• facebook
  • whatsapp
  • telegram

జీవసాంకేతిక శాస్త్రాల నవీన అంశాలు, ఆవిష్కరణలు

జికా వైరస్ త్రీడీ నిర్మాణం

ఇండియానాలోని పర్‌డ్యూ విశ్వవిద్యాలయ పరిశోధకులు జికా వైరస్ త్రిమితీయ (3D) నిర్మాణాన్ని కనుక్కున్నారు. ఇది జికా వైరస్ నివారణకు చాలా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరమాణు స్థాయిలో విశేషాలను బయటపెట్టే ఈ త్రిమితీయ జికా వైరస్ నిర్మాణం ఇతర వైరస్‌లతో దీన్ని పోల్చడానికి, సత్వరం వ్యాక్సిన్‌ను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.


జికా వైరస్ క్లోన్

టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యరంగ విభాగం జెనెటిక్ ఇంజినీరింగ్ పద్ధతిలో జికా వైరస్ క్లోన్ (సమరూపజీవి)ను సృష్టించింది. సంపూరక డీఎన్ఏ (Complementary DNA) ను వైరల్ జన్యుపదార్థం నుంచి తయారు చేయడం ద్వారా ఈ వైరస్ క్లోన్‌లను సృష్టించగలిగారు. ఈ వైరల్ జన్యుపదార్థాన్ని అయిదు భాగాలుగా చేసి, ఒక్కోదాన్ని వేర్వేరుగా క్లోనింగ్ చేసి, సంపూర్ణ జికా వైరస్ క్లోన్‌ను సృష్టించారు. జికా వైరస్ నివారణకు ఈ ఆవిష్కరణ కూడా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


నీటిని శుద్ధి చేసే బయోపాలిమర్

మన దేశ శాస్త్రవేత్తలు పర్యావరణానికి హానిచేయని బయోపాలిమర్‌ను నానో టెక్నాలజీ సహాయంతో అభివృద్ధి చేశారు. ఈ బయోపాలిమర్‌ను నీటిని శుద్ధి చేయడానికి, మృదుజలంగా మార్చడానికి ఉపయోగించవచ్చు. అసోంలోని గువహటిలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST) సంస్థ దీన్ని అభివృద్ధి పరిచింది.

* ఈ పర్యావరణ స్నేహపూర్వక (Eco Friendly) జీవ పాలిమర్‌ను 'ఖైటోసాన్' (Chitosan) అనే ప్రకృతి సంబంధ పదార్థంతో తయారు చేశారు. ఈ ఖైటోసాన్‌ను పీతలు, రొయ్యలు లాంటి జీవుల బాహ్య అస్థిపంజరాల నుంచి సంగ్రహిస్తారు.

* అయాన్ వినిమయం ద్వారా ఈ బయోపాలిమర్‌లో ఉన్న అత్యంత సూక్ష్మ కణాలు (Nano Particles) కాల్షియం, మెగ్నీషియంలను నీటి నుంచి వేరుచేస్తాయి. ఇలా నీటిని శుద్ధి చేయడంలో ఇది ఉపకరిస్తుంది. నీటిని శుద్ధి చేయడానికి అందుబాటులోకి వచ్చిన మొదటి జీవ విచ్ఛిత్తి చెందగల పదార్థంగా ఈ బయోపాలిమర్‌ను పేర్కొనవచ్చు.

* ఈ పద్ధతి సంప్రదాయ సింథటిక్ రెసిన్‌లను ఉపయోగించి చేసే నీటి శుద్ధి విధానాల కంటే చాలా మెరుగైంది.


డెంగీ వ్యాధికి టీకాలు

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డెంగీ వ్యాధికి టీకాలు వేసే ప్రజాకార్యక్రమాన్ని ఫిలిప్పైన్స్‌లో ప్రారంభించారు. ప్రపంచంలో ప్రప్రథమ డెంగీ వ్యాక్సిన్‌గా పేరొందిన 'డెంగ్ వాక్సియా' (Deng Vaxia) అనే టీకాను తూర్పు మనీలా ప్రాంతంలోని 9 నుంచి 10 సంవత్సరాల వయసున్న చిన్నారులకు వేశారు.

* 'డెంగ్ వాక్సియా'ను మొదట ఆమోదించిన దేశం - మెక్సికో. అలాగే ఆసియా ఖండంలో మొదటి ప్రజా ఉపయోగ కార్యక్రమంగా డెంగ్యూ వ్యాక్సిన్‌ను ఆమోదించిన దేశంగా ఫిలిప్పైన్స్ నిలిచింది.

* డెంగ్ వాక్సియా (CYD-TDV) ని 'సనోఫిపాశ్చర్' సంస్థ తయారు చేసింది.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా 120 దేశాల్లో 390 మిలియన్ ప్రజలు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ప్రపంచం మొత్తం డెంగీ వ్యాధిగ్రస్తులలో సుమారు 70% మంది ఆసియాలోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

 

బ్రెడ్‌లో క్యాన్సర్ కారకాలు!

రొట్టెల తయారీలో ఉపయోగిస్తున్న పొటాషియం బ్రోమేట్ (KBrO3) ఒక కార్సినోజెనిక్ పదార్థమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) ఇటీవల జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సంస్థ అధ్యయనం చేసిన 84% నమూనాల్లో క్యాన్సర్ కారకాలు, థైరాయిడ్ గ్రంథి ప్రేరేపకాలైన పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్‌లను మోతాదుకు మించి రొట్టెలు, బర్గర్‌లు లాంటిపదార్థాల్లో కలుపుతున్నట్లు తేలింది.

* రొట్టెలు తయారు చేసేటప్పుడు బేకింగ్ సమయంలో KBrO3 ని ఉపయోగిస్తుంటారు. మన దేశంలో దీన్ని 50 ppm పరిమితి వరకు మాత్రమే అనుమతిస్తారు. 1982లో జపాన్ శాస్త్రవేత్తలు మోతాదుకు మించిన KBrO3 క్యాన్సర్‌కు కారణమవుతుందని పేర్కొన్నారు. దీంతో జపాన్, ఆస్ట్రేలియా, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి దేశాలు ఈ పదార్థాన్ని నిషేధించాయి.

* మన దేశంలో కూడా జాతీయ ఆహార గుణాత్మకతను నియంత్రించే 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (FSSAI) పొటాషియం బ్రోమేట్‌ను అనుమతించిన సంకలితాల జాబితా (List of Permitted Additives) నుంచి తొలగించాలని నిర్ణయించింది.

* క్యాన్సర్ అనియంత్రిత కణ విభజనల వల్ల కలుగుతుంది. దీన్నే మాలిగ్నెన్సీ అని కూడా అంటారు. క్యాన్సర్‌ను కలిగించే కారకాలను కార్సినోజెన్స్ అంటారు. ఈ కార్సినోజెన్‌లు మానవుల్లో 'ప్రోటో ఆంకోజీన్స్‌'ను ప్రభావితం చేయడం వల్ల మనిషి క్యాన్సర్ బారిన పడుతుంటాడు. క్యాన్సర్ కణాలు చూపే చలనాన్ని లేదా స్థానభ్రంశాన్ని మెటాస్టాసిస్ అంటారు.

* ఉపకళా కణజాలాలకు వచ్చే క్యాన్సర్‌ను కార్సినోమా అని, కండరాలకు వచ్చే క్యాన్సర్‌ను సార్కోమా అని, తెల్ల రక్తకణాలకు సంక్రమించే క్యాన్సర్‌ను లుకేమియా అని పిలుస్తారు.

* క్యాన్సర్ వ్రణాలు ప్రమాదకరమైనవి. ప్రమాదరహితమైన వ్రణాలను వైద్య పరిభాషలో బినైన్ వ్రణాలుగా పేర్కొంటారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన నివారణ, చికిత్స మొదలైన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు.


ఐపీఆర్ - 2016

భారత ప్రభుత్వం 'జాతీయ మేధో సంపత్తి హక్కుల విధానాలు - 2016'ను (National Intellectual Property Rights - IPR 2016) ఆమోదించింది.
* IPR - 2016 'సృజనాత్మక భారత్; వినూత్న భారత్' (Creative India; Innovative India) అనే నినాదానికి కట్టుబడి ఉంటుంది.


ఎన్‌జీఎస్ పద్ధతిలో తొలి బిడ్డ

నెక్ట్స్ జనరేషన్ డీఎన్ఏ సీక్వెన్సింగ్ (NGS - Next Generaton DNA Sequencing) పద్థతి ద్వారా యునైటెడ్ కింగ్‌డమ్‌లో బియాగియో రూసు (Biagio Russu) అనే బిడ్డ జన్మించింది. పరస్థానిక ఫలదీకరణం (IVF - Invitro Fertilization) పద్ధతిలో ఈ నవీన విధానం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. దీని వల్ల వైద్యులు ఏ పిండాలు సక్రమంగా, సంపూర్ణంగా ఎదిగి ఆరోగ్యవంతమైన బిడ్డలుగా రూపొందుతాయో తెలుసుకోగలుగుతున్నారు. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను ఈ NGS పద్ధతి సాయంతో అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 

ఇసుకను తినే కప్ప..

మిక్రిక్సాలస్ హిరై (Micrixalus Herrei) అనే టాడ్‌పోల్ కప్ప జాతిని మన దేశంలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో కనుక్కున్నారు.

* ఇసుకను తినే ఈ జాతి భూగర్భంలోని బొరియల్లో ఉంటూ, సంపూర్ణంగా అభివృద్ధి చెందిన తర్వాత బయటకు వస్తుంది.

* ఇలా బొరియల్లో ఉండే జీవులు ఉభయచరాల జాతుల్లో అరుదుగా కనిపిస్తాయి.

* ఇవి కాల్షియం కార్బొనేట్‌ను నిల్వ ఉంచే తెల్లని గోళాకారతిత్తి (సంచి) లాంటి (Lime Sac) భాగాన్ని కలిగి, ప్రత్యేకంగా కనిపిస్తాయి.


మిలీనియం టెక్నాలజీ అవార్డు

యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన బయో ఇంజినీర్ ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్‌కు 2016 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక 'మిలీనియం టెక్నాలజీ అవార్డు' లభించింది. టెక్నాలజీ అకాడమీ ఫిన్లాండ్ (TAF- Technology Academy Finland) 2004 లో ఈ అవార్డును ప్రారంభించింది. రెండేళ్లకు ఒకసారి దీన్ని ప్రకటిస్తారు.

* ఈ అవార్డు గెలుచుకున్న మొదటి మహిళగా ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందింది. పరిణామ క్రమంపై ఈమె చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది. మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ బహుమతిగా పేరుగాంచింది.

* భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒక పరస్పర ఒప్పందం (MoU) కుదిరింది. మన దేశానికి చెందిన BIRAC (Biotechnology Industry Research Assistance Council), హార్టికల్చర్ ఇన్నోవేషన్ ఆస్ట్రేలియా ఈ ఒప్పందం చేసుకున్నాయి.

* BIRAC అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) ఆధీనంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని 2012 మార్చి 20న స్థాపించారు.

Posted Date : 21-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌