• facebook
  • whatsapp
  • telegram

గజనీ మహమ్మద్‌ దండయాత్రలు

గజనీ మహమ్మద్‌ లక్ష్యాలు 


 భారతదేశంలో విగ్రహారాధనను నిర్మూలించి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం.


 ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడం. అపార ధనాన్ని కొల్లగొట్టడం.


దండయాత్రలు (క్రీ.శ. 1000- 1026) 


 క్రీ.శ. 1000లో కైబర్‌ కనుమలోని కొన్ని కోటలు, పట్టణాలను ఆక్రమించాడు.


 క్రీ.శ. 1001లో భారత్‌లోకి ప్రవేశించి పెషావర్‌ పాలకుడైన జయపాలుడ్ని ఓడించి, బందీగా చేసుకున్నాడు. ఇతడ్ని విడుదల చేయడానికి పెద్ద మొత్తం వసూలు చేశాడు.


 క్రీ.శ. 1003లో భాటియా రాజ్యంపై దాడి చేసి, ‘బిజయ్‌ రాయ్‌’ని ఓడించి, అనేకమందిని ఇస్లాంలోకి మార్చాడు.


 క్రీ.శ. 1006లో సింధూ నదిని దాటి ముల్తాన్‌పై దాడి చేసి, ఫతేదావూద్‌ను బంధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. దీనికి శుక్రపాలుడ్ని రాజుగా చేశాడు. శుక్రపాలుడ్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, అతడి పేరును నవాపాషాగా మార్చాడు.


 మహమ్మద్‌ గజనీకి వెళ్లాక ‘నవాపాషా’ ఇస్లాంను విడిచిపెట్టాడు. దీంతో గజనీ క్రీ.శ.1007లో నవాపాషాపై దండెత్తి, ఓడించి జీవితఖైదు విధించాడు.


 తర్వాత గజనీ దృష్టి హింద్‌ షాహీపై పడింది. ఆనందపాలుడు గజనీని ఎదుర్కొనేందుకు ఉజ్జయిని, గ్వాలియర్, కలంజర్, కనౌజ్, ఢిల్లీ పాలకులతో కలిసి ఒక సమాఖ్యను ఏర్పరిచాడు. క్రీ.శ. 1008లో మహమ్మద్‌ వీరందరిని ‘రోహింద్‌’ యుద్ధంలో ఓడించాడు. నాగర్‌కోట, నారాయణపూర్‌లను దోచుకున్నాడు. 


 క్రీ.శ. 1009లో నాగర్‌కోటను ఆక్రమించాడు.


 క్రీ.శ. 1010లో రెండోసారి ముల్తాన్‌పై దాడి చేశాడు.


 ఆనందపాలుడు తన రాజధానిని వైహిద్‌ నుంచి నందనంకు మార్చాడు. ఇతడి తర్వాత త్రిలోచనపాలుడు రాజయ్యాడు. ఇతడు బుందేల్‌ఖండ్‌ పాలకుడు చందేల వంశానికి చెందిన విద్యాధరుడితో కలిసి గజనీపై దండయాత్రలు సాగించాడు. గజనీ క్రీ.శ. 1014లో త్రిలోచనపాలుడ్ని ఓడించి, నందనాన్ని ఆక్రమించాడు. దీంతో హింద్‌ షాహీ వంశం అంతమైంది.


 క్రీ.శ. 1014లో గజనీ స్థానేశ్వరంపై దాడి చేశాడు. చక్రస్వామి దేవాలయాన్ని దోచుకుని, ధ్వంసం చేశాడు. క్రీ.శ. 1015, 1021లో కశ్మీర్‌పై దాడులు చేశాడు.


 క్రీ.శ. 1018లో కృష్ణుడి జన్మస్థలంగా పిలిచే మధుర నగరాన్ని ధ్వంసం చేశాడు. అక్కడి నంచి అపార సంపదను దోచుకున్నాడు.


 మధుర నుంచి గజనీ కనౌజ్‌ వైపు వెళ్లాడు. రాజ్యపాలుడ్ని ఓడించి, ఆ నగరాన్ని నాశనం చేసి, అపార సంపద దోచుకున్నాడు.


 బుందేల్‌ఖండ్‌ పాలకుడైన విద్యాధరుడుకి రాజ్యపాలకుడికి మధ్య వైరం ఉండేది. గజనీ కనౌజ్‌ను దోచుకున్నాక, విద్యాధరుడు రాజ్యపాలుడిపై దండెత్తి అతడ్ని చంపాడు. 


 మహమ్మద్‌ గజనీ విద్యాధరుడిపై దాడిచేసినా విజయం సాధించలేదు. గజనీ ఓడించలేకపోయిన ఏకైక రాజపుత్రుడు విద్యాధరుడే.


 క్రీ.శ. 1019లో గజనీ కలంజర్‌ పాలకుడు గోండు


రాజుపై దండెత్తి అపార సంపదను దోచుకున్నాడు. క్రీ.శ. 1021-22లో మళ్లీ దండెత్తగా సంధి చేసుకుని ధనం అప్పగించాడు.


 క్రీ.శ. 1026లో గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయంపై గజనీ దాడి చేశాడు. అన్హిల్‌వాడ పాలకుడైన సోలంకి వంశానికి చెందిన భీమదేవుడ్ని ఓడించి దేవాలయాన్ని దోచుకున్నారు. మళ్లీ క్రీ.శ.1027లో సింధ్‌లోని జాట్‌లను ఓడించి, సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకుని అపార ధనరాశులతో గజనీకి వెళ్లాడు. 


 గజనీ మహమ్మద్‌  క్రీ.శ.1030లో మరణించాడు.


గజనీ మహమ్మద్‌ ఘనత 


 ఇతడ్ని ప్రపంచ నాయకుల్లో ఒకడిగా చరిత్రకారులు పేర్కొన్నారు. 


 కేవలం దండయాత్రలే కాకుండా సాహిత్య, కళాపోషణకు ఇతడు ప్రాధాన్యం ఇచ్చాడు. 


 ఇతడు భారతదేశంలో తన శక్తినంతా విధ్వంసక చర్యలకే వినియోగించాడు. ఇక్కడ దోచుకున్న సంపదతో గజనీని ఎంతో అభివృద్ధి చేశాడు. 


 మహమ్మద్‌ తర్వాత ఖుస్రూ మాలిక్‌ చివరి రాజయ్యాడు. మొమిజోద్దీన్‌ మహమ్మద్‌-బీన్‌-సమ్‌ (షిహబుద్దీన్‌ మహమ్మద్‌ ఘోరీ) ఖుస్రూను వధించి రాజయ్యాడు.


క్రీ.శ. 1000లో భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు


 గజనీ మహమ్మద్‌ భారతదేశంపై దండెత్తే నాటికి దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. 


 అరబ్‌ దేశానికి ముల్తాన్, హింద్‌ షాహీ సరిహద్దు రాజ్యాలు. ముల్తాన్‌ పాలకుడు ఫతేదావూద్‌. 


 షాహీ రాజ్యం పంజాబ్‌లో జీలం నది వరకు విస్తరించింది. దీని రాజధాని వైహిద్‌ లేదా ఉద్భందాపూర్‌. దీన్ని ఆనందపాలుడు పాలించేవాడు. ఇతడు రాజపుత్రుడు. 


 కశ్మీర్‌ సంగ్రామ రాజు అధీనంలో ఉండేది. కనౌజ్‌ను పార్థియన్‌ రాజు రాజ్యపాలుడు పాలించేవాడు.


 బెంగాల్‌ను పాల వంశానికి చెందిన మహిపాలుడు పాలించేవాడు. రాజస్థాన్‌లోని మాళ్వాకు భోజుడు రాజు. ఇతడి రాజధాని ఉజ్జయిని. 


 గుజరాత్‌ను సోలంకి వంశానికి చెందిన భీమదేవుడు పాలించేవాడు. ఇతడి రాజధాని అన్హిల్‌వాడ. 


 బుందేల్‌ఖండ్‌ చందేల వంశ రాజు విద్యాధరుడి అధీనంలో ఉండేది. 


 దక్షిణ భారతదేశాన్ని చోళ పాలకుడు రాజేంద్ర గంగైకొండ చోళుడు పాలించేవాడు. ఇతడి రాజధాని తంజావూరు. ఇతడు ఉత్తర భారతదేశంపై ఎక్కువగా దృష్టిసారించలేదు.


మహమ్మద్‌ గజనీ (క్రీ.శ. 978 - 1030) 


 సుబక్తజిన్‌ తర్వాత అతడి కుమారుడు మహమ్మద్‌ రాజయ్యాడు. 


 ఖలీఫా ఖాదిర్‌ బిలాబ్‌ ఇతడికి యామిన్‌ ఉద్దౌలా, అమన్‌ ఉల్‌మిల్లత్‌ అనే బిరుదులు ఇచ్చాడు. 


 మహమ్మద్‌ చేసిన దండయాత్రలన్నింటినీ అతడి ఆస్థాన చరిత్రకారుడు ‘ఉద్బి’ రికార్డు చేశాడు. ఇతడు భారతదేశంపై పవిత్ర యుద్ధం (జిహాద్‌) చేసి విగ్రహారాధనను నాశనం చేసి, అపార ధనాన్ని దోచుకున్నట్లు ఉద్బి పేర్కొన్నాడు. 


 మహమ్మద్‌ భారతదేశంపై 12 సార్లు 17 దండయాత్రలు చేసినట్లు ఉద్బి చెప్పగా, ఇతడు భారత్‌పై 17 యుద్ధాలు చేసినట్లు సర్‌ హెన్రీ ఎలియట్‌ తెలిపారు. 


 ఖలీఫా ఖాదిర్‌ ప్రోత్సాహంతో ఇతడు ఏటా భారతదేశంపై దండెత్తాడు.


దండయాత్ర ఫలితాలు


 హింద్‌ షాహీ వంశం పతనమైంది. పంజాబ్, ముల్తాన్‌ గజనీ రాజ్యభాగాలయ్యాయి. ప్రతీహార రాజ్యం కూడా కనుమరుగైంది.


 ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ నగరాలన్నీ నిర్వీర్యమయ్యాయి. పవిత్ర దేవాలయాలైన మధుర, కనౌజ్, సోమనాథ్, నాగర్‌కోట నాశనమయ్యాయి. దోచుకున్న సంపదనంతా మహమ్మద్‌ తన రాజ్య అభివృద్ధికి వెచ్చించాడు. అక్కడ అందమైన వనాలు, సమాధులు, కళాశాలలు, మసీదులు నిర్మించాడు. అల్‌బెరూనీ, ఉన్సూరి, పుక్రి, ఉద్బి, ఫిర్దౌసి లాంటి గొప్ప కవులు గజనీ ఆస్థానాన్ని ఆశ్రయించారు. ఫిర్దౌసి ‘షానామా’ అనే గ్రంథాన్ని రచించాడు. గజనీ సామ్రాజ్యం ఇరాక్, కాస్పియన్‌ సముద్రాల నుంచి గంగానది వరకు విస్తరించింది. 


 భారతదేశంలో తురుష్కుల రాజ్యస్థాపనకు గజనీ కారణమయ్యాడు. 


 ఇతడి దండయాత్రలన్నీ భారతదేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా జరిగాయి తప్ప సామ్రాజ్య స్థాపన దిశగా సాగలేదు. మత మార్పిడికి పాల్పడ్డాడు కానీ ఇస్లాం మతవ్యాప్తికి కృషి చేయలేదు. పంజాబ్, ముల్తాన్‌లను ఆక్రమించి తురుష్కుల పాలనకు నాంది పలికాడు.


 ఈ దాడుల తర్వాత కూడా భారతదేశ రాజులు సైనిక శక్తిని పెంచుకోలేదు.


 భారతదేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. భారతీయ శిల్పకళకు నష్టం వాటిల్లింది.


గజనీ రాజ్యం


 తురుష్కులు ఇస్లాంను స్వీకరించి, ఆ మత వ్యాప్తిని చేపట్టారు. 10వ శతాబ్దంలో ఖలీఫాల ప్రాబల్యం తగ్గాక, తురుష్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. 


 గజనీ కేంద్రంగా క్రీ.శ.962లో అలప్తజిన్‌ తురుష్క సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. అతడి వారసుడు సుబక్తజిన్‌. 


 సుబక్తజిన్, హింద్‌ షాహీ రాజ్య పాలకుడు ఆనందపాలుడికి మధ్య వివాదాలు ఉండేవి. 


 సుబక్తజిన్‌ రాజపుత్రుల నుంచి పెషావర్‌ను ఆక్రమించుకున్నాడు. ఇతడికి ‘మిర్‌-ఉల్‌-అయాని’ అనే బిరుదు ఉంది.


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌