• facebook
  • whatsapp
  • telegram

మహారాష్ట్రుల విజృంభణ

  క్రీ.శ. 17 వ శతాబ్దం ద్వితీయార్ధంలో మరాఠా రాజ్య ఆవిర్భావం, 18 వ శతాబ్దంలో వారి పతనం, 19 వ శతాబ్దం మొదట్లో వారి రాజ్యం పూర్తిగా అదృశ్యమవడం మొదలైన అంశాలను భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. మరాఠాల రాజ్య పాలన, అప్పటి పరిస్థితులు, శివాజీ ఛత్రపతిగా మారడం మొదలైన విషయాలను గురించి తెలుసుకుందాం.
  మరాఠాల విజృంభణకు దోహదం చేసిన అంశాలను కింది విధంగా వివరించవచ్చు.

* భౌగోళిక పరిస్థితులు: మహారాష్ట్ర భౌగోళిక రూపురేఖలు మరాఠాల వ్యక్తిత్వం, చరిత్రపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఇది మరాఠాలకు కావలసిన రక్షణ కల్పించింది.

* మరాఠాలు నివసిస్తున్న ప్రాంతం దట్టమైన అడవులు, కొండలు, లోతైన లోయలతో కూడిన పీఠభూమి ప్రాంతం. వీటితోపాటు ఇక్కడ తక్కువ వర్షపాతం, వ్యవసాయ వనరుల కొరత మరాఠాలను విలాసాలకు, సోమరితనానికి దూరంగా ఉండేటట్లు చేసింది. అలాగే వారిలో స్వయంసమృద్ధి, ధైర్యసాహసాలు, నిరాడంబరత, సాంఘిక సమానత్వం, మనిషిని మనిషిగా గౌరవించడం అనే సుగుణాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడింది.

* సారవంతమైన భూమి లేకపోవడంతో మరాఠాలు జీవనోపాధి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టించి పని చేయాల్సి వచ్చేది.

* అక్కడున్న కొండలు వారికి గిరి దుర్గాలుగా ఉపయోగపడ్డాయి.

* మరాఠా ప్రాంతం కొండలు, లోతైన లోయలు, దట్టమైన అడవులతో కూడి ఉండటం వారి శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, గొరిల్లా యుద్ధతంత్రం ద్వారా శత్రువులను ఇబ్బంది పెట్టడానికి దోహదం చేసింది.

* భక్తి ఉద్యమం: మహారాష్ట్రలోని భక్తి ఉద్యమకారులైన తుకారాం నామ్‌దేవ్, వామన పండిత్, ఏక్‌నాథ్ మొదలైనవారు దేవుడిపై భక్తి, దేవుడి ముందు మానవులంతా సమానులేనని బోధించారు. మరాఠా భాష, మాండలికంలో రచించిన పాటలు మరాఠాల్లో ఐకమత్యాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

* రాజకీయ, సైనిక పాలనలో అనుభవం: బహమని రాజ్యం అంతరించడంతో దక్కనులోని అహ్మద్‌నగర్, బీదర్, బీరార్, బీజపూర్, గోల్కొండల్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల్లో మరాఠాలు రాజకీయ, సైనిక విభాగాల్లో పనిచేసి, అనుభవాన్ని గడించారు. దక్కను సుల్తానులు మరాఠా సర్దారులను పరిపాలనలోని వివిధ విభాగాల్లో నియమించారు.

 

శివాజీ ...

* మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన కొద్దిమంది వ్యక్తుల్లో శివాజీ ఒకడు. ఇతడు కొత్త మరాఠా రాజ్యం 'స్వరాజ్యం' స్థాపనకు కారకుడు. శివాజీ జున్నార్ దగ్గరలోని శివనేర్ దుర్గంలో 1627 లో జన్మించాడు. షాజీభోంస్లే, జిజాబాయి ఇతడి తల్లిదండ్రులు. ఇతడు తల్లివైపు నుంచి యాదవ వంశానికి, తండ్రివైపు నుంచి మేవాడ్‌ను పాలించిన శిషోదయ వంశానికి చెందినవాడు.
షాజీ అహ్మద్‌నగర్‌ను పాలించిన నిజాంషాహీ పాలకుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పని చేశాడు. మొగలులు అహ్మద్‌నగర్‌ను ఆక్రమించిన తర్వాత షాజీ బీజపూర్ రాజ్యానికి వచ్చాడు. ఈ కాలంలో షాజీ తన మొదటి భార్య జిజాబాయిని, కొడుకు శివాజీని నిర్లక్ష్యం చేశాడు. కర్ణాటక ప్రాంతంలో ఒక జాగీరును ఏర్పాటు చేశాడు. శివాజీ, అతడి తల్లి పూనా జాగీర్‌లో ఉండేవారు.

* శివాజీ చిన్నతనం నుంచే గొప్ప ధైర్యసాహసాలు కలిగి ఉండేవాడు. జిజాబాయితోపాటు పూనా జాగీరు పాలకుడు దాదాజీ కొండదేవ్ శివాజీ బాల్య జీవితంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఇతడు శివాజీకి పరిపాలన, యుద్ధ విద్యల్లో శిక్షణ ఇచ్చాడు. శివాజీ తన మత గురువైన సమర్థ రామదాసు నుంచి స్ఫూర్తి పొందాడు. ఇతడు 'కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని' శివాజీకి బోధించాడు.

* శివాజీ మావళీల సహాయంతో ఒక శక్తిమంతమైన సంచార సైన్యాన్ని రూపొందించాడు. దక్కను సుల్తానుల బలహీనత, ఉత్తర భారతదేశంలో మొగలుల నిరంతర దండయాత్రలు శివాజీ తన బలాన్ని పెంచుకోవడానికి అవకాశం కల్పించాయి. పూనా దగ్గరలోని తోరణ, కొండనే, రాయఘడ్ గిరి దుర్గాలను శివాజీ ఆక్రమించుకున్నాడు. దాదాజీ కొండదేవ్ మరణం తర్వాత శివాజీ పూనా జాగీరుకు యజమాని అయ్యాడు. జావళి కోట ఆక్రమణతో 1646 లో శివాజీ తన నిజమైన దండయాత్రల పర్వాన్ని ప్రారంభించాడు.

 

పురంధర్ సంధి

  ఔరంగజేబు దక్కను వైస్రాయిగా ఉన్న షయిస్తఖాన్‌ను బెంగాల్ వైస్రాయిగా పంపాడు. అంబర్‌కు చెందిన రాజా జైసింగ్‌ను శివాజీని నియంత్రించేందుకు పంపాడు. జైసింగ్ తన తెలివితేటలతో శివాజీ రాజ్యాన్ని అన్నివైపుల నుంచి శత్రువులు దాడిచేసేలా ఏర్పాట్లు చేశాడు. పురంధర్ కోటను ముట్టడించాడు. మొగలులు శివాజీ రాజధాని రాయఘడ్‌ను దిగ్భందం చేశారు. వేరే గత్యంతరం లేక శివాజీ జైసింగ్‌తో 1665 లో పురందర్ సంధిని కుదుర్చుకున్నాడు.

సంధి షరతులు: శివాజీ తన ఆధీనంలోని 35 కోటల్లో 23 కోటలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోని సంవత్సరానికి 4 లక్షల హన్నుల ఆదాయం వచ్చే భూభాగాన్ని మొగలులకు ఇవ్వడానికి అంగీకరించాడు.

* దీనికి బదులుగా సంవత్సరానికి 4 లక్షల హన్నుల ఆదాయం వచ్చే బీజపూర్ - కొంకణ్ ప్రాంతంలోని భూభాగాన్ని, బాలాఘాట్ ప్రాంతంలో సంవత్సరానికి 4 లక్షల హన్నుల ఆదాయం వచ్చే భూభాగాన్ని మొగలులు శివాజీకి ఇచ్చారు. దీనికోసం శివాజీ కంతులవారీగా 40 లక్షల హన్నులు మొగలులకు చెల్లించాలి.

* శివాజీ కుమారుడు శంభాజీ ఔరంగజేబు కొలువులో మున్సబుదార్‌గా చేరడానికి అంగీకారం కుదిరింది.

* ఈ సంధి షరతుల్లో అంతర్భాగంగా శివాజీ మొగలు దర్బార్‌ను సందర్శించడానికి అంగీకరించాడు. రాజా జైసింగ్ మొగలు దర్బార్‌లో ఏవిధమైన అగౌరవం జరగదని ఔరంగజేబుకు సిఫారసు చేసి, దక్కను వైస్రాయిగా నియమించేటట్లు చూస్తానని శివాజీకి హామీ ఇచ్చాడు. శివాజీ ఔరంగజేబు దర్బార్ వైభవాన్ని, మొగలుల బలాబలాలను స్వయంగా చూడాలని భావించి ఈ షరతుకు ఒప్పుకున్నాడని ప్రొ సర్దేశాయి పేర్కొన్నాడు.

* శివాజీ తన కుమారుడు శంభాజీతోపాటు క్రీ.శ. 1666 మే 9 న మొగలు దర్బార్‌ను సందర్శించాడు. అయితే దర్బార్‌లో చక్రవర్తి శివాజీకి తగిన గౌరవం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన శివాజీ చక్రవర్తిని దూషించాడు. ఔరంగజేబు శివాజీని అరెస్టు చేసి ఆగ్రా కోటలో నిర్బంధించాడు. తగిన సలహాకోసం రాజా జైసింగ్‌కు లేఖ రాశాడు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేలోపే శివాజీ నిర్బంధం నుంచి తప్పించుకున్నాడు.

* శివాజీ క్రీ.శ. 1666 నుంచి క్రీ.శ. 1669 మధ్య 3 ఏళ్లపాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. తర్వాత మొగలులతో వైరాన్ని పునరుద్ధరించి సూరత్‌పై రెండోసారి దాడిచేసి 66 లక్షల రూపాయల విలువగల సంపదను దోచుకున్నాడు. పురంధర్ సంధి షరతుల ప్రకారం మొగలులకు ఇచ్చిన 23 కోటలను వారి నుంచి తిరిగి ఆక్రమించుకున్నాడు. మొగలు సామ్రాజ్యంలోని వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఆప్ఘనుల తిరుగుబాటు శివాజీ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి బాగా దోహదపడింది. దక్కనులోని మొగలు సైన్యంలోని కొంత భాగాన్ని వాయవ్య సరిహద్దు రాష్ట్రానికి తరలించారు. దీంతో శివాజీ బీరార్, ఖాందేష్‌లను మొగలుల నుంచి, పన్హాలా, సతారాలను బీజపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించుకున్నాడు.

* శివాజీ అధికారం తారస్థాయికి చేరింది. క్రీ.శ. 1674 జూన్ 16 న రాయఘడ్ దుర్గంలో శివాజీ పట్టాభిషేక మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివాజీ ఛత్రపతి బిరుదును స్వీకరించాడు. ప్రముఖ విద్వాంసుడు, కాశీ పండితుడైన గార్గభట్టు అధ్యక్షతన ఎనిమిది మంది పురోహితుల సమక్షంలో ఈ పట్టాభిషేకం జరిగింది. శివాజీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇతర మరాఠా సర్దారులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నాడు.

 

శివాజీ దక్షిణదేశ దండయాత్రలు

  మొగలులు వాయవ్య భాగంలో తిరుగుబాట్లతో సతమతమవడం శివాజీకి కలిసొచ్చింది. ఇది శివాజీ దక్షిణ భారతదేశంపై తన దృష్టిని సారించడానికి తోడ్పడింది. శివాజీ గోల్కొండ సుల్తాను అబ్దుల్ హసన్ సహాయంతో బీజపూర్, కర్ణాటకలపై దండయాత్ర చేశాడు. కర్ణాటకలో సంపాదించే సంపదను రెండు రాజ్యాలు పంచుకునే నిబంధన ప్రకారం అబ్దుల్ హసన్ శివాజీకి సైనిక సహకారం అందించాడు. శివాజీ కర్ణాటకను దోచుకుని, తర్వాత తన సోదరుడు వెంకోజీ ఆధీనంలోని జింజీ, వెల్లూరులను ఆక్రమించాడు.

* ఈ దండయాత్రలో భారీగా సంపదను దోచుకున్న శివాజీ, ఈ సంపదను గోల్కొండ సుల్తానుతో పంచుకోవడానికి నిరాకరించాడు. దీంతో వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దక్షిణ భారతదేశ దండయాత్ర శివాజీ జీవితంలో చివరిది. శివాజీ 1680 లో మరణించాడు. ఈ దండయాత్ర తన స్వరాజ్యం ఆర్థికపరిస్థితిని మెరుగుపరచుకోవడానికే చేపట్టాడు. శివాజీ రాజ్యం పశ్చిమతీరంలో కల్యాణ్ నుంచి గోవా వరకు విస్తరించింది. దక్షిణాన బెల్గాం నుంచి తుంగభద్రా నదీతీరం వరకు, మద్రాసు రాష్ట్రంలోని వెల్లూరు, జింజీ వరకు విస్తరించింది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌