• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం (1336 - 1680)

దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి ఒక విశిష్ట స్థానముంది. సుమారు మూడు శతాబ్దాల కాలం కొనసాగి, సువిశాలమైన ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలు భారతదేశ చరిత్రలో అతి తక్కువ. దీనివల్లే విజయనగర సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది.

  విజయనగర రాజ్యస్థాపన గురించి చరిత్రకారుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి చెందిన చరిత్రకారుడు సాలెటోర్ విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలు హొయసల రాజైన మూడో వీరభల్లుడి ఆస్థానంలో ఉండేవారని, ఈ రాజ్యాన్ని మహ్మదీయులు ఆక్రమించిన తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాన్ని నెలటూరి వెంకట రమణయ్య అంగీకరించలేదు.
* హరిహరరాయలు, బుక్కరాయలు అనే సోదరులిద్దరు కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో కీలక పదవుల్లో ఉండేవారు. ప్రతాపరుద్రుడిని మహ్మద్‌బీన్ తుగ్లక్ సైనికులు బందీగా తీసుకువెళ్లిన తర్వాత, ఈ సోదరులిద్దరూ విద్యారణ్యస్వామి ఆశీస్సులతో 1336లో తుంగభద్ర నదిపరీవాహక ప్రాంతంలోని అనెగొందిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి అనే నాలుగు రాజ వంశాలు పరిపాలించాయి.
1. సంగమ వంశం 1336 - 1485
2. సాళువ వంశం 1485 - 1505
3. తుళువ వంశం 1505 - 1570
4. అరవీటి వంశం 1570 - 1680

 

సంగమ వంశం

 

మొదటి హరిహరరాయలు (1336 - 56): సోదరుల సహాయంతో సామ్రాజ్యాన్ని తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు విస్తరించాడు. ఇతడి కాలంలోనే 1347లో బహమనీ సామ్రాజ్యం స్థాపితమైంది. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ సామ్రాజ్యాలు స్థాపించిన సమయంలో మహ్మద్‌బీన్ తుగ్లక్ దిల్లీ సుల్తాన్‌గా ఉండేవాడు. బహమనీ సుల్తానుల రాజ్య విస్తరణ కాంక్ష, ఇస్లాం మతాన్ని నిరోధించి, వైదిక మతాన్ని కాపాడాలనే విజయనగర రాజ్య పాలకుల పట్టుదల కారణంగా రెండు సామ్రాజ్యాల మధ్య నిరంతరం ఘర్షణ వాతావరణం కొనసాగింది. దీనికి మొదటి హరిహరరాయల కాలంలో బీజం పడింది. ఇతడి కాలంలో బహమనీ రాజ్యస్థాపకుడు అల్లాఉద్దీన్ హసన్ రెండుసార్లు దండెత్తాడు.

 

మొదటి బుక్కరాయలు (1357 - 77): ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటన - మధురా విజయం. మొదటి బుక్కరాయల కుమారుడు కంపరాయలు మధుర సుల్తాన్‌ను ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ విజయాన్ని కంపరాయలు భార్య అయిన గంగాదేవి తాను రచించిన 'మధురా విజయం'లో వర్ణించింది.
* మొదటి బుక్కరాయల కాలంలో రాయచూర్ అంతర్వేది గురించి విజయనగర, బహమనీ సామ్రాజ్యాల మధ్య నిరంతరం పోరాటాలు జరిగేవి. బహమనీ సుల్తానులతో యుద్ధం తర్వాత రెడ్డి రాజులతో కూడా యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో బుక్కరాయలు రెడ్డి రాజ్యంలోని అహోబిలం, వినుకొండ ప్రాంతాలను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. మొదటి బుక్కరాయలు మత సహనానికి పెట్టింది పేరు. ఇతడు అల్ప సంఖ్యాకులైన జైనులకు రక్షణ కల్పించాడు. విదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాడు. 1374లో మింగ్ వంశానికి చెందిన చైనా చక్రవర్తి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ప్రముఖ ఆంధ్ర కవి నాచన సోముడు ఇతడి ఆస్థానంలోనివాడే.

 

రెండో హరిహరరాయలు (1377 - 1404): ఇతడికి రాజాధిరాజు, రాజపరమేశ్వర అనే బిరుదులు ఉన్నాయి. బహమనీ సుల్తాన్ అయిన రెండో మహ్మద్ ఇతడికి సమకాలీనుడు. 1378లో రెండో హరిహరరాయల మంత్రి మాధవుడు గోవా రాజ్యాన్ని జయించి, 'భువనైక వీరుడు' అనే బిరుదు పొందాడు. రెండో హరిహరరాయల కాలంలో సింహళానికి, విజయనగర రాజ్యానికి ఘర్షణ ప్రారంభమైంది. 1398లో బహమనీ రాజైన ఫిరోజ్‌షా విజయనగరంపై దండెత్తి ప్రజలను ఊచకోత కోయడమే కాకుండా విజయనగర సంపదను దోచుకున్నాడు. ఇతడి మరణం తర్వాత సింహాసనం కోసం అంతఃకలహాలు చోటుచేసుకున్నాయి.

 

రెండో బుక్కరాయలు (1404 - 06): సోదరుడైన విరూపాక్షుడిని పదవీభ్రష్టుడిని చేసి సింహాసనాన్ని అధిష్టించాడు. కేవలం రెండేళ్లు మాత్రమే పాలించాడు.

 

మొదటి దేవరాయలు (1406 - 22): ఇతడు ఫిరోజ్ షా చేతిలో ఓడిపోయి తన కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మొదటి దేవరాయలు రెడ్డి రాజులను ఓడించి ఉదయగిరి, మోటుపల్లిని ఆక్రమించాడు. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. ఇటలీ యాత్రికుడైన నికొలో కాంటే 1420లో ఇతడి కాలంలోనే విజయనగరాన్ని సందర్శించాడు.

 

రెండో దేవరాయలు లేదా ప్రౌఢదేవరాయలు (1426 - 46): సంగమ వంశ రాజుల్లో అగ్రగణ్యుడు. బహమనీ సుల్తానులతో జరుతున్న యుద్ధాల్లో విజయనగర సైన్యం ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించి, వాటిని సవరించడానికి పూనుకున్నాడు. సైన్యంలోని ఆయుధ విభాగాన్ని పటిష్టం చేసి, ముస్లింలను కూడా సైన్యంలో చేర్చుకున్నాడు. వారి కోసం రాజధానిలో మసీదు నిర్మించాడు. సింహాసనం ఎదురుగా ఖురాన్ ప్రతిని ఉంచాడు. ఇతనికి 'గజభేటకార' అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలోనే పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ (1443) విజయనగరాన్ని దర్శించాడు.
* ప్రౌఢ దేవరాయలు స్వయంగా కవి. సంస్కృతంలో మహానాటక సుధానిధి, వృత్తి అనే గ్రంథాలను రచించాడు. విజయనగర ఆస్థాన కవి అయిన 'డిండిమభట్టు'ను ఓడించిన శ్రీనాథుడికి ప్రౌఢ దేవరాయలు కనకాభిషేకం చేయించాడు. ఇతడి కాలంలోనే ప్రసిద్ధి చెందిన విఠలస్వామి ఆలయం నిర్మితమైంది. ప్రౌఢ దేవరాయల తర్వాత సంగమ వంశ పతనం ప్రారంభమైంది. చివరి సంగమ రాజైన రెండో విరూపాక్షరాయలను పెనుగొండకు చెందిన సాళువ నరసింహుడు వధించడంతో సంగం వంశం అంతరించింది.

 

సాళువ వంశం (1485 - 1505)

 

సాళువ నరసింహరాయలు (1485 - 91): ఇతడు సింహాసనం అధిష్టించిన తర్వాత సామంత రాజులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లను సమర్థవంతంగా అణచివేసి, విజయనగర సంస్కృతీ సంప్రదాయాలను పదిలపరచాడు. అరబ్బు వర్తకులతో స్నేహం చేసి, వారి నుంచి ఉత్తమ అశ్వాలను సంపాదించి, అశ్విక దళాన్ని అభివృద్ధి చేశాడు.

 

ఇమ్మడి నరసింహరాయలు (1491 - 1505): ఇతడు పేరుకు మాత్రమే రాజు. సర్వాధికారాలను నరసనాయకుడు చెలాయించేవాడు. నరసనాయకుడు సమర్థుడైన సేనాని. శక్తిమంతమైన పాలకుడు. ఉమ్మత్తూర్ నాయకుడి తిరుగుబాటును అణచివేశాడు. శ్రీరంగ పట్టణాన్ని ఆక్రమించాడు. నరసనాయుడు 1503 లో మరణించాడు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించాలనే తమ నాయకుడైన సాళువ నరసింహరాయలి కోరికను పూర్తిచేశాడు. దక్షిణ భారతదేశంలో అత్యధిక భాగాన్ని విజయనగర సామ్రాజ్య పరిధిలోకి తీసుకువచ్చాడు. సైనిక శక్తిని పునర్నిర్మించడం ద్వారా తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు సాధించిన విజయాలకు పునాది వేశాడు. నరసనాయకుడు మరణించిన తర్వాత అతడి పెద్ద కుమారుడు వీర నరసింహరాయలు రాజ ప్రతినిధి అయ్యాడు. ఇతడు క్రీ.శ. 1505 లో పెనుగొండ దుర్గంలో బంధితుడై ఉన్న అసలు రాజు ఇమ్మడి నరసింహరాయలను హత్య చేశాడు. దీంతో సాళువ వంశం అంతరించింది.

 

తుళువ వంశం (1505 - 70)

మైసూరులోని తుళువనాడు వీరి జన్మస్థలం కావడం వల్ల వీరి వంశానికి ఆ పేరు వచ్చింది. తుళువ వంశానికి మూలపురుషుడు తిమ్మరాజు. తుళువ నరసనాయకుడికి ముగ్గురు భార్యలు. పెద్ద భార్య కుమారుడు వీరనరసింహరాయలు. రెండో భార్య నాగాంబ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు, మూడో భార్య కుమారులు శ్రీరంగదేవరాయలు, అచ్యుతదేవరాయలు.

వీర నరసింహరాయలు (1505 - 09): వీర నరసింహరాయలుపై నాటి బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా దండెత్తి రాగా, రాయలి సామంతులు అతడిని ఓడించారు. ఉమ్మత్తూరు, శివసముద్ర రాష్ట్ర పాలకులు తిరుగుబాట్లు చేయగా, వారిని అణిచివేసే యత్నంలో వీర నరసింహరాయలు మరణించాడు. దీంతో అతడి తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు.

 

శ్రీకృష్ణదేవరాయలు (1509 - 29) 

  తుళువ వంశంలోనే కాకుండా విజయనగర చరిత్రలో అద్వితీయుడు, మహోన్నతుడు. ఇతడు అధికారంలోకి వచ్చేనాటికి సామ్రాజ్యం అస్తవ్యస్తంగా ఉంది. తీరాంధ్ర దేశంలో గజపతులు, బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ షా, గోల్కొండ పాలకుడు కులీకుతుబ్ షా విజయనగర సామ్రాజ్యాన్ని కబళించడానికి పూనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిని ప్రదర్శించాడు. 1510లో పోర్చుగీసు వారితో సంధి చేసుకుని, అశ్విక దళాన్ని పటిష్టం చేశాడు.

* శ్రీకృష్ణదేవరాయలు రాజ్య విస్తరణ కోసం అనేక దిగ్విజయ యాత్రలను కొనసాగించాడు. 1510-11 కాలంలో బహమనీ రాజ్యంపై దండెత్తి, రాయచూర్, ముద్గళ్ ప్రాంతాలను ఆక్రమించాడు. అప్పటికే బహమనీ సామ్రాజ్యం క్షీణించి బీరార్, బీజాపూర్, బీదర్, అహ్మద్‌నగర్, గోల్కొండ అనే అయిదు స్వతంత్య్ర రాజ్యాలుగా విడిపోయింది.
* 1510లో బీదర్‌లో అహ్మద్ బరీద్ అనే సేనాని, సుల్తాన్ మహ్మద్ షాను బంధించి తనను తాను సుల్తాన్‌గా ప్రకటించుకున్నాడు. దీంతో బీదర్ ప్రజల కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు దండెత్తి గుల్బర్గా వరకు వెళ్లి, బరీద్‌ను శిక్షించి, సుల్తాన్‌ను విడిపించి, మహమ్మద్ షా అధికారాన్ని పునరుద్ధరించాడు. దీనికి చిహ్నంగా 'యవనరాజ్య స్థాపనాచార్య' అనే బిరుదు ధరించాడు.
* దక్షిణదేశ దండయాత్రల్లో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు 1512-13లో పెనుగొండ, ఉమ్మత్తూరు, శివసముద్ర దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. తన ప్రతినిధిగా చిక్కరాయలను నియమించాడు. శ్రీకృష్ణదేవరాయలి తూర్పు దిగ్విజయ యాత్ర 1513లో ఉదయగిరి ఆక్రమణతో ప్రారంభమై, 1519లో ముగిసింది. కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం మొదలైన ప్రాంతాలను వశపరచుకుని గజపతుల రాజధాని కటకాన్ని చేరుకున్నాడు. దీంతో ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తె అన్నపూర్ణాదేవిని ఇచ్చి వివాహం జరిపించి, కృష్ణదేవరాయలితో సంధి చేసుకున్నాడు. రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో నిమగ్నమై ఉండగా, బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్‌షా రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలు 1520లో బీజాపూర్‌పై దండెత్తి రాయచూర్ యుద్ధంలో ఓడించి, అంతర్వేదిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇలా శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశానికి తిరుగులేని సార్వభౌముడు అయ్యాడు.
* శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో అనేక చెరువులు, కాలువలు, బావులు తవ్వించి సాగునీటి వసతి కల్పించి వ్యవసాయాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఇతడి కాలంలో విజయనగర ఆస్థానంలో వసంతోత్సవాలు జరిగేవి. రాయల ఆస్థానానికి 'భువన విజయం' అనే పేరుంది. తెలుగు భాషలోని మాధుర్యాన్ని గ్రహించి 'దేశభాషలందు తెలుగు లెస్స' అని వ్యాఖ్యానించాడు. సంస్కృత సారస్వతానికి మిహిరభోజుడు ఎంత సేవ చేశాడో కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అంత సేవ చేసి 'ఆంధ్రభోజుడనే' బిరుదు పొందాడు.
* అల్లసాని పెద్దన రాయల ఆస్థాన కవి. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాభిమాని. అద్వైత మతాచార్యుడైన వ్యాసరాయలు ఇతని గురువు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఈయన రచించిన 'ఆముక్తమాల్యద'ను తెలుగు సాహితీ రంగంలో ఉత్తమ శ్రేణి గ్రంథంగా పేర్కొంటారు. ఆముక్తమాల్యదను 'విష్ణుచిత్తీయం' అని కూడా అంటారు. ఈ గ్రంథం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గురించి తెలియజేస్తుంది.
* శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో భవనాలు, ఆలయ మంటపాలు కట్టించాడు. తిరుపతి, కంచి, శ్రీకాళహస్తి, సింహాచలం, అహోబిలం ఆలయాలకు గోపురాలు, మండపాలను నిర్మించాడు. రాజధానిలో విఠలస్వామి ఆలయాన్ని, హజరా రామస్వామి ఆలయాన్ని నిర్మించాడు. తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం 'నాగలాపురం'' అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతడు 1529లో మరణించాడు.
* శ్రీకృష్ణదేవరాయలి మరణం తర్వాత అచ్యుతదేవరాయలు (1529 - 42) పరిపాలించాడు. 1542 43లలో మొదట వెంకటపతిరాయల పాలన సాగింది. 1543 నుంచి 1570 వరకు సదాశివరాయలు పాలించాడు.

 

రాక్షస - తంగడి యుద్ధం (1565)

భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో రాక్షస - తంగడి యుద్ధం ఒకటి. దీన్నే 'బన్నిహట్టి' యుద్ధం అని కూడా పిలుస్తారు. దక్కన్ సుల్తాన్‌లలోని అంతఃకలహాలను అవకాశంగా తీసుకుని రామరాయలు వారి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నాడు. అహ్మద్‌నగర్, గోల్కొండ సుల్తానులకు సహాయంగా బీజాపూర్‌పై దండెత్తాడు. తర్వాత బీజాపూర్‌తో కలిసి అహ్మద్‌నగర్‌ను ధ్వంసం చేశాడు. చివరికి రామరాయల కుట్రను గ్రహించిన సుల్తానులు తమలో విభేదాలను మరచి, ఐక్యమత్యంతో కూటమిగా ఏర్పడి 1565లో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. విజయనగరానికి 10 మైళ్ల దూరంలోని రాక్షస - తంగడి అనే గ్రామాల మధ్య ఉన్న మైదానాల్లో ఉభయ పక్షాలు తలపడ్డాయి. యుద్ధ ప్రారంభంలో విజయం అళియ రామరాయలకే దక్కింది. కానీ, ముస్లిం సైన్యాలు 20 మైళ్లు వెనక్కి వెళ్లి విజయనగర సైన్యాలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు మెరుపుదాడికి పాల్పడ్డాయి. రామరాయలను అహ్మద్‌నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాంషా అతిక్రూరంగా హతమార్చాడు.

* విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని మైత్రి కుదుర్చుకున్న సుల్తానుల కూటమి మళ్లీ విడిపోయి ఎవరికి వారు విడిగా వ్యవహరించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని 1570 లో విజయనగరాన్ని పాలించిన అరవీటి వంశం (నాలుగోది) పెనుగొండను రాజధానిగా చేసుకుని 1680 వరకు పాలన సాగించింది.

 

అరవీటి వంశం (1570 - 1680)

తిరుమల రాయలు (1570-72): తిరుమల రాయలు తన సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి తన కుమారులను ప్రతినిధులుగా నియమించాడు. ఇతడు తిరుపతి, కంచి, శ్రీరంగంలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించాడు.

మొదటి శ్రీరంగ రాయలు (1572-85): ఇతడి పాలనాకాలంలో అనేక దండయాత్రలు జరిగాయి. 1576 లో బీజాపూర్ అలీషా పెనుగొండను ముట్టడించాడు. 1579 లో గోల్కొండ సుల్తాన్ విజయనగర రాజ్యంపై దండెత్తి అహోబిలాన్ని ఆక్రమించి, అక్కడి నరసింహ ఆలయాన్ని దోచుకున్నాడు. మొదటి శ్రీరంగరాయలికి సంతానం లేనందున చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతడి తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు.

రెండో వెంకటరాయలు (1585-1614): ఇతడు చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు. అరవీటి వంశంలో గొప్పరాజు. రెవెన్యూ పాలనను పటిష్టం చేశాడు. ఇతడి పాలనా కాలంలో తూర్పు తీరంలో డచ్చివారు, ఆంగ్లేయులు తమ కర్మాగారాలను నెలకొల్పారు.

మూడో శ్రీరంగరాయలు: ఇతడు ఆఖరి పాలకుడు. ఇతడి మరణంతో అరవీటి వంశంతో పాటు విజయనగర సామ్రాజ్యం కూడా పతనమైంది.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌