• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగ‌రిక‌త‌ లేదా హర‌ప్పా నాగ‌రిక‌త‌

  క్రీస్తు పూర్వం దాదాపు 2500 సంవత్సరాల కిందట సింధు నది ప్రాంతంలో విలసిల్లిన నాగరికతే సింధు నాగరికత. 1921-22 సంవత్సరాల్లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఈ సింధు నాగరికత యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. యూరప్, అమెరికా ప్రజలకు నాగలి, చక్రం గురించి తెలియకముందే భారతీయులు వాటిని ఫలప్రదంగా వినియోగించారంటే ఆశ్చర్యమే. ఈ సుసంపన్న నాగరికత భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో వెలిసింది. ఈ నాగరికత కాంస్య యుగానికి చెందింది.

 

సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత

  హరప్పా సంస్కృతి అత్యంత ప్రాచీన నాగరికతలైన ఈజిప్ట్, మెసపటోమియా నాగరికతలతో పోల్చదగింది. హరప్పా సంస్కృతిలోని ముఖ్యాంశాలైన పట్టణ నిర్మాణం, దానిలో వారు అవలంబించిన శాస్త్రీయ పద్ధతులు, ఆర్థిక విషయాలు, మతం, ఆచారాలు, మానసిక ఆనందం కోసం వారు ప్రోత్సహించిన కళలను పరిశీలిస్తే ఆ సంస్కృతి విశిష్టత మనకు అర్థమవుతుంది.

 

ముఖ్యమైన ప్రాంతాలు

  సింధు నాగరికత దాదాపు 1000 ప్రాంతాల్లో విస్తరించింది. ఈ నాగరికత క్రీ.పూ.3000 - క్రీ.పూ.1500 మధ్య కాలం నాటిది. సింధు నాగరికత ఉత్తరాన రూపర్ (పంజాబ్) నుంచి దక్షిణాన భగత్రావ్ (గుజరాత్) వరకు సుమారు 1100 కి.మీ. వ్యాపించి ఉండేది. పశ్చిమాన సుత్కాజెండర్ (పాకిస్థాన్ సరిహద్దు) నుంచి తూర్పున అలంగీర్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్) వరకు దాదాపు 1600 కి.మీ. విస్తరించింది.
సింధు నాగరికత కాలంలో బయటపడిన ప్రధాన నగరాలు, వాటి ఉనికి 

1. హరప్పా: పశ్చిమ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్)

2. మొహంజోదారో: సింధ్ - లార్కానా జిల్లా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది.)

3. చాన్హుదారో: సింధ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)

4. సుత్కాజెండర్: పాకిస్థాన్ - ఇరాన్ సరిహద్దుల్లోని బెలూచిస్థాన్‌లో ఉంది.

5. రూపర్: పంజాబ్ (భారతదేశం)

6. బన్వాలీ: హరియాణాలోని హిస్సార్ జిల్లాలో ఉంది.

7. కాలిబంగన్: రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఉంది.

8. లోథాల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.

9. అలంగీర్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు సమీపంలో ఉంది.

10. రంగపూర్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో ఉంది.

11. సుర్కోటుడా: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉంది.

12. ధోలవీర: ఇది ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది.

 

సింధు నాగరికత లక్షణాలు

నగర జీవనం 

  సింధు నాగరికత ముఖ్య లక్షణం పట్టణ ప్రణాళిక. ప్రతి పట్టణాన్ని దీర్ఘ చతురస్రాకారంలో సమాంతరంగా, అడ్డంగా ఏర్పరిచిన వీధులతో నిర్మించారు. కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు జరిపేవారు. ఇటుక పరిమాణం సమానంగా ఉండటం ఈ నాగరికతలోని మరో విశిష్టత. అంతస్తులున్న భవనాలు, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, ఇంటిలోపల స్నానపు గదుల నిర్మాణం, వీధుల్లోని మురుగు కాల్వలను కలిపే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం విశేషం.

 

ఆర్థిక వ్యవస్థ

  సింధు నాగరికత అత్యున్నత దశకు చేరడానికి ప్రధాన కారణం వ్యవసాయం. ప్రధానమైన పంటలు గోధుమ, బార్లీ. లోథాల్, రంగపూర్‌లలో మాత్రం వరి పండించినట్లు ఆధారాలున్నాయి.
* ప్రధానమైన పంటలను రబీ (శీతాకాలం) పంటలుగా, ఇతర పంటలను ఖరీఫ్ (వేసవికాలం) పంటలుగా సాగు చేసేవారు. ప్రపంచంలో మొదటిసారిగా పత్తి పండించిన ఘనత సింధు ప్రజలకే దక్కుతుంది.
* సింధు నాగరికత కాలంలో వృత్తి విద్యలు కూడా అమల్లో ఉన్నాయి. కాంస్యకారులు, స్వర్ణకారులు, ముద్రలు తయారు చేసేవారు, నేతపనివారు, పడవలను నిర్మించేవారు; టెర్రకోటా, దంతపు బొమ్మలు తయారు చేసేవారు తదితరులు ఉండేవారు.

 

వర్తక వాణిజ్యాలు

  దేశీయ, విదేశీ వర్తకాలు కూడా ఎక్కువగా ఉండేవి. రాజస్థాన్, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, దక్షిణ భారతదేశం, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ ప్రాంతాల్లో దేశీయ వర్తకం ఎక్కువగా జరిగేది. విదేశీ వాణిజ్యం ఎక్కువగా మెసపటోమియా, మధ్య ఆసియా, అఫ్గనిస్థాన్, పర్షియా, బహ్రెయిన్ మొదలైన దేశాలతో కొనసాగేది. ఎగుమతుల్లో ప్రధానమైనవి - నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు.

 

రాజకీయ వ్యవస్థ

  సింధూ నాగరికత పాలనా వ్యవస్థపై చరిత్రకారులకు ఏకాభిప్రాయం కుదరలేదు. డి.డి.కోశాంబి అభిప్రాయం ప్రకారం పట్టణాలను పురోహిత వర్గం పాలించి ఉండాలి. అయితే, ఎక్కువమంది చరిత్రకారులు సింధు నాగరికత కాలంలో పట్టణాలను ఐశ్వర్యవంతులైన వ్యాపారులు పాలించి ఉంటారని భావించారు.
సామాజిక జీవనం: ముఖ్యంగా సమాజంలో నాలుగు వర్గాల ప్రజలు ఉండేవారు. 1) వైద్యులు, పురోహితులు, జ్యోతిష్యులు    2) యుద్ధవీరులు    3) చేతివృత్తులవారు, కళాకారులు     4) శారీరక శ్రమ చేసేవారు.

 

కళా స్వరూపాలు

  సింధు నాగరికత విశిష్టత నాటి కళా స్వరూపాల్లో ప్రతిబింబిస్తుంది. సింధు నాగరికత కాలంలోని ప్రజలు అపారమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి ముద్రికలు, కుండలు, బంకమట్టి బొమ్మలు, తమదైన లిపిని రూపొందించారు.
* ముద్రికలు కళా స్వరూపాల్లో అందమైనవి. వీటిని 'స్టియటైట్' అనే సున్నపురాయితో తయారు చేసేవారు. దాదాపు 2000 ముద్రికలను కనుక్కున్నారు. వీటిలో ఎక్కువగా 'మూపురంలేని ఎద్దు' కనిపిస్తుంది. వీరి లిపిని బొమ్మల లిపిగా పరిగణించారు.

 

మతవిశ్వాసాలు

  కుండల మీద చిత్రించిన బొమ్మలు, ముద్రలు, రాతి విగ్రహాలను బట్టి సింధు ప్రజల మత విశ్వాసాల గురించి తెలుసుకోవచ్చు. వీరి ప్రధాన దేవత అమ్మతల్లి. అలాగే శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. వృక్షాలను, లింగాన్ని కూడా పూజించినట్లు ఆధారాలు లభించాయి. స్నానాన్ని పవిత్ర కార్యంగా భావించేవారు. మూపురం లేని ఎద్దును పూజించేవారు. రాగి చెట్టును పవిత్రమైందిగా భావించేవారు.

 

సింధు నాగరికత పతనం

  సింధు నాగరికత పతనం గురించి కూడా చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రీ.పూ.1700 నాటికి వరదల కారణంగా హరప్పా నాగరికత పతనమైంది. ఉపరితలానికి 50 నుంచి 80 అడుగుల ఎత్తులో కూడా కొన్నిచోట్ల ఇసుక మేటలు కనిపించాయి. కాబట్టి భారీ వరద సంభవించి నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని చరిత్రకారుల ఊహ. అలాగే సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడ్డారనేది మరో అభిప్రాయం.
* పక్కనున్న ఎడారి విస్తరించడంతో ఇక్కడి భూములు బీడు భూములుగా మారి, సారం కోల్పోయి ఉంటాయని, ఆర్యుల దాడిలో ఈ నాగరికత నాశనమై ఉంటుందని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌