• facebook
  • whatsapp
  • telegram

వర్షాలు - వర్షపాత విస్తరణ - వరదలు - నివారణ

తూర్పున‌ కుండపోతలు.. పశ్చిమాన ఎదురుచూపులు!


వ్యవసాయం, తాగునీరు తదితర అనేక రకాల ప్రయోజనాలకు అవసరమైన నీటిని అందించే ప్రధాన ఆధారం వర్షపాతం. దాని విస్తరణను అనుసరించి ఆర్థిక వ్యవహారాలు సహా అన్ని రకాల కార్యకలాపాలు సాగుతుంటాయి. నైరుతి రుతుపవనాల ద్వారా మన దేశంలో అత్యధికంగా నమోదయ్యే వర్షపాతం తీరాల నుంచి అంతర్భాగానికి, తూర్పు నుంచి పడమరకు వెళుతున్న కొద్దీ తగ్గుతూ పోతుంది. ఇక్కడ కుండపోతలు కురిస్తే, అక్కడ చినుకుల కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి. దాంతోపాటు కుంభవృష్టి, తుపానులు, మేఘాల విస్ఫోటాల వల్ల వరద విపత్తులూ సంభవిస్తుంటాయి. వర్షపునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడంతోపాటు, వరదల నివారణకు అనివార్యంగా చేపట్టాల్సిన చర్యల గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

ఒక దేశ ఆర్థిక పరిస్థితిని, ఒక ప్రాంత శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాల్లో వర్షపాతం ప్రధానమైనది. వర్షాధారిత వ్యవసాయం ఎక్కువగా జరిగే మన దేశంలో వర్షాలు సకాలంలో పడితే పంటలు బాగా పండుతాయి. దేశంలో నైరుతి రుతుపవనాలు 85% వర్షపాతం ఇస్తున్నాయి. రుతుపవనాల వల్ల సంభవించే వర్షపాతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించిన పర్వతాలు, కొండలపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలకు అభిముఖంగా ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా, కొండలకు అవతల వైపు ఉన్న ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. దేశంలో వర్షపాతం కేవలం రుతుపవనాల వల్లే కాకుండా తుపానులు, సంవహన వర్షపాతం (వేసవిలో) వల్ల కూడా సంభవిస్తుంది. శీతాకాలంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది.

విస్తరణ: భారతదేశంలో వర్షపాత విస్తరణలో వ్యత్యాసం ఎక్కువ. దేశ సంవత్సరిక సగటు వర్షపాతం 118 సెం.మీ. కాగా, ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని చిరపుంజి, మాసిన్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక వార్షిక సగటు వర్షపాతం (సుమారు 1100 సెం.మీ.) ఉంటుంది. పశ్చిమాన రాజస్థాన్‌ ఎడారి ప్రాంతంలో వార్షిక సగటు వర్షపాతం 15 సెం.మీ. లోపే ఉంది.

* వర్షాకాలంలో నెలల వారీగా పరిశీలిస్తే జులై, ఆగస్టుల్లో ఎక్కువగా; జూన్, సెప్టెంబరుల్లో తక్కువగా వర్షపాతం నమోదవుతోంది. (జూన్‌ - 14%, జులై - 24%, ఆగస్టు - 21%, సెప్టెంబరు - 14.5%). డిసెంబరు, జనవరిల్లో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది.

* రుతువుల వారీగా నైరుతి రుతుపవన కాలంలో అత్యధికంగా (75-80%), ఈశాన్య రుతుపవన కాలంలో తక్కువగా (15-20%), శీతాకాలం, వేసవి కాలాల్లో స్వల్పంగా (5-10%) వర్షపాతం సంభవిస్తుంది.

* పశ్చిమ తీరంలోని తిరువనంతపురం - ముంబయి ప్రాంతం, పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా భాగాల్లో అత్యధిక వర్షపాతం (200 సెం.మీ. కంటే ఎక్కువ) నమోదవుతుంది.

* ఉత్తర భారత మైదానాలు, సబ్‌ హిమాలయాలు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతం, కోరమాండల్‌ ప్రాంతం, పశ్చిమ కనుమల్లో కొంత భాగం, మణిపుర్, ఉత్కళ్‌ తీరం, బెంగాల్, అమర్‌ కంటక్‌ పీఠభూమి, ఛత్తీస్‌గఢ్, నాగ్‌పుర్‌ పీఠభూమి ప్రాంతం సాధారణ వర్షపాతం (100-200 సెం.మీ.) పడే ప్రాంతాలు.

* దక్కన్‌ పీఠభూమి, గుజరాత్, మాల్వా పీఠభూమి, ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతం, పంజాబ్, హరియాణా, జమ్ము- కశ్మీర్‌ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం (50-100 సెం.మీ.) నమోదవుతుంది. రాజస్థాన్‌ పశ్చిమ ప్రాంతం, దక్కన్‌ పీఠభూమిలో కొన్ని ప్రాంతాలు, లద్దాఖ్‌ (శీతల ఎడారి)లో అత్యల్ప వర్షపాతం (50 సెం.మీ. కంటే తక్కువగా) నమోదవుతుంది.

మన దేశంలో వర్షపాతం ప్రాథమికంగా పర్వతీయ వర్షపాత రకానికి చెందింది. తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్లే కొద్దీ, అలాగే తీర ప్రాంతాల నుంచి అంతర్భాగాలకు వెళ్లే కొద్దీ తగ్గుతూ పోతుంది. దేశంలో సగటున వర్షం కురిసే రోజులు 40-45. ఈ సగటు ఈశాన్య ప్రాంతంలో 180 రోజులు ఉంటే, రాజస్థాన్‌లో కేవలం 20 రోజులే.


వరదలు 

మన దేశం ఏటా ఎదుర్కొంటున్న విపత్తుల్లో వరదలు ఒకటి. వీటికి ప్రధాన కారణాలు వాతావరణం, భూఉపరితల లక్షణం, మానవ కార్యకలాపాలు. వాతావరణ సంబంధ కారణాల్లో అత్యధిక వర్షపాతం, కుంభవృష్టి, ఉష్ణమండల తుపానులు, మేఘాల విస్ఫోటం (క్లౌడ్‌ బరస్ట్‌) మొదలైనవి. నైరుతి రుతుపవన కాలంలో తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం వరదలకు దారితీస్తోంది. దేశంలో ఉత్తర మైదానాలు పెద్ద నదీ పరీవాహక ప్రాంతాలు కావడం, తక్కువ వాలు, నదీ ప్రవాహం మార్గం తక్కువగా ఉండటం, నీటిపారుదల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి భౌగోళిక కారణాలు ఇక్కడ వరదలకు కారణమవుతున్నాయి.

 * 2006, జులైలో జోధ్‌పుర్‌ - బార్మర్‌ ప్రాంతంలో మేఘాల విస్ఫోటం, డ్రైనేజీ సరిగా లేకపోవడం వంటి కారణాలతో వరదలు వచ్చాయి. 2005, జులైలో ముంబైలో వరదలకు స్థానిక మేథీ నదిలోని ఇళ్లు, నిర్మాణాలే కారణమయ్యాయి. హైదరాబాద్‌లో మూసీ పరీవాహక ప్రాంతంలోనూ చెరువుల ఆక్రమణలు, డ్రైనేజీ నిర్వహణ లోపాలు వరదలకు దారితీస్తున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాలు: దేశంలో సుమారు 13.6% భూభాగాన్ని వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. (2012 లెక్కలు)

గంగా నదీ పరీవాహక ప్రాంతం: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు రాజస్థాన్‌లోని కొద్ది ప్రాంతం గంగా నది వరదలకు గురవుతోంది. హిమాలయాల్లో మంచు కరగడం, వర్షాకాలంలో కుంభవృష్టి వంటి కారణాలతో నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగి పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. దేశంలోని వరద ప్రభావిత భూభాగంలో 22% శాతం ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉంది. గంగా నది ఎడమవైపు ఉండే ఉపనది ‘కోసీ’ 2008, జులైలో బిహార్‌ను ముంచెత్తి తీవ్రనష్టం కలగజేసింది. కోసీ నదిని బిహార్‌ దుఃఖదాయినిగా పిలుస్తారు.

* మేఘ విచ్ఛేదనం (క్లౌడ్‌ బరస్ట్‌) కారణంగా 2013, జూన్‌లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరద విపత్తు సృష్టించింది.

* పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, మధ్య ప్రాంతాలు నైరుతి రుతుపవనాల కాలంలో వరదల బారిన పడుతున్నాయి. మహనంద, భాగీరథి, అజోయ్, దామోదర్‌ నదీ ప్రవాహాలు బెంగాల్‌ను తరచూ ముంచెత్తుతున్నాయి. దామోదర్‌ నదిని బెంగాల్‌ దుఃఖదాయినిగా పిలుస్తారు.

బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాలు: దేశంలో తీవ్రమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం లోయ ప్రాంతం ఒకటి. ఇందులోనూ ఘోరమైన వరదలు వచ్చే ప్రాంతాలు ‘మజులి’ ద్వీపం (దేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపం), దుబ్రి, కోక్రాజార్, బార్‌పేట, గౌహతి, మంగల్‌డోయ్, సిబ్‌సాగర్, జోర్‌హట్, డిబ్రుఘర్, తేజ్‌పుర్‌. అస్సాం రాష్ట్రంలో సుమారు 45% వరద ప్రభావిత ప్రాంతమే.

పంజాబ్‌ - హరియాణా వరద ప్రభావిత ప్రాంతం: ఇక్కడి సట్లెజ్, బియాస్, గగ్గర్, మార్ఖండా నదులు ఏటా వరదలను సృష్టిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని గగ్గర్‌ మైదానంలో తరచూ వరదలు వస్తుంటాయి. వర్షాధార నది అయిన గగ్గర్‌ పంజాబ్, హరియాణా తర్వాత రాజస్థాన్‌లోని ఇసుక దిబ్బల్లో చేరి మాయమవుతుంది. కశ్మీరు లోయలో జీలం, జమ్ములో తావి నదుల వల్ల వరదలు వస్తాయి.

కోస్తా, తీర ప్రాంతాలు:  ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ ఈ కోవలోకి వస్తాయి. మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ లోతట్టు ప్రాంతాలు తరచూ వరదల బారిన పడుతున్నాయి. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో చెట్లు నరికేయడం వల్ల భూమి నిస్సారమై, నేల కోత ఏర్పడుతూ ప్రవాహ మార్గం ఇసుక మేటలతో నిండిపోవడమే వరదలకు కారణం. సముద్రంలో తుపానులు, సునామీల కారణంగా తీరప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదల్లో మునిగిపోతాయి.
 

నివారణ చర్యలు

వరద అంచనా: కేంద్ర జలసంఘం 1958 నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తోంది. మొదటి వరద అంచనా కేంద్రాన్ని దిల్లీలోని పురాతన రైల్వే వంతెన వద్ద నెలకొల్పారు. తర్వాత దేశమంతటా విస్తరించారు. ప్రస్తుతం దేశంలో వరద ప్రవాహ అంచనా కేంద్రాలు 199 ఉన్నాయి. ఇవి రోజువారీ వరద ప్రవాహాన్ని అంచనా వేసి హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తుంటాయి.

ప్రవాహం తగ్గింపు: వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకే విధంగా చేయడం, పరీవాహక ప్రాంతంలో అడవులను పెంచడం ద్వారా వరద ప్రవాహాన్ని తగ్గించవచ్చు.

రిజర్వాయర్లు - ఆనకట్టల నిర్మాణం: రిజర్వాయర్లు, ఆనకట్టలు నిర్మించి ప్రవాహాలను నిలిపేసి, వరదను అరికట్టవచ్చు. ఆ నీటిని అవసరమైనప్పుడు పంటలకు, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.

వరద స్థాయి నియంత్రణ: వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద కాల్వలు నిర్మించడం, ఉన్న కాల్వలు మెరుగుపరచడం, వరద మళ్లించడం.

వరద నియంత్రణ కట్టల నిర్మాణం: వరద నియంత్రణకు కరకట్టలు నిర్మించడం, ఎత్తిపోతల పద్ధతి ద్వారా నీటి మట్టాన్ని తగ్గించవచ్చు. దేశంలో సుమారు 12 వేల కి.మీ.ల వరద నియంత్రణకు కరకట్టలు నిర్మించారు.

వరద మైదాన మండలాల గుర్తింపు: ఈ ప్రక్రియలో వరద మైదానాల్లో భూవినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రూపొందిస్తారు. నదులు, కాల్వలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు, వాటి పరీవాహక ప్రాంతాలు వరదలకు ఎక్కువ ప్రభావితమవుతాయి. అలాంటి చోట భవనాలు, ఇతర నిర్మాణాలను నిషేధించాలి. తరచూ వరదలు వచ్చే ప్రాంతాల్లో సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి.
 

జాతీయ వరద నియంత్రణ కార్యక్రమం: 1954లో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. దీనిలో 3 దశలున్నాయి.

తక్షణ చర్య: ఈ దశ 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రాథమిక స్థాయి నీటి ప్రవాహ లెక్కలు సేకరించడం, కరకట్టల నిర్మాణం, నదీ ప్రవాహ మార్గాలను మెరుగుపరచడం, వరద ముంచెత్తే ప్రాంతాల్లోని గ్రామస్థులకు సురక్షిత ప్రదేశాల్లో నివాసం చూపించడం.

స్వల్పకాలిక దశ: ఈ దశ 5 సంవత్సరాలు ఉంటుంది. ఉపరితల నీటిపారుదలను మెరుగుపరచడం, ప్రభావవంతమైన వరద హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు, వరద మళ్లింపు, వరదలు నియంత్రించే కట్టల ఎత్తు పెంచడం మొదలైనవి.

దీర్ఘకాలిక దశ: ఈ దశలో ఆనకట్టలు, పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం, వరద మళ్లింపు మార్గాలు తవ్వడం, భూవినియోగాన్ని మెరుగుపరచడం, ప్రధాన నది, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నేలల సంరక్షణ చర్యలు, అటవీ పెంపకం మొదలైనవి చేపడతారు.

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 22-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌