• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ పర్యటక రంగం

  పర్యటక రంగం ఇటీవల కాలంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) వినూత్నమైన కార్యకలాపాలతో దేశీయ, విదేశీ పర్యటకులను సైతం ఆకర్షిస్తోంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం లభించడమే కాకుండా అంతర్జాతీయ సదవగాహన ఏర్పడేందుకు తోడ్పడుతుంది. దేశీయంగా పర్యటక, సాంస్కృతిక యాత్రలవల్ల జాతీయ ఐకమత్యం పెంపొందుతుంది.

  తెలంగాణ అతి ప్రాచీన చరిత్ర ఉన్న రాష్ట్రం. వైదికతత్వం, జైన, బౌద్ధ మతాలకు కేంద్రంగా కూడా ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రమంతటా వందలాది యాత్రాస్థలాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రిసార్ట్స్, ఇకో టూరిజం (Eco-Tourism) ద్వారా జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, జూ పార్కులు, పక్షుల సంరక్షణా కేంద్రాలు ఉన్నాయి. నదులు, సరస్సులపై పడవ ప్రయాణాలను ప్రోత్సహిస్తోంది. అందుకే నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ మ్యాగజీన్ ప్రచురించిన 'ప్రపంచంలో చూడాల్సిన 20 ప్రదేశాలు 2015' జాబితాలో హైదరాబాద్ రెండో ర్యాంకును సాధించింది.

 

చారిత్రక ప్రదేశాలు:

  తెలంగాణ పర్యటక శాఖ రాష్ట్రంలోని అనేక చారిత్రక స్థలాలను కాలానుగుణంగా పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. ఇందులో ముఖ్యమైనవి: నిజాం ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన ధ్వని, కాంతి ప్రదర్శన, తారామతి బారాదరి, చార్మినార్ విద్యుద్దీపాలంకరణ, కుతుబ్‌షాహీ సమాధులు మొదలైనవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుతుబ్‌షాహీ సమాధులను పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం, అగాఖాన్ ట్రస్ట్‌ల సహాయాన్ని తీసుకుంటోంది.

 

మతసంబంధమైన ప్రదేశాలు:

  తెలంగాణ రాష్ట్రంలో అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్ ఒడ్డున ఉన్న చిలుకూరు బాలాజీ మందిరం; సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం - ఖమ్మం జిల్లా; సరస్వతి ఆలయం, బాసర - ఆదిలాబాద్ జిల్లా; లక్ష్మీనరసింహస్వామి మందిరం, యాదగిరిగుట్ట - నల్గొండ జిల్లా; వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి మందిరం; హనుమాన్ మందిరం - కొండగట్టు; నరసింహస్వామి ఆలయం, ధర్మపురి - కరీంనగర్ జిల్లా. రామప్ప దేవాలయం, పాలంపేట - వరంగల్ జిల్లా; అలంపూర్ జోగులాంబ మందిరం - మహబూబ్‌నగర్ జిల్లా; హైదరాబాద్‌లోని మక్కా మసీదు; బిర్లా మందిర్; మెదక్ చర్చ్ మొదలైనవి.

* ఈ మతపరమైన ప్రదేశాలే కాకుండా భిన్నమైన సాంస్కృతిక సంపద కూడా తెలంగాణలో ఉంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ....

బోనాలు: తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా అభివర్ణించింది. బోనాలు పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి మందిరం, లాల్‌దర్వాజలోని మైసమ్మ మందిరాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు.

బతుకమ్మ జాతర: ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ. ఈ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.పది కోట్లు మంజూరు చేస్తోంది.

సమ్మక్క-సారలమ్మ జాతర: ఈ జాతరనే మేడారం జాతర అని కూడా అంటారు. ఈ పండుగను ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహిస్తారు. కుంభమేళా తర్వాత అంతటి జనసందోహం ఈ జాతరకు వస్తుందని ఒక అంచనా. 2014 లో సుమారు కోటి మందికి పైగా ఈ జాతరకు హాజరయ్యారు.

 

గ్రామీణ పర్యటక కేంద్రాలు

  హస్తకళలలో తెలంగాణది అందెవేసిన చేయి. ఇక్కడి హస్తకళా సామగ్రికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. భారత ప్రభుత్వం గుర్తించిన కొన్ని అతి ముఖ్యమైన ప్రాజెక్టులు:

* పోచంపల్లి గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - నల్గొండ
* నిర్మల్ గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - ఆదిలాబాద్
* చెరియాల్ గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - వరంగల్
* పెంబర్తి గ్రామీణ పర్యటక ప్రాజెక్టు - వరంగల్
ఇకో టూరిజం: రాష్ట్రంలో అనేక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, అడవులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రకృతి అందాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అడవులు, లేక్ రిసార్ట్స్‌లలో ఇకోటూరిజం ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:
* అలీసాగర్ జింకల పార్కు - నిజామాబాద్
* ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం - వరంగల్
* పాకాల్ వన్యమృగ రక్షణ కేంద్రం - వరంగల్
* కవ్వాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్
* జన్నారం వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్
* శివరాం వన్యమృగ సంరక్షణ కేంద్రం - ఆదిలాబాద్
* భీముని పాదం జలపాతం - వరంగల్
* మంజీర పక్షుల సంరక్షణ కేంద్రం - సంగారెడ్డి
* పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - మెదక్
* షామీర్‌పేట్ జింకల పార్కు - హైదరాబాదు
* మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు - హైదరాబాద్
* కుంతల జలపాతం - ఆదిలాబాద్
* ఎత్తిపోతల జలపాతం - నల్గొండ

 

వారసత్వ పర్యటక ప్రదేశాలు:

  తెలంగాణలో వారసత్వ సంపదకు చిహ్నాలైన అనేక రాచకోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ, పర్యటక శాఖల ఆధ్వర్యంలో ఉన్నాయి.

* వీటిలో కొన్ని ముఖ్యమైనవి: గోల్కొండ కోట, మెదక్ కోట, ఖమ్మం ఖిల్లా, నిజామాబాద్ కోట, ఎలగందుల కోట, కరీంనగర్ కోట, భువనగిరి కోట, వరంగల్ కోట మొదలైనవి.
* ప్రపంచస్థాయి వసతులు కలిగిన తెలంగాణ కళాభారతి (హైదరాబాద్), కాళోజీ కళాకేంద్రాలను (వరంగల్) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* కళలను ప్రోత్సహించడానికి రాచకొండ (నల్గొండ - రంగారెడ్డి జిల్లా)లో 2000 ఎకరాల్లో మెగా సినిమా సిటీని ఏర్పాటు చేయనున్నారు.

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌