• facebook
  • whatsapp
  • telegram

సమాజంలో 'మధ్యతరగతి'

  సామాజిక జీవన క్రమంలో మధ్య తరగతి అనే మాట వినని వారుండరు. వీరి జీవితమంతా మధ్యస్థమే.. అసలు మధ్య తరగతి వారంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సంక్లిష్టంగా ఉంటుంది. మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉండేది మధ్య తరగతి ప్రజలే. ఆదాయం, సామాజిక జీవనం తదితర లెక్కల ఆధారంగా రకరకాలుగా వీరిని విశ్లేషించవచ్చు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో సోషల్ ఎక్స్‌క్లూజన్ సబ్జెక్టులోని ప్రధానాంశాల్లో మధ్య తరగతి ఒకటి.
మధ్యతరగతి అనే పదాన్ని నిర్వచించడం ఒక రకంగా సంక్లిష్టమైన ప్రయత్నం. సాంఘిక హోదా, వార్షికాదాయం, సామాజిక లక్షణాల ఆధారంగా 'మధ్యతరగతి' అనే సాంఘిక సమూహాన్ని వర్ణించవచ్చు.
* 'సాంఘిక హోదా' కోణంలో చూస్తే.. మధ్యతరగతిని సామాజిక గుర్తింపు అధికంగా ఉన్న వృత్తిదారుల సమూహంగా భావించవచ్చు.
* కేంబ్రిడ్జ్ నిఘంటువు (డిక్షనరీ) నిర్వచనం ప్రకారం.. 'విద్యాధికులైన వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు మొదలైన వారి సమూహం. మంచి ఉద్యోగంతోపాటు చెప్పుకోదగిన ఆదాయం కలిగినవారు.' (పట్టిక - 1 చూడండి)

సామాజిక భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ కోణంలో మధ్యతరగతిని ముఖ్య ఆదాయ తరగతిగా విశ్లేషించారు. ఆదాయంతో సంబంధం లేకుండా వివిధ సామాజిక పరివర్తనలు, ప్రక్రియల్లోని ప్రబల భాగస్వామ్యం ఆధారంగా 'సామాజిక మధ్యతరగతి'ని నిర్వచించవచ్చనే అభిప్రాయం కూడా ఉంది.

* సంప్రదాయ, ఆధునికతకు మధ్య పరివర్తన దశల్లో ప్రతిబింబించే సామాజిక వర్గమే మధ్యతరగతి వర్గం. వివిధ సామాజిక అంశాల్లో 'పరిపక్వత' స్థాయిని ప్రామాణికంగా తీసుకుని ఈ విధమైన సామాజిక విభజన చేశారు. (పట్టిక - 2 చూడండి)

 

మధ్యస్థమే..

మధ్యతరగతి అనేది అటు సంప్రదాయ, ఇటు ఆధునికతకు మధ్య రకంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఆధునిక లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నట్లే ఉన్నా.. మరికొన్ని సందర్భాల్లో 'ఆధునికత' అదృశ్యమై సంప్రదాయం ప్రాబల్యం వహిస్తున్నట్లుగా ఉంటుంది. ఒక రకంగా 'మధ్యతరగతి' వర్గం సంప్రదాయ, ఆధునికతల సమ్మేళనంగా ఉంటుంది.
* ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో 2001-2011 మధ్య జరిగిన ఆర్థిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 'పీఈడబ్ల్యూ రిసెర్చ్ స్టడీ' జరిపిన అధ్యయనాల ప్రకారం... భారతదేశంలో 'మధ్య ఆదాయ తరగతి' సామాజిక చట్రంలో ఏ విధంగా ప్రతిబింబిస్తుందో పట్టిక-3లో చూడవచ్చు.


మధ్యతరగతి లక్షణాలు

* దేశంలోని మొత్తం ప్రజానీకంలో వీరిదే మెజారిటీ వాటా. దాదాపు 80% మంది ఈ వర్గానికి చెందినవారే.
* గత దశాబ్ద కాలంలో దిగువ మధ్యతరగతిలోనే పెరుగుదల అధికంగా కనిపిస్తోంది (సుమారు 14%).
* ఆర్థిక సంస్కరణల ఫలితంగా పేదరికం తగ్గినా, ఆర్థిక వ్యవస్థలో దాని ప్రభావం ఆశించిన స్థాయిలో ధనాత్మకంగా రాణించలేదు.
* సామాజికంగానూ మధ్యతరగతి కుటుంబాల సంఖ్య అధికమే.
* కుటుంబ పరిమాణం రీత్యా మధ్యతరగతి కుటుంబాల్లోనే సభ్యుల సంఖ్య ఎక్కువ.
* మిగిలిన రెండు సామాజిక వర్గాలతో పోలిస్తే సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, పట్టింపులు ఈ వర్గంలోనే ఎక్కువ. ఉల్లంఘన కూడా అదే స్థాయిలో ఉంటుంది.
* పరిమిత వనరులు, అపరిమిత ఆశలతో అసంతృప్తికి గురవుతూ ఉంటారు.
* కుటుంబ వ్యవస్థలో సంఘర్షణ ఎక్కువ. విడాకుల రేటు కూడా మిగిలిన రెండు సామాజిక వర్గాల కంటే ఎక్కువే.
* సామాజిక విషయాల పట్ల అతి త్వరగా స్పందిస్తారు. ఏకీభవించే అంశాలు మాత్రం కనిపించవు. సామాజిక సమస్యల పట్ల విభిన్నత, ఏకీకరణ, పునరేకీకరణ లాంటి ప్రక్రియలు తరచూ జరుగుతూ ఉంటాయి.

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌