• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - భౌతిక అమరిక

సరిహద్దు దేశాలతో సంబంధాలు

భారత్‌ - బంగ్లాదేశ్‌

భారత్‌తో పొడవైన సరిహద్దు (4096 కి.మీ.) పంచుకునే దేశం బంగ్లాదేశ్‌. దీన్ని పూర్వం తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. ఇది భారతదేశ సహకారంతో 1971లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

* బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన వారిని ‘చక్నోలు’ అంటారు.

* పశ్చిమ్‌ బంగా, అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి.

* భారత్, బంగ్లాదేశ్‌లను వేరు చేస్తున్న రేఖ రాడ్‌క్లిఫ్‌ రేఖ. ఇది త్రిపుర, బంగ్లాదేశ్‌ల మధ్య ఉంది. దీన్ని జీరోలైన్‌/ బార్డర్‌ అంటారు.


ప్రధాన వివాదాలు: 

తిపాయ్‌ముఖ్‌ ప్రాజెక్ట్‌: భారత్‌ మణిపుర్‌లో ప్రవహించే బరాక్‌ నదిపై దీన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ వల్ల బంగ్లాదేశ్‌ తూర్పు ప్రాంత మైదానాల్లో నీటి సమస్య తలెత్తుతుందని ఆ దేశం పేర్కొంటోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ వ్యతిరేకిస్తోంది.

* తిపాయ్‌ముఖ్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయితే మణిపుర్‌లోని ‘కుకి’ గిరిజన తెగ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.


తీన్‌ భిగా కారిడార్‌: 1947లో దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన అంగర్‌పోట, దహగ్రామ్‌ ప్రాంతాలు పశ్చిమ్‌ బంగాలోని భారత భూభాగంలో భాగంగా ఉండిపోయాయి. ఈ రెండు ప్రాంతాలను బంగ్లాదేశ్‌ ప్రధాన భూభాగంలో కలుపుతూ 10 కి.మీ. మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని తీన్‌ భిగా కారిడార్‌ అంటారు.

* తీన్‌ భిగా కారిడార్‌ ప్రాంతాన్ని 1992లో భారత్‌ 999 ఏళ్ల పాటు బంగ్లాదేశ్‌కు లీజుకు ఇచ్చింది. దీంతో ఈ వివాదం పరిష్కారమైంది.


ఫరక్కా బ్యారేజ్‌: దీన్ని పశ్చిమ్‌ బంగాలో గంగా నదిపై నిర్మించారు. దీనివల్ల కోల్‌కతా ఓడరేవుకు మంచినీటి సమస్య పరిష్కారమైంది.

* ఫరక్కా ప్రాజెక్టు నిర్మాణం వల్ల బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన గœంగా జలాల్లో కోతపడింది. ఇది వివాదానికి కారణమైంది.

* గంగానది రోజువారీ ప్రవాహంలో కనిష్ఠంగా 35,000 క్యూసెక్కులు, గరిష్ఠంగా 40,000 క్యూసెక్కుల నీరు బంగ్లాదేశ్‌కు చెందే విధంగా 2014లో ఒప్పందం కుదిరింది. దీంతో ఈ వివాదం ముగిసింది.

* భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పదమైన నదులు - తీస్తా, ఫెని.


మైత్రి బ్రిడ్జి: త్రిపురలోని సబ్రుం, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నగరాన్ని కలుపుతూ ఇండియా-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఫెని నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2021లో ప్రారంభించారు.


న్యూమూర్‌ దీవులు: 2004 సునామీ సమయంలో బంగ్లాదేశ్, భారత సరిహద్దు ప్రాంతాల్లోని బంగాళాఖాతంలో ఈ కొత్త దీవులు వెలుగుచూశాయి. వీటికి న్యూమూర్‌ దీవులు అని పేరుపెట్టారు.

* ఈ దీవులు తమకు చెందినవని బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

* ఈ దీవుల మొత్తం వైశాల్యం 2500 చ.కి.మీ. వీటిలో 1900 చ.కి.మీ. విస్తీర్ణం భారత్‌కు, 600 చ.కి.మీ. వైశాల్యం బంగ్లాదేశ్‌కు చెందేలా 2014లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.


భారత్‌ - నేపాల్‌ 

భారతదేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌ బంగా, సిక్కిం రాష్ట్రాలు నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ విభజన రేఖ ఉంది.

వివాదాలు: నేపాల్‌ తమ దేశానికి 2015లో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. దీని ఆధారంగా నేపాల్‌ దేశ పటాల (మ్యాప్స్‌)ను 2020లో రూపొందించింది. ఇందులో ఉత్తరాఖండ్‌కి చెందిన లింపియధుర, లిపిలేఖి, కాలాపానీ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపించింది. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. 1816లో చేసుకున్న సుగౌలి ఒప్పందం ఆధారంగానే ఆ ప్రాంతాలు నేపాల్‌లో భాగమయ్యాయని ఆ దేశం పేర్కొంది.

సుగౌలి ఒప్పందం (1816): దీని ప్రకారం కాళీ, గండక్‌ నదీపరీవాహక ప్రాంతాలను నేపాల్, భారత్‌ల మధ్య సరిహద్దులుగా గుర్తించారు.

* నేపాల్, ఇండియా (ఉత్తరాఖండ్‌) మధ్య సరిహద్దుగా కాళీ నది ప్రవహిస్తోంది.

* లింపియధుర, లిపులేఖి వద్ద జన్మించే రెండు సెలయేర్లు కాలాపానీ వద్ద కలవడంతో కాళీనది ఏర్పడింది.

* కాళీనది జన్మస్థానం ఆధారంగా నేపాల్‌ ఈ మూడు ప్రాంతాలను తమ పటంలో చూపింది.

* భారతదేశ జాతీయ ఆర్మీలో నేపాల్‌ యువకులను చేర్చుకోవచ్చని సుగౌలి ఒప్పందంలో పేర్కొన్నారు.


మాధేశి ఉద్యమాలు: నేపాల్‌ దక్షిణ సరిహద్దు వెంట టెరాయి ప్రాంతంలోని భారత సంతతి నేపాలీ ప్రజలు రాజ్యాంగపరమైన హక్కులు, సమానత్వం కోసం పోరాడుతున్నారు.

భారత్‌ - ఆఫ్గనిస్థాన్‌ భారతదేశంతో అత్యల్ప భూభాగ సరిహద్దు కలిగిన దేశం ఆఫ్గనిస్థాన్‌.

* భారతదేశం - ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌- ఆఫ్గనిస్థాన్‌ల మధ్య విభజన రేఖగా డ్యూరాండ్‌ రేఖను 1893లో ఏర్పాటు చేశారు.

* 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చే వరకు ప్రస్తుత పాకిస్థాన్‌లోని బోలాన్‌ కనుమ ద్వారా ఆఫ్గనిస్థాన్‌కు ఆహార పదార్థాలను ఎగుమతి చేసేవారు.

* పాకిస్థాన్, భారత్‌ మధ్య విభేదాలు ప్రారంభమయ్యాక ఈ ఎగుమతులను నిషేధించారు.

* ముంబయి (కాండ్లా) ఓడరేవు నుంచి ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవుకు, అక్కడి నుంచి ఇరాన్, ఆఫ్గనిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్న చరంజ్‌ వరకు రైలు మార్గాల ద్వారా; అక్కడి నుంచి ఆఫ్గనిస్థాన్‌లోని డేలారం వరకు ఆహారధాన్యాల ఎగుమతి కోసం భారత్‌ రోడ్డుమార్గాన్ని నిర్మించింది.

* ఆఫ్గనిస్థాన్‌లో ప్రవహించే హరి నదిపై భారత ప్రభుత్వం ‘సల్మా ప్రాజెక్టు’ నిర్మించింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2016లో ప్రారంభించి, దీని పేరును ‘ఫ్రెండ్‌షిప్‌ డ్యాం’గా మార్చారు.

* ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో భారత ప్రభుత్వం పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించింది. 

* ఇటీవల ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని  చేపట్టాక భారత్‌తో స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి.


చాబహార్‌ ఒప్పందం: ఆఫ్గనిస్థాన్‌కి ఆహార పదార్థాల ఎగుమతి కోసం భారత్‌ 2016లో ఇరాన్‌ తీరంలోని చాబహార్‌ ఓడరేవును లీజుకు తీసుకుంది.

* భారత్, ఇరాన్, ఆఫ్గనిస్థాన్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

* పాకిస్థాన్‌ తీర ప్రాంతంలోని ‘గ్వాదర్‌’ ఓడరేవును చైనా లీజుకు తీసుకుని అక్కడి నుంచి చైనా వరకు రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. దీన్నే సీపీఈసీ (చైనా - పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌) అంటారు.

*  దీని ద్వారా చైనా - భారత్‌ సరిహద్దులపై నిఘాను పెంచే ప్రయత్నం చేస్తోంది. దీన్ని నియంత్రించేందుకు ఇరాన్‌లోని  చాబహార్‌ ఓడరేవును భారతదేశం లీజుకు తీసుకుని అభివృద్ధి చేస్తోంది.


భారత్‌ - మయన్మార్‌

అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, మణిపుర్, నాగాలాండ్‌ రాష్ట్రాలు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి.

ఇండియా - మయన్మార్‌ల మధ్య విభజితమవని ప్రాంతాలు: 

1. లోహిత్‌ వ్యాలీ సెక్టార్‌: దీని పొడవు సుమారు 135 కి.మీ. ఇది అరుణాచల్‌ ప్రదేశ్, మయన్మార్‌ సరిహద్దుల్లో ఉంది.

2. కబావ్‌ వ్యాలీ సెక్టార్‌: దీని పొడవు సుమారు 36 కి.మీ. మణిపుర్, మయన్మార్‌ సరిహద్దుల్లో ఉంది.

* భారతదేశం, మయన్మార్‌ మధ్య మొత్తం సరిహద్దు పొడవు 1643 కి.మీ. ఇందులో 171 కి.మీ. సరిహద్దు అపరిష్కృతంగా ఉంది.


ఫ్రీ మూమెంట్‌ రెజిమ్‌: భారత్‌ - మయన్మార్‌ మధ్య 16 కి.మీ. వెడల్పుతో పొడవైన స్వేచ్ఛా సరిహద్దు (ఫ్రీ మూమెంట్‌ రెజిమ్‌) ఉంది. ఇక్కడ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో, కొండల్లో నివసించే తెగల ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా సంచరించవచ్చు.

* ఇండియా - మయన్మార్‌లను వేరు చేసే పర్వతాలు- పూర్వాంచల్‌/ అరకన్‌ యోమా పర్వతాలు.


కలదాన్‌ ప్రాజెక్ట్‌: పశ్చిమ్‌ బంగా రాజధాని కోల్‌కతా, మిజోరం రాజధాని ఐజ్వాల్‌ను కలుపుతూ జలమార్గాలు, మయన్మార్‌ సరిహద్దుగా రోడ్డు మార్గం, నదీ మార్గం ద్వారా ఏర్పాటు చేసిన రవాణా మార్గాన్ని కలదాన్‌ ప్రాజెక్ట్‌ అంటారు.


త్రైపాక్షిక రహదారి: ఇండియా, మణిపూర్‌ సరిహద్దుల్లోని మోరే పట్టణం నుంచి మయన్మార్‌లోని తాము, కలేవా, నేపిడా పట్టణాల మీదుగా థాయ్‌లాండ్‌లోని మియోసాట్‌ నగరం వరకు రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు.


భారత్‌ - చైనా 

లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లు చైనాతో సరిహద్దును కలిగి ఉన్నాయి.

* భారత్‌ - చైనా మధ్య విభజన రేఖ మెక్‌మోహన్‌ రేఖ.

* భారతదేశంతో చైనా సుమారు 3488 కి.మీ. సరిహద్దును కలిగి ఉంది. దీన్ని మూడు సెక్టార్లుగా పేర్కొంటారు. అవి:


1. పశ్చిమ సెక్టార్‌: ఇది భారతదేశంలోని లద్దాఖ్, చైనాలోని సికియాంగ్‌ ప్రాంతాల మధ్య ఉంది. 1962లో జరిగిన భారత్‌-చైనా యుద్ధంలో లద్దాఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌చిన్‌  ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. దీని విస్తీర్ణం 38000 చ.కి.మీ.


line of actual control (LAC) : చైనా-భారత్‌ల మధ్య విభజన రేఖగా లద్దాఖ్‌లో ఉంది.


చైనా సీడెడ్‌ కశ్మీర్‌: సుమారు 5180 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని చైనా ఒక ఒప్పందం ప్రకారం పొందింది.

గాల్వన్‌లోయ వివాదం: పశ్చిమ సెక్టార్‌లో చైనా - భారత్‌ల మధ్య ఇటీవల కాలంలో ఈ వివాదం ప్రారంభమైది.

గాల్వన్‌ నది లద్దాఖ్‌ ప్రాంతం మీదుగా ప్రవహిస్తోంది. ఈ నది ఎల్‌ఏసీ ప్రాంతంలో ఉంది.

2020, జూన్‌ 15న ఈ ప్రాంతంలో చైనా బలగాలు దుశ్చర్యకు పాల్పడటంతో గాల్వాన్‌ ఘటన వివాదంగా మారింది. షోనక్‌ నదికి గాల్వన్‌ ఉపనది.

గాల్వన్‌ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు మరణించారు.


2. మధ్య సెక్టార్‌: హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలకు టిబెట్‌ ప్రాంతానికి మధ్య ఉన్న ప్రాంతం. ఇక్కడ సుమారు 2000 చ.కి.మీ. వివాదాస్పద ప్రాంతం ఉంది.


3. తూర్పు సెక్టార్‌: అరుణాచల్‌ప్రదేశ్, తవాంగ్, టిబెట్‌ ప్రాంతాల మధ్య ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 9000 చ.కి.మీ. వైశాల్య ప్రాంతాన్ని చైనా తనకు చెందిందిగా పేర్కొంటోంది.

* ఇక్కడ చైనా - భారత్‌ సరిహద్దును మెక్‌మోహన్‌ రేఖగా పిలుస్తారు.

* అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా తమ దేశంలో భాగంగా పేర్కొంటోంది. ఆ రాష్ట్ర ప్రజలు చైనా దేశానికి వెళ్లడానికి వీసాలు జారీ చేయదు.

 

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌