• facebook
  • whatsapp
  • telegram

కాంతి

 

న‌క్ష‌త్రాలు మినుకు మినుకుమ‌న‌డం, స్విమ్మింగ్‌పూల్ లోతు త‌క్కువ‌గా క‌నిపించ‌డం త‌దిత‌ర ఎన్నో విష‌యాల వెనుక సైన్స్ ఉంటుంది. నిత్య జీవితంలో క‌నిపించే ఇలాంటి అంశాల‌కు సంబంధించిన శాస్త్రీయ కార‌ణాల‌పై పోటీ ప‌రీక్షార్థుల‌కు అవ‌గాహ‌న ఉండాలి. ప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న‌లు వీటిపైనే వ‌స్తున్నాయి.
వక్రీభవనం
* కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించినప్పుడు కాంతి వేగంలో వచ్చే మార్పు వల్ల యానకం లంబం వద్ద వంగి ప్రయాణిస్తుంది. ఈ దృగ్విషయాన్ని 'వక్రీభవనం' అంటారు.
అనువర్తనాలు:
* నీటి తొట్టెలో ఉంచిన కడ్డీ వంగినట్లుగా కనిపించడం.
* నీటి తొట్టెలో వేసిన నాణెం తక్కువ లోతులో ఉన్నట్లుగా, పెద్దదిగా కనిపించడం.
* వక్రీభవనం వల్ల జలాశయం, స్విమ్మింగ్ పూల్ లోతు అసలు లోతు కంటే తక్కువగా ఉన్నట్లు కనిపించడం.
* ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో ఉన్న చేపను చూసినప్పుడు ఆ చేప పరిమాణం పెద్దదిగా, తక్కువ లోతులో (దగ్గరగా) ఉన్నట్లు కనిపిస్తుంది.
* నీటిలో ఉన్న చేపకు ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసినప్పుడు అది దూరంగా, చిన్నదిగా కనిపిస్తుంది.
* భూమి వాతావరణంలో వక్రీభవనం వల్ల ఆకాశంలోని నక్షత్రాలు మినుకు మినుకుమన్నట్లు కనిపిస్తాయి.

* అక్షరాలున్న పేపరుపై గాజు పలకను ఉంచినప్పుడు, పేపరులోని అక్షరాలు పెద్దవిగా, దగ్గరగా కనిపిస్తాయి.
* సూర్యోదయం సమయంలో కాంతి కిరణాలు భూమి వాతావరణంలో వక్రీభవనం చెందడం వల్ల వాస్తవ సూర్యోదయాని కంటే రెండు నిమిషాల ముందు వెలుతురు వస్తుంది. అదేవిధంగా వాస్తవ సూర్యాస్తమయం తర్వాత రెండు నిమిషాలు అదనంగా వెలుతురు కనిపిస్తుంది.
వక్రీభవన గుణకం
* కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించినప్పుడు యానక లంబం వద్ద చేసే పతనకోణం (i) సైన్ విలువకు, వక్రీభవన కోణం (r) సైన్ విలువకు మధ్య ఉన్న నిష్పత్తిని 'వక్రీభవన గుణకం' అంటారు.
  
ఇక్కడ = i పతన కోణం r = వక్రీభవన కోణం
* వక్రీభవన గుణకానికి ప్రమాణాలుండవు. పదార్థ స్వభావాన్ని బట్టి దీని విలువలు మారుతుంటాయి.
* గాజు, నీరు వక్రీభవన గుణకం విలువలు దాదాపు సమానంగా ఉండటం వల్ల గాజు పలకను నీటిలో వేసినప్పుడు అది అదృశ్యమైనట్లు కనిపిస్తుంది.

 

కటకాలు - రకాలు

* ప్రకాశపారదర్శకమైన కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత వక్ర ఉపరితలాలున్న యానకాన్ని 'కటకం' అంటారు.
* కటకం రెండు ఉపరితలాల్లో కనీసం ఒకటి వక్రతలమవుతుంది.
1. కుంభాకార కటకం: ఈ కటకానికి రెండు వైపులా ఉబ్బెత్తయిన ఉపరితాలు ఉంటాయి. దీని మధ్య భాగం మందంగా, అంచుల భాగం పల్లంగా ఉంటుంది.
* కటకం మధ్య బిందువును 'కటక కేంద్రం' అంటారు. కటకానికి ఒక వైపున పతనమైన సమాంతర కాంతి కిరణాలు వక్రీభవనం చెంది, రెండో వైపున ఏదో ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఈ బిందువును 'ప్రధాన నాభి' అంటారు. ఈ ప్రధాన నాభి నుంచి కటక కేంద్రానికి మధ్య ఉన్న దూరాన్ని 'నాభ్యాంతరం' (f) అంటారు.
* ఈ కటకంలో కాంతి కిరణాలన్నీ ప్రధాన నాభి వద్ద కేంద్రీకృతమవడం వల్ల దీన్ని 'కేంద్రీకరణ కటకం' లేదా 'అభిసారి కటకం' అంటారు. ఈ కటకం నాభ్యాంతరాన్ని ధనాత్మకంగా (+) తీసుకుంటారు.
2. పుటాకార కటకం: ఈ కటకానికి రెండు వైపులా వాలుగా ఉన్న ఉపరితలాలు ఉంటాయి. దీని మధ్య భాగం పల్లంగా, అంచుల భాగం మందంగా ఉంటుంది.
* కటకానికి ఒక వైపున పతనమైన సమాంతర కాంతి కిరణాలు వక్రీభవనం చెంది, రెండో వైపున 'వికేంద్రీకృతం అవుతాయి. అందువల్ల ఈ కటకాన్ని 'వికేంద్రీకరణ కటకం' లేదా 'అపసారి కటకం' అని అంటారు.
* కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కంటే ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న యానకంలో ఉంచినప్పుడు అది వికేంద్రీకరణ కటకంలా పనిచేస్తుంది.
ఉదా: నీటిలో ఉండే గాలి బుడగ వికేంద్రీకరణ కటకంలా పనిచేస్తుంది.
కటక సామర్థ్యం:
* ఒక కటకం కాంతి కిరణాలను కేంద్రీకరించే స్థాయి లేదా వికేంద్రీకరించే స్థాయిని కటక సామర్థ్యంగా వ్యక్తపరుస్తారు.
* కటక నాభ్యాంతర విలోమాన్ని 'కటక సామర్థ్యం అని అంటారు.
   
 

   

* కటక సామర్థ్యానికి ప్రమాణం 'డయాప్టర్' (Dioptre) దీన్ని 'D' తో సూచిస్తారు.
* కుంభాకార కటకం నాభ్యాంతరం ధనాత్మకంగా ఉండటం వల్ల దాని కటక సామర్థ్యాన్ని '+D' గా తీసుకుంటారు.
* పుటాకార కటకం నాభ్యాంతరం రుణాత్మకంగా ఉండటంవల్ల దాని కటక సామర్థ్యాన్ని '-D' గా పరిగణిస్తారు.
* సమతల గాజు పలకకు రెండు వైపులా సమతలంగా ఉన్న ఉపరితలాలు ఉంటాయి. దీనికి ఒక వైపు పతనమైన సమాంతర కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత రెండో వైపున కూడా సమాంతరంగా ప్రయాణిస్తాయి. కాబట్టి సమతల గాజుపలక నాభ్యాంతరాన్ని అనంతంగా తీసుకుంటారు.
దాని కటక  

 

దృష్టి లోపాలు

1) హ్రస్వ దృష్టి (Myopia):
* ఈ దృష్టి లోపం ఉన్నవాళ్లు దగ్గరలోని వస్తువులను మాత్రమే చూడగలరు. దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు.
* ఈ దోషం ఉన్న వ్యక్తుల్లో దూరంగా ఉన్న వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం పొందాక, రెటీనాకు ముందు కొంత దూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి.
* తగిన పుటాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వ దృష్టిని సవరించవచ్చు.
2) దీర్ఘ దృష్టి (Hypermetropia):
* ఈ దృష్టి దోషం ఉన్న వాళ్లు దూరపు వస్తువులను మాత్రమే చూడగలరు. దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించవు.
* ఈ దోషం ఉన్న వ్యక్తులకు దగ్గరలోని వస్తువుల నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా వక్రీభవనం పొందాక, రెటీనాకు ఆవల ప్రతిబింబం ఏర్పడుతుంది.
* తగిన కుంభాకార కటకాన్ని ఉపయోగించి దీర్ఘదృష్టిని నివారించవచ్చు.

 

Posted Date : 14-09-2020
  • Tags :

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌