• facebook
  • whatsapp
  • telegram

భూమి - అంతర్భాగం

  టెలిస్కోప్ లాంటి పరికరాలతో కొన్ని వేల కి.మీ. దూరంలో ఉన్న గ్రహాలు, గ్రహశకలాలను ప్రత్యక్షంగా చూడగలిగిన మానవుడు భూమి అంతర్భాగాలను మాత్రం ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాడు. ఇంతవరకు ప్రపంచంలో తవ్విన గనుల లోతు అత్యధికంగా 12 కిలోమీటర్లు. ఇది రష్యాలోని కోలా పెనిన్సులా (Kola Peninsula) భూమిలో ఉంది.  

  ఉపరితలం మీదున్న మానవుడు తన అనుభవాల వల్ల రెండు విషయాలు తెలుసుకోగలిగాడు. మొదటిది- భూమి నుంచి లోపలికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది. రెండోది- భూమి లోపల మాగ్మా అనే శిలాద్రవం ఉంటుంది. ఇది అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లినప్పుడు వెలువడుతుంది. అలా వెలువడిన ద్రవాన్ని లావా అంటారు. దీని ఉష్ణోగ్రత సుమారు 6000ºC ఉంటుంది.

* భూమి మండుతున్న సూర్యగోళం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి సూర్యుడి బాహ్య ఉష్ణోగ్రత, భూమి లోపలి ఉష్ణోగ్రత రెండూ సమానం (6000º C)గా ఉంటాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

* భూమి ఉపరితలం చల్లగా ఉంటుంది. లోపలికి వెళ్లే కొద్ది, ప్రతి 32 మీటర్ల లోతుకు 1º C చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వల్ల మానవుడు భూమి లోపలికి వెళ్లి అంతర్భాగం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడం సాధ్యపడలేదు.

* ఉష్ణోగ్రతతోపాటు సాంద్రత, పీడనం కూడా భూమి లోపలికి వెళ్లే కొద్ది పెరుగుతూ ఉంటాయి.

* శాస్త్రజ్ఞులు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపల ఉండే ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం లాంటి అంశాలను కొంతవరకూ అంచనా వేయగలిగారు. శాస్త్రవేత్తలు అనుసరించిన పరోక్ష పద్ధతుల్లో ముఖ్యమైంది- భూకంప తరంగాల విశ్లేషణ (Seismic Wave Analysis Method) పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం భూమి అంతర్భాగాన్ని మూడు జోన్లుగా విభజించవచ్చు.
      1. భూ పటలం (Crust)
      2. భూ ప్రావారం (Mantle)
      3. భూ కేంద్రం (Core)

 

భూ పటలం: ఇది భూమి ఉపరితలంపై ఉండే సన్నటి పొర. దీని సగటు మందం 38 కి.మీ. అయితే ఖండాలపై ఎక్కువ మందంతో (దాదాపు 75 కి.మీ.), సముద్ర గర్భంలో తక్కువ మందంతో (దాదాపు 5 కి.మీ.) ఉంటుంది. దీని వల్ల పటలాన్ని రెండు పొరలుగా విభజించారు.
      1. బాహ్య పటలం       2. అంతర్ పటలం

బాహ్య పటలం: ఇది ఒక సన్నటి పొర. దీని మీదే సకల ప్రాణికోటి నివసిస్తోంది. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మొదలైన స్వరూపాలన్నీ దీని మీదే ఉన్నాయి. ఈ బాహ్యపటలం మీద అగ్ని శిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అనే మూడు రకాల శిలలు కనిపిస్తాయి. రసాయనికంగా పరిశీలిస్తే- బాహ్య పటలంలో సిలికా (Silica), అల్యుమినియం (Aluminium) ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటి మొదటి అక్షరాలను కలిపి సియాల్ పొర (SIAL) అని కూడా అంటారు. ఈ పొర సాంద్రత 2.7 grams/cubic cm లేదా 2.7 gms/cm3.

అంతర్ పటలం: ఇది సముద్ర గర్భంలో ఎక్కువ మందంతో ఉంటుంది. దీనిలో బసాల్ట్ శిలలు కనిపిస్తాయి. ఇవి అగ్నిశిలలు. రసాయనికంగా పరిశీలిస్తే ఇందులో సిలికా, మెగ్నీషియం (Magnesium) ఎక్కువగా ఉంటాయి. వాటి మొదటి రెండక్షరాలు కలిపి "SIMA" అని కూడా అంటారు. దీని సాంద్రత 3.0 gm/c.c
 భూకంప తరంగాలు (Seismic waves) సియాల్, సీమా పొరల ద్వారా చొచ్చుకుని వెళ్లేటప్పుడు వాటి వేగంలో మార్పు వస్తుంది. ఈ మార్పునే విచ్ఛిన్నం (Discontinuity) అంటారు. సియాల్, సీమా పొరల మధ్య విచ్ఛిన్నాన్ని కనిపెట్టింది - కన్రాడ్. అందుకే ఈ విచ్ఛిన్నాన్ని 'కన్రాడ్ విచ్ఛిన్న పొర' అంటారు.

ప్రావారం: ఇది పటలానికి, కేంద్రానికి మధ్య, దాదాపు 2900 కి.మీ. మందంతో ఉంటుంది. ఈ ప్రావారాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు.
      1. బాహ్య ప్రావారం (Outer Mantle)
      2. అంతర్ ప్రావారం (Inner Mantle)

బాహ్య ప్రావారం: దీని సాంద్రత 3.5 gm/c.c. 100 నుంచి 400 కి.మీ లోతులో అధిక ఉష్ణోగ్రతల వల్ల శిలలు కూడా కరిగిపోయి, ప్లాస్టిక్ ద్రవ రూపంలో ఉండే ఈ పొరను ఎస్తినోస్పియర్ (Asthenosphere) అంటారు. భూకంప తరంగాలు ఈ పొరలో అత్యల్ప వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే ఈ పొరల్ని Low Velocity zone అని అంటారు.

అంతర్ ప్రావారం: దీని సాంద్రత 4.5 gm/c.c వరకు ఉంటుంది. ఇది దాదాపు 2900 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉంది. భూతరంగాలు పటలం నుంచి ప్రావారానికి ప్రయాణించేటప్పుడు వాటి వేగంలో వచ్చే మార్పును మొహిరోవిసిక్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. అందుకే పటలానికి ప్రావారానికి మధ్య ఉన్న విచ్ఛిన్న పొరను మొహిరోవిసిక్ విచ్ఛిన్న పొర అంటారు.

కేంద్రం: ప్రావారం దాటిన తర్వాత ఉండే పొరే కేంద్రం. ఇది 2900 కి.మీ. నుంచి 6400 కి.మీ. వరకు విస్తరించింది. దీనిలోకి ప్రవేశించిన భూకంప తరంగాలు ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించడంతో ఇక్కడ ఒక విచ్ఛిన్న పొర ఉందని గూటెన్‌బర్గ్-వేచార్ట్ అనే శాస్త్రవేత్త అంచనా వేశాడు. అందుకే ప్రావారానికి, కేంద్రానికి మధ్య ఉన్న విచ్ఛిన్న పొరను గూటెన్‌బర్గ్ విచ్ఛిన్న పొర అంటారు.

  కేంద్రం సాంద్రత 13 gms/c.c వరకు ఉంటుంది. భూకేంద్రంలో ప్రధానంగా నికెల్ (Nickel), ఫెర్రస్ (Ferrous) ఖనిజాలు ఉంటాయి. వీటి మొదటి అక్షరాలను పేరిట ఈ పొరను "NIFE" పొరగా పేర్కొంటారు.

కేంద్రాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు.
         1. బాహ్య కేంద్రం (Outer Core)
         2. అంతర్ కేంద్రం (Inner Core)

బాహ్య కేంద్రం: దీని మందం దాదాపు 2000 కి.మీ. వరకు ఉంటుంది. బాహ్య కేంద్రంలో రేడియోధార్మిక విచ్ఛిన్నత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల శిలలు ద్రవరూపంలో ఉంటాయి. దీన్నే Liquid Outer Core అంటారు. దీని సాంద్రత 10 gm/c.c వరకు ఉంటుంది. ఈ పొర వల్లే భూమికి ఆకర్షణ శక్తి వచ్చిందని శాస్త్రజ్ఞుల భావన.

అంతర్ కేంద్రం: ఇది ఘనస్థితిలో ఉన్న లోహయుక్త కేంద్రం. ఇందులో నికెల్, ఇనుము అత్యధిక స్థాయిలో ఉండటం వల్ల దీని సాంద్రత అన్ని పొరల కంటే ఎక్కువ (130 gm/c.c.). అంతర్ కేంద్ర మందం 1500 కి.మీ వరకు ఉంటుంది.
బాహ్య కేంద్రం నుంచి అంతర్ కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు భూకంప తరంగాల ప్రవర్తనను బట్టి 'లేహమాన్' అనే శాస్త్రజ్ఞురాలు ఇక్కడ ఒక విచ్ఛిన్న పొర ఉందని గుర్తించింది. అందుకే దీనికి లేహమాన్ విచ్ఛిన్న పొర అనే పేరు వచ్చింది.
 

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌