• facebook
  • whatsapp
  • telegram

నెపోలియ‌న్ ఉన్నతి - ప‌త‌నం

  నెపోలియన్ బోనపార్టీ ఐరోపా చరిత్రను సుమారు రెండు దశాబ్దాలపాటు శాసించాడు. స్థిరమైన రాజకీయ వ్యవస్థను, సమర్థ పాలననూ అందించిన నెపోలియన్ ఐరోపా ఖండం మీద ఫ్రెంచ్ పతాకాన్ని ఎగరేశాడు. 'నేను విప్లవం కన్నబిడ్డను, నా దేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను. ఫ్రెంచ్ కిరీటం నేలపై పడి ఉండగా నేను నా కత్తితో దాన్ని పైకెత్తాను' అంటూ ధీరత్వాన్ని ప్రకటించుకున్న నెపోలియన్‌కు సంబంధించిన మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం.

  నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కార్సికా దీవిలోని అజాషియా పట్టణంలో జన్మించాడు. ఇతడి తల్లిదండ్రులు కార్లో బోనపార్టీ, లెటిజియారమోలినో. ఫ్రెంచ్‌వారు జెనీవా నుంచి కార్సికాను కొనుక్కోవడం వల్ల నెపోలియన్ ఫ్రెంచ్ పౌరుడయ్యాడు. నెపోలియన్‌కు చరిత్ర, భూగోళ, రాజనీతి, గణిత, తత్వశాస్త్రాల అధ్యయనంపై ఆసక్తి ఎక్కువ. ఇతడిపై రూసో ప్రభావం అధికంగా ఉండేది. 'రూసో లేకపోయినట్లయితే నెపోలియన్ ఉండేవాడు కాదు', 'నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడు లేడు' అని నెపోలియన్ పేర్కొన్నాడు. ఇతడు గొప్ప సైనిక విజేత, పరిపాలనాదక్షుడు.

* 1799 నుంచి 1815 వరకూ సాగిన నెపోలియన్ కాలాన్ని రెండు దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో (1799 - 1804) ప్రథమ కన్సల్‌గా వ్యవహరించిన నెపోలియన్ రెండో దశలో (1804 - 15) చక్రవర్తిగా అధికారం చెలాయించాడు.

 

పాలనా సంస్కరణలు

  నెపోలియన్ యుద్ధ విజయాలు అశాశ్వతాలు కావచ్చునేమోగానీ అతడి స్వదేశీ సంస్కరణలు ఫ్రాన్స్‌లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఈ దశలో ఫ్రాన్స్‌కు కావాల్సింది సమానత్వమేగానీ, స్వేచ్ఛకాదని నెపోలియన్ ప్రగాఢంగా విశ్వసించాడు. అతడి దృష్టిలో సామాజిక వ్యవస్థలో ప్రభుత్వం సౌరకుటుంబంలో సూర్యుడి లాంటిది.

* ఫ్రాన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులను ఎంచుకునే పద్ధతికి స్వస్తి పలికాడు. డిపార్ట్‌మెంట్లుగా పిలిచే రాష్ట్రాలపై అధికారులుగా ప్రిఫెక్ట్‌లనూ, వాటి అంతర్భాగాలైన అరెంటైజ్‌మెంట్లపై సబ్‌ప్రిఫెక్ట్‌లనూ, అయిదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు మేయర్లను నియమించాడు. వీరిని తొలగించే అధికారం తనవద్దే ఉంచుకున్నాడు.

ఆర్థిక సంస్కరణలు - జాతీయ బ్యాంకు:

  డైరెక్టరీ పతనానికి ఆర్థిక పతనమే కారణమని నెపోలియన్ గుర్తించాడు. పకడ్బందీగా పన్నులు వసూలు చేసి, లంచగొండి అధికారులను కఠినంగా శిక్షించాడు. నెపోలియన్ ఆర్థిక సంస్కరణల్లో ప్రముఖంగా పేర్కొనేది 'జాతీయ బ్యాంకు' స్థాపన. 1800 లో స్థాపించిన ఈ బ్యాంకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖంగా నిలిచి, నేటికి కొనసాగుతోంది. విలువ కోల్పోయిన కాగిత ద్రవ్యం 'అస్సినా'ను రద్దుచేసి, నాణేల రూపంలో నూతన ద్రవ్యాన్ని ముద్రించాడు. ఇండియా, చైనా దేశాలతో వ్యాపార సంబంధాలను విస్తృతపరిచాడు. భారతదేశంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు.

 

పోప్‌తో రాజీ - కంకార్డేట్:

  మతం ప్రాధాన్యాన్ని గుర్తించిన నెపోలియన్ ప్రజలకు మతం ఉండాలిగానీ, అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని భావించాడు. మతం లేని రాజ్యం దిక్సూచి లేని నౌకలాంటిదని ప్రకటించాడు. పోప్ ఏడో పయస్‌తో 1801 లో కంకార్డేట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. నెపోలియన్ సూచించిన ఫ్రెంచ్ మతాధికారులనే పోప్ నియమించేటట్లు ఒప్పందం కుదిరింది. కేథలిక్‌ను అధికార మతంగా గుర్తించాడు.

 

న్యాయ సంస్కరణలు - నెపోలియన్ స్మృతి:

  వివిధ న్యాయ స్మృతులను క్రోడీకరించి దేశమంతటికీ అనువర్తించే విధంగా ఒకే న్యాయ స్మృతిని రూపొందించాడు. ప్రథమ కాన్సల్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నెపోలియన్ ఒక న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘం న్యాయ స్మృతులను అయిదు భాగాలుగా క్రోడీకరించింది. వీటిలో సాంఘిక సమానత్వం, మత సహనం, భూస్వామ్య వ్యతిరేకత, బహిరంగ నేర విచారణ, న్యాయం ముందు సమానత్వం, జ్యూరీ తీర్పు లాంటి అంశాలున్నాయి. ఇతడి న్యాయ స్మృతి మొదటి అధునిక న్యాయ స్మృతిగా ప్రసిద్ధిపొంది, ఇతర రాజ్యాలకూ మార్గదర్శకమైంది. నెపోలియన్‌ను ప్రజలు 'రెండో జస్టీనియన్‌'గా ప్రస్తుతించారు.
విద్యా సంస్కరణలు: ఫ్రాన్స్ దేశమంతా అనుసరించే ఒకే జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేశాడు. ప్యారిస్‌లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. దీనికి అనుబంధంగా 17 శాఖలను ఏర్పాటు చేసి, విద్యావ్యవస్థను ఇవి పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నాడు.

* ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, వృత్తి విద్యా పాఠశాలలను స్థాపించాడు. నెపోలియన్ మహిళా విద్య పట్ల శ్రద్ధ చూపాడు. ధర్మశీలురుగా, ఆదర్శ గృహిణులుగా తీర్చిదిద్దడమే మహిళా విద్య లక్ష్యంగా ప్రకటించాడు.
ప్రజాహిత కార్యక్రమాలు: వ్యవసాయ అభివృద్ధి కోసం పంట కాల్వలను తవ్వించాడు. నదులపై వంతెనలు నిర్మించాడు. ఆస్టర్లిట్జ్‌లోని జీనా వద్ద నిర్మించిన వంతెనలు ప్రసిద్ధమైనవి. నెపోలియన్ నిర్మించిన విశాల రహదారులు అతడి పాలనాదక్షతకు నిదర్శనం. పురాతన రాజభవానాలైన ఫౌంటెన్ బ్లూ, ట్విలరీని పునర్నిర్మించి జేగీయమానం చేశాడు. యుద్ధ విజయాల ద్వారా సాధించిన ప్రాచీన కళాఖండాలతో ప్యారిస్‌ను తీర్చిదిద్దాడు.
చక్రవర్తిగా నెపోలియన్: 1804 నుంచి 1815 వరకు నెపోలియన్ చక్రవర్తిగా పాలించిన కాలమంతా యుద్ధాలతోనే గడిచింది. ఇంగ్లండ్ మినహా ఐరోపా ఖండాన్నంతటినీ జయించి, మహాసామ్రాజ్య నిర్మాతగా, ఐరోపా సార్వభౌముడిగా ఖ్యాతి పొందాడు.

 

మూడో రాజ్య కూటమి

  ఇంగ్లండ్ 1804 లో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా మూడో రాజ్య కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో ఇంగ్లండ్‌తోపాటు ఆస్ట్రియా, రష్యా, నేపుల్స్, స్వీడన్ చేరాయి. ప్రష్యా తటస్థంగా ఉంది. ఫ్రాన్స్‌తో స్పెయిన్ జతకట్టింది. నెపోలియన్ 1805 లో ఉల్మ్ యుద్ధంలో, ఆస్టర్లిట్జ్ యుద్ధంలోనూ ఆస్ట్రియాను ఓడించి, దాని రాజధాని వియన్నాను ఆక్రమించాడు.

* బ్రిటన్‌తో ట్రఫాల్గర్ వద్ద జరిగిన నౌకా యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. ఆస్ట్రియా ప్రెస్ బర్గ్ సంధి చేసుకుని, ఇటలీ రాజ్యాలైన వెనిస్, టైరోర్‌ను ఫ్రాన్స్‌కు ఇచ్చింది. ఆస్ట్రియా చక్రవర్తికి ఉన్న పవిత్ర రోమన్ చక్రవర్తి బిరుదును నెపోలియన్ రద్దు చేశాడు. దీంతో వెయ్యేళ్ల పవిత్ర రోమన్ సామ్రాజ్యం (800 - 1805) అంతమైంది.

ఐరోపా సార్వభౌమత్వం: మూడో రాజ్య కూటమి విచ్ఛిన్నం కావడంతో నెపోలియన్ ఐరోపా సార్వభౌముడిగా అవతరించాడు. ఐరోపా రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చేసి, తన బంధువులు, సేనానులను ఆయా రాజ్యాల్లో నియమించాడు.

* రైన్ పరివాహక ప్రాంతంలోని 16 జర్మన్ రాజ్యాలను రైన్ సమాఖ్యగా ఏర్పాటు చేసి, వాటికి సంరక్షకుడు తానే అని ప్రకటించుకున్నాడు. ప్రష్యా, ఆస్ట్రియా నుంచి గ్రహించిన భూభాగాలతో వార్సా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

* ఐరోపాపై నెపోలియన్ విజయ పతాకం రెపరెపలాడింది. ఆక్రమిత ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థనూ, వెట్టిచాకిరినీ రద్దు చేశాడు. వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం ముందు సమానత్వాన్ని అందించాడు. చర్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా నెపోలియన్ విప్లవ ఫలాలను ఐరోపా అంతటా పంచిపెట్టాడు.

 

భూఖండ విధానం

  ఇంగ్లండ్‌ను ఓడించడానికి నెపోలియన్ అనుసరించిన విధానమే భూఖండ విధానం. ఇంగ్లండ్ సైనిక శక్తికి దోహదం చేస్తున్న అంశం వాణిజ్యమేనని గుర్తించిన నెపోలియన్, వ్యాపారాన్ని ధ్వంసం చేస్తే ఆ రాజ్యం దాసోహమవుతుందని భావించాడు. బ్రిటిష్ వ్యాపారాన్ని దెబ్బతీయడమంటే బ్రిటిష్ గుండెలపై ఎగిరి తన్నడమే అని వ్యాఖ్యానించాడు. దీనికి భూఖండ విధానమనే నూతన పద్ధతిని అనుసరించాడు.

* 1806 లో బెర్లిన్, 1807 లో మిలాన్, 1810 లో ప్లాటెన్‌బా నుంచి జారీ చేసిన ఆదేశాల ద్వారా ఈ విధానాన్ని ప్రకటించాడు. ఐరోపా రాజ్యాలు బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాన్ని నిలిపేయాలని, ఇంగ్లండ్ నౌకలను ఫ్రెంచ్ ఓడరేవుల్లో, ఫ్రాన్స్ మిత్రదేశాల ఓడరేవుల్లో నిలపకూడదని నెపోలియన్ ఆజ్ఞాపించాడు.

* ప్రతిచర్యగా ఇంగ్లండ్ 'ఆర్డర్స్ ఇన్ కౌన్సిల్' శాసనాలను జారీ చేసింది. భూఖండ విధానాన్ని అమలుపరచడంలో నెపోలియన్ కఠిన వైఖరిని అనుసరించాడు. కానీ, పారిశ్రామిక విప్లవం, భారత్, ఈజిప్ట్ లాంటి దేశాలతో వ్యాపారం వల్ల ఇంగ్లండ్ అప్పటికే అభివృద్ధి సాధించడంతో ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కోగలిగింది.

 

పోప్ నిర్బంధం

  పోప్ ఏడో పయస్ తన అధీన ప్రాంతాల్లో భూఖండ విధానాన్ని అమలుపరచడానికి నిరాకరించడంతో నెపోలియన్ అతడిని బంధించి, ఆ భూములను ఫ్రెంచ్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దీంతో రోమన్ కేథలిక్‌లలో నెపోలియన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ద్వీపకల్ప యుద్ధంతో నెపోలియన్ పతనం ప్రారంభమైంది.

* ఇతడు ఆస్ట్రియా రాకుమార్తె మేరియా లూసియాను వివాహం చేసుకున్నాడు. ప్రాచీన రాజవంశమైన హాప్సీబర్గ్‌లతో వివాహ బంధం ఏర్పరచుకోవడం నెపోలియన్ ప్రతిష్టను పెంచింది.
* మేరియా లూసియా, నెపోలియన్ దంపతులకు జన్మించిన కుమారుడే రెండో నెపోలియన్.
* స్పెయిన్ సమస్య తనను తినేసిన రాచపుండని నెపోలియన్ వ్యాఖ్యానించాడు.
నెపోలియన్ పతనం - నాలుగో రాజ్య కూటమి: నెపోలియన్‌కు వ్యతిరేకంగా 1813 లో నాలుగో కూటమి
ఏర్పడింది. ఈ కూటమిలో ప్రధాన సభ్య దేశాలు: ప్రష్యా, రష్యా, స్వీడన్, ఇంగ్లండ్, ఆస్ట్రియా.

 

లీప్‌జిగ్ యుద్ధం

  మిత్ర కూటమి సైన్యాలు 1813 అక్టోబరు 16 - 19 మధ్య లీప్‌జిగ్ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించాయి. దీన్నే రాజ్యాల యుద్ధం (బ్యాటిల్ ఆఫ్ నేషన్స్) అంటారు. ఈ యుద్ధంలో మిత్ర సైన్యాలకు ఆస్ట్రియాకు చెందిన మెటర్నిక్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో నెపోలియన్ పరాజయం పాలై, ఎల్బో దీవికి ప్రవాసం వెళ్లాడు. క్రీ.శ. 1789 లో నెపోలియన్ ఈజిప్ట్ పై దండయాత్ర చేశాడు. ఈ యుద్ధంలో నెపోలియన్ బ్రిటిష్ నౌకాదళాధిపతి నెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

వాటర్లూ యుద్ధం: ఎల్బో దీవి నుంచి తప్పించుకున్న నెపోలియన్ ఫ్రాన్స్ చేరుకున్నాడు. మిత్రకూటమి సైన్యాలు 'డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్' నాయకత్వంలో 1815 జూన్ 18 న జరిగిన చరిత్రాత్మక వాటర్లూ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐరోపాకు 6000 మైళ్ల దూరంలో ఉన్న సెయింట్ హెలీనాలోని రాకీ దీవికి అతడిని బందీగా పంపించాయి. నెపోలియన్ కేన్సర్ వ్యాధి బారినపడి 1821 మే 5న తన 52వ ఏట మరణించాడు.

Posted Date : 06-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌