• facebook
  • whatsapp
  • telegram

లోహాలు, అలోహాలు

లోహాలు - భౌతిక ధర్మాలు 

ద్యుతిగుణం:

* ప్రకాశమంతమైన ఉపరితలం ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగే పదార్థాలను ద్యుతిగుణం ఉన్న పదార్థాలనీ, ఆ గుణాన్ని ద్యుతిగుణం అనీ అంటారు.

* ద్యుతి గుణం అంటే మెరిసే స్వభావం.

*  ప్రకాశమంతంగా లేని పదార్థాలను ద్యుతిగుణం లేని పదార్థాలు అంటారు.

*  ఇనుము, రాగి, జింక్, అల్యూమినియం లాంటివి మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.

*  గంధకం (సల్ఫర్), కార్బన్ లాంటివి మెరిసే స్వభావాన్ని కలిగి ఉండవు.

*  సాధారణంగా లోహాలన్నీ ద్యుతి గుణాన్ని ప్రదర్శిస్తాయి.

*  ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థాలను ధ్వని గుణం ఉన్న పదార్థాలు అంటారు.

ఉదా: జింక్, అల్యూమినియం, మెగ్నీషియం

స్తరణీయత:

*  పదార్థాలను కొట్టినప్పుడు పలుచటి రేకులుగా సాగే గుణాన్ని స్తరణీయత అంటారు.

*  పలుచని చదునైన రేకులుగా మారే పదార్థాలను స్తరణీయ పదార్థాలు అంటారు.

* లోహాలు స్తరణీయత (అఘాత వర్థనీయత) ధర్మాన్ని కలిగి ఉంటాయి.

*  పదార్థాల స్తరణీయతా వ్యాప్తి వేర్వేరుగా ఉంటుంది.

*  అత్యధిక స్తరణీయత ఉన్న లోహం బంగారం.

* అల్యూమియం, వెండి కూడా అధిక స్తరణీయతతో ఉంటాయి.

తాంతవత:

పదార్థాన్ని సన్నటి తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు.

* దాదాపు అన్ని లోహాలు తాంతవత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి.

అధిక తాంతవత ఉన్న లోహం ప్లాటినం.

విద్యుత్ వాహకత:

తమ ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేసే ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటారు.

దాదాపు లోహాలన్నీ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి.

* అత్యుత్తమ విద్యుత్ వాహకం వెండి.

ఉష్ణ వాహకత:

*  పదార్థం ద్వారా ఉష్ణం ప్రసరించే ధర్మాన్ని ఉష్ణవాహకత అంటారు.

* ఉత్తమ ఉష్ణ వాహకం వెండి.

*  ఉష్ణ వాహకతను అన్ని లోహాలు ఒకేలా ప్రదర్శించవు.

* అల్యూమినియం, రాగి, ఇనుముకు ఉండే అధిక ఉష్ణవాహకత కారణంగా వాటిని వంట పాత్రల తయారీకి ఉపయోగిస్తారు.

*  లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపి క్షార స్వభావం ఉన్న ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.

      2 Mg + O2   2 MgO

      MgO క్షారస్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది నీటిలో కరిగి Mg(OH)2 ఏర్పరుస్తుంది. ఇది ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తుంది.

* బంగారం, ప్లాటినం లాంటివి గాలితో చర్య జరపవు కాబట్టి అవి తుప్పుపట్టవు.

*  వెండి వస్తువులు, రాగిపాత్రలు, విగ్రహాలు కొంతకాలం తర్వాత మెరుపును కోల్పోతాయి. వెండి వస్తువులు నల్గగా, రాగి వస్తువులు ఆకుపచ్చగా మారతాయి. కారణం ఇవి గాలితో చర్య జరపడమే.

*  లోహాలు నీటితో చాలా నెమ్మదిగా చర్య జరుపుతాయి.

*  లోహాలు ఆమ్లాలతో చర్యజరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి.    Mg + 2 HCl  MgCl2 + H

*  అధిక చర్యాశీలత కలిగిన లోహాలు, తక్కువ చర్యాశీలత కలిగిన లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి.

 అలోహాలు:

* అలోహాలు ద్యుతిగుణం, ధ్వనిగుణం లాంటి లోహధర్మాలను కలిగి ఉండవు.

*ఇవి నీటితో, ఆమ్లాలతో చర్య జరపవు.

* అలోహాలు O2 తో చర్యజరిపి అలోహ ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.

* ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి

    S + O2   SO2

*  ఇవి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోని మారుస్తాయి.

లోహాలు - ఉపయోగాలు:

*  మిఠాయిలపై అలంకరించడానికి పలుచటి వెండి రేకును ఉపయోగిస్తారు.

*  తినుబండారాలను ప్యాకింగ్ చేయడానికి, చాక్లెట్ రేపర్లకు పలుచటి అల్యూమినియం రేకును వినియోగిస్తారు.

* అల్యూమినియం, రాగి మిశ్రమాన్ని నాణేలు, పతకాలు, విగ్రహాల తయారీలో వాడతారు.

*  జింక్, ఇనుము మిశ్రమాన్ని ఇనుప రేకుల తయారీలో వినియోగిస్తారు.

*  వ్యవసాయ పనిముట్ల తయారీలో ఇనుమును, అలంకరణ సామాగ్రిలో వాడతారు.

*  థర్మామీటర్లలో పాదరసాన్ని ఉపయోగిస్తారు.

అలోహాలు - ఉపయోగాలు:

* సల్ఫర్‌ను బాణసంచా, మందుగుండు సామగ్రి, గన్‌పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటీసెప్టిక్ ఆయింట్‌మెంట్‌ల తయారీకి ఉపయోగిస్తారు.

* ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, వెంట్రుకలు, చేతి గోళ్లలో సల్ఫర్ ఉంటుంది.

* శుద్ధి చేసిన కార్బన్‌ను విరంజనకారిగా వినియోగిస్తారు.

* ఆల్కహాల్‌లో కలిపిన అయోడిన్ (టింక్చర్ అయోడిన్)ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు.

* చాలా వరకు లోహాలు ఘనస్థితిలో లభిస్తాయి.

మన చుట్టూ జరిగే మార్పులు: పదార్థ మార్పులు రెండు రకాలు

      1. భౌతిక మార్పులు

      2. రసాయన మార్పులు.

1. భౌతిక మార్పులు:

* ఈ మార్పులో పదార్థం రంగు, స్థితి, ఆకారం, పరిమాణంలో మార్పు కనిపిస్తుంది కానీ, కొత్త పదార్థాలు ఏర్పడవు.

ఉదా: మంచు గడ్డ కరగడం, నెయ్యి కరగడం; కొబ్బరినూనె చలికాలంలో గడ్డకట్టడం. బెలూన్, సైకిల్ ట్యూబ్‌ను గాలితో నింపడం, కొవ్వొత్తిని వేడిచేయడం, గుడ్డును ఉడక బెట్టడం.

* భౌతిక మార్పులో ప్రయోగ పరిస్థితిని వెనుకకు తిప్పితే తిరిగి మొదటి పదార్థం ఏర్పడుతుంది.

* అయోడిన్ (ఘనం)       అయోడిన్ (బాష్పం)

* NH4Cl (ఘనం)      NH4Cl (తెల్లటి దట్టమైన పొగలు)

* ZnO (తెలుపు)     ZnO (పసుపు)

2. రసాయన మార్పులు:

* పదార్థ సంఘటనంలో మార్పు జరిగితే అది రసాయన మార్పు. దీన్నే రసాయన చర్య అంటారు.

* రసాయన మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుంది.

ఉదా: మెగ్నీషియం తీగను గాలిలో మండించగా మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది

    2 Mg + O2    2 MgO

  జింక్ కార్బొనేట్‌ను వేడిచేస్తే ZnO ఏర్పడటం.

    

*కిరణజన్యసంయోగక్రియ, గోడకు వెల్ల వేయడం, అగ్గిపుల్లను వెలిగించడం, టపాకాయలను పేల్చడం... అన్నీ రసాయన మార్పులే.

* వేసవికాలంలో చర్మం రంగులో మార్పురావడం, టీ తయారీ, నొప్పులకు వాడే లేపనాలు, వ్యాధులకు వాడే మందు బిల్లలు లాంటివి రసాయన మార్పులు.

ఇనుము తుప్పు పట్టడం:

* ఇనుమును ఎక్కువ కాలం గాలి తగిలేలా ఉంచినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్‌తో చర్యజరిపి ఆక్సైడ్ రూపంలో కొత్త పదార్థంగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను తుప్పుపట్టడం అంటారు.

* ఇనుము + ఆక్సిజన్ (గాలి నుంచి) + నీరు  తుప్పు (ఇనుము)

తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి ఇనుప వస్తువులకు నేరుగా నీరు, గాలిలో ఆక్సిజన్ లాంటివి తగలకుండా చూడాలి.

* ఇనుప వస్తువులకు రంగు లేదా గ్రీజుతో పూతవేయాలి.

గాల్వనైజేషన్:

* ఒక లోహం మీద వేరొక లోహంతో పూతవేసే ప్రక్రియను గాల్వనైజేషన్ అంటారు.

* సైకిల్, మోటార్ సైకిళ్ల హ్యాండిల్స్‌కు, రిమ్ములకు తెల్లటి పూతవేస్తారు.

* ఇనుము మీద జింక్ లేదా క్రోమియం పూతపూసే ప్రక్రియే గాల్వనైజేషన్.

సాధారణంగా గాల్వనైజేషన్ ప్రక్రియలో పూత పూయడానికి జింక్‌ను వాడతారు.

* కాయలు, పండ్లు కోసినప్పుడు రంగు మారకుండా ఉండటానికి వెనిగర్ లేదా నిమ్మరసం ఉపయోగిస్తారు.

* వెనిగర్ + వంటసోడా     కార్బన్‌డయాక్సైడ్ + ఇతర పదార్థాలు.

ఒక పదార్థాన్ని వేడిచేసినప్పుడు అది ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.

ఉదా: కర్పూరం వేడిచేసినప్పుడు ఆవిరవడం

* ఆవిరిగా మార్చి లేదా వేడిచేసి ద్రావణాల నుంచి ఘనపదార్థాలను వేరుచేసే ప్రక్రియను స్ఫటికీకరణం అంటారు.

ఉదా: చక్కెర స్ఫటికాలు ఏర్పడటం, యూరియా స్ఫటికాలను వేరుచేయడం.

నేలబొగ్గు, పెట్రోలియం

* పదార్థాల గురించి వివరించే విజ్ఞానశాస్త్ర శాఖనే పదార్థ శాస్త్రం అంటారు.

* ఇసుకను ఇతర పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లబరచడం వల్ల గాజు, కేలినైట్ ఖనిజాన్ని నీటిలో కలపడం వల్ల బంకమన్ను, ఎండిన చెట్ల నుంచి కలప, ధాతువుల నుంచి లోహాలు తయారవుతాయి.

* నేడు మనం అనేక అవసరాలకు ఉపయోగిస్తున్న పదార్థాలు 2 రకాలు.

     1. తరగని శక్తి వనరులు

     2. తరిగిపోయే శక్తి వనరులు

 మనం వినియోగించేకొద్దీ తగ్గిపోని వాటిని తరగని శక్తి వనరులు అంటారు.

ఉదా: గాలి, సౌరశక్తి

మనం వినియోగించే కొద్దీ తగ్గిపోయే వాటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు.

ఉదా: సహజవాయువు, బొగ్గు, పెట్రోలియం

పెట్రోలియం ఘనపరిమాణాన్ని బారెల్ ప్రమాణంగా తీసుకుంటారు.

    1 బారెల్ = 159 లీటర్లు

* బయోడీజిల్ (జీవ ఇంధనాలు) విషరహితం, పునరుత్పత్తి చేసే సామర్థ్యం గలవి.

బయోడీజిల్‌ను వృక్షతైలాలు లేదా జంతువుల కొవ్వుల నుంచి వివిధ రసాయన చర్యలకు గురిచేసి తయారు చేస్తారు.

*బయోడీజిల్ సురక్షితమైంది.

* పారిశ్రామిక విప్లవ కాలంలో కనుక్కున్న ఆవిరియంత్రాల్లో బొగ్గును వాడేవారు.

* 1950 సంవత్సరం దాకా ప్రపంచ విద్యుత్ ఉత్పత్తి నేలబొగ్గు ద్వారా జరిగింది.

* ఆధునిక సమాజానికి సేవలందిస్తున్న పురాతనపు బహుమతి నేలబొగ్గు.

* పరిశ్రమల్లో వాడే బొగ్గు భూపటలంలోని గనుల నుంచి లభిస్తుంది.

వంట చెరకు నుంచి లభించే బొగ్గు కట్టెబొగ్గు (Charcoal).

పూర్వచారిత్రక యుగం నుంచి పెట్రోలియం గురించి మానవుడికి తెలుసు.

* 4000 ఏళ్ల పూర్వమే బాబిలోనియా గోడలు, గోపురాల నిర్మాణంలో ''ఆస్పాల్ట్" అనే పెట్రోలియం ఉత్పన్నాన్ని వాడారు.

*  పెట్రోలియం వెలికితీయడానికి చైనా లోతయిన బావులను తవ్వింది.

*   సహజవాయువును అత్యధిక పీడనాల వద్ద ''సంపీడిత సహజ వాయువు (CNG)"గా నిల్వచేస్తున్నారు

*  ONGC (Oil and Natural Gas Corporation) ఆధ్వర్యంలో భారతదేశంలో పెట్రోలు, సహజవాయువు కోసం అన్వేషణ జరుగుతోంది.

*  పెట్రోలియం ఒక సంక్లిష్ట మిశ్రమం. దీన్ని అంశిక స్వేదనం ప్రక్రియ ద్వారా వివిధ అంశీభూతాలుగా వేరుచేస్తారు.

నేలబొగ్గు:

* ఇది పెట్రోలియంలా వైవిధ్యభరితమైంది కాదు కానీ ఉపయుక్తమైంది.

* నేలబొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా CO2 విడుదల అవుతుంది.

* పారిశ్రామికంగా శుద్ధిచేయడం ద్వారా కోక్, కోల్‌వాయువు, కోల్‌తారు పొందుతాం.

కోక్:

* ఇది దృఢమైన, నల్లటి సచ్ఛిద్ర పదార్థం.

* కార్బన్ స్వచ్ఛమైన రూపం.

*స్టీలు తయారీలో, లోహాల సంగ్రహణలో కోక్ ఉపయోగిస్తారు.

కోల్‌తారు:

* ఇది దుర్వాసన గల నల్లటి చిక్కనైన ద్రవం.

*ఇది 200 పదార్థాల మిశ్రమం.

* మాత్‌లు, ఇతర కీటకాల నుంచి రక్షణ కోసం ఉపయోగించే నాఫ్తలిన్ గుళికలను కోల్‌తారు నుంచి తయారుచేస్తారు.

కోల్‌గ్యాస్:

* నేలబొగ్గు నుంచి కోక్ పొందే ప్రక్రియలో కోల్‌గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.

* అనేక కర్మాగారాల్లో కోల్‌గ్యాస్ ఇంధనంగా ఉపయోగిస్తారు.

* పెట్రోలియంకి గల గొప్ప వ్యాపార ప్రాముఖ్యం వల్ల దీన్ని ''ద్రవ బంగారం" అంటారు.

* జీవపదార్థం బొగ్గుగా మారే ప్రక్రియను ''కార్బొనైజేషన్" అంటారు.

జీవపదార్థాల అవశేషాల నుంచి ఏర్పడటం వల్ల నేలబొగ్గును శిలాజ ఇంధనం అంటారు.

సముద్రాలు, మహాసముద్రాల ఉపరితలాలకు దగ్గరగా ఉండే ''ప్లాంక్‌టన్" లాంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరల్లో కప్పబడి ఉండి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందుతుంది.

శిలాజాల అతివినియోగం వల్ల గాలి కాలుష్యం, హరితగృహ ప్రభావం, భూతాపం లాంటి సమస్యలు వస్తాయి.

ముడిచమురు సముద్ర నీటిలో కలిసిపోవడం వల్ల పక్షులు, క్షీరదాలు, చేపలు లాంటివి చనిపోతాయి.

పెట్రోలియం, భారలోహాల నుంచి తయారైన పెయింట్లను గోడలు, తలుపులు, కిటికీలకు వేసినప్పుడు విషపదార్థాలు గాలిలోకి వస్తాయి.

గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బును, నాసియా మత్తులకు దారితీస్తుంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి మన జీవితాలను మార్చగలిగింది.

కాలుష్యపరంగా ఆదర్శ ఇంధనం సహజవాయువు.

దహనం, ఇంధనాలు, మంట

ఏదైనా వస్తువును గాలిలో మండించినప్పుడు ఉష్ణం, కాంతి వెలువడుతుంది.

* ఒక పదార్థం ఆక్సిజన్‌తో కలిసి మండటాన్ని దహనం (Combustion) అంటారు.

* మంట దగ్గరకు తీసుకువచ్చినపుడు మండే గుణం గల పదార్థాలను 'దహనశీలి పదార్థాలు' అంటారు.

వీటిలో కొన్నింటిని ఇంధనాలుగా ఉపయోగిస్తారు.

మండని పదార్థాలను 'దహనశీలి కాని పదార్థాలు' అంటారు.

* వస్తువులు మండటానికి గాలి అవసరం.

* ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత అంటారు.

* ఒకసారి పదార్థం మండటం ప్రారంభించిన తర్వాత దాని నుంచి వెలువడే ఉష్ణం ఆ పదార్థం నిరంతరంగా పూర్తిగా మండటానికి ఉపయోగపడుతుంది.

* జ్వలన ఉష్ణోగ్రత పదార్థాన్ని బట్టి మారుతుంది.

* ఒక పదార్థం జ్వలన ఉష్ణోగ్రత విలువ ఆ పదార్థం ఎంత త్వరగా మండుతుందో తెలుపుతుంది.

జ్వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండి త్వరగా మండే పదార్థాలను త్వరగా మండే పదార్థాలు అంటారు.

ఉదా: పెట్రోలు, ఆల్కహాల్, వంటగ్యాస్

అగ్గిపుల్ల తయారీలో అగ్గిపుల్ల తలభాగంలో ఆంటిమొని సల్ఫైడ్, తెల్లభాస్వరం, పొటాషియం క్లోరేట్, బంకతో తయారైన మిశ్రమాన్ని వాడతారు.

* అగ్గిపుల్లను అగ్గిపెట్టపై ఉంచి రాపిడి చెందించినప్పుడు ఫాస్ఫరస్ మండుతుంది.

ఈ రోజుల్లో మనం వాడే అగ్గిపుల్లలలో పొటాషియం క్లోరేట్, ఆంటిమొని సల్ఫైడ్, ఎర్ర ఫాస్ఫరస్ ఉపయోగిస్తున్నారు.

పదార్థాలు ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే మండటాన్ని స్వతఃసిద్ధ దహనం అంటారు.

గ్యాస్ స్టవ్ పిడిని తిప్పి వెలుగుతున్న అగ్గిపుల్లను గ్యాస్ దగ్గరగా తీసుకొస్తే అది వెంటనే మండుతుంది. దీన్ని ''శీఘ్రదహనం" అంటారు.

ఉదా: స్పిరిట్, పెట్రోలు, కర్పూరం లాంటివి శీఘ్రదహనం చెందుతాయి.

*పెట్రోల్ ట్యాంకర్లపై "Highly Inflammable" అని రాసి ఉంటుంది. కారణం పెట్రోల్ శీఘ్ర దహన కారకం.

బాణసంచాపై ఒత్తిడి పెంచడం ద్వారా కూడా అవి పేలుతాయి.

ఒక కిలోగ్రాం ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తిచేసే ఉష్ణరాశి విలువనే ''కెలోరిఫిక్ విలువ" అని అంటారు

దీని ప్రమాణాలు కిలోజౌల్/కిలోగ్రామ్ (K.J./K.G.)

* మంటను ఆర్పడానికి నీటిని ఉపయోగిస్తారు. నూనెల మంటను ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ ఉపయోగిస్తారు.

* కొవ్వొత్తి మంట నల్లని ప్రాంతంలో దహనచర్య జరగదు.

హైడ్రోజన్

* ఆవర్తన పట్టికలో మొదటి మూలకం.

* ప్రపంచంలో అత్యంత సాధారణ మూలకం.

* హైడ్రోజన్ అంటే లాటిన్ భాషలో నీటిని ఏర్పరిచేది.

* హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు.

* విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం.

* హైడ్రోజన్ వాయువు గాలి కంటే తేలికైంది. గాలి హైడ్రోజన్ కంటే 14.5 రెట్లు బరువైంది.

హైడ్రోజన్ ఆక్సిజన్‌తో కలిసి నీటిని ఏర్పరుస్తుంది. కానీ నీటిలో కరగదు.

* ఆక్సీహైడ్రోజన్ మంట ద్వారా అత్యధిక ఉష్ణోగ్రత పొందవచ్చు.

* సూర్యుడు, నక్షత్రాల్లో సంలీనం చెందే వాయువు హైడ్రోజన్. వీటి స్వయం ప్రకాశత్వానికి ఇది కారణం అవుతుంది.

* మనకు లభించే అన్ని మూలకాల్లో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్‌లు, న్యూట్రాన్‌లు ఉంటాయి.

* న్యూట్రాన్ ఉండని ఒకే ఒక మూలకం హైడ్రోజన్.

* హైడ్రోజన్‌ను దహనశీలి వాయువు అంటారు. ఇది నీలి రంగులో మండి 'టప్' అని శబ్దం చేస్తుంది.

* మనకు తెలిసిన వాయువులన్నింటిలో అత్యధిక వ్యాపన రేటు ఉన్నది కూడా హైడ్రోజన్ మాత్రమే.

* నూనెల నుంచి వనస్పతి తయారుచేసే హైడ్రోజినేషన్ ప్రక్రియలో దీన్ని ఉపయోగిస్తారు.

* అమ్మోనియా తయారీకి హైడ్రోజన్, నైట్రోజన్ వాయువులను ఉపయోగిస్తారు.

* హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను యాంటీసెప్టిక్, జెర్మిసైడ్, సిల్కు, వెంట్రుకలు, ఏనుగు దంతాలను విరంజనం చేయడానికి ఉపయోగిస్తారు.

* హైడ్రోజన్ రంగు, రుచి, వాసన లేని వాయువు.

* ఆక్సీ హైడ్రోజన్ మంటను వెల్డింగ్ దుకాణాల్లో లోహాలను అతికించడానికి, కోయడానికి ఉపయోగిస్తారు.

* హైడ్రోజన్‌కు అధిక ఉష్ణం, దహన ఉష్ణం ఉండటం వల్ల దీన్ని వాయు ఇంధనంగా ఉపయోగిస్తారు.

*పెట్రోల్ హైడ్రోజనీకరణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త బెర్జీలినియస్.

* ద్రవ హైడ్రోజన్‌ను రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు.

* హైడ్రోజన్ ఐసోటోపులు డ్యుటీరియం, ట్రిటియం.

* డాల్డాను తయారుచేయడానికి నూనెల హైడ్రోజినేషన్‌లో దీన్ని ఉపయోగిస్తారు.

* ఇది అతి తేలికైన వాయువు. ఆక్సిజన్‌తో కలిసి నీటిని ఏర్పరుస్తుంది.

* 1 లీటరు హైడ్రోజన్ భారం = 0.09 గ్రాములు.

హీలియం

* ఇది జడ వాయువుల్లో మొదటిది. అన్నిటి కంటే తేలికైన జడవాయువు.

* విశ్వంలో హైడ్రోజన్ తర్వాత అత్యధికంగా ఉండేది హీలియం. దీన్ని మొదట సూర్యుడిపై గుర్తించారు.

సూర్యగోళంలో సంలీన చర్యలో ఏర్పడే జడవాయువు హీలియం. దీన్ని వాతావరణ బెలూన్లలో ఉపయోగిస్తారు.

* సముద్రాల్లో ఈతకు వెళ్లేవారు శ్వాస కోసం ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.

* హీలియంతో కలిసిన ఆక్సిజన్ మిశ్రమాన్ని ఉబ్బసం లాంటి ఊపిరితిత్తుల జబ్బులున్న రోగులకు వాడతారు.

* పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద వివిధ ప్రక్రియలను అధ్యయనం చేసేటప్పుడు అల్ప ఉష్ణోగ్రతలను (1.0 × 10 K) పొందడానికి హీలియం ద్రవాన్ని 'క్రయోజనిక్ ద్రవం'గా ఉపయోగిస్తారు.

* హీలియంకు రబ్బరు, గాజు, ప్లాస్టిక్ లాంటి పదార్థాల ద్వారా విసరణ చెందే స్వభావం ఉంటుంది.

* అల్ప ఉష్ణోగ్రతలను కనుక్కోవడానికి ఉపయోగించే థర్మామీటర్లలో హీలియం వాయువును ఉపయోగిస్తారు.

* హీలియం గాలి కంటే తేలికైంది. కాబట్టి దీన్ని విమానాల టైర్లలో నింపడానికి ఉపయోగిస్తారు.

* ద్రవ హీలియంను 'సూపర్ ఫ్లూయిడ్' అంటారు.

* ద్రవ హీలియం భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఎగబాకే స్వభావాన్ని కలిగి ఉంటుంది.

లిథియం

* ఇది లోహాలన్నింటిలోకి తేలికైంది.

* లోహాలన్నింటిలో కఠినమైంది టంగ్‌స్టన్. అందుకే టంగ్‌స్టన్‌ను విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్‌గా ఉపయోగిస్తారు.

*సాధారణ విద్యుత్ బల్బులో నైట్రోజన్ వాయువును నింపుతారు.

* ఫ్లోరోసెంట్ బల్బులో మెర్క్యురీ బాష్పం, ఆర్గాన్ వాయువుల మిశ్రమాన్ని నింపుతారు. విద్యుత్ బల్బును క్వార్ట్జ్ గాజుతో తయారుచేస్తారు.

కార్బన్

* కార్బన్‌ను మూలకాలకు రాజు అంటారు.

* మూలకాలన్నింటికీ అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచేది కార్బన్.

* మూలక పరమాణువులు ఒకదానికొకటి కలిసి గొలుసు లాంటి సమ్మేళనం ఏర్పరిచే స్వభావమే కాటనేషన్.

* మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ స్వభావం ఉన్న మూలకం కార్బన్.

* కార్బన్ మరో రూపాంతరం గ్రాఫైట్.

* కార్బన్ ఒక అలోహం. అయినప్పటికీ ఇది విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది.

* కార్బన్ రూపాంతరమైన డైమండ్ ప్రకృతిలో లభించే పదార్థాలన్నింటిలో కఠినమైంది.

నైట్రోజన్

* నైట్రోజన్‌ను 'అంశిక స్వేదనం' ద్వారా తయారుచేస్తారు.

* కళేబరాలు కుళ్లినప్పుడు వాటి నుంచి నైట్రోజన్ వాయువు వెలువడి గాలిలో కలిసిపోతుంది.

* ఉష్ణోగ్రతను కచ్చితంగా కొలిచే వాయు థర్మామీటర్‌లో నైట్రోజన్‌ను ఉపయోగిస్తారు.

* ద్రవ నైట్రోజన్ ఉష్ణోగ్రత -196ºC కాబట్టి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఉంచాల్సిన పదార్థాలను నిల్వ ఉంచడానికి దీన్ని వాడతారు.

* ఉదాహరణకు సంకరణం చెందించే పశువుల వీర్యాన్ని ద్రవ నైట్రోజన్‌లో నిల్వ చేస్తారు.

* మేఘాల్లో మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ కలిసి 'నైట్రిక్ ఆక్సైడ్‌'ను ఏర్పరుస్తాయి.

* నైట్రోజన్ సమ్మేళనమైన నైట్రస్ ఆక్సైడ్‌ను 'నవ్వు పుట్టించే వాయువు' అంటారు.

* నైట్రోజన్ సమ్మేళనాలైన నైట్రో గ్లిజరిన్, ట్రైనైట్రోగ్లిజరిన్, పొటాషియం నైట్రేట్‌లను పేలుడు పదార్థాలుగా ఉపయోగిస్తారు.

* కృత్రిమ సిల్కు లేదా సెల్యులోజ్ నైట్రేట్ లేదా గన్ కాటన్ తయారీలో నత్రికామ్లాన్ని ఉపయోగిస్తారు.

* నైట్రోజన్ గాలిలో 3/4వ వంతు భార శాతం గానూ, 4/5వ వంతు ఘనపరిమాణ శాతంగానూ లభిస్తుంది.

* ఇది గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.

* మొక్కల కణజాలాల్లో పెరుగుదలకు కావాల్సిన ముఖ్యమైన మూలకం నైట్రోజన్.

* విద్యుత్ బల్బుల్లో జడ వాతావరణం కోసం నైట్రోజన్‌ను నింపుతారు.

* గాలిలోని ఐదు భాగాల్లో నాలుగు భాగాలు నైట్రోజన్ వాయువు వెలువడి గాలిలో కలిసిపోతుంది.

* లెగ్యుమినేసి మొక్కలు గాలి నుంచి నైట్రోజన్‌ను గ్రహించి దాన్ని నైట్రేట్ల రూపంలో నిల్వ చేస్తాయి.

* నైట్రోజన్ రంగు, రుచి, వాసన లేని వాయువు.

* నైట్రోజన్ గాలి కంటే తేలికైంది.

* నైట్రోజన్ నీటిలో కొద్దిగా కరుగుతుంది.

* నైట్రోజన్ మండే కొవ్వొత్తిని ఆర్పుతుంది.

* ఇది చర్యాశీలత లేని వాయువు. దహనశీలి కాదు. దహన దోహదకారి కాదు.

* నైట్రిక్ ఆమ్లం తయారీలో నైట్రోజన్‌ను ఉపయోగిస్తారు.

* వాయు థర్మామీటర్లలో దీన్ని ఉపయోగిస్తారు.

ఆక్సిజన్

* ఆక్సిజన్‌ను ప్రిస్టిలీ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు.

* భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్.

ఇది దహన దోహదకారి వాయువు. అంటే పదార్థాలు మండటానికి సహకరిస్తుంది.

* మొక్కలు, జంతువులు శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం. కాబట్టి దీన్ని ప్రాణవాయువు అంటారు.

* మొక్కలు సూర్యరశ్మిలో కిరణజన్య సంయోగక్రియ జరిపినప్పుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది.

ఆక్సిజన్ గాలిలో 1/5  వ వంతు ఉంటుంది.

ఆక్సిజన్, హైడ్రోజన్‌లను కలిపి మండించినప్పుడు ఆక్సీ హైడ్రోజన్ జ్వాల 2100°C ఉష్ణోగ్రత వద్ద ఏర్పడుతుంది.

రోగులు, సముద్రంలో లోతుగా వెళ్లే నావికులు శ్వాస కోసం ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని

ఉపయోగిస్తారు.

* ప్రకృతిలో ఎక్కువగా లభించే మూలకం ఆక్సిజన్.

* ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది.

* నీటిలో జీవించే జీవులు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి.

* నీటిలో ఆక్సిజన్ శాతం 89% (భారాత్మకంగా)

మెర్క్యురిక్ ఆక్సైడ్, పొటాషియం నైట్రేట్‌లను వియోగం చెందించి ఆక్సిజన్‌ను తయారు చేసినవారు - -ప్రిస్ట్‌లీ.

ఆక్సిజన్ అంటే అర్థం ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది.

ఆక్సిజన్ ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఆక్సిజన్ అని పేరుపెట్టిన శాస్త్రవేత్త - లెవోయిజర్.

ఆక్సిజన్‌ను ద్రవీకరిస్తే అది లేత నీలి రంగు ద్రవంగా మారుతుంది. ద్రవరూప ఆక్సిజన్‌ను రోదసిలోని రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు.

ఆక్సిజన్ ఓజోన్ (O3) అనే రూపాంతరాన్ని కలిగి ఉంటుంది.

సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాలను వాతావరణం పైపొరల్లో ఉండే ఓజోన్పొర అడ్డగించి మనకు చేరకుండా కాపాడుతుంది.

* ఆస్తమా, న్యుమోనియా లాంటి శ్వాస సంబంధ రోగులకు శ్వాస కోసం ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు.

* ఆక్సిజన్ - ఎసిటలీన్‌ల మిశ్రమాన్ని ఆక్సీ ఎసిటలీన్ మంటగా ఉపయోగిస్తారు.

* ఆక్సీ ఎసిటలీన్ మంట ద్వారా వచ్చే ఉష్ణోగ్రత 3200°C.

ఎసిటలీన్, ఆక్సిజన్ వాయువుల మిశ్రమాన్ని గ్యాస్ వెల్డింగ్‌లో, లోహాలను కోయడానికి ఉపయోగిస్తారు.

  ఫ్లోరిన్

మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఫ్లోరిన్. దీన్ని సూపర్ హాలోజన్ అని పిలుస్తారు.

ఫ్లోరిన్ దంతాల్లో పింగాణీ ఏర్పడటానికి అవసరం.

* అలోహాలన్నింటిలో అత్యధిక చర్యాశీలత ఉన్నది ఫ్లోరిన్.

* నీటిలో ఫ్లోరిన్ గాఢత 3 పీపీఎం కంటే ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. దీంతో ఎముకలు బలహీనమై దంతాలపై పసుపు చారలు ఏర్పడతాయి.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం నీటిలో ఉండదగిన ఫ్లోరిన్ పరిమాణం 1.5 mg/ lit

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, అనంతపురం; తెలంగాణలోని నల్గొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య అధికం.

*ఫ్లోరిన్ ఉండే ఫ్రియాన్ వాయువును రిఫ్రిజిరేటర్ కంప్రెసర్లలో ఉపయోగిస్తారు.

* క్లోరో ఫ్లోరో కార్బన్లను (ఫ్రియాన్లు) ద్రావణిగా, శీతలీకరణ పదార్థాలుగా రిఫ్రిజిరేటర్లలో ఉపయోగిస్తారు. ఇది ఓజోన్ పొరకు రంధ్రం చేస్తుంది.

* ఫ్లోరిన్‌ను గ్యాసోలిన్ తయారీలో ఉపయోగిస్తారు.

* సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్‌ను అధిక ఇన్సులేటర్‌గా వాడతారు.

* ఫ్లోరిన్‌ను టూత్‌పేస్ట్‌లలో సోడియం ఫ్లోరైడ్‌గా ఉపయోగిస్తారు.

* 'హైడ్రోఫ్లోరికామ్లం' గాజు నిక్షారణగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని గాజుపైన గుర్తులు (ఎచింగ్), గాట్లు పెట్టడానికి ఉపయోగిస్తారు.

నియాన్

* ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాల్లో నింపుతారు.

విమానాలు, రైల్వే సిగ్నల్ లైట్ల కోసం ఎర్రటి కాంతి ఉపయోగిస్తారు. నియాన్ వాయువు నింపిన బల్బులు ఎర్రటి కాంతిని ఇస్తాయి.

ఈ కాంతికి తరంగధైర్ఘ్యం ఎక్కువ. పొగమంచు ద్వారా ప్రయాణించే స్వభావం కలిగి ఉంటుంది.

* విమానాల రన్‌వేలో దారి చూపే లైట్లు ఎర్రటి కాంతినిస్తాయి. వీటిలో నియాన్‌ను నింపుతారు.

 * నియాన్‌ను ఉత్సర్గనాళంలో ప్రకటన కోసం వాడే ప్రతిదీప్తి బల్బుల్లో, బేకన్ లైట్లలో ఉపయోగిస్తారు.

సోడియం

* సోడియంను కిరోసిన్‌లో నిల్వ చేస్తారు.

* సోడియంను కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.

* ద్రవ సోడియంను న్యూక్లియర్ రియాక్టర్లలో శీతలీకరణిగా వాడతారు.

* సోడియం చల్లని నీటితో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.

     2 Na + 2 H2O  2 NaOH + H2 

మెగ్నీషియం

* మొక్కల్లోని ఆకుల్లో ఉండే హరిత రేణువుల్లో మెగ్నీషియం లోహం ఉంటుంది.

* మొక్కల్లో మెగ్నీషియం లోహం ఉండటం వల్ల ఆకులు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.

* మాగ్నసైట్, డోలమైట్ దీని ముడి లోహాలు.

* మెగ్నీషియం మెరిసే తెల్లని, మెత్తని లోహం.

*  కాంతిని ఇచ్చే పౌడర్ల తయారీకి

* బాణా సంచా తయారీలో వాడతారు.

* మెగ్నీషియం కార్బొనేట్‌ను టూత్ పేస్ట్‌లలో ఉపయోగిస్తారు.

మెగ్నీషియంను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు ప్రకాశవంతంగా మండుతుంది. కాబట్టి దీన్ని దీపావళి టపాసుల తయారీలో వాడతారు.

* మెగ్నీషియం మిశ్రమ లోహాలను ప్లేట్ల తయారీలో, తోళ్ల పరిశ్రమలో, రంగుల పరిశ్రమలో ఉపయోగిస్తారు.

* టాల్కమ్ పౌడర్‌లో 'టాల్క్' అంటే మెగ్నీషియం సిలికేట్.

అల్యూమినియం

* ఆవర్తన పట్టికలో 3వ గ్రూప్ 3వ పీరియడ్‌లో ఉండే మూలకం.

* అల్యూమినియంను సిల్వర్ పెయింట్ తయారీలో ఉపయోగిస్తారు.

* సిల్వర్ పెయింట్‌లో సిల్వర్ శాతం సున్నా. అల్యూమినియం పొడిని లిన్‌పీడ్ ఆయిల్‌లో కలిపినప్పుడు సిల్వర్ పెయింట్ తయారవుతుంది.

* భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం.

* ముఖ్య ఖనిజం బాక్సైట్. దీని ఫార్ములా Al2O3 . 2 H2O. ఈ బాక్సైట్ రెండు రకాలుగా ఉంటుంది. ఎర్రబాక్సైట్, తెల్ల బాక్సైట్. ఎర్ర బాక్సైట్‌లో ఐరన్ ఆక్సైడ్ (Fe2O3), తెల్ల బాక్సైట్‌లో సిలికా (SiO2) మలినాలు ఉంటాయి.

అల్యూమినియం పొడి, అమ్మోనియం నైట్రేట్‌ల మిశ్రమాన్ని అమ్మోనాల్ అంటారు. దీన్ని పేలుడు

 పదార్థంగా ఉపయోగిస్తారు.

టెలిస్కోపులలో రిఫ్లెక్టర్ (పరావర్తకం)గా అల్యూమినియం లోహాన్ని ఉపయోగిస్తారు.

అల్యూమినియంను సిగరేట్ రేపర్లు, టాబ్‌లెట్ల రేపర్లు, చాక్లెట్ కవర్ల తయారీలో వాడతారు.

సిలికాన్

* కంప్యూటర్ చిప్ లేదా మైక్రో ప్రాసెసర్ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.

* సౌరశక్తి సేకరణలో సోలార్ సెల్స్ తయారీకి కూడా ఈ మూలకాన్ని ఉపయోగిస్తారు.

* సిలికాన్ మూలకాన్ని ట్రాన్సిస్టర్‌లో అర్ధ లోహంగా ఉపయోగిస్తారు.

* సిలికా జెల్ అనే పదార్థం తేమను త్వరగా గ్రహిస్తుంది. అందువల్ల మందు సీసాల్లో తేమను గ్రహించడానికి చిన్న ప్యాకెట్ రూపంలో సిలికా జెల్ ఉపయోగిస్తారు.

సిలికాన్ డై ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది. దీన్నే 'క్వార్ట్జ్' అని అంటారు.

* క్వార్ట్జ్‌ను ఎలక్ట్రానిక్ గడియారాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగిస్తారు.

(సిలికాన్ డై ఆక్సైడ్ = క్వార్ట్జ్)

భూపటలంలో ఆక్సిజన్ తర్వాత అతి విస్తారంగా లభించే మూలకం 'సిలికాన్'.

భూమి, ఇసుక, పర్వతాలు, కొండలు.... వీటిలో ముఖ్యమైన అనుఘటకం 'సిలికా'.

ఫాస్ఫరస్

* ఫాస్ఫరస్ ముఖ్యంగా రెండు రకాలుగా లభిస్తుంది.

    1) తెల్ల ఫాస్ఫరస్          2) ఎర్ర ఫాస్ఫరస్

తెల్ల ఫాస్ఫరస్ అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది.

నీటిలో నిల్వ చేసే అలోహం - తెల్ల ఫాస్ఫరస్.

తెల్ల ఫాస్ఫరస్ గాలి తగలగానే ఆక్సిజన్‌తో మండి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది.

ఫాస్ఫరస్ రంగులేని మైనం లాంటి మెత్తని ఘన పదార్థం. కానీ ఇది తర్వాత పసుపు రంగులోకి మారుతుంది.

ఇది వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది. విష పదార్థం.

ఫాస్ఫరస్ పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులకు దవడ ఎముకలు నశిస్తాయి. దీన్నే 'ఫాసిజా జబ్బు' అంటారు.

తెల్ల భాస్వరానికి చర్యాశీలత ఎక్కువ.

తెల్ల భాస్వరం మండే ఉష్ణోగ్రత 35° C.

తెల్ల భాస్వరం గాలిలో త్వరగా మండి తెల్లని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ పొగలను ఏర్పరుస్తుంది.

చీకటిలో భాస్వరాన్ని గాలిలో ఉంచితే నెమ్మదిగా మండి మెరుస్తుంది. దీన్నే 'ఫాస్ఫారిజమ్స్' అంటారు.

ఇది గాలి తగిలితే మండుతుంది. అందువల్ల దీన్ని నీటిలో లేదా కిరోసిన్‌లో నిల్వ ఉంచుతారు.

దీన్ని డిటర్జంట్ల తయారీలో వాడతారు.

దీనికి మెరిసే గుణం ఉండటం వల్ల ఎముకలు చీకటిలో కూడా కనిపిస్తాయి.

తెల్ల భాస్వరాన్ని ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తారు.

బాంబులు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

ఎలుకలను చంపడానికి జింక్ అల్యూమినియం ఫాస్ఫైడ్‌లను ఉపయోగిస్తారు.

* ఎర్ర ఫాస్ఫరస్‌ను అగ్గిపెట్టెల పరిశ్రమలో ఉపయోగిస్తారు.

అగ్గిపుల్ల తలలో పొటాషియం క్లోరేట్, యాంటిమొని సల్ఫైడ్, మొత్తని గాజు ముక్కల పొడి ఉంటాయి. అగ్గిపుల్లను గీసినప్పుడు వేడికి పొటాషియం క్లోరేట్ వియోగం చెంది ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది.

సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్, అమ్మోనియం ఫాస్ఫేట్‌లను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు.

కాల్షియం ఫాస్ఫైడ్, కాల్షియం కార్బైడ్ మిశ్రమాలను హోలెమ్స్ సిగ్నల్స్‌గా సముద్రాల్లో వాడతారు.

ఎముకల్లో 50% వరకు ఫాస్ఫరస్ సమ్మేళనమైన 'కాల్షియం ఫాస్ఫేట్' ఉంటుంది.

* తెల్ల భాస్వరానికి చర్యాశీలత చాలా ఎక్కువ.

పొటాషియం

ఇది మొక్కల పెరుగుదలకు కావలసిన క్షార లోహం.

ఫొటో ఎలక్ట్రిక్ ఘటాల్లో, అధిక ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్లలో దీన్ని ఉపయోగిస్తారు.

కాల్షియం

మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం కాల్షియం. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి ఇది ఎంతో అవసరం. దీని ఫార్ములా Ca3(PO4)2.

మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం కాల్షియం.

ఎముకలు, దంతాల దృఢత్వానికి ఇది ఎంతో అవసరం.

ఎముకల్లో కాల్షియం, పాస్ఫరస్‌తో కలిసి కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది.

కాల్షియం కార్బొనేట్ సున్నపురాయిగా లభిస్తుంది.

కాల్షియం తెల్లని తేలికైన లోహం. దీన్ని శుద్ధ ఆల్కహాల్ తయారీకి, ఎముకల పెరుగుదల, మొక్కల పెరుగుదలకు వాడతారు.

మానవుడి ఎముకల్లో 60% కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది.

ఎముకల బూడిదను సల్ఫ్యూరికామ్లంతో చర్య జరిపి 'సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్' తయారు చేస్తారు. దీన్ని 'సూపర్' అని వ్యవహరిస్తారు. ఇది నీటిలో బాగా కరిగి ఎరువైతే దీన్ని మొక్కలకు ఉపయోగిస్తారు.
కాల్షియం సమ్మేళనాలు: సున్నపురాయిని వేడిచేస్తే కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. దీన్ని పొడి సున్నం (క్విక్లైమ్) అంటారు.

కాల్షియం హైడ్రాక్సైడ్: మిల్క్ ఆఫ్ లైమ్‌ను గోడలకు సున్నంగా వాడతారు. దీన్ని తడి సున్నం అంటారు.

కాల్షియం సల్ఫేట్: ప్రకృతిలో జిప్సంగా లభిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సిమెంట్, వ్యవసాయం, వడపోత, కాగితాన్ని ప్రక్షిప్తం చేయడానికి వాడతారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్: ఇది తెల్లని పొడి. నీటిలో కలిపితే కొద్ది సేపటికే గట్టిపడుతుంది. జిప్సంను 393K వరకు వేడిచేస్తే వస్తుంది.

నల్ల బల్ల మీద రాసే సుద్దలను తయారు చేయడానికి, విరిగిన ఎముకలను సరి చేయడానికి ఉపయోగిస్తారు.

కాడ్మియం

ఇది నీలి తెలుపు రంగులో ఉండే మెత్తని లోహం.

దీని ద్రవీభవన స్థానం 321 °C

ఇనుము, ఉక్కు, తుప్పు పట్టకుండా కాపాడవచ్చు.

మోటారు కారు పరిశ్రమల్లో విద్యుత్ ప్లేటింగ్ పదార్థంగా వాడతారు.

రాగి + కాడ్మియం మిశ్రమ లోహాన్ని విద్యుత్ వాహక తంతువులుగా వాడతారు.

కాడ్మియంను న్యూక్లియర్ రియాక్టర్లలో నియంత్రణ కడ్డీలుగా ఉపయోగిస్తారు.

సీసం

ఇది మెత్తని నీలి, నల్లరంగు గల లోహం. కరిగిన సీసం ఆక్సీకరణం చెందిన తర్వాత ఎరుపు సీసంగా మారుతుంది.

నీటి పైపులు, తీగలు, సీసపు గుండ్లు, సీసాలు, పిగ్మెంట్ల తయారీకి ఉపయోగిస్తారు.

టంగ్‌స్టన్

లోహాలన్నింటిలో కఠినమైంది టంగ్‌స్టన్.

టంగ్‌స్టన్‌ను విద్యుత్ బల్బుల్లో ఫిలమెంటుగా ఉపయోగిస్తారు.

ఫ్లోరోసెంట్ బల్బుల్లో మెర్క్యురీ, ఆర్గాన్ వాయువుల మిశ్రమాన్ని నింపుతారు.

విద్యుత్ బల్బులను క్వార్ట్జ్ గాజుతో తయారుచేస్తారు.

హాలోజన్‌లు

ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటివ్‌లను కలిపి హాలోజన్లు అంటారు.

వీటిలో ఫ్లోరిన్, క్లోరిన్ వాయు రూపంలోనూ; బ్రోమిన్ ద్రవ రూపంలోనూ; అయోడిన్, అస్టాటివ్ ఘన రూపంలోనూ ఉంటాయి.

బ్రోమిన్

* ఇది ముదురు ఎరుపు రంగు గల వాయువు. ఇది ద్రవ స్థితిలో కూడా లభ్యమవుతుంది.

సమద్రపు నీటి మొక్కల్లో తయారవుతుంది.

క్రిమి సంహారిణిగా రంగులు, మందులు తయారీలో ఉపయోగిస్తారు.

* బ్యాటరీల్లో, అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగిస్తారు.

అయోడిన్

* శుభ్రపరచడానికి, గాయాలు మాన్పడానికి (టింక్చర్) ఉపయోగిస్తారు. గాయిటర్ వ్యాధి రాకుండా టేబుల్సాల్ట్‌లో పొటాషియం ఆయోడైడ్ రూపంలో కలుపుతారు. ఇది మెరిసే నల్లని ఘనం.

* అయోడిన్‌ను రంగుల తయారీలో, సిల్వర్ అయోడైడ్‌ను కృత్రిమ వర్షోత్పతికి ఉపయోగిస్తారు.

కాడ్ లివర్ ఆయిల్, థైరాయిడ్ గ్రంథి, సముద్రపు శైవలాలు, సముద్రపు ఒడ్డున పెరిగే మొక్కలు, సముద్రపు నీటిలో అయోడిన్ ఉంటుంది.

సిల్వర్

* ఇది అత్యంత విద్యుత్ వాహకత కలిగిన లోహం.

* సిల్వర్ క్లోరైడ్‌ను క్రిమి సంహారిణిగా, సిల్వర్ నైట్రేట్‌ను మందుగా, సిల్వర్ బ్రోమైడ్‌ను ఫొటోగ్రఫీ పరిశ్రమలో ఉపయోగిస్తారు.

* కృత్రిమ వర్షాలను కురిపించడానికి సిల్వర్ అయోడైడ్‌ను ఉపయోగిస్తారు.

ఉక్కు

* ఉక్కులో 0.1% నుంచి 1.5% కార్బన్ ఉంటుంది.

* మిశ్రమ లోహాలను ఉక్కు, ఇతర లోహాలతో కలిపి తయారు చేస్తారు

ఉక్కు ద్రవీభవన స్థానం 1300 - 1400°C.

ఉక్కును అయస్కాంతంతో కరిగించవచ్చు, పదును పెట్టవచ్చు, వెల్డింగ్ చేయవచ్చు.

ఉక్కును రైలు పట్టాలు, లోకోమోటివ్‌లు, యుద్ధ సామగ్రి, శస్త్రచికిత్స సాధనాలు, గడియారపు స్ప్రింగులు, కత్తుల తయారీకి ఉపయోగిస్తారు.

ఆర్సినిక్

ఇది ఒక లోహం. విరూపకతను ప్రదర్శిస్తుంది.

* సీసపు గుళ్ల తయారీలో సీసంతో కలుపుతారు. సీసాన్ని గట్టిపరిచి విషపూరితం చేస్తుంది.

రాగి, కంచులను గట్టి పరచడానికి ఉపయోగిస్తారు. 

ఆంటిమొని

*ఇది తెల్లని ఘనం. ఘట ఫలకాలు, వైట్ లెడ్ లాంటి పెయింట్లు, ప్రింటింగ్ (ఎల్లో సల్ఫైడ్), మిశ్రమ లోహాల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు.

బిస్మత్

* ఇది మెరిసే గుణం గల తెల్లని గట్టి లోహం.

* ఇది తక్కువ ఉష్ణ, విద్యుత్ వాహకత కలిగి ఉంటుంది.

* ఇది ఆక్వార్జియాలో త్వరగా కరుగుతుంది.

మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగిస్తారు.

బిస్మత్ ఆక్సైడ్‌ను ఆప్టికల్ గాజు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. జీర్ణకోశ సంబంధ చికిత్సలో వాడతారు.

కోబాల్ట్

* తెల్లని లోహం. ఎలక్ట్రోప్లేటింగ్, నాణేలు, మిశ్రమ లోహాల తయారీకి వాడుతారు. బి - 12 విటమిన్‌లో ఉంటుంది.

* అందుకే దీన్ని సయనొకో బాలమైన్ అంటారు.

నికెల్

* ఇది కోబాల్ట్ ముడి ఖనిజాల్లో ఉంటుంది. ఇది తెల్లని లోహం

హైడ్రోజన్ నికెల్ సమక్షంలో నూనెలను గ్రహించి ఘన కొవ్వులుగా మార్చుతుంది.

బంగారం

ఇది పసుపు రంగు గల కాంతివంతమైన లోహం.

*  దీన్ని సులభంగా వంచవచ్చు.

గాలిలో ఏ విధమైన మార్పు చెందదు. ఇది ఆమ్లాలతో చర్య జరపదు. ద్రావణంలో కరుగుతుంది.

బెరీలియం

అణుశక్తి కర్మాగారాల్లో న్యూట్రాన్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు.

మెగ్నీషియం, అల్యూమినియంతో మిశ్రమ లోహాన్ని విమాన భాగాల తయారీలో ఉపయోగిస్తారు. 

Posted Date : 09-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌