• facebook
  • whatsapp
  • telegram

ప్రయోజనానికి లోపలా? వెలుపలా?

  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించిన అన్ని పరీక్షల సిలబస్‌లో ఎక్కువగా అభ్యర్థులను తర్జనభర్జనకు గురిచేస్తున్న అంశం - సామాజిక వెలి, భాగస్వామ్యం (సోషల్ ఎక్స్‌క్లూజన్, ఇన్‌క్లూజన్). మరో వారం రోజుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల నుంచి గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న వారి దాకా అందరిలోనూ ఆసక్తిని, ఒకింత గందరగోళాన్నీ రేకెత్తిస్తున్న అంశమిది. అభ్యర్థులకు ఈ అంశంపై మంచి అవగాహన కల్పించేందుకు.. టీఎస్‌పీఎస్సీ పరీక్షల విధానం, సిలబస్ కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరించిన ప్రముఖ విద్యావేత్త ఆచార్య హరగోపాల్ అందిస్తున్న విశ్లేషణ - ఈనాడు ప్రతిభ పాఠకులకు ప్రత్యేకం.

  సమాజంలో దళితులు, ఆదివాసీల సామాజిక ఆర్థిక పరిస్థితులు.. ప్రభుత్వ ప్రణాళికలు, సామాజిక పరిణామాల్లో లాభపడుతున్న దెవరు? ఎంతమంది? నష్టపోతున్నదెవరు? వంటి అంశాలపై అవగాహనే ఈ సామాజిక వెలి, భాగస్వామ్యం (సోషల్ ఎక్స్‌క్లూజన్, ఇన్‌క్లూజన్) ఉద్దేశం. మన దేశ, రాష్ట్ర కాలమాన పరిస్థితులను అనువర్తింపజేసుకొని దీన్ని అర్థం చేసుకోవడం ప్రధానం.
ఒక అభివృద్ధి నమూనా వల్ల సమాజంలో కొంతమందికి ప్రయోజనం చేకూరితే మరికొందరికి ప్రయోజనం చేకూరదు. ఇంకొందరికి ఉన్న ప్రయోజనాలు పోతాయి. ఇలా ప్రయోజనాలు కోల్పోయినవారిని సోషల్ ఎక్స్‌క్లూజన్ (సామాజిక వెలి) అంటాం. అభివృద్ధి నమూనాలో భాగమై దాని ప్రయోజనాలు పొందేవారిని అందులో భాగస్వాములని అంటాం.

  ఒక రాష్ట్రంలో అభివృద్ధి నమూనాను తీసుకుందాం. ఉదాహరణకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు పెట్టారనుకుందాం. వీటివల్ల ఔషధ పరిశ్రమ, మైనింగ్ లేదా మరో పరిశ్రమకు భూమిని లీజుకిస్తారు. ఇలా లీజుకిచ్చే భూముల్లో భూసంస్కరణలు వచ్చినప్పుడు దళితులకిచ్చిన భూములు లేదా వినోభాబావే భూదానోద్యమంలో ఇచ్చిన భూములు లేదా ప్రభుత్వం మరే ఇతర మార్గాల ద్వారానైనా దళితులకు ఇచ్చిన భూములు ఉండే అవకాశముంది. ప్రభుత్వం దళితులకు గతంలో భూములిచ్చినప్పుడు ప్రజాప్రయోజనం కోసం మళ్లీ ఆ భూముల్ని వెనక్కి తీసుకునే అవకాశముందనే నిబంధన ఒకటి విధించింది. ఈ నిబంధనను అనుసరించి చాలామంది దళితుల వద్ద నుంచి భూమి వెనక్కి తీసుకుంటారు. అంటే అభివృద్ధి నమూనా పారిశ్రామిక రంగం రూపంలో వస్తోంది. పరిశ్రమలు పెడితే పారిశ్రామికవేత్తలకు లాభాలొస్తాయి. పరిశ్రమల ద్వారా కొంతమందికి ఉద్యోగాలొస్తాయి. అంటే వారంతా ఆ నమూనాలో భాగస్వాములవుతారు. కానీ ఉన్న భూమిని కోల్పోయేవారు ఆ నమూనా నుంచి వెలికి గురవుతారు. అంటే అభివృద్ధి వచ్చి వారిని వెలివేసిందని అర్థమవుతుంది. అలాగే గిరిజన ప్రాంతాల పరిస్థితులను పరిశీలిస్తే.. ఖనిజాల కోసం మైనింగ్ చేపడుతున్నారు. అక్కడి భూములను ఓ పరిశ్రమకు లేదా విదేశీ కంపెనీలకు అప్పజెబితే గిరిజనులు అంతకుముందు అడవిపై ఉన్న హక్కును కోల్పోతారు. తర్వాత వారి జీవనాధారం, నివాసాలు పోతాయి. ఎన్నో హక్కులు కోల్పోతారు.

 

అందుకే రైతు ఆత్మహత్యలు!

  అభివృద్ధి నమూనా వల్ల కొత్త హక్కులు రావొచ్చు లేదా ఉన్నవి పోవచ్చు. ఈ రెండూ జరుగుతాయి. కొంతమందికి కొత్త అవకాశాలొస్తాయి.. హక్కులొస్తాయి. మరికొందరికి ఉన్నవి కూడా పోతుంటాయి. తెలంగాణలో ఈ రెండింటికీ సంబంధించిన అధ్యయనాలు ఉన్నాయి. ఉదాహరణకు రైతాంగాన్నే తీసుకుంటే, రైతుల ఆత్మహత్యకు కారణం ప్రస్తుత అభివృద్ధి నమూనాలో రైతు భాగస్వామి కాకపోవడమే! అభివృద్ధి నమూనా వల్ల రైతుల ప్రయోజనాలు పెరిగి, ఆదాయాలు పెరిగి రైతు మరింత సుఖంగా ఉండడం లేదు. ప్రస్తుత అభివృద్ధి నమూనాలో దిగుమతులు పెంచాం. చక్కెర, సిల్క్, ఆహార ధాన్యాలు.. ఇలా చాలావాటిని దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ధరలు పడిపోతాయి. రైతుకు పండించిన పంటకు మంచి ధర రాదు. తద్వారా అభివృద్ధి నమూనా నుంచి రైతు వెలికి గురవుతాడు. అలాగే వాణిజ్య పంటలైన పత్తి వంటివి వేసి కొన్నిసార్లు లాభపడతారు. అలాంటప్పుడు నమూనాలో భాగస్వాములవుతారు. అంటే అభివృద్ధి నమూనాలు అందర్నీ కలుపుకొని, అందరికీ పనికొచ్చేవి కావు. అసలు అందరినీ భాగస్వాములను చేసే నమూనా ఏదైనా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఉదాహరణకు సంక్షేమ పథకాలను తీసుకుంటే ఎన్టీరామారావు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యంలో దాదాపు పేదవారందరినీ భాగస్వాములను చేశారు. పథక రూపకల్పనే అలా జరుగుతుంది. అలాకాకుండా కొంతమందికే పరిమితం చేసేలా సంక్షేమ పథకాలను రూపొందించినప్పుడు కొంతమందికే ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొంతమందిని సమ్మిళితం చేస్తే మరికొందరిని వెలి వేస్తుంటుంది. అందర్నీ భాగస్వాములను చేయడం సాధ్యామా కాదా అని కాకుండా పథకాల రచనలోనే సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రయోజనం కలిగించేలా చూడాలి. అలాకాకుండా వృద్ధిరేటు బాగుండాలి, సంపద పెరగాలి అన్న వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు, సంపద పెరుగుతుంది తప్ప ఆ సంపద వల్ల విస్తృత ప్రజానీకానికి ప్రయోజనం చేకూరదు. ఏ విధానాన్నైనా , ఏ ప్రణాళికనైనా ఏ కోణంలో చూడాలో ఆలోచించాలి. ఉదాహరణకు ఓ పరిశ్రమ వచ్చిందనుకుందాం. వంద కోట్ల రూపాయలు పెట్టి వెయ్యి ఉద్యోగాలిచ్చే వారొకరైతే, వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టి వంద మందికి ఉద్యోగాలిచ్చే వారు మరొకరు. వెయ్యి కోట్లు పెట్టి వందమందికి ఉద్యోగాలిచ్చేవాడు చాలా భూమి, వసతులు తీసుకొని తక్కువ ప్రయోజనం ఇస్తాడు. అలాకాకుండా వంద కోట్లతో వెయ్యి ఉద్యోగాలు కల్పించేవారితో సమాజానికి లాభం ఎక్కువ. ఎక్కువమంది అభివృద్ధి నమూనాలో భాగస్వాములవుతారు.
హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక అభివృద్ధిని తీసుకుంటే 1980 ప్రాంతంలో పెట్టుబడికి, శ్రమకు ఉండే సంబంధంలో ఎక్కువ ఉద్యోగాలొచ్చేవి. రూ. 75వేల పెట్టుబడికి ఓ ఉద్యోగం వచ్చేలా ఉండేది. కానీ ఇప్పుడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నా ఉద్యోగం వచ్చే పరిస్థితులు లేవు. 1980 ప్రాంతంలో హైదరాబాద్‌లో, ఉమ్మడి రాష్ట్రంలో 5లక్షల మందికి స్థిరమైన ఉద్యోగాలిచ్చారు. అప్పటితో పోల్చుకుంటే తక్కువలో తక్కువ చూసుకున్నా పెట్టుబడి 10రెట్లు పెరిగింది. అదే నిష్పత్తిలో చూస్తే 50 లక్షల ఉద్యోగాలు రావాలి. అంటే చదువుకున్న వారందరికీ ఉద్యోగాలొచ్చేవి. అసలు తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదు. ఎందుకంటే అందరికీ అవకాశాలు వచ్చి, ఉద్యోగాలు దొరికేవి. కానీ అలా జరగలేదు. పెట్టుబడులు పెరిగాయి, ఉద్యోగావకాశాలు మాత్రం తగ్గాయి.

 

నాణ్యత లేని చదువులు!

  వెలి, భాగస్వామ్యాలను బేరీజు వేసినప్పుడు అభివృద్ధి నమూనా, పథకాల వల్ల ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు? ఎంతమంది పొందడం లేదనేది చూడాలి. దానికనుగుణంగానే హక్కులు ముడిపడి ఉంటాయి. అభివృద్ధి నమూనాను అర్థం చేసుకొని, గత 30 ఏళ్ల అభివృద్ధిలో ఎవరు వెలికి గురయ్యారు? ఎవరు భాగస్వాములయ్యారనేది పరిశీలించాలి. చాలావరకు దళితులు, గిరిజనులు, కొంతవరకు మైనార్టీలు, మహిళలపై నకారాత్మక ప్రభావం ఉంది. ఉద్యోగాల తీరులో మార్పు వచ్చింది. స్థిరమైన ఉద్యోగాల నుంచి తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగాలొచ్చాయి. ఈ ఒప్పంద ఉద్యోగాలు, ఉద్యోగస్తులు - అభివృద్ధిలో భాగస్వాములా, వెలివేసినవారా అనేది అర్థంకాని పరిస్థితి. ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, బతకుతెరువు నడుస్తోంది.. కానీ దానికి స్థిరత్వం లేదు. ఆదాయం స్థిరంగా రాదు. తెలంగాణలో ప్రస్తుతం రెండున్నర లక్షలమంది ఒప్పంద ఉద్యోగులున్నారు. ఈ పద్ధతి 30 సంవత్సరాల కిందట లేదు. ప్రస్తుత అభివృద్ధి నమూనా వల్ల వీరు అందులో భాగస్వాములు కారు, అలాగని బయట కూడా లేరు! ఇదో చిత్రమైన పరిస్థితి. ఉంటుందా! ఊడుతుందా? అనే ఉద్యోగాలివి. గతంలో మాదిరిగా భద్రతలేని ఉద్యోగాలు. మరి దీని ప్రభావం ఎవరిపై పడుతోందనేది పరీక్షించాలి.
అలాగే విద్యావ్యవస్థలో చూస్తే.. డబ్బున్నవారి పిల్లలు కొత్తగా పెట్టిన మంచి ప్రైవేటు కాలేజీల్లో, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదువులు చదువుతున్నారు. అమెరికా వెళుతున్నారు, ఉన్నత చదువులు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఈ అభివృద్ధి నమూనాలో వారికి కొత్త అవకాశాలొచ్చాయి. కానీ డబ్బులేని పిల్లలు ఇక్కడే ప్రభుత్వ విద్యాసంస్థల్లో, ఉస్మానియాలాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. వాటిలో నాణ్యత పడిపోయింది. అంటే పేదపిల్లలు చదివే విద్యావ్యవస్థలో నాణ్యత లేదు. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయానికుండే బోధన సిబ్బంది ఇప్పుడు లేరు. నియామకాలు లేవు, గ్రాంట్స్ లేవు. అంటే దీంట్లో చదువుకున్న వారికి కూడా అవకాశాలు రాలేని పరిస్థితి.

 

తప్పు అమ్మాయిలదా?

   ఈ వెలి-భాగస్వామ్యంలో మరో అంశం లింగ వివక్ష! ఇందులో ప్రధానంగా నష్టపోయేది మహిళలే! ఐటీ రంగాన్నే తీసుకుంటే అందులో పనిచేసే వేళలు అమెరికాకు సరిపోతాయి. అవి మన మహిళలకు, కుటుంబ వ్యవస్థకు సరిపోవు. దీంతో చాలామంది మహిళలు పనిచేస్తున్నా ఇబ్బందులు పడుతున్నారు. చాలా సంపాదిస్తున్నా పెళ్లి చేసుకోవాలా? వద్దా? పిల్లల్ని కనాలా? వద్దా? అనే సందిగ్ధావస్థలో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. నాకు తెలిసిన ఓ కళాశాలలో బయోకెమిస్ట్రీ కోర్సు పెట్టారు. పారిశ్రామికవేత్తలను పిలిచారు. వారంతా అమ్మాయిలు ఆ కోర్సు చేయడాన్ని అంతగా ఇష్టపడలేదు. ఎందుకంటే - అమ్మాయిలకు ఉద్యోగమిస్తే పొద్దున్నే షిఫ్ట్‌కు రాలేరు. సాయంత్రం ఆరింటికి వస్తే రాత్రి పన్నెండింటికి వెళ్లాలి. అదీ ఇబ్బందే. రాత్రి పన్నెండింటికి రాలేరు. ఇలా షిఫ్ట్ వ్యవస్థలతో ఇబ్బందులుంటాయి కాబట్టి తీసుకోలేం.. అని నిర్మొహమాటంగా చెప్పారు. అంటే పారిశ్రామికరంగం వచ్చింది, బయోటెక్నాలజీ కోర్సు వచ్చింది.. ఉద్యోగాలొచ్చాయి.. చదువుకున్న అమ్మాయిలున్నారు, కానీ పారిశ్రామికవేత్తలకు మాత్రం ఇష్టం లేదు. ఒకవేళ అమ్మాయి అర్థరాత్రి రాలేకపోతోంది, పోలేకపోతోందంటే అదెవరి తప్పు? అమ్మాయిల తప్పా? అమ్మాయి అందుకు కారణమా? రవాణా ఏర్పాట్లు, భద్రతలాంటివి కల్పిస్తే సరిపోతుంది. కానీ అవి కల్పించడం పారిశ్రామికవేత్తలకు ఇష్టం లేదు. అంటే అవకాశాలున్నా ఆ అభివృద్ధి నమూనా నుంచి అమ్మాయిలకు వెలి తప్పడం లేదు.

 

ఎందుకు చదవాలంటే..!

  సామాజిక వెలి.. భాగస్వామ్యం - ఈ ప్రక్రియ మొత్తాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అభివృద్ధి నమూనా గురించి సమగ్రమైన అవగాహన ఉంటే వాళ్లు మున్ముందు, ఉద్యోగాలు సంపాదించి విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, రాజకీయ నాయకులకు సూచనలు, సలహాలివ్వాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. అభివృద్ధి నమూనా వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది? ఎవరు ప్రభావితులు అవుతున్నారనేది వారికి తెలియాలి. అందుకే ఈ అంశాన్ని పరీక్షల్లో పెట్టాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మానవ హక్కులపై కోర్సుంది. వాటిలోని అనేక పాఠాల్లో ఈ అంశం ఉంటుంది. తెలంగాణ దళితుల విషయంలో, గిరిజనుల విషయంలోనైతే చాలా అధ్యయనాలున్నాయి. బలహీనవర్గాల పరిస్థితులపై తెలంగాణ వరకు బోలెడంత పరిశోధన జరిగింది. ఆ అధ్యయనాలన్నీ అందుబాటులో ఉన్నాయి.

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌