• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు

  భూ అంతర్భాగంలో కొన్ని ప్రత్యేక స్థలాల్లో కలిగే ఆకస్మిక అలజడి వల్ల కంపన తరంగాలు ఏర్పడతాయి. ఈ కంపన తరంగాలు రాతి పొరల ద్వారా ప్రయాణించినప్పుడు భూమి కంపిస్తుంది. దాన్నే భూకంపం అంటారు. భూకంపం సంభవించినప్పుడు భూమి సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ కాలం కంపిస్తుంది. భూకంపం వల్ల కలిగే నష్టం భూమి కంపించే తీవ్రతను బట్టి ఉంటుంది.

 

భూకంపాలు సంభవించడానికి... 

1. ఉపరితల కారణాలు:
* పర్వతాల్లో సంభవించే భూపాతం వల్ల
* హిమనీ నదాలు ప్రవహించే చోట హిమసంపాతాల వల్ల
* భూగర్భంలో అణ్వస్త్రాలు పేల్చడం వల్ల
* ఖనిజ సొరంగాల పైకప్పులు కూలడం వల్ల

 

2. అగ్నిపర్వత సంబంధ కారణాలు:
* అగ్ని పర్వతాలు పేలడానికి ముందు, పేలిన తర్వాత

 

3. పాతాళ సంబంధ కారణాలు:
* భూ అంతర్భాగంలో కలిగే రసాయనిక మార్పులు, రేడియోధార్మిక విచ్ఛిత్తి వల్ల

 

4. భూ సమస్థితిక సర్దుబాటుకు సంబంధించిన కారణాలు:
* నదులు, వాటి పరీవాహక ప్రాంతాల నుంచి శిలాశిథిలాలను రవాణా చేసి, సముద్ర భూతలం మీద నిక్షేపిస్తాయి. ఈ నిక్షేపాలు పొరలు పొరలుగా ఏర్పడి కిందకు కుంగుతాయి. ఈ సందర్భంగా భూకంపాలు సంభవిస్తాయి.

 

5. విరూప కారక కారణాలు:
* భూ అంతర్భాగంలో, భూ పటంలోని రాతి పొరల్లో ఉన్న బలాల వ్యత్యాసాల మూలంగా, ప్రతిబలం సడలి భూకంపం సంభవిస్తుంది.
* స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించింది - రీడ్
* భూకంపాలను అవి సంభవించే లోతును బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు.
భూకంప శాస్త్రం: భూకంపాల గురించి విశదీకరించే శాస్త్రం
భూకంప నాభి: భూకంపం సంభవించే ప్రాంతం.
భూకంప అధికేంద్రం: భూకంప నాభికి క్షితిజలంబంగా ఉన్న భూ ఉపరితల బిందువు.
భూకంప లేఖిని: భూకంపాల తీవ్రతను నమోదు చేసే పరికరం.
భూకంపన రేఖా చిత్రం: భూకంప లేఖిని నమోదు చేసిన గ్రాఫ్ / చిత్రం
రిక్టర్ స్కేలు: భూకంప పరిమాణాన్ని / భూకంప సమయంలో బహిర్గతమైన మొత్తం శక్తిని తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రమాణం
* రిక్టర్ భూకంప తరంగదైర్ఘ్యం ఆధారంగా, భూకంప తీవ్రత పట్టికలో '0' నుంచి '9' వరకు పది వర్గాలను రూపొందించారు.
భూకంపన ప్రాంతం: భూకంపన పరిమితుల తీవ్రత ఆధారంగా నిర్ధారించిన ప్రాంతం. భూకంప ప్రాంతాల హద్దులు మారుతూ ఉంటాయి.
ఐసోసెసిమల్ రేఖలు: ఒకే భూకంపన తీవ్రత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసినవే ఐసోసెసిమల్ రేఖలు. సాధారణంగా ఇవి కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి.
భూకంప ఛాయామండలం: భూకంప నాభికి ఎదురుగా ఉన్న భూభాగానికి P, S తరంగాలు నేరుగా చేరవు. ఈ భాగాన్ని భూకంప ఛాయామండలం అని పిలుస్తారు.

 

జలాంతర్భాగ భూకంపాలు:
సముద్రం అంతర్భాగంలో ఏర్పడే భూకంపాలను జలాంతర్భాగ భూకంపాలు అంటారు. వీటివల్ల సముద్రాల్లో పెద్దకెరటాలు ఏర్పడి, తీర ప్రాంతాలను ఎక్కువగా నష్టపరుస్తాయి. వీటిని 'సునామీ' (TSUNAMI) అంటారు.

 

భూకంప మండలాల విస్తరణ - శాతం
* పసిఫిక్ మహాసముద్ర పరివేష్టిత మేఖల         68%
* ఆల్ఫ్స్ పర్వతాల నుంచి
     హిమాలయ పర్వత ప్రాంత మేఖల                21%
* మిగిలిన ఇతర ప్రాంతాలు                              11%
మొత్తం                                                           100%

 

పసిఫిక్ అగ్నివలయం (Circle of Fire):

  పసిఫిక్ మహాసముద్ర పరివేష్టిత భూకంప మేఖలలో అత్యధికంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీరాల్లోని ఆలూషియన్ దీవులు, ఆసియా ఖండం తూర్పుతీరంలో, జపాన్, ఫిలిఫ్పైన్స్ దీవుల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని అగ్నివలయం లేదా సర్కిల్ ఆఫ్ ఫైర్ అని అంటారు.

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌