• facebook
  • whatsapp
  • telegram

అగ్ని పర్వతాలు

  భూ అంతర్భాగంలో అంతర్జనిత శక్తుల వల్ల ఏదైనా మార్పు సంభవిస్తే ఉష్ణోగ్రత పెరిగి శిలలు కరుగుతాయి. ఆ శిలాద్రవం విదరాల ద్వారా గానీ, కుహరం ద్వారా గానీ ఉపరితలం చేరి చల్లారి, ఘనీభవిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి.
* అగ్నిపర్వతం: భూగర్భంలో ఉన్న శిలాద్రవం ఉపరితలం చేరటానికి ఉపయోగపడే మార్గం.
మాగ్మా: భూ అంతర్భాగంలో వాయువులతో కూడి ఉన్న శిలాద్రవం.
లావా: భూ ఉపరితలాన్ని చేరిన శిలాద్రవం.
ఆమ్లలావా: లావాలో సిలికాపాళ్లు 65 శాతం కంటే ఎక్కువగా ఉండేది.
మౌలికలావా: లావాలో సిలికాపాళ్లు 45 శాతం కంటే తక్కువగా ఉండేది.
తాపశిలాశకలాలు: అగ్నిపర్వత విస్ఫోటనంలో వెదజల్లే ధూళి, సిండర్.

 

అగ్నిపర్వతాల అంతర్గమ స్వరూపాలు

  శిలాద్రవం భూ అంతర్భాగం నుంచి ఉపరితలానికి ప్రవహించేటప్పుడు, ఉపరితలానికి కొంత దిగువన ఘనీభవించి కొన్ని భూస్వరూపాలు ఏర్పడతాయి. అవి. 1) డైక్ 2) సిల్ 3) లాకోలిత్ 4) బాతోలిత్‌లు. ఈ స్వరూపాలు భూ అంతర్భాగంలో ఏర్పడతాయి కాబట్టి వీటిని అంతర్గమ స్వరూపాలు అని అంటారు.

 

అంతర్గమ స్వరూపాలు (INTRUSIVE FORMS)

* డైక్ - శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించే మార్గం మధ్యలో ఏర్పడిన స్తంభం లాంటి శిలా స్వరూపం.

* సిల్ - శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించే మార్గం మధ్యలో రెండు సమాంతర పొరల మధ్య ఘనీభవించి ఏర్పడిన పొర     

* లాకోలిత్ - శిలాద్రవం రెండు పొరల మధ్య చిన్న గుమ్మటం ఆకారంలో ఏర్పడిన స్వరూపం.

* బాకోలిత్ - శిలాద్రవం పైకి ప్రవహించేటప్పుడు తన మార్గంలో ఉన్న శిలలను కరిగించి తనలో కలుపుకోవడం ద్వారా ఏర్పడిన విశాలమైన గుమ్మట ఆకార స్వరూపం.

 

అగ్నిపర్వతాల విస్తరణ

        ప్రపంచంలో సుమారు 500కు పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. మొత్తం అగ్నిపర్వతాల్లో 80 శాతం కంటే ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఒక మేఖలగా విస్తరించి ఉన్నాయి. ఈ మేఖలను పసిఫిక్ పరివేష్టిత మేఖల అంటారు. అధిక సంఖ్యలో అగ్నిపర్వతాలు ఈ మేఖలలో ఉండటంతో దీన్ని పసిఫిక్ అగ్నివలయం అంటారు.

 

అగ్నిపర్వతాల ద్వారా వెలువడే పదార్థాలు

  అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల అనేకరకాలైన పదార్థాలు భూ అంతర్భాగం నుంచి బయటికి వస్తాయి. ఇవి ఘన, ద్రవ, వాయు రూపంలో ఉంటాయి.
* టుఫ్ - నీరు, ధూళి, శిలాభస్మాల కలయికవల్ల ఏర్పడే రాయిలాంటి పదార్థం.
* స్కోరియా - నురగతో కూడిన శిలాద్రవం ఘనీభవించగా ఏర్పడిన పదార్థం.
* ప్యూమైస్ - శిల అయినప్పటికీ నీటిలో తేలుతుంది.
* లాపిలి - గులకరాయి పరిమాణంలో ఉన్న రాళ్లు.
* ఎగ్లోమరేట్ - స్కోరియా, ప్యూమైస్, శిలాభస్మాల కలయికతో ఏర్పడిన మిశ్రమ శిలలు.

  భూమిలో ఉండే అధిక ఉష్ణోగ్రత వల్ల భూమి లోపల ఇంకిన సముద్ర నీరు విఘటనం చెంది హైడ్రోజన్ క్లోరైడ్ (HCl),హైడ్రోజన్ ఫ్ల్లోరైడ్ (HF), హైడ్రోజన్‌గా ఏర్పడుతుంది. మాగ్మా సున్నపురాళ్ల ద్వారా ప్రవహించడంవల్ల కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. హైడ్రోకార్బన్‌లు, గంధకం, అమ్మోనియం, సల్ఫర్ డైఆక్సైడ్, ఇతర వాయువులు కూడా బయటి వాతావరణంలోనికి వెలువడతాయి.

  పంకాగ్ని పర్వతాలు: వేడినీటితోపాటు బురదను కూడా ఉపరితలం వైపు వెదజల్లే పర్వతాలను పంకాగ్ని పర్వతాలు అని అంటారు.

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌