• facebook
  • whatsapp
  • telegram

మతోద్యమాలు - జైన మతం

ప్రపంచ చరిత్రతోపాటు భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 6వ శతాబ్దానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ శతాబ్దంలో 62 మతాలు ఆవిర్భవించాయి. చైనాలో కన్‌ప్యూషియస్ - కన్‌ఫ్యూషియనిజం, లౌజె - టావోయిజం, పర్షియాలో జొరాస్టర్ - జొరాస్ట్రియనిజం లాంటి మతాలతోపాటు భారతదేశంలో అజీవక, జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి.

 

మతాల ఆవిర్భవానికి కారణాలు:
* క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి వైదిక మతం ఆడంబరంగా మారి, అర్థం లేని అనంతమైన యజ్ఞ, యాగాది క్రతువులతో నిండి పోయింది.
* బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువైంది.
* యజ్ఞ యాగాదులు అధిక వ్యయ ప్రయాసలతో కూడి ఉండటం మొదలైనవి జైన, బౌద్ధ మతాల ఆవిర్భవానికి కారణమయ్యాయి. మోక్ష మార్గాన్ని కనుక్కోవడానికి, వర్ణ వ్యవస్థ, అసమానతలను తొలగించడానికి జైన, బౌద్ధ మతాలు కృషి చేశాయి.

 

అజీవకులు:

  మక్కలి గోసల దీని ప్రచారకుడు. ఇతడు 'ఏదీ మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది' అని ప్రచారం చేశాడు. ఇతడు ఆత్మ ముందే నిర్ణయించి ఉన్న పునర్జన్మల్లో చేరుతూ ఉంటుందని పేర్కొన్నాడు. మక్కలి గోసల గురువు - పురాణ కశ్యపుడు. అజిత కంబలి, పకుద కత్యాయన అజీవక మత బోధకులు.

 

జైన మతం 

  ద్వాదశ అంగాలు, ఉపాంగాలు, జైనకల్ప సూత్రాలు, వాస్తు శిల్పాలు జైన మతాన్ని గురించి వివరిస్తున్నాయి. జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వారి పేర్లు - చిహ్నాలు:

 

తీర్థంకరులు చిహ్నాలు
1. వృషభనాథుడు ఎద్దు
2. అజిత ఏనుగు
3. సంభావ గుర్రం
4. అభినందన కోతి
5. సుమతీనాథ్ కొంగ
6. పద్మప్రభ ఎర్రగులాబీ
7. సుపర్శ్వ స్వస్తిక్
8. చంద్రప్రభ చంద్రుడు
9. సువిధ డాల్ఫిన్
10. శీతల కుచం
11. శ్రేయంశ నీటి ఏనుగు
12. వసుపూజ్య గేదె
13. విమలనాథ్ అడవి పంది
14. అనంతనాథుడు రాబందు
15. ధర్మ ఉడుము
16. శాంతి (హస్తిన రాజు) దుప్పి
17. కుంతు మేక
18. అర చేప
19. మల్లి (మిథిల రాజు కూతురు) కూజా
20. సువ్రత తాబేలు
21. నామ/ నేమినాథుడు నీలి గులాబీ
22. అరిష్టనేమి శంఖం
23. పార్శ్వ పాము
24. మహావీర సింహం

* జైనమతాన్ని స్థాపించింది వృషభనాథుడు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఈ మతాన్ని వెలుగులోకి తెచ్చిన మహావీరుడు జైనమతానికి నిజమైన స్థాపకుడిగా పేరుగాంచాడు.

 

వర్థమానుడు

  వర్థమానుడు క్రీ.పూ. 540లో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు జ్ఞాత్రిక క్షత్రియశాఖకు చెందిన సిద్ధార్థుడు, త్రిశాలి (వైశాలి ప్రభువైన చేతకుని సోదరి). వర్థమానుడి భార్య యశోద, కుమార్తె ప్రియదర్శిని/ అనోజ. 30 ఏళ్లు నిండక ముందే జీవిత సుఖాలను వదిలి, ఇంటిని విడిచి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి, రిజుపాలక నదీతీరాన జ్ఞానోదయం పొందాడు.

* వర్థమానుడు మక్కలి గోసల దగ్గర శిష్యరికం చేశాడు. కేవలిన్, నిర్గుందుడు, మహావీరుడు అనే బిరుదులను పొందాడు.
* వర్థమాన మహావీరుడు క్రీ.పూ. 468లో తన 72వ ఏట పావాపురిలో హస్తిపాలుడు అనే రాజగృహంలో మరణించాడు.
* జైన మత సిద్ధాంతాలు: వర్థమాన మహావీరుడు తన పూర్వీకుల జైన సిద్ధాంతాలకు రూపకల్పన చేసి తన బోధనల ద్వారా జైనమతాన్ని త్వరితగతిన వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు.
* త్రిరత్నాలు: జైనుల పరమ లక్ష్యం సిద్ధశీల సంప్రాప్తి. సిద్ధశీల అంటే జనన మరణాల నుంచి ఆత్మకు విముక్తి సాధించడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వర్థమాన మహావీరుడు మూడు సూత్రాలను పేర్కొన్నాడు. అవి. 1. సరైన విశ్వాసం 2. సరైన జ్ఞానం 3. సరైన శీలం.
* జైన మత సమావేశాలు: జైన మత సమావేశాలను పరిషత్తులు అంటారు.
* మొదటి జైన పరిషత్: క్రీ.పూ. 300లో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో జరిగింది. ప్రదేశం - పాటలీపుత్రం. నేతృత్వం వహించింది - భద్రబాహుడు, స్థూల భద్రుడు.
* రెండో జైన పరిషత్: క్రీ.శ. 6వ శతాబ్దంలో దేవార్థ క్షమశ్రయ అధ్యక్షతన వల్లభిలో జరిగింది.
* క్రీ.శ. 12వ శతాబ్దంలో హేమచంద్రుడి అధ్యక్షతన వల్లభ, మధురలో జైన పరిషత్‌లు జరిగాయి.

 

పంచ వ్రతాలు

1. జీవహింస చేయకూడదు

2. అసత్యం పలకకూడదు

3. దొంగతనం చేయకూడదు

4. ఆస్తి కలిగి ఉండకూడదు (అపరిగ్రహ)

5. బ్రహ్మచర్యం పాటించాలి. (5వ సూత్రాన్ని వర్థమాన మహావీరుడు చేర్చాడు)

* అహింసా సిద్ధాంతం: జైన మతం సమానతా సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని జీవులను సమంగా చూడాలని బోధించింది. జైనం ప్రకారం స్పష్టిలోని చరాచరాలన్నింటిలో జీవం ఉంటుంది. జీవం ఉన్న ఏ పదార్థాన్నీ హింసించకూడదనే నియమం పాటించేవారు. జైన మతస్థులు తమ బోధనల కోసం ప్రాకృత భాషను ఉపయోగించారు.

* జైన మత గ్రంథాలు: హేమచంద్రుని పరిశిష్ట పర్వం, త్రిసష్టసకల పురుష చరిత్ర, భద్రబాహుని కల్పసూత్రాలు, కొండ కుందాచారి సమయ సారం, తిరుతక్క దేవర్ జీవక చింతామణి మొదలైనవి.

* సల్లేఖనం: సల్లేఖన దీక్ష ద్వారా ఎవరైనా మోక్షం పొందవచ్చు. సల్లేఖనం అంటే కఠోర ఉపవాస దీక్ష. ఈ దీక్ష మానవుని ఆత్మను ప్రక్షాళనం చేసి, పునర్జన్మ లేని స్థానానికి చేరుస్తుందని విశ్వసించేవారు.

* జైనమత వ్యాప్తి: మహావీరుని వ్యక్తిత్వం, ఆకర్షణ శక్తి వల్ల తొలిదశలో జైనం నలుదిశలా వ్యాపించింది. మగధ పాలకులు జైన మతాన్ని అభిమానించి, పోషించారు. చంద్రగుప్త మౌర్యుడు, కళింగ ఖారవేలుడు, చాళుక్యులు, గాంగులు, కాదంబులు, రాష్ట్రకూటులు జైనమతాన్ని ఆదరించారు. కాలక్రమేణా జైనమతం ఆంధ్ర, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, మాళ్వా, గుజరాత్ ప్రాంతాలకు వ్యాపించింది. జైన మతంలో వర్తకులు ఎక్కువగా చేరారు.

* వాస్తు నిర్మాణం: రాజగిర్, గిరినార్, మౌంట్ అబు, మధుర, బుందేల్‌ఖండ్‌లలోని జైన దేవాలయాలు జైనుల వాస్తు నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి. భువనేశ్వర్‌లోని చంద్రగిరి గుహల్లో కూర్చున్నట్లున్న జైన చిత్రం, సత్గవలో మలచిన జైన బొమ్మలు జైనమత శిల్పకళకు నిదర్శనాలు. 'అబూ' శిఖరం మీద నిర్మించిన దిల్వారా ఆలయం సుందరమైన శిల్ప సంపదకు నిలయం.

* జైన పండితులు: భద్రబాహు, హేమచంద్రుడు, కొండ కుందాచారి, పంప కవి, తిరుతక్క దేవర్ మొదలైనవారు జైన పండితులుగా ప్రసిద్ధి చెందారు.

* జైన గుహలు: శ్రావణ బెళగొళలోని బాహుబలి విగ్రహం, ఎల్లోరా, ఉదయగిరి మొదలైనవి.

 

జైనమత క్షీణత

  మహావీరుని తర్వాత కొంతకాలానికి జైనమతం శ్వేతాంబర (తెల్లని వస్త్రం ధరించేవారు), దిగంబర అనే రెండు భాగాలుగా చీలిపోయింది. అదేసమయంలో వైదిక మతంలో ప్రతి సంస్కరణోద్యమం బయలుదేరడం, తర్వాతి కాలంలో రాజుల ఆదరణ లేకపోవడం వల్ల జైన మతం త్వరలోనే క్షీణించింది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌