• facebook
  • whatsapp
  • telegram

ఇంధన సంక్షోభం

(సంప్రదాయేతర ఇంధన వనరుల పాత్ర, ప్రత్యామ్నాయ చర్యలు)

ఇండయన్‌ జాగ్రఫీ 

ఒక దేశ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఇంధనం, శక్తి వనరులు కీలకం. ఇంతకాలం పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపైనే అధికంగా ఆధారపడటంతో వాటి నిల్వలు తగ్గేకొద్దీ ధరలు పెరుగుతూ పోతున్నాయి. దాంతోపాటు వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. ఫలితంగా శిలాజ ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రత్యామ్నాయంగా సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం ఎక్కువైంది. కాలుష్యరహితమైన ఆ తరహా వనరులను కావాల్సినంత ఉత్పత్తి చేసుకోవచ్చు. మన దేశంలో ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల లభ్యత, వినియోగం, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాలను పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి.



శక్తివనరులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ అధికంగా ఉంది. భారతదేశంలో శక్తి (ఇంధనం) ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువ. జనాభా విస్ఫోటం, పట్టణీకరణ, వాహన వినియోగంతో ఇంధనాల అవసరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సగటు మనిషి జీవన ప్రమాణాలు, పెరిగిన ఆదాయం కూడా శక్తి వినియోగం అధికం కావడానికి కారణాలే. ప్రస్తుతం దేశంలో అనేకచోట్ల పెరిగిన ఈ విద్యుత్తు/ఇంధన/శక్తి డిమాండ్‌ వల్ల ప్రకటిత, అప్రకటిత విద్యుత్తు కోతలు, లో ఓల్టేజ్, హై ఓల్జేజ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. చాలాచోట్ల పవర్‌ ప్లాంట్ల మూసివేతలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంధన సంక్షోభానికి సూచికలే. మన దేశంలో సంప్రదాయకంగా బొగ్గు, సహజ వాయువు ఆధారిత విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణలో లోపాలున్నాయి. దాంతో చాలా ప్లాంట్లు వాటి స్థాపిత సామర్థ్యం కంటే తక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. అసమర్థ పంపిణీ, విద్యుత్తు చౌర్యం వంటి వాటిని కూడా ఇంధన సంక్షోభానికి మూలాలుగా చెప్పవచ్చు.


* మన దేశంలో డిమాండ్, సరఫరాల మధ్య వ్యత్యాసం చాలా ఉంది. ఇది ఏటా పెరుగుతూనే ఉంది. 2021-22 లెక్కల ప్రకారం సగటు వార్షిక తలసరి శక్తి వినియోగం 1,255 కిలోవాట్లు.


* శక్తి వినియోగంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. చైనా (157.65 ఎక్సా జౌల్స్‌), అమెరికా (92.97 ఎక్సా జౌల్స్‌), భారత్‌ (35.43 ఎక్సాజౌల్స్‌), రష్యా (31.3 ఎక్సా జౌల్స్‌) వరుసగా 1, 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.


2000 సంవత్సరం నుంచి దేశంలో ఇంధన వినియోగం రెట్టింపైంది. 2020-21 కొవిడ్‌ కాలంలో భారత ఇంధన డిమాండ్‌ 12,75,534 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2021-22కి 13,79,812 మి.యూనిట్లు, 2022-23కి 15,11,214 మి.యూనిట్లకు చేరింది. అయితే 2022-23 సంవత్సరానికి 15,03,650 మి.యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. 7,564 మి.యూనిట్ల లోటు నమోదైంది. కొవిడ్‌ సమస్యల నుంచి గట్టెక్కడం ద్వారా పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు, వాతావరణంలో మార్పులు, వ్యవసాయ రంగంలో ఎక్కువ వినియోగంతో పాటు, తీవ్ర వడగాలుల వల్ల గతేడాదిలో ఇంధన వినియోగం పెరిగినట్లు అంచనా వేశారు.

సంప్రదాయేతర ఇంధన వనరుల లభ్యత: సంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు మొదలైనవి వేగంగా తరిగిపోతున్నాయి. దీంతో సౌరశక్తి, పవన శక్తి, బయోమాస్, టైడల్‌ శక్తి, జియోథర్మల్‌ శక్తి, వ్యర్థ పదార్థాల నుంచి తయారుచేసే శక్తివనరులకు ప్రాధాన్యం పెరిగింది. ఈ శక్తి వనరులు పర్యావరణ అనుకూలమైనవి, కాలుష్యరహితమైనవి, పునరుత్పాదకమైనవి. పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు సౌకర్యవంతంగా సరఫరా అవుతాయి. స్వచ్ఛమైన పర్యావరణాన్ని సృష్టించడంతో పాటు శక్తి ఉత్పాదనను వికేంద్రీకృతం చేస్తాయి. భవిష్యత్తు తరాల ఇంధనాలు ఇవే.


దేశంలో 2022 నాటికి వాణిజ్యపరంగా 900 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనిలో పవన విద్యుత్తు 102 గిగావాట్లు, మినీ హైడ్రోపవర్‌ 20 గిగావాట్లు, బయోమాస్‌ 25 గిగావాట్లు, సౌర విద్యుత్తు 750 గిగావాట్లు. ముఖ్యంగా సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం దేశంలోని బంజరు భూములు/నిరుపయోగంగా ఉన్న భూముల్లో 3 శాతం వినియోగించాలన్నది ప్రభుత్వ యోచన.


* గత దశాబ్దంలో (2007 నుంచి 2017 వరకు) పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 25 శాతం చొప్పున 2017 నాటికి 30 వేల మెగావాట్లకు చేరింది. ఈ కాలంలోనే పవన విద్యుత్తు స్థాపన 10 రెట్లు పెరిగింది. సౌరశక్తి దాదాపు కనీస స్థాయి నుంచి 2,500 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం మొత్తం శక్తి ఉత్పత్తి సామర్థ్యంలో 20 శాతం మాత్రమే జరుగుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే శక్తిలో ఇది కేవలం 10%. దేశంలో సంవత్సరానికి 5 వేల ట్రిలియన్‌ కిలోవాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయగలిగిన వనరులున్నాయి. సుమారు 1000 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉంది. 4 - 5 మెగావాట్ల జియోథర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తికి, 8,000 - 9,000 మెగావాట్ల మేర అలల శక్తి (టైడల్‌ ఎనర్జీ) సామర్థ్యం, 40 వేల మెగావాట్ల తరంగ శక్తి సామర్థ్యం, దేశీ సముద్ర థర్మల్‌ ఎనర్జీ సామర్థ్యం 50 వేల మెగావాట్లు ఉంది.


ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గం ఉత్పత్తిని పెంచడం, ఇంధనాన్ని ఆదా చేయడం. భారత్‌లో ప్రతి ఇంటికి విద్యుత్తు సౌకర్యం కల్పించడానికి అనేక పథకాలు ఉన్నాయి. 


దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన: ఈ పథకాన్ని 2014, డిసెంబరులో ప్రారంభించారు. పంపిణీ సంస్థలను బలోపేతం చేయడం, వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందించడం కోసం దీన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మీటరింగ్‌తో సహా పంపిణీ మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యం. జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల్లో 60 శాతం, స్పెషల్‌ కేటగిరీ రాష్ట్రాల్లో 85 శాతం వరకు కేంద్రం మద్దతుతో రాష్ట్రాలు, వాటి డిస్కంలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.


ఉజ్వల్‌ డిస్కం అస్యూరెన్స్‌ యోజన (ఉదయ్‌): దీన్ని 2015, నవంబరు 20న ప్రారంభించారు. ఈ పథకం డిస్కంలపై వడ్డీ భారం, నిర్వహణ వ్యయం, సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించడానికి సాయపడుతుంది. ఇందులో అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం ఉంది. 26 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతం చేరింది. దీన్ని ఇంటర్‌ మినిస్టీరియల్‌ కమిటీ, రాష్ట్రస్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి.


సౌభాగ్య (ప్రధానమంత్రి సహజ్‌ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన): ఈ పథకాన్ని 2017, సెప్టెంబరులో ప్రారంభించారు. రూ.16,320 కోట్ల వ్యయంతో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు లేని కుటుంబాలకు విద్యుత్తు అందించడమే దీని లక్ష్యం. సౌభాగ్య పథకం ద్వారా 2019, మార్చి నాటికి దాదాపు 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. దేశంలోని మొత్తం విద్యుత్తు వినియోగంలో 20 శాతం వెలుతురు కోసమే వినియోగిస్తున్నారు (బల్బులు, ట్యూబ్‌లైట్ల ద్వారా). సరైన ధరకు సమర్థ లైటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించడానికి జాతీయ LED ప్రోగ్రామ్‌ను 2015, జనవరిలో ప్రారంభించారు. దీనిలో రెండు భాగాలున్నాయి. 1) ఎల్‌ఈడీ (ఉజాలా): దేశీయ వినియోగదారులకు ఎల్‌ఈడీ బల్బులు అందించడం. తద్వారా 77 కోట్ల ఇన్‌కాండిసెంట్‌ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చడం. 2) స్ట్రీట్‌ లైటింగ్‌ నేషనల్‌ ప్రోగ్రామ్‌: 2019, మార్చి నాటికి 1.34 కోట్ల సంప్రదాయ వీధిదీపాలను స్మార్ట్, ఎనర్జీ ఎఫెక్టివ్‌ ఎల్‌ఈడీ వీధిదీపాలతో భర్తీ చేయడం.


* కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌’ సంస్థ ఏకకాలంలో గృహోపకరణాలు, భవనాలు, ప్యాసింజరు కార్లు, హెవీ డ్యూటీ వాహనాలు మొదలైన వాటి ప్రామాణీకరణ, లేబులింగ్‌తో సహా శక్తి సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది.


   ముఖ్యాంశాలు


* భారతదేశంలో మొదటి బయోగ్యాస్‌ విద్యుత్‌ కేంద్రం పంజాబ్‌లోని ‘జలభారి’. 


* దేశంలో మనకు లభ్యమయ్యే సౌర దినాలు సుమారుగా 250 నుంచి 300.


* భారత్‌లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు సంబంధించిన పథకం ఉజాలా. అత్యధిక పవన విద్యుత్‌ శక్తి గల రాష్ట్రాలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌. 


* సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖను 1992లో ఏర్పాటు చేశారు. 


* ప్రపంచ పవన విద్యుత్‌ ఉత్పత్తిలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.


* దేశంలో సముద్ర తరంగాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న రాష్ట్రం గుజరాత్‌. 


* దేశంలో పవన విద్యుత్‌కు సంబంధించిన అతిపెద్ద పార్కు మ్పుండాల్‌ (తమిళనాడు).


* ప్రపంచంలో మొదటి తరంగ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ప్రాన్స్‌లోని లారాన్స్‌లో (1966)లో ఏర్పాటు చేశారు.


* సౌరశక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు అమెరికా, ఫ్రాన్స్‌. 


* నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ గుర్గావ్‌ (హరియాణా)లో, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ చెన్నై (తమిళనాడు)లో ఉన్నాయి.   


* భారతదేశంలో మొదటి భూతాప విద్యుత్‌ కేంద్రాన్ని మణికరణ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)లో ఏర్పాటు చేశారు.

రచయిత: గోపగోని ఆనంద్‌

 

 

Posted Date : 17-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌