• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యేక ఆర్థిక మండలి

  సముద్రాలపైనా సరిహద్దులు!

ఒక దేశం విస్తీర్ణం, పరిధి కేవలం దాని భూభాగానికే పరిమితం కాదు. సముద్ర తీరం ఉన్న ప్రతి దేశానికి సముద్రంలో నిర్ణీత దూరం వరకు ప్రత్యేక హక్కులు, నియంత్రణ ఉంటాయి. ఆ సముద్ర జలాల్లో చేపల వేట, నౌకాయాన స్వేచ్ఛతో పాటు సముద్రగర్భంలోని ఖనిజాలు పొందేందుకు అధికారం ఉంటుంది. జాతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, పరపతి దీనితోనే ముడిపడి ఉంటాయి. ఆధునిక కాలంలో సముద్ర వ్యవహారాలకు ప్రాధాన్యం పెరిగి ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్‌) ప్రాంతాల ఏర్పాటుకు దారితీసింది. అంతర్జాతీయంగా ఆమోదం పొందిన ఈ అవగాహన గురించి పోటీ పరీక్షార్థులకు తెలియాలి. భారతదేశ ఈఈజడ్‌ పరిధి, ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉన్న వివాదాలను తెలుసుకోవాలి.


ప్రత్యేక ఆర్థిక మండలి (ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌) అనేది సముద్రంలోని ఒక ప్రత్యేక ప్రాంతం. సాధారణంగా ఒక దేశ ప్రాదేశిక సముద్ర పరిధి ఆ దేశ తీరం నుంచి 200 నాటికల్‌ మైళ్లు (అంటే 230 మైళ్లు/ 370 కి.మీ.) విస్తరించి ఉంటుంది. ‘యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌ ది లా ఆఫ్‌ ది సీ-1982’ నిర్దేశం ప్రకారం ప్రత్యేక ఆర్థిక మండలి అనేది సముద్రంలోని ఒక ప్రాంతానికి/దేశానికి చెందినదై ఉంటుంది. ఆ ప్రాంత జలశక్తి, పవన శక్తి, సహజ వాయువు, ముడిచమురు, ఇతర సముద్ర వనరులను అన్వేషించడానికి, వెలికితీయడానికి, ఉపయోగించడానికి ఆ దేశానికి అనుమతించే హక్కు ఉంటుంది. ఒక దేశ/రాష్ట్ర ప్రాదేశిక జలాల పరిధి 12 నాటికల్‌ మైళ్లు. కానీ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి 200 నాటికల్‌ మైళ్లు.

సముద్ర ప్రాంతాలను అంతర్గత జలాలు, ప్రాదేశిక సముద్రం, అనుబంధ జోన్, ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఈఈజడ్‌), హైసీస్‌ అనే అయిదు ప్రధాన ప్రాంతాలుగా విభజిస్తారు. భారతదేశంలో ఈఈజడ్‌కు సంబంధించి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ హద్దులను నిర్ణయిస్తుంది. భారత్‌ ఈఈజడ్‌లోని వనరుల అన్వేషణ, అంచనా, భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం మెరైన్‌ జియో సైన్సెస్‌ డేటా లాంటి పనులు నిర్వహిస్తుంది. దేశ ప్రధాన భూభాగంతో పాటు, లక్షదీవులు, అండమాన్, నికోబార్‌ దీవులు ఈ మ్యాపింగ్‌ పరిధిలోకి వస్తాయి.  ప్రత్యేక ఆర్థిక మండలి విస్తీర్ణం విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్‌ది 18వ స్థానం.

భారత ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతాలు, వైశాల్యం 

భారతదేశ పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతం 23,05,143 చ.కి.మీ. ఉంది. సరిహద్దులుగా దక్షిణాన మాల్దీవులు, శ్రీలంక; పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండొనేసియా ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన శాస్త్రీయ ఆధారాల ప్రకారం మన ఈఈజడ్‌ పరిధిని 200 నాటికల్‌ మైళ్ల నుంచి 350 నాటికల్‌ మైళ్ల వరకు పెంచాలని ఐక్యరాజ్య సమితికి భారతదేశం విజ్ఞప్తి చేసింది. మహాసముద్రాలు పాలీ మెటాలిక్‌ ఖనిజాలకు నిలయాలు కావడంతో ఈఈజడ్‌ విస్తీర్ణానికి ప్రాధాన్యం పెరిగింది.

పాలీ మెటాలిక్‌ ఖనిజాలు: వీటిని మాంగనీస్‌ నోడ్యూల్స్‌ అని కూడా అంటారు. సముద్ర అఖాతాల్లో సుమారు 3000 నుంచి 6000 మీటర్ల లోతులో ఉంటాయి. ఇవి నీటి లోపల అడుగు భాగాన అగాధ మైదాన అవక్షేపాల్లో, భూ అంతర పొరల్లో ఇనుము, మాంగనీస్‌ హైడ్రాక్సైడ్‌ల కేంద్రీకృత పొరలతో ఏర్పడిన రాతి కాంక్రీటు లాంటి పదార్థాలు. వీటిని బ్యాటరీలు, విద్యుత్తు వాహనాల తయారీలో వాడతారు. అలాగే క్లీన్‌ ఎనర్జీ ఎకానమీకి అవసరమైన లోహాలు సముద్రాల్లో ఉంటాయి.

చరిత్ర, మూలం: ఒక దేశ ప్రాదేశిక జలాల పరిమితుల వెలుపల సముద్ర వ్యవహారాలపై మరింత నియంత్రణను అందించడానికి దేశాలకు ప్రత్యేక ఆర్థిక మండళ్లను కేటాయించాలనే ఆలోచన 20వ శతాబ్దం చివర్లో ఆమోదం పొందింది. మొదట్లో ఒక ప్రాదేశిక జలాల పరిధి తీరం నుంచి 3 లేదా 5 నాటికల్‌ మైళ్లు ఉండేది. ప్రస్తుతం 12 నాటికల్‌ మైళ్లు (22 కి.మీ.) వరకు విస్తరించింది. 1945, సెప్టెంబరు 28 నాటి ట్రూమన్‌ ప్రకటనలో యునైటెడ్‌ స్టేట్స్‌ ద్వారా సంప్రదాయ ప్రాదేశిక జలాలకు వెలుపల ఉన్న ప్రాంతంపై అధికారిక పరిధి గురించి చర్చించారు. 1947 జూన్, ఆగస్టుల్లో పెరూ, చిలీ దేశాలు మొదటిసారిగా ఖండతీరపు అంచు నుంచి ప్రెసిడెన్షియల్‌ డిక్లరేషన్‌కు సంబంధించి 200 నాటికల్‌ మైళ్ల పరిధిని హక్కుగా (క్లెయిమ్‌) ప్రకటించాయి.

వివాదాలు:

* దక్షిణ చైనా సముద్రంపై నియంత్రణ, అధికారం కోసం చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, మలేసియాల మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది.


* ఆడ్రియాటిక్‌ సముద్రంలోని క్రోయేషియాకు చెందిన పర్యావరణ, మత్స్య సంరక్షణ ప్రాంతం విషయంలో ఇటలీ, స్లోవేకియాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇది క్రొయేషియా యూరోపియన్‌ యూనియన్‌లో చేరే సమయంలో జరిగింది.


* కెనడా - అమెరికా దేశాల మధ్య బ్యూపోర్ట్‌ సముద్రపు చీలిక ఆకారంలోని భాగం వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న చమురు నిల్వలు.


* ఒకినోటోరిషిమా చుట్టూ ఉన్న ఈఈజడ్‌ ప్రాంతం తనదని జపాన్‌ చెబుతోంది. అయితే చైనా, తైవాన్, దక్షిణ కొరియాలు మాత్రం ఇది ఎవరికీ చెందని ప్రాంతమని వాదిస్తున్నాయి.


* లిబియా - తుర్కియే దేశాల మధ్య జరిగిన అంతర్జాతీయ జల ఒప్పందం చట్టవిరుద్ధమని గ్రీస్‌ చెబుతోంది. ప్రతిగా ఈజిప్టుతో కుదిరిన ఒప్పందంపై సంతకం చేసింది.


* ఫ్రాన్స్‌ ఆధీనంలో ఉన్న ట్రోమోలిన్‌ ద్వీపం ప్రత్యేక ఆర్థిక మండలి; యూకే ఆధీనంలో ఉన్న దక్షిణ బ్రిటిష్‌ హిందూ మహాసముద్రపు ఈఈజడ్‌లు తమవని మారిషస్‌ పేర్కొంటోంది.


పరిష్కారమైన వివాదాలు


* యూకే - ఐస్‌లాండ్‌ల మధ్య అనేక దశాబ్దాలుగా కొనసాగిన కాడ్‌ వార్స్‌ వివాదం 1976లో తుది ఒప్పందంతో పరిష్కారమైంది.


* కెనడా - ఫ్రాన్స్‌ దేశాల మధ్య సరిహద్దు వివాదం, సెయింట్‌ పియర్‌ - మిక్వెలాన్‌ అనే (ఫ్రెంచ్‌ దీవుల చుట్టూ ఉన్న ప్రత్యేక ఆర్థికమండలి) ప్రాంతం 1992లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ద్వారా కెనడా చేసిన వాదన ప్రకారం పరిష్కారమైంది.


* 1999లో హనీష్‌ దీవుల వివాదం తర్వాత, యెమన్‌ - ఎరిత్రియాల ఈఈజడ్‌ల ద్వీపాలపై సార్వభౌమాధికారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం రెండు దేశాల ప్రధాన భూభాగాల మధ్య సమానంగా గుర్తించాలని తీర్పునిచ్చింది.


* 2009లో రొమేనియా - ఉక్రెయిన్‌ల మధ్య స్నేక్‌ ఐలాండ్‌ల కోసం జరిగిన వివాదంలో స్నేక్‌ ఐలాండ్‌కు 12 నాటికల్‌ మైళ్లకు మించి ఈఈజడ్‌ లేదని అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయించింది.


* 2010లో నార్వే - రష్యా మధ్య] ప్రాదేశిక జలాలు, ఈఈజడ్‌లకు సంబంధించి ‘స్వాల్‌బర్డ్‌ ద్వీప సమూహం వివాదం’ పరిష్కారమైంది.


* 2014లో నెదర్లాండ్స్‌ - జర్మనీల మధ్య డోలర్ట్‌ అఖాతపు సరిహద్దు వివాదం కూడా సమసిపోయింది.


* రెండు దేశాల మధ్య చేపల నిర్వహణ, స్పాండ్లింగ్‌ స్టాక్‌ రెండూ ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈఈజడ్‌ల మధ్య ఆచరణకు నోచుకుంటాయి.


* భారతదేశానికి శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లతో ఈఈజడ్‌ల వివాదాలు పరిష్కారమయ్యాయి. కానీ పాకిస్థాన్‌తో సర్‌క్రీక్‌ వివాదం ఇంకా కొనసాగుతోంది.


ముఖ్యాంశాలు


* ప్రపంచంలో అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి ఉన్న దేశం ఫ్రాన్స్‌


* ఈఈజడ్‌ ఏ దేశ నియంత్రణలో ఉంటుందో ఆ దేశానికి లేదా ఆ జాతీయులకు చేపల వేటకు అనుమతి ఉంటుంది.


* భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి విస్తీర్ణం 2.37 మిలియన్‌ చ.కి.మీ.


* ‘యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఆన్‌  ది లా ఆఫ్‌ ది సీ’ ద్వారా దేశాలు వాటి మధ్య ఈఈజడ్‌ల అతివ్యాప్తికి సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుంటాయి


* భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలి మ్యాపింగ్‌ కార్యక్రమాన్ని ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.


* ప్రత్యేక ఆర్థిక మండలి కలిగి ఉన్న దేశాల్లో భారత్‌ 18వ స్థానంలో ఉంది.


* భారతదేశ తీర ప్రాదేశిక జలాల విస్తరణ 12 నాటికల్‌ మైళ్లు.


* భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతం పరిధి 200 నాటికల్‌ మైళ్లు.


* ప్రత్యేక ఆర్థిక మండలి ఆలోచన మొదటిసారి 20వ శతాబ్దంలో (1947)లో వచ్చింది.


* ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతం/పరిధిని మొదట (1947లో) క్లెయిమ్‌ చేసిన దేశాలు పెరూ, చిలీ .


* ప్రత్యేక ఆర్థిక మండలి విషయంలో భారత్‌కు పాకిస్థాన్‌తో నేటికీ వివాదం కొనసాగుతోంది.


* రెండు దేశాల మధ్య చేపల నిర్వహణ, స్టాండ్లింగ్‌ స్టాక్‌ కోసం ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) మార్గదర్శకాలను అనుసరిస్తారు. 


* ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించి రొమేనియా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య స్నేక్‌ ఐలాండ్‌ వివాదం జరుగుతోంది.

 


రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌


 

 

Posted Date : 14-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌