• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ముఖ్యమైన పంటలు

  భారతదేశంలోని వ్యవసాయ పంటలు స్థూలంగా రెండు రకాలు. అవి: ఆహార, ఆహారేతర పంటలు. ఆహార పంటలను ఆహారధాన్యాలు, నూనెగింజలుగా, ఆహారేతర పంటలను పత్తి, చెరకు, పళ్లతోటలు, ఉద్యానవనాలు, నార, సుగంధ ద్రవ్యాలు, పశుగ్రాస పంటలుగా విభజించవచ్చు. పోటీపరీక్షల్లో ముఖ్యమైన ఆహార పంటలపైన, చెరకు, పత్తి వంటి పంటలపైన ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల వార్తల్లోకెక్కిన చెరకుకు సంబంధించి కనీస మద్దతు ధర వివాదాస్పదమై ఉత్తర భారతదేశంలో రైతుల ఆందోళనలు, ఉద్యమాలకు కారణమైంది. కాబట్టి, ఆ దిశలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత సమస్యగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యమైన ఆహార ధాన్యాలపై కూడా ప్రశ్నలు వచ్చే వీలుంది.

 

ముఖ్యమైన ఆహార ధాన్య పంటలు

  తృణ ధాన్యాలు: భారతదేశంలో పండించే ముఖ్యమైన తృణధాన్యాలు: వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, బార్లీ, రాగులు, కొర్రలు మొదలైన చిరుధాన్యాలు.

 

వరి

  భారతదేశంలో అత్యధిక ప్రజల ప్రధాన ఆహారధాన్యంగా వినియోగంలో ఉంది. విస్తీర్ణంలో, ఉత్పత్తిలో వరిది ప్రథమ స్థానం. వరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది (చైనా తరువాత). ఇది ప్రధానంగా ఖరీఫ్ పంట.
కానీ, సమృద్ధిగా నీటిపారుదల సౌకర్యాలున్న ప్రాంతాల్లో రబీపంటగా కూడా పండిస్తారు.

 

ఉష్ణోగ్రత: వరి పంటకు అనువైన ఉష్ణోగ్రత 20-27 డిగ్రీల సెంటీగ్రేడ్.
కావలసిన వర్షపాతం: దాదాపు 150 సెం.మీ. లేదా నీటిపారుదల సౌకర్యం.

 

అనువైన నేలలు: ఒండ్రుమట్టి, బంకమట్టి నేలలు, జలబంధన శక్తి బాగా ఉన్న ఇతర నేలలు.
వరిని ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు: 1. పశ్చిమబెంగాల్, 2. ఆంధ్రప్రదేశ్, 3. ఉత్తరప్రదేశ్, 4. పంజాబ్

 

విస్తీర్ణక్రమం: 1.పశ్చిమబెంగాల్ 2.ఉత్తరప్రదేశ్ 3. ఆంధ్రప్రదేశ్, 4. ఒరిస్సా.
హెక్టారుకు దిగుబడి అధికంగా ఉన్న రాష్ట్రాలు:
1. పంజాబ్ 2. తమిళనాడు 3. హర్యానా.

 

అధిక దిగుబడి వంగడాలు: రత్న, హంస, జయ, IR-8, IR-20, IET-826, FR -13A, జలధి-1, హేమ, రాజేశ్వరి మొదలైనవి.
* ప్రపంచ వరి పరిశోధనా ప్రధాన కేంద్రం ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది.
* భారతదేశ వరి పరిశోధన ప్రధాన కేంద్ర కార్యాలయం ఒరిస్సాలోని కటక్‌లో ఉంది.

 

గోధుమ

  భారతదేశ ఆహార పంటల్లో వరి తరువాత విస్తీర్ణంలో, ఉత్పత్తిలో ఎక్కువగా పండేది గోధుమ. ఇది కేవలం రబీ కాలంలోనే పండుతుంది. ఇతర రుతువులు/ కాలాలు ఈ పంటకు అనువైనవి కావు. ఇది సమశీతోష్ణ ప్రాంత పంట. సగటున 15-20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 50-100 సెం.మీ. వర్షపాతం అవసరం.

నేలలు: ఒండ్రుమట్టి, ఇసుక కలిగిన (Sandy Loamy solis) నేలలు అనుకూలం.

ఉత్పత్తిలో మొదటి రాష్ట్రాలు: 1.ఉత్తరప్రదేశ్, 2. పంజాబ్, 3. హర్యానా.

అధిక విస్తీర్ణంలో మొదటి రాష్ట్రాలు: 1. ఉత్తరప్రదేశ్, 2. మధ్యప్రదేశ్, 3. పంజాబ్, 4. హర్యానా

అధిక దిగుబడిలో మొదటి రాష్ట్రాలు: 1. పంజాబ్, 2. హర్యానా, 3. ఉత్తరప్రదేశ్, 4. రాజస్థాన్అ

ధిక దిగుబడి వంగడాలు: కల్యాణ్ సోనా; సోనాలిక; జనక్; జయరాజ్; ప్రతాప్; మేఘదూత్

 

జొన్న

  వరి, గోధుమల తరువాత ఉత్పత్తిలో, విస్తీర్ణంలో జొన్న మూడో స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ పంటకు సాధారణ వర్షపాతం అంటే 30-75 సెం.మీ. వర్షపాతం, 27-32 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. ఇది ప్రధానంగా ఖరీఫ్ పంట. కానీ, కొన్ని ప్రాంతాల్లో దీన్ని రబీ పంటగా కూడా పండిస్తారు. విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి పరంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాలను ఆక్రమిస్తాయి.
అధిక దిగుబడి వంగడాలు: csh-j, csv-2, m-35

 

సజ్జ 

  వాయవ్య రాజస్థాన్, గుజరాత్‌లలో సజ్జలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు. సజ్జ పంట, కవోష్ణ శుష్క శీతోష్ణస్థితి ప్రాంతాల్లో పండుతుంది. దీనికి దాదాపు 45 సెం.మీ. వార్షిక వర్షపాతం, 25 నుంచి 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమవుతాయి.
ఉత్పత్తిలో మొదటి రాష్ట్రాలు: 1.రాజస్థాన్, 2. మహారాష్ట్ర, 3. గుజరాత్
విస్తీర్ణంలో మొదటి రాష్ట్రాలు: 1. రాజస్థాన్, 2. మహారాష్ట్ర, 3. గుజరాత్
అధిక దిగుబడి రకాలు: COI × 3; I I I 1B-5-, KCC-75 సజ్జ కేవలం ఖరీఫ్ పంట మాత్రమే.

 

మొక్కజొన్న

  ఇది ఖరీఫ్ పంట. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా పండుతుంది. మొక్కజొన్న పర్వత ప్రాంత నేలల్లోను, వివిధ రకాల ప్రాంతాల్లోను పండుతుంది. ఈ పంటకు దాదాపు 75 సెం.మీ. వర్షపాతం అవసరం. సారవంతమైన ఒండలి, ఎర్రమట్టి నేలలో ఇది మంచి దిగుబడినిస్తుంది.
ఉత్పత్తిలో మొదటి రాష్ట్రాలు: 1. ఆంధ్రప్రదేశ్ 2. కర్ణాటక 3. బీహార్ 4. మధ్యప్రదేశ్.
విస్తీర్ణంలో మొదటి రాష్ట్రాలు: 1. రాజస్థాన్ 2. కర్ణాటక 3. మధ్య ప్రదేశ్ 4. ఉత్తరప్రదేశ్.
హెక్టార్‌కు దిగుబడి అధికంగా ఉన్న రాష్ట్రాలు: 1. ఆంధ్రప్రదేశ్ 2. కర్ణాటక
అధిక దిగుబడినిచ్చే రకాలు: గంగ-101; రంజిత; దక్కన్. విజయ్, అంబ.

 

బార్లీ

  శీతోష్ణస్థితి పరిస్థితులు (climate conditions) దాదాపు గోధుమ పంటకు కావలసిన పరిస్థితులే కానీ, శుష్క పరిస్థితులకు తట్టుకునే శక్తి బార్లీకి ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతల్లో పక్వానికి వస్తుంది. చల్లని శీతాకాలం, అయిదు నెలల పంట కాలమూ దీనికి అవసరం. నిరంతరం వేడిగా ఉండే, ఆర్ధ్రంగా ఉండే ప్రాంతాలు అనుకూలమైనవి కావు. బార్లీని ఎత్త్తెన ప్రాంతాల్లో కూడా పండించవచ్చు. ఇది రబీ పంట.
ఉత్పత్తిలో మొదటి రాష్ట్రాలు: 1.ఉత్తర ప్రదేశ్ 2.రాజస్థాన్
విస్తీర్ణంలో మొదటి రాష్ట్రాలు: 1. ఉత్తరప్రదేశ్ 2. రాజస్థాన్
హెక్టారుకు అధిక దిగుబడి: 1. పంజాబ్, 2. హర్యానా
అధిక దిగుబడినిచ్చే రకాలు: కైలాష్-కె 24, దాల్మా అజాద్-ఆర్ డి -103.

 

పప్పుధాన్యాలు

  పప్పు దినుసులను ఆహార ధాన్యాల్లో అంతర్భాగంగా గుర్తిస్తారు. పప్పుధాన్యాలు ముఖ్యమైన ప్రొటీన్ వనరులుగా ఉంటాయి. ఇవి లెగ్యుమినేసి మొక్కలైనందువల్ల, అవి భూసారాన్ని పెంపొందించడానికి ఉపయోగకరమైనవి. భారతదేశంలో వివిధ రకాల పప్పుధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి.
ముఖ్యమైన పప్పుధాన్యాలు : సెనగ, కంది, మినుము, పెసర మొదలైనవి.

 

సెనగ

  అతి ముఖ్యమైన పప్పుధాన్యం. దీన్ని బెంగాల్ గ్రామ్ అని కూడా అంటారు. సాధారణంగా గోధుమ, బార్లీ, ఆవాల పంటలతో కలిపి రబీకాలంలో మెట్ట పంటగా పండిస్తారు. ఈ పంటకు ఒక మాదిరి వర్షపాతం అంటే 50-75 సెం.మీ. కొంచెం చల్లటి వాతావరణం అవసరం. విత్తిన తరువాత లేదా పూత సమయంలో అధిక వర్షపాతం హానికరం. ఇది కేవలం రబీ పంటే.
ఉత్పత్తిలో, విస్తీర్ణంలో ప్రముఖ రాష్ట్రాలు: 1. మధ్యప్రదేశ్, 2. ఉత్తరప్రదేశ్, 3. రాజస్థాన్.

 

కంది 

  దీన్ని అర్హర్, రెడ్‌గ్రామ్ అనికూడా అంటారు. జొన్న, సజ్జ వంటి తృణధాన్యాలతో కలిపి మెట్టపంటగా పండిస్తారు.

కందిని అర్ధ శుష్క ప్రాంతాల్లో శుష్క శీతోష్ణస్థితిలో కూడా సాగు చేస్తారు. పూత సమయంలో, పక్వానికొచ్చే దశలో ఉష్ణ వాతావరణం అవసరమవుతుంది.

ఉత్పత్తి, విస్తీర్ణం రెండింటిలో మొదటి రాష్ట్రాలు : 1. మహారాష్ట్ర, 2. మధ్యప్రదేశ్.

కంది కేవలం ఖరీఫ్ పంట మాత్రమే.

  మినప, పెసర, లెంటిల్ అనేవి కూడా ముఖ్యమైన పప్పుధాన్య పంటలే. వీటిని పత్తి, జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలకు అనుబంధపు పంటలుగా పండిస్తారు. ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చెరకు, వరి పంటల తరువాత భూసారాన్ని పెంపొందించడానికి ఈ పంటలను పండిస్తారు. లెంటిల్ అనేది తరచూ బార్లీ లేదా ఆవ పంటతో కలిపి సాగుచేసే రబీ పంట. ఈ పప్పుధాన్యాలు, తేలికపాటి, ఒండలి, నల్లరేగడి, ఎర్రనేలల్లో పండుతాయి. వీటిని సాధారణంగా వర్షాధార పంటలుగా సాగుచేస్తారు.

  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ప్రధానంగా ఖరీఫ్ పప్పుధాన్యాలను ఉత్పత్తి చేస్తుండగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ప్రధానంగా రబీ పప్పుధాన్యాలను పండిస్తున్నాయి.

 

నూనెగింజలు

         నూనె గింజలను ఆహార ధాన్యాలుగా కాకుండా, ఆహార పంటలుగా పరిగణిస్తారు. ఔషధాలు, పరిమళ ద్రవ్యాలు, వార్నిష్‌లు, లూబ్రికెంట్‌లు, కొవ్వొత్తులు, సబ్బులు మొదలైన ఉత్పత్తుల తయారీలో నూనెగింజలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నూనె తీసిన తరువాత మిగిలే గానుగ పిండి, ముఖ్యమైన పశువుల దాణాగా ఉపయోగపడుతుంది.

 

వేరుసెనగ

  ఈ పంట ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానిదే అగ్రస్థానం. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు మూడోవంతు మన దేశమే ఉత్పత్తి చేస్తోంది. దీనికి కనీసం 50-75 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. పూతకొచ్చినప్పుడూ, ఊడలు దిగేటప్పుడూ వర్షపాతం అత్యవసరం. ఇసుక తెర నేలలు, లూమీ నేలలు, మురుగు పారుదల ఉన్న నల్ల నేలలు అనువైనవి.
ఉత్పత్తిలో మొదటి రాష్ట్రాలు: 1. ఆంధ్రప్రదేశ్, 2. గుజరాత్, 3. తమిళనాడు.
విస్తీర్ణంలో మొదటి రాష్ట్రాలు: 1. ఆంధ్రప్రదేశ్, 2. గుజరాత్, 3. తమిళనాడు.
వేరుసెనగను ఖరీఫ్, రబీ కాలాల్లో పండిస్తారు.కానీ, రబీ కాలంలో తెగుళ్ల సమస్యలు తక్కువ కాబట్టి, దీన్ని రబీ పంటగా పండించడమే మంచిది.

 

ఆముదం

  ఆముదాన్ని కందెన (లూబ్రికెంట్)గా ఉపయోగిస్తారు. దీన్ని సబ్బులు, పారదర్శకమైన కాగితం ముద్రణ, సిరాలు, వార్నిష్‌లు మొదలైనవాటి తయారీలో ఉపయోగిస్తారు. ఆముదపు పంట 50-75 సెం.మీ. వర్షపాతం ఉండే సాపేక్ష, శుష్క, ఉష్ణ ప్రాంతాల్లో బాగా పండుతుంది. భారీ వర్షపాతం ఉన్నప్రాంతాల్లోఈ పంట మితిమీరి వృద్ధి చెంది, నిరంతర పంటగా మారుతుంది. గరిష్ఠ స్థాయిలో దిగుబడి రావడానికి ఈ పంట పెరుగుతున్న కాలమంతా తక్కువ తేమతో తగుమాత్రం అధిక ఉష్ణోగ్రత (20-26 సెం.మీ.) అవసరమవుతుంది. ఇది ఖరీఫ్ పంట.
ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రాలు: 1. గుజరాత్, 2. ఆంధ్రప్రదేశ్ 3. ఒరిస్సా.
విస్తీర్ణంలో ప్రముఖ రాష్ట్రాలు: 1. గుజరాత్, 2. ఆంధ్రప్రదేశ్ 3. ఒరిస్సా.

 

నువ్వులు

  ఇది ప్రధానంగా ఖరీఫ్ పంట. నువ్వుల నుంచి తీసే నువ్వులనూనె ముఖ్యంగా పంటల్లో, ఔషధాల తయారీలో వాడతారు. ప్రపంచ నువ్వుల ఉత్పత్తిలో భారతదేశానిదే అగ్రస్థానం. నువ్వుల ఉత్పత్తిలో మొదటిస్థానం గుజరాత్ ఆ తర్వాత పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర వస్తాయి.

 

రేప్‌సీడ్, ఆవాలు

ప్రపంచ మొత్తం రేప్ సీడ్, ఆవాల ఉత్పత్తిలో ఈ పంటల విస్తీర్ణంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. వీటిని ప్రధానంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తారు. ఇవి రెండూ రబీ పంటలే.

 

అవిశె

  ఇది చల్లటి, తేమ వాతావరణంలో పండుతుంది. దీనికి 50-70 సెం.మీ. వర్షపాతం అవసరం. అవిశె రబీ పంట. ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రాలు: 1. మధ్యప్రదేశ్ 2. ఉత్తర ప్రదేశ్

 

సోయా చిక్కుడు

  సోయా చిక్కుడు సంప్రదాయికమైన చైనా పంట. ఈ విత్తనాల్లో నూనె తక్కువగా 15-20 శాతం ఉంటుంది. నూనె కోసం విత్తనాలను గానుగాడించగా మిగిలిన ఉప ఉత్పత్తులను ఎరువులుగా, పశువుల దాణాగా ఉపయోగిస్తారు. విస్తృతంగా సాగు చేసే ద్వివిదారక పంటలన్నింటిలో సోయా చిక్కుడులోనే ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి.
ఉత్పత్తిలో ప్రముఖమైన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్.

 

పొద్దు తిరుగుడు

ప్రధానంగా పంట నూనెగా ఉపయోగిస్తారు.
ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న రాష్ట్రాలు: కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్.

Posted Date : 25-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌