• facebook
  • whatsapp
  • telegram

 శత్రువుల కదలికలపై నిఘా!

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంతోపాటు విదేశాలకూ సేవలు అందిస్తూ అన్నిరకాలుగా మనం అభివృద్ధి చెందడానికి దోహదపడుతోంది.

కార్టోశాట్‌ - 3
ప్రపంచ చరిత్రలోనే అత్యంత రిజల్యూషన్‌తో భూమి ఛాయా చిత్రాలను తీసే శక్తిమంతమైన ఉపగ్రహం కార్టోశాట్‌ - 3 ని ఇస్రో ప్రయోగించింది. శత్రువుల కదలికలు, స్థావరాలపై నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు ఇది దోహదపడుతుంది. కార్టోశాట్‌ - 3 తో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చే మరో 13 అమెరికన్‌ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-47 ద్వారా ప్రయోగించారు.
1625 కి.గ్రా. బరువు ఉండే కార్టోశాట్‌ - 3 ప్రపంచంలోనే అత్యంత చురుకైన నిఘా నేత్రం. దీని రిజల్యూషన్‌ 25 సెం.మీ. అంటే చేతి వాచీలోని సమయాన్నీ ఇది చూడగలదని ఒక అంచనా. ఈ శాటిలైట్‌లో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.


ప్రత్యేకతలు
* అత్యంత చురుకైన నిర్మాణాత్మక ప్లాట్‌ఫామ్‌
* పేలోడ్‌ ప్లాట్‌ఫామ్‌
* అత్యధిక డేటా నిర్వహణ రేటు
* అధిక స్పీడ్‌, సమాచార ప్రసార వ్యవస్థ
* ఆధునిక ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌
* కొత్త పవర్‌ ఎలక్ట్రానిక్స్‌
* డ్యూయల్‌ జిమ్‌బల్‌ యాంటెన్నా (360 ట్రాకింగ్‌‌)

కార్టోశాట్‌ - 3 సేవలను పెద్ద మొత్తంలో పట్టణ ప్లానింగ్‌, మౌలిక వసతుల అభివృద్ధి, తీరప్రాంత వినియోగం, సైనిక నిఘా, పౌర అవసరాలకు అయిదేళ్ల పాటు వినియోగించుకోనున్నారు.
కార్టోగ్రఫీ: పటాల తయారీకి సంబంధించిన శాస్త్రాన్ని కార్టోగ్రఫీÆ అంటారు. దీనికి తోడ్పడే రిమోట్‌ సెన్సింగ్‌ తరహా శాటిలైట్‌ కార్టోశాట్‌. ఈ శ్రేణిలో ఇస్రో ప్రయోగించిన తొమ్మిదో ఉపగ్రహం కార్టోశాట్‌ - 3. ఇతర ఉపగ్రహాల కంటే దీనికి కచ్చితత్వం ఎక్కువ. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ స్పేస్‌ కంపెనీ డిజిటల్‌ గ్లోబ్‌ ప్రయోగించిన జియో ఐ-1 భూమి నుంచి 16.14 అంగుళాల ఎత్తు నుంచి ఫొటోలను తీస్తే కార్టోశాట్‌ - 3 శాటిలైట్‌ 9.84 అంగుళాల నుంచే ఫొటోలను తీస్తుంది. జియో ఐ1 రిజల్యూషన్‌ 0.46 మీ., కార్టోశాట్‌ - 3 రిజల్యూషన్‌ 0.25 మీ.


పీఎస్‌ఎల్‌వీ సీ-47
2019 నవంబరు 27న సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-47 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్‌ సహాయంతో భారతీయ ఉపగ్రహం కార్టోశాట్‌ - 3, పదమూడు వాణిజ్య నానో శాటిలైట్లను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. 1993లో ప్రారంభించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల పరంపరలో ఇది 49వ ప్రయోగం. ఆరు స్ట్రాప్‌ ఆన్‌ మోటార్లను కలిగి ఉండే పీఎస్‌ఎల్‌వీ-శ్రీలి తరహా రాకెట్‌ ప్రయోగాల్లో ఇది ఇరవై ఒకటోది. 44.4 మీ. పొడవు, సుమారు 320 టన్నుల బరువైన ఈ రాకెట్‌ నాలుగు అంచెల్లో వరుసగా ఘన, ద్రవ, ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తారు. మొదటి అంచెలో అదనంగా బిగించే ఆరు స్ట్రాప్‌ ఆన్‌ బూస్టర్‌ మోటార్లు రాకెట్‌ ప్రయోగం తొలి అంకంలో కావాల్సిన అదనపు ఒత్తిడిని కలగజేసేందుకు దోహదపడతాయి. పీఎస్‌ఎల్‌వీ సీ47 ప్రయోగించిన 18 నిమిషాల్లోనే కార్టోశాట్‌-3 ని 509 కి.మీ. ఎత్తు, 97.5ా వాలుతో ఉండే సూర్యానువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మరో 9 నిమిషాల్లో వరుసగా 13 నానో శాటిలైట్లను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.
రిశాట్‌-2బిఆర్‌1: ఎక్స్‌-బ్యాండ్‌ రాడార్‌ని కలిగి, భూమిపై 0.35 మీటర్ల దూరంతో ఉండే రెండు వస్తువులను గుర్తించే రాడార్‌ ఇమేజింగ్‌ (భూ పరిశీలక) ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్‌ 16 నిమిషాల్లోనే 576 కి.మీ. దూరంలో, 37 డిగ్రీల వాలుతో ఉండే దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎక్స్‌-బ్యాండ్‌ రాడార్‌ 8 నుంచి 12 గిగాహెర్ట్జ్‌ పౌనఃపున్యాల మధ్య ఉండే తరంగాలను పరిశీలిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే ఈ ఉపగ్రహాన్ని జాతీయ రక్షణకు; పౌర, వ్యవసాయ, అటవీ, విపత్తు - నిర్వహణ రంగాల్లో ఉపయోగించనున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగానికి PSLV-QL తరహా రాకెట్‌ని ఉపయోగించారు. దీని మొదటి అంచెలో నాలుగు ఘన ఇంధన స్ట్రాప్‌ ఆన్‌ మోటార్లను ఉపయోగించారు.

పీఎస్‌ఎల్‌వీ ‘అర్ధశతక’ యాత్ర
పీఎస్‌ఎల్‌వీ తన 50వ ప్రయోగంలో భారత అత్యాధునిక రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం రిశాట్‌-2బిఆర్‌1తో పాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
పీఎస్‌ఎల్‌వీ: 1994 అక్టోబరులో ప్రారంభమైన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహక నౌకల విజయపరంపర దిగ్విజయంగా కొనసాగుతోంది. భారత అంతరిక్ష రంగానికి చెందిన మూడోతరం రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ. ఇది అనేక రకాల పేలోడ్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వాటిలో ప్రధానమైనవి చంద్రయాన్‌ - 1 (2008), మంగళ్‌యాన్‌ (2013), కమ్యూనికేషన్‌ శాటిలైట్‌, నేవిగేషన్‌ శాటిలైట్లు. త్వరలోనే పీఎస్‌ఎల్‌వీతో ఆదిత్య-లి1 (సూర్యుడి మిషన్‌)ను కూడా చేపట్టనున్నారు. నాలుగు అంచెలు, 44 మీటర్ల పొడవు, 320 టన్నుల ద్రవ్యరాశితో ఉండే పీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో నాలుగు రకాలు ఉన్నాయి. మొదటి అంచెలో వాడే స్ట్రాప్‌ ఆన్‌ మోటార్ల సంఖ్య ఆధారంగా అవి PSLV-G, PSLV-CA, PSLVXL, PSLV-QL ఇరవై ఆరేళ్లలో పీఎస్‌ఎల్‌వీ సుమారు 52 టన్నుల ద్రవ్యరాశిని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అందులో 17% విదేశాలకు చెందింది. పీఎస్‌ఎల్‌వీతో ప్రయోగించిన 319 విదేశీ ఉపగ్రహాల్లో 233 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి. పీఎస్‌ఎల్‌వీ 50 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. అవి: PSLV-D1 (1993), PSLV C-39 (2017)

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌