• facebook
  • whatsapp
  • telegram

వాతావరణం

  సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతలను క్రమబద్ధం చేస్తూ, జీవరాశి మనుగడకు సరిపడే విధంగా శీతోష్ణాన్ని వాతావరణం అందిస్తుంది. అందమైన నీలాకాశం, ఆహ్లాదకరమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలు, సముద్ర ఘోషలు, వర్షాలు, వరదలు, ఎడారులు అన్నీ వాతావరణం సృష్టే. సూర్యుడి నుంచి అధిక సంఖ్యలో వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు, కాస్మిక్ కిరణాల నుంచి జీవరాశిని కాపాడేది వాతావరణం.

 

వాతావరణం - భావన: వాతావరణం అంటే భూగోళాన్ని ఆవరించిన వాయువు అని అర్థం. సంస్కృతంలో వాతం అంటే గాలి అని, ఆవరణం అంటే తొడుగు అని అర్థం.

* వాతావరణం అంటే గాలితొడుగు. హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నైట్రోజన్, ఓజోన్ మొదలైన పదార్థాలను వాతాగత మూలకాలు అంటారు.

* భూమి చుట్టూ తొడుగులా ఉన్న గాలి పొరలో ఈ వాతాగత మూలకాలు ఉండటం వల్ల ఈ గాలి పొరను వాతావరణం అంటారు.

 

వాతావరణం - సంఘటనం: వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాతావరణంలో కంటికి కన్పించని ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఎన్నో ఉంటాయి.

* ఆక్సిజన్ అనేది జీవులకు ప్రాణవాయువు. ఆక్సిజన్ తనకు తాను మండిపోతూ ఇతర పదార్థాలను మండించడానికి దోహదం చేస్తుంది.

వాతావరణం - పీడనం: ప్రకృతిలోని ప్రతి పదార్థానికి బరువు ఉన్నట్లుగానే వాతావరణంలోని గాలికి కూడా బరువు ఉంటుంది. ఈ బరువు భూమి మీద ఉన్న వస్తువులపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడిని వాతావరణ పీడనం అంటారు.
* ఏదైనా ఒక ప్రదేశం వద్ద ఆ ప్రదేశం పైన ఉన్న వాయువుల పొర బరువును ఆ ప్రదేశ వాతావరణ పీడనం అంటారు. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని పీడన మాపకం లేదా భారమితి అంటారు.
* వాతావరణ పీడనం కంటికి కన్పించదు. పీడనం - ఎత్తు అనేవి విలోమానుపాతంలో ఉంటాయి. భారమితిలో పాదరస మట్టం 760 మి.మీ. ఉన్నప్పుడు అది ఎంత ఒత్తిడిని కలిగిస్తుందో దాన్ని ప్రామాణిక వాతావరణ పీడనం లేదా సామాన్య వాతావరణ పీడనం అంటారు. ఇది 1013.2 మిల్లీబార్లకు సమానం. గొట్టంలోని పాదరసం ఎత్తు 3 మి.మీ. అయితే అది 4 మిల్లీబార్ల వాతావరణ పీడనానికి సమానం. వాయుపీడనం అనేది ఉష్ణోగ్రత వ్యత్యాసాలను బట్టి మారుతుంటుంది.

 

వాతావరణం - పొరలు

ఉష్ణోగ్రతలో వ్యత్యాసాల ఆధారంగా వాతావరణాన్ని అయిదు ముఖ్య ఆవరణాలుగా విభజించవచ్చు. అవి...
1. ట్రోపో ఆవరణం 2. స్ట్రాటో ఆవరణం 3. మీసో ఆవరణం 4. థర్మో ఆవరణం 5. ఎక్సో ఆవరణం.

 

ట్రోపో ఆవరణం:

భూమిని ఆనుకుని ఉన్న మొట్టమొదటి పొర. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల దాదాపు 75 శాతం వాతావరణం ట్రోపో పొరలోనే కేంద్రీకృతమైంది. ట్రోపో అనే పదానికి అర్థం... మార్పు.
* వాతావరణంలో మార్పులన్నీ ట్రోపో ఆవరణంలోనే జరుగుతాయి. ట్రోపో ఆవరణం భూమి ఉపరితలం నుంచి 8-18 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. ధ్రువాల వద్ద దీని మందం 8 కి.మీ. మాత్రమే. భూమధ్య రేఖ వద్ద 18 కి.మీ. వరకు ఉంది. ట్రోపో పొర పగలు సూర్యతాపం నుంచి, రాత్రిళ్లు భూమి ఉపరితలంపై తగిన వెచ్చదనం నిలిపి జీవరాశులను రక్షిస్తుంది.

* ధూళికణాలు, నీటి ఆవిరి, మేఘాలు, ఉరుములు, మెరుపులు, తుపానులు, వర్షాలు మొదలైనవి ఈ పొరలోనే ఏర్పడతాయి.

* ఎత్తు పెరిగేకొద్ది ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడం ఈ ఆవరణం ప్రత్యేకత. ట్రోపో ఆవరణలో ఎత్తు - ఉష్ణోగ్రతలు విలోమానుపాతంలో ఉంటాయి. ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత తగ్గటాన్ని సాధారణ ఉష్ణోగ్రత క్రమం అంటారు. ప్రతి 166 మీటర్లకు 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపో ఆవరణలోనే సంవహనక్రియ జరుగుతుంది. ట్రోపో ఆవరణ పైభాగం సరిహద్దును ట్రోపోపాస్ అంటారు. గ్రీకు భాషలో పాస్ అంటే మార్పునకు శ్రీకారం చుట్టడం అని అర్థం.

 

స్ట్రాటో ఆవరణం:

  ట్రోపో ఆవరణం దాటిన తర్వాత ట్రోపోపాస్‌ను ఆనుకుని ఉన్న ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటారు. దీనిలో దిగువ స్ట్రాటో ఆవరణం అని, ఎగువ స్ట్రాటో ఆవరణం అని రెండుభాగాలు ఉంటాయి. ఈ రెండింటిని వేరుచేస్తూ స్ట్రాటోనల్ అనే ఒక విచిత్రమైన పొర ఉంది. స్ట్రాటో ఆవరణంలో పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎత్తుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే నియమం స్ట్రాటో ఆవరణలో వర్తించదు.)
* ట్రోపో ఆవరణంలో కన్పించే ధూళికణాలు, నీటి ఆవిరి, మేఘాలు, వర్షపాతం స్ట్రాటో ఆవరణంలో ఉండవు.
* తెల్లగా వెండిలా మెరిసే సిర్రస్ మేఘాలు అప్పుడప్పుడూ అక్కడక్కడ కన్పిస్తాయి.
* జెట్ విమానాలు స్ట్రాటో ఆవరణంలోనే ఎగురుతాయి. జెట్ విమాన ఇంజిన్ నుంచి వెలువడిన నీటి ఆవిరి ఘనీభవించి తెల్లని రిబ్బన్ ఆకారంలో కన్పిస్తుంది.
* స్ట్రాటో ఆవరణం పైభాగాన్ని స్ట్రాటోపాస్ అంటారు.

 

ఓజోన్:
సకల జీవరాశులకు ఎంతో ఉపకారం చేస్తున్న ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలోనే బాగా విస్తరించి ఉంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను, హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించి, ప్రకృతిసిద్ధ డి-విటమిన్‌ను ప్రసాదిస్తూ రికెట్స్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఓజోన్ వాయువు జీవరాశికి రక్షణ కవచం కూడా. అందుకే దీన్ని ఓజోన్ ఆవరణం అని అంటారు.
* సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను ఓజోన్ గ్రహించడం ద్వారా అక్కడ ఉష్ణం జనిస్తుంది. కాబట్టి ఆ ఆవరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.

 

మీసో ఆవరణం:
* స్ట్రాటో ఆవరణం సరిహద్దు స్ట్రాటోపాస్‌ను ఆనుకుని దాదాపు 85 కి.మీ.ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఆవరణాన్ని మీసో ఆవరణం అంటారు. గ్రీకు భాషలో మీసో అంటే మధ్య అని అర్థం.
* ట్రోపో ఆవరణానికి, మీసో ఆవరణానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతకు, ఎత్తుకు మధ్య సంబంధం విలోమానుపాతంలో ఉంటుంది. ట్రోపో ఆవరణం మాదిరిగానే సంవహన క్రియ నిర్విఘ్నంగా కొనసాగుతుంది.
* సౌర కుటుంబంలో ఉల్కలు భూవాతావారణంలోకి ప్రవేశించి, మీసో ఆవరణంలోకి రాగానే ఇక్కడ రసాయనిక చర్య జరిపి, ఉల్కలు బద్దలై ముక్కలు ముక్కలవుతాయి. వాటి నుంచి వెలువడిన దుమ్ము, ధూళి, బూడిద మీసో ఆవరణంలో అడ్డదిడ్డంగా విస్తరిస్తుంది. భూమిపై ఉన్న జీవరాశిని ఉల్కల బారి నుంచి రక్షిస్తున్నందున ఈ ఆవరణాన్ని రసాయనావరణం అంటారు.
* జమ్ము కశ్మీర్‌లో ఉన్న ఊలార్ సరస్సు ఉల్కాపాతం వల్ల ఏర్పడింది.

 

థర్మో ఆవరణం లేదా ఐనో ఆవరణం:
* మీసో ఆవరణం పైభాగమైన మీసోపాస్ నుంచి దాదాపు 800 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఆవరణాన్ని థర్మో ఆవరణం అంటారు. ఆ పేరుకు తగినట్లుగానే ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
* థర్మో ఆవరణం పైభాగాన్ని థర్మోపాస్ అంటారు. అణుసంబంధిత ఆక్సిజన్, నైట్రోజన్ వాయువుల నిరంతర రసాయనిక చర్యల వల్ల ఉష్ణం జనిస్తూ ఉంటుంది. ఈ వాతావరణ పొరలోనే అయోనైజేషన్ (Ionisation) జరగటం వల్ల దీన్ని ఐనో ఆవరణం అంటారు.

 

ఎక్సో ఆవరణం:
* విశాల ఆకాశంలో థర్మోపాస్ దాటిన తర్వాత 1000 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉన్న పొరను ఎక్సో ఆవరణం అంటారు. వాతావరణంలో కింది పొర ట్రోపో ఆవరణం, పైన ఉన్న పొర ఎక్సో ఆవరణం. ఎక్సో ఆవరణం దాటిన తర్వాత మిగిలిందంతా శూన్యమే.

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌