• facebook
  • whatsapp
  • telegram

సిక్కు మతం

సిక్కు మత స్థాపకుడు గురు నానక్. ఈయన పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్న తల్వండి అనే గ్రామంలో జన్మించాడు. పంజాబ్ గవర్నర్ వద్ద గణాంక అధికారిగా పనిచేశాడు. ఏ వ్యక్తికైనా ఒక ఆధ్యాత్మిక గురువు లేకపోతే పరిపూర్ణత లభించదని పేర్కొన్నాడు. భగవంతుడు ఒక్కడే, అతడు నిరాకారుడు అని బోధించాడు.

  గురు నానక్ శీలానికి, నిర్మలత్వానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇతడి బోధనలు ఆదిగ్రంథ్ అనే సంకలనంగా వెలువడ్డాయి. గురు నానక్ కబీర్‌కు సమకాలీకుడు.
* నానక్ భార్య పేరు సులాఖని. ఇతడి కుమారులు శ్రీచంద్, లక్ష్మీచంద్.
* గురు నానక్ కార్యకలాపాలకు పంజాబ్ కేంద్రమైంది. పర్షియా, హిందీ, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హిందూ, ముస్లింల ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు.
* పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో 1538 లో గురు నానక్ మరణించాడు. ఇతడి శిష్యులు 'సిక్కులు' అయ్యారు.

గురు అంగద్: నానక్ తన వారసుడిగా గురు అంగద్ పేరును ప్రకటించాడు. గురు అంగద్ సిక్కు ప్రవచనాల కోసం గురుముఖిని మాధ్యమంగా ఎన్నుకున్నాడు. లంగర్ అనే వంటశాలను ఏర్పాటు చేశాడు. గురు నానక్ జీవిత చరిత్రను రచించాడు. సిక్కుల్లో క్రమశిక్షణను ప్రవేశపెట్టాడు.

గురు అమర్‌దాస్: సిక్కుల మూడో గురువు గురు అమర్‌దాస్. ఇతడు సిక్కు మతవ్యాప్తి కోసం 22 ఆధ్యాత్మిక సూత్రాలను ప్రవేశపెట్టాడు. మొగలు చక్రవర్తి హుమయూన్‌కు ఇతడి ఆశీస్సులు లభించాయి.

గురు రామ్‌దాస్: సిక్కుల నాలుగో గురువు గురు రామ్‌దాస్. మొగలు చక్రవర్తి అక్బర్‌కు ఈయన పట్ల అమితమైన గౌరవ భావం ఉండేది. అక్బర్ చక్రవర్తి స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేశాడు. సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణదేవాలయం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఉంది.

గురు అర్జున్ సింగ్: సిక్కుల అయిదో గురువు గురు అర్జున్‌సింగ్. ఇతడు ఆదిగ్రంథ్‌ను సంకలనం చేశాడు (సిక్కుల పవిత్ర గ్రంథం). అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి సిక్కు తన సంపాదనలో  వ వంతు సిక్కు గురువులకు ఇవ్వాలని పేర్కొన్నాడు. మొగలు చక్రవర్తి జహంగీర్ చేతిలో హత్యకు గురయ్యాడు.

గురు హర్‌గోవింద్: సిక్కుల ఆరో గురువు హర్‌గోవింద్. ఇతడు షాజహాన్‌పై తిరుగుబాటు చేశాడు.

గురు హర్‌రాయ్: ఇతడు సిక్కుల ఏడో గురువు. షాజహాన్ కుమారుడైన దారాషుకు, ఔరంగజేబుకు వ్యతిరేకంగా పనిచేశాడు.

గురు హర్‌కిషన్: ఇతడు సిక్కుల ఎనిమిదో గురువు. ఔరంగజేబు సమకాలీకుడు. మశూచి వ్యాధితో బాధపడుతూ ఔరంగజేబు ఆస్థానంలో మరణించాడు.

గురు తేజ్‌బహదూర్: ఇతడు సిక్కుల తొమ్మిదో గురువు. బిహార్, అసోం ప్రాంతాలకు సిక్కు మతాన్ని వ్యాపింపజేశాడు. మొగలు చక్రవర్తి ఔరంగజేబు చేతిలో హత్యకు గురయ్యాడు.

 

గురు గోవింద్‌సింగ్

  ఇతడు సిక్కుల పదో గురువు. గురు గోవింద్‌సింగ్ తన ప్రధాన కేంద్రాన్ని కర్తార్‌పూర్ నుంచి పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహెబ్‌కు మార్చాడు.
* ఇతడు సిక్కుల్లో సమానత్వం అనే ఖల్సాను సాధించాడు (సోదర భావం).
* సిక్కు మతస్థులందరూ తమ శరీరాలపై 'క' అక్షరంతో కూడిన అయిదు వస్తువులను ధరించాలని ఆదేశించాడు. అవి 1) కంఘా (దువ్వెన), 2) కచ్ (లోపలి వస్త్రం), 3) కర్డ్ (కంకణం), 4) కేశ్ (జుట్టు), 5) కృపాణ్ (ఖడ్గం). వీటితోపాటు ప్రతి సిక్కు మతస్థుడు తన పేరు చివర సింగ్ అనే పదాన్ని చేర్చాలి.
* గురు గోవింద్‌సింగ్ తన తర్వాత 'ఆదిగ్రంథ్‌'ను గురువుగా భావించమని సిక్కులను ఆదేశించాడు. తన సైనిక వారసుడిగా బందాను ఎంపిక చేశాడు.
* సిక్కుల 12 రాజ్యాలను మిజిల్స్ అంటారు. సిక్కు మత రక్షకులమని చెప్పే వారిని అకాలీలు అంటారు.

 

రంజిత్‌సింగ్ (1782 - 1839): రంజిత్‌సింగ్ తండ్రి మహాసింగ్, తల్లి రాజ్‌కౌర్. ఇతడి మొదటి పేరు బుధ్‌సింగ్. ఇతడు లాహోర్‌లో ఆయుధ కర్మాగారాన్ని నిర్మించాడు. 1809లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ మింటోతో అమృత్‌సర్ సంధి కుదుర్చుకున్నాడు.

 

ఆంగ్లో - సిక్కు యుద్ధాలు

మొదటి ఆంగ్లో - సిక్కు యుద్ధం (1845-1846): ఈ యుద్ధ కాలంలో దిలీప్‌సింగ్‌తో సింహాసనాన్ని అధిష్టింపజేసి, అతడి తల్లి రాణి జిందాన్ కౌర్ పరిపాలనా బాధ్యతలను స్వీకరించింది. ఈ యుద్ధం లాహోర్ సంధితో (1846 మార్చి 9) ముగిసింది.

రెండో ఆంగ్లో - సిక్కు యుద్ధం (1848-1849): ఈ యుద్ధంలో ముల్తాన్ గవర్నర్ మూల్‌రాజ్, లాహోర్‌లో చత్తర్‌సింగ్ తిరుగుబాటు చేశారు. నాటి గవర్నర్ జనరల్ డల్హౌసీ సిక్కులను ఓడించాడు.

సిక్కు మత గురువులు సమకాలీన మొగలు చక్రవర్తులు
1. గురు నానక్ (1469 - 1538) బాబరు
2. గురు అంగద్ (1538 - 1552) హుమయూన్
3. గురు అమర్‌దాస్ (1552 - 1574) హుమయూన్, అక్బర్
4. గురు రామ్‌దాస్ (1574 - 1581) అక్బర్
5. గురు అర్జున్‌సింగ్ (1581 - 1606) అక్బర్, జహంగీర్
6. గురు హర్‌గోవింద్ (1606 - 1645) జహంగీర్, షాజహాన్
7. గురు హర్‌రాయ్ (1645 - 1661) షాజహాన్, ఔరంగజేబు
8. గురు హర్‌కిషన్ (1661 - 1664) ఔరంగజేబు
9. గురు తేజ్ బహదూర్ (1664 - 1675) ఔరంగజేబు
10. గురు గోవింద్‌సింగ్ (1675 - 1708) ఔరంగజేబు, బహదూర్ షా
* బందా బహదూర్ (1708 - 1715)
(సిక్కు మత గురువు కాదు)
బహదూర్ షా, జహందర్ షా ఫరూక్ సియార్

 

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌