ.1003లో చాళుక్య తైలపుడ్ని ఓడించి, కట్టవాడిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

వేంగిని ఆక్రమించాలనుకున్న కళింగ గాంగులను రాజరాజు ఓడించాడు. ఇతడు తన నౌకాబలంతో మాల్దీవులను జయించాడు.

ఇతర విషయాలు.. 

రాజరాజ చోళుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమేకాక, ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించాడు. రాజ్యంలోని భూములను సర్వే చేయించి, గ్రామపాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

రాజరాజ శివభక్తుడు. ఇతడికి ‘శివపాదశేఖర’ అనే బిరుదు ఉంది. ఇతర బిరుదులు:‘జయంగోడ’, ‘చోళమార్తాండ’, ‘ముమ్మడిచోళ’, ‘కేరళాంతక’.

ఇతడ్ని మొదట్లో ‘రాజకేసరి అరుమోళివర్మన్‌’ అనే పేరుతో పిలిచేవారు. 

ఇతడు క్రీ.శ. 1010లో తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. దీన్నే ‘రాజరాజేశ్వరాలయం’ అంటారు. 

శ్రీవిజయ రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశ రాజు శ్రీమార విజయోత్తుంగవర్మ ఇతడి స్నేహితుడు. ఇతడి కోరిక మేరకు రాజరాజ నాగపట్నంలో బౌద్ధవిహార నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. క్రీ.శ 1006లో ఆ విహారానికి ‘అనైమాంగలం’ అనే గ్రామాన్ని దానం చేశాడు.

మాదిరి ప్రశ్నలు

1. ‘సౌత్‌ ఇండియన్‌ నెపోలియన్‌’ అని ఎవరిని అంటారు?

1)రాజరాజ - I   2)రాజేంద్ర చోళుడు   3) రాజరాజ - II    4) నరేంద్ర చోళుడు

2. ‘ఇండియన్‌ నెపోలియన్‌’ అనే బిరుదు ఎవరిది?

1)సముద్రగుప్త   2)రెండో చంద్రగుప్త  3)కుమారగుప్త   4)స్కందగుప్త

3. ‘గంగైకొండ’ అనే బిరుదు ఎవరిది?

1)రాజరాజ    2)అనంత చోళుడు 3)రాజాధిరాజ    4)రాజేంద్ర చోళుడు

4. ఉత్తర మేరూర్‌ శాసనం ఎవరి పాలనా విధానాన్ని తెలుపుతుంది?

1)చోళులు    2)చాళుక్యులు 3)మౌర్యులు    4)రాష్ట్రకూటులు

5. ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చోళరాజు ఎవరు?

1)రాజేంద్రచోళ - I  2)మొదటి రాజరాజు   3)మొదటి పరాంతక      4)ఆదిత్య చోళుడు

సమాధానాలు

1-2  2-1  3-4  4-1  5-1

 

Posted Date : 21-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌