• facebook
  • whatsapp
  • telegram

పూర్వ చారిత్రక యుగం

  పరిణామ క్రమంలో మానవ సాంస్కృతికాభివృద్ధి చరిత్ర 10 వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. మొత్తం ప్రపంచం భౌతికాభివృద్ధిని వర్ణించడానికి 80 కి.మీ. కాగితాన్ని ఉపయోగిస్తే, దానిపై మానవ పరిణామ ప్రగతి కేవలం 10 సెం.మీ. మాత్రమే ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. ఇది ప్రపంచ వయోపరిణామంలోని 10 లక్షల విభాగంలో ఒకటిగా వర్ణించారు. ప్రపంచ మానవ చరిత్రను మూడు విభాగాలుగా అధ్యయనం చేయవచ్చు.
1. పూర్వ చారిత్రక యుగం (ఆదిమ చరిత్ర): పూర్వ చారిత్రక యుగానికి లిఖిత ఆధారాలు లేవు. దీన్ని ప్రిహిస్టరీ
అంటారు.

2. సంధి కాలపు చారిత్రక యుగం: దీన్ని ప్రోటో హిస్టరీ అంటారు. ఇది రెండు యుగాల మధ్యకాలం.

3. చారిత్రక యుగం (హిస్టారిక్ కాలం): దీనికి లిఖిత ఆధారాలున్నాయి.
* పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి లిఖిత ఆధారాలు లేవు. అయితే పురావస్తు, మానవ శాస్త్రాలు దీన్ని గురించి తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి.
* చారిత్రక యుగాన్ని ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని 3 విభాగాలుగా అధ్యయనం చేస్తారు. ఈ విభజన మానవ చరిత్రకు కూడా వర్తిస్తుంది.
* ప్రాచీన కాలంలో మానవుడు నివసించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడాన్ని 'ఉత్ఖాతనం' అంటారు. తవ్వకాలను గురించి తెలిపే శాస్త్రాన్ని పురావస్తుశాస్త్రం అంటారు. ఉదా: ఈజిప్ట్‌లో పిరమిడ్ల ఉత్ఖాతనాలు అక్కడి ప్రాచీన నాగరికతా విశేషాలు తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి.
* సింధు, ఈజిప్ట్, మెసపటోమియా నాగరికతలు ఒకే కాలానికి చెందుతాయి. (సమకాలీనమైనవి)
* నాగార్జునకొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతనాలు క్రీ.శ 3వ శతాబ్దం నుంచి ఇక్ష్వాకుల కాలం నాటి నాగరికతను తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి.

 

మానవశాస్త్రం

  ఇది ప్రాచీన చరిత్ర రచనకు బాగా తోడ్పడుతుంది. వివిధ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో వేలాది సంవత్సరాల కిందట జీవించిన మానవుల అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు, దంతాలు బయటపడ్డాయి. భూమి పైపొరల్లో లభించిన శిలాజాలు, ప్రాచీన కాలం నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ మానవ చరిత్రకు అతివిలువైన సాక్ష్యాధారాలు. రేడియో కార్బన్ల నిష్పత్తి కాల నిర్ణయానికి తోడ్పడుతుంది.

 

భూమిపై ప్రాణికోటి ఆవిర్భావం:
ప్రపంచంలోని ప్రాణులన్నీ భూమిపైనే జీవిస్తాయి. భూమి సూర్యగోళం నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది. దీనిపై ఆవిర్భవించిన మొదటి ప్రాణి లార్వా. ఆ తర్వాతిది 'ప్లాజిలెట్టా'. కాలక్రమంగా వృక్ష, జంతుజాలం, చివరగా మానవుడు ఆవిర్భవించాడు.

 

మానవ జీవిత పరిణామ దశలు:

  మానవ జీవితంలో ఆస్ట్రోపిథికస్, రామాపిథికస్, హోమోఎరక్టస్, నియోన్‌డెర్తల్ అనే పరిణామ దశలున్నాయి. మనిషిని పోలిన ఈ ప్రాణులు క్రీ.పూ. 1,40,000 - 4000 కు పూర్వం జీవించి ఉండేవి.
* హోమోసెపియన్స్ అనే తెగవారు ఆధునిక మానవుడికి సమీప పూర్వీకులు. వీరిని క్రోమాగ్నన్లు అని కూడా పిలుస్తారు. వీరు 20 వేల సంవత్సరాల పూర్వం ఉండేవారు. వీరు గీసిన గుహచిత్రాలు వారి అనుభవాలను తెలియజేసేవి. మానవుడి నాగరికత పరిణామ క్రమం రాతియుగంతో ఆరంభమైంది.
* రాతియుగాన్ని 3 దశలుగా విభజించారు. అవి: పాతరాతి యుగం, మధ్యశిలా యుగం, కొత్తరాతి యుగం.

 

పాతరాతి యుగం

  పాతరాతి యుగం (క్రీ.పూ. 2,50,000 - 10,000)లో మానవుడి ముఖ్య వృత్తి ఆహార సేకరణ. రాతితో పనిముట్లు తయారు చేశాడు. ఈ యుగాన్ని ఆంగ్లంలో పాలియోలిథిక్ యుగం అంటారు. పాలియో అంటే పాత, లిథిక్ అంటే రాయి అని అర్థం. ఈ యుగంలో మానవుడు గుహల్లో నివసించేవాడు. జంతువుల చర్మాలతో శరీరాన్ని కప్పుకునేవాడు. దేశ దిమ్మరిగా జీవిస్తూ ఉండేవాడు. తన అనుభవాలను బొమ్మల రూపంలో చిత్రించేవాడు.

* ఈ యుగానికి చెందిన ప్రదేశాలు మధ్యప్రదేశ్‌లోని బింబేల్కా, పంజాబ్‌లోని సోన్‌నది లోయ, ఉత్తర్ ప్రదేశ్‌లోని భేలాని ప్రాంతాల్లో వెలుగుచూశాయి.

 

మధ్యశిలా యుగం

  పాతరాతి యుగానికి, కొత్తరాతి యుగానికి మధ్య ఉన్న కాలాన్ని మధ్యశిలా యుగం (క్రీ.పూ. 8000 - 6000) అంటారు. ఈ యుగంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఆలోచన, విచక్షణాజ్ఞానం పెరిగాయి. మానవుడు నిప్పును ఉపయోగించడం తెలుసుకున్నాడు. ఈ కాలానికి చెందిన మానవులు చిన్న సామాజిక వర్గాల్లో నివసించారు. ఫలితంగా సాంఘిక సంబంధాలు బలపడ్డాయి. సాంఘిక నిబంధనలు ఏర్పడ్డాయి. ఆంగ్లంలో ఈ యుగాన్ని మియోలిథిక్ యుగం అంటారు. మియో అంటే మధ్య, లిథిక్ అంటే రాయి అని అర్థం.
* ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి లోయ, బిహార్‌లో బిర్బార్‌పూర్ మొదలైన ప్రాంతాల్లో ఈ కాలానికి చెందిన అవశేషాలు బయటపడ్డాయి.

 

కొత్త రాతి యుగం

  కొత్తరాతి యుగాన్నే (క్రీ.పూ. 6000 - 1000) 'నవీన యుగం' అంటారు. దీన్నే ఆంగ్లంలో నియోలిథిక్ యుగం అంటారు. నియో అంటే కొత్త, లిథిక్ అంటే రాయి అని అర్థం. ఈ యుగంలో పరికరాలు, పనిముట్ల నాణ్యత పెరిగింది. మానవులు ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. వ్యవసాయం, పశుపోషణ చేపట్టారు. చక్రాన్ని కనుక్కున్నారు. మట్టి కుండలను కాల్చడం ఆరంభించారు. ఇది రసాయనిక శాస్త్ర అధ్యయానికి తొలిమెట్టు. చేనేత కళ ఆరంభం, పత్తి పంటను పండించడం భౌతిక, వృక్షశాస్త్రాల అభ్యాసానికి దారితీశాయి. వస్తుమార్పిడి పద్ధతి వ్యాపార వాణిజ్యాలకు మార్గదర్శకమైంది. చక్రం ఆవిష్కరణ వల్ల ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. పూజారులను దేవతలు, మానవులకు మధ్యవర్తులుగా భావించేవారు. నవీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్లు టెక్కలి కోట, మస్కి, సింగనకల్లు, ఉట్నూరు మొదలైన ప్రాంతాల్లో లభించాయి.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌