• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సాహితీ సౌరభాలు

  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనరల్ స్టడీస్‌లో ప్రధాన అంశాల్లో తెలంగాణ సాహిత్యం ఒకటి. దీని పట్ల అంతగా పరిచయం లేని ఇంజినీరింగ్ విద్యార్థులతోపాటు గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు తెలంగాణ సాహిత్యాన్ని ఎలా చదవాలి? పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? తదితర అంశాలపై ప్రముఖ సాహితీవేత్త, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు నందిని సిధారెడ్డి విశ్లేషణ..

  ప్రాచీన సాహిత్యాన్ని స్థూలంగా నాలుగు దశలుగా గుర్తించాలి. అవి 1. సోమనకు పూర్వయుగం, 2. పాల్కురికి సోమన యుగం, 3. పోతన యుగం, 4. గోపరాజు యుగం లేదా కుతుబ్‌షాహీ యుగం.

 

సోమనకు పూర్వయుగం- (క్రీ.శ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 940)

  తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆదికవి అయిన పాల్కురికి సోమన కేంద్రంగా తెలంగాణ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే సులువుగా ఉంటుంది. సోమనకు పూర్వం తెలంగాణలో జరిగిన సాహిత్య కృషిని ముందు పరిశీలించాలి. ఇది తొలిదశ. శాతవాహనుల కాలంలో క్రీ.శ. 2వ శతాబ్ది పైశాచీ భాషలో గుణాఢ్యుడు రచించిన బృహత్కథ, హాలుడు ప్రాకృతంలో గ్రంథస్థం చేసిన గాథాసప్తశతి.. అవి తెలుగులో లేకపోయినా తెలంగాణకు తలమానికాలు. జిన వల్లభుడు క్రీ.శ. 940లో వేయించిన కుర్కాల శాసనం తొలి తెలంగాణ పద్యశాసనం. మల్లియ రేచన రచించిన 'కవి జనాశ్రయం' తెలుగులోనే మొదటి లక్షణ గ్రంథం.

 

సోమన యుగం - (క్రీ.శ. 1100 నుంచి 1300)

  పాల్కురికి సోమన ప్రధానంగా శివకవి. దేశీచ్ఛందస్సులో దేశికవిత సృష్టించాడు. జానుతెలుగులో స్థానిక శివభక్తుల కథలు రచించాడు. సోమన రచించిన 'వృషాధిప శతకం' తెలుగులో మొదటి శతకం. తెలుగులో మొదటి వచనం - సింహగిరి వచనాలు.. రచించింది కృష్ణమాచార్యులు. రంగనాథ రామాయణాన్ని రచించిన గోనబుద్ధారెడ్డి, మార్కండేయ పురాణాన్ని రచించిన మారనలను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.

 

పోతన యుగం-(క్రీ.శ. 1300 - 1500)

  పోతన యుగంగా చెప్పే ఈ కాలంలో మడికి సింగన (సకల నీతి సమ్మతం), మల్లినాథ సూరి (కాళిదాస కావ్యాలకు వ్యాఖ్యానాలు), గౌరన (హరిశ్చంద్రోపాఖ్యానం) మొదలైన కవులను పరిశీలించవచ్చు.హాలికుడిగా జీవనం గడుపుతూ రాజాశ్రయాన్ని ధిక్కరించి శ్రీమత్‌భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన తెలంగాణ గర్వించదగ్గ కవి. ఈ కాలంలో పేరొందిన మరోకవి గౌరన. దేశీఛందమైన ద్విపదలో 'హరిశ్చంద్రోపాఖ్యానం', 'నవనాథ చరిత్ర'లు రచించాడు. మత్స్య పురాణం, నారసింహపురాణం రచించిన కవి హరిభట్టు ఈ కాలం కవే. కాళిదాసు రచించిన రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం కావ్యాలకు మల్లినాథ సూరి రచించిన వ్యాఖ్యానాలు సంస్కృత సాహిత్యంలో గొప్ప గుర్తింపును పొంది, కాళిదాసుకు పునర్జీవం పోశాయి. రాచకొండను పరిపాలించిన అనపోతానాయుడు, రెండో సింగభూపాలుడు స్వయంగా కవులు. అనపోతానాయుడి ఆస్థానంలో పశుపతనాగనాథ కవి పేరెన్నికగన్నవాడు.

 

కుతుబ్‌షాహీల యుగం- (క్రీశ 1500 - 1600)

  గోపరాజు యుగం లేదా కుతుబ్‌షాహీల యుగంగా చెప్పే ఈ కాలంలో సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కేంద్రంగా అద్దంకి గంగాధరుడు (తపతీ సంవరణోపాఖ్యానం), పొన్నగంటి తెలగన (యయాతి చరిత్ర), చరిగొండ ధర్మన (చిత్రభారతం)లను పరిశీలించాలి. తెలుగులో తొలి చతురర్థి కావ్యం తెలంగాణ నుంచి వెలువడింది. మరింగంటి సింగరాచార్యులు రచించిన 'నలరాఘవ యాదవ పాండవీయం నాలుగు కథలను ఏకకాలంలో బోధిస్తుంది. ఇంత అద్భుతమైన ప్రక్రియలకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. గొప్ప అవధాని ఎలకూచి బాలసరస్వతి తెలంగాణ వాడే. ఇతడు యాదవరాఘవ పాండవీయం త్య్రర్థి (ఏకకాలంలో మూడు కథల సారాని తెలిపే) కావ్యాన్ని రచించాడు. ఆ కాలంలో కందుకూరి రుద్రకవి రచించిన 'సుగ్రీవ విజయం తెలుగులో తొలి యక్షగానం. తెలంగాణ నుంచి వేలాది యక్షగానాలు రచించారు. అలాగే తెలంగాణ నుంచి వందలాది శతకాలు వెలువడ్డాయి. శతక ప్రక్రియ తెలంగాణలోనే విరాజిల్లి వెలుగొందింది. ధర్మపురిలో వెలసిన శేషప్పకవి రాసిన నారసింహ శతకం, నరసింహదాసు శ్రీకృష్ణ శతకం, కుమ్మరి సిద్దప్ప సిద్దప్ప శతకం ఇప్పటికీ ప్రజల నాలుకలపై ఆడుతున్న సుప్రసిద్ధాలు. తెలంగాణలో పదసంకీర్తన సాహిత్యం పుష్కలంగా వెలువడింది. అంతగా గుర్తింపునకు మాత్రం నోచుకోలేదు. రామదాసు, హనుమద్దాసు, కంకటదాసు, ఈద్దాసు వేలాది కీర్తనలు రచించి ప్రాచుర్యంలోకి తెచ్చారు.

 

ఆధునిక సాహిత్యం

  స్థూలంగా 20వ శతాబ్ది ఆరంభం నుంచి తెలంగాణ ఆధునిక కవిత్వ యుగంగా గుర్తించి అధ్యయనం చేయాలి. తెలంగాణ సామాజిక పరిణామ దశలు భిన్నంగా ఉన్నాయి. నిజాం రాచరిక పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారు. పన్నులు, వెట్టిచాకిరీ, నిరక్షరాస్యత, కౌలుపద్ధతి వంటివి ఎన్నో సామాజిక సంచాలనాలకు కారణమయ్యాయి. గ్రంథాలయోద్యమం, రైతాంగ విమోచనోద్యమం, సాయుధపోరాటం వంటివి సంభవించాయి. ఈ సామాజిక విప్లవాలు, ఉద్యమాలన్నీ సాహిత్యంలోనూ ప్రతిబింబించాయి. తెలంగాణలో ప్రత్యేకమైన సాహిత్యం పురుడు పోసుకుంది. సంప్రదాయరూపమైన పద్యంలో సామాజిక విప్లవ భావనలు పెల్లుబికాయి. పాటలో ప్రజల భావోద్వేగాలు ప్రజ్వరిల్లాయి. 354 మంది కవి, పండితుల రచనలతో సురవరం ప్రతాపరెడ్డి రూపొందించిన 'గోలకొండ కవుల సంచిక' తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. కాళోజీ, దాశరథి, సుద్దాల హన్మంతు, యాదగిరి, పొట్లపల్లి రామారావు, గంగులశాయిరెడ్డి, వానమామలై సోదరులు మరెందరో ఉత్తేజభరితమైన రచనలు చేశారు.

  ఆధునిక సాహిత్యంలో అవతరించిన రచనా ప్రక్రియలు కథ, నవల, వ్యాసం, ఆత్మకథ.. ఈ ప్రక్రియలన్నీ తెలంగాణలో విశేషంగా వెలువడ్డాయి. వీటిని నాలుగు దశలుగా అధ్యయనం చేయొచ్చు. రైతాంగ విమోచనోద్యమ నేపథ్యంతోను.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంతోను.. విప్లవోద్యమ భూమికగాను.. కాల్పనికోద్యమ ప్రభావంగాను.. వచ్చిన సాహిత్యాన్ని విడివిడిగా అధ్యయనం చేయడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. తెలంగాణలో తొలికథ కొమర్రాజు లక్ష్మణరావు 1910లో రాసిన ఏబది వేల బేరము. కొందరు మాడపాటి హనుమంతరావు 1912లో రచించిన హృదయశల్యము మొదటి కథగా భావిస్తారు. సురవరం ప్రతాపరెడ్డి 'సంఘాల పంతులు', కాళోజీ 'తెలియక ప్రేమ తెలిసి ద్వేషము', నెల్లూరి కేశవస్వామి 'యుగాంతం', ఆవుల పిచ్చయ్య రాసిన 'ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమిందారు, వెట్టిచాకలి దినచర్య' కథలు సుప్రసిద్ధమైనవి. వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన జైలుకథలు తెలుగు సాహిత్యంలో మొదటగా జైలు జీవితాన్ని చిత్రించాయి. పీవీ నరసింహారావు రాసిన 'గొల్లరామవ్వ' మంచి కథ. దళిత కవి భాగ్యరెడ్డి వర్మ ఆదిహిందు సంస్థను స్థాపించి దళిత చైతన్యానికి ప్రేరకుడయ్యాడు. ఆయన రచించిన 'వ్యక్తి మాదిగ' కథ దళిత జీవితాన్ని చిత్రించింది.

  తెలంగాణలో మొదటి నవల తడకమల్ల కృష్ణారావు రచించిన కంబుకందర చరిత్ర. తెలంగాణ సాహిత్యంలో లోకమలహరి రాసిన 'జగ్గనియిద్దె' నవల దళిత జీవితానికి అద్దం పట్టింది. మొదటి చారిత్రక నవల ఒద్దిరాజు రామచంద్రరావు రచించిన రుద్రమదేవి. తెలంగాణ విమోచనోద్యమాన్ని చిత్రించిన నవలలు - వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజలమనిషి', 'గంగు'; దాశరథి రంగాచార్య నవలలు - జనపదం, మోదుగుపూలు, చిల్లరదేవుళ్ళు తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించాయి. విప్లవోద్యమ నేపథ్యంతో తెలంగాణలో చాలా నవలలు వెలువడ్డాయి. అల్లం రాజయ్య (కొలిమంటుకున్నది, కొమరంభీం) సుప్రసిద్ధ నవలా రచయిత నవీన్ రచించిన 'అంపశయ్య' ద్వారా సుప్రసిద్ధుడై నవల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు.

 

అధ్యయనం చేయండిలా!

  గతంలో తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనానికి చాలా పుస్తకాలు, నోట్స్, సమాచారం అందుబాటులో ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం అభ్యర్థులు వాటిని తెలంగాణ కోణంలో ప్రత్యేకంగా సేకరించుకోవలసి ఉంటుంది. పరీక్షల కోసం నిర్ణయించిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. వాటి ఆధారంగా అధ్యయనం చేయవలసిన విషయానికి సంబంధించిన పుస్తకాలను, సమాచారం తెలిపే వ్యాసాలను సేకరించుకోవడం మొదటి పని. తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి రెండు పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి ముదిగంటి సుజాతారెడ్డి రచించిన తెలంగాణ సాహిత్య చరిత్ర, రెండోది యస్వీ రామారావు రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర. ఇవికాకుండా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రచించిన 'ముంగిలి కూడా తెలంగాణ ప్రాచీన కవుల చరిత్రే. భువనగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కళాశాల ప్రచురించిన 'తెలంగాణ సాహిత్యం-జీవిత చిత్రణం జాతీయ సదస్సు పత్రాల సంచిక (సంపాదకుడు తూర్పు మల్లారెడ్డి) కూడా చక్కగా ఉపయోగపడుతుంది.

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌