• facebook
  • whatsapp
  • telegram

యుద్ధనౌకలు, జలాంతర్గాములు

* భారత నావికాదళ ప్రత్యేకతలు

భారతదేశ త్రివిధ దళాల్లో నావికాదళం ఒకటి. వేల కిలోమీటర్ల సాగరతీరం ఉన్న మన దేశంలో సముద్ర మార్గం గుండా పొంచిఉండే ముప్పును సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఇది సర్వదా సిద్ధంగా ఉంటుంది. భారత నావికాదళం అమ్ములపొదిలో అత్యంత కీలకమైనవి యుద్ధనౌకలు, జలాంతర్గాములు. సముద్రజలాల మీద, లోపల కూడా పహారా కాస్తూ రక్షణ రంగంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ఇంతటి కీలకమైన జలాంతర్గాముల నిర్మాణం ఎలా ఉంటుంది? ఇవి ఎలా పనిచేస్తాయి? యుద్ధనౌకలు ఏం చేస్తాయి? భారత జలాంతర్గాములు, యుద్ధనౌకల ప్రత్యేకతలేమిటి? టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయనున్న అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్‌లో భాగంగా అధ్యయన సమాచారం.

భారతదేశం ఒక ద్వీపకల్పం. భారత తీరరేఖ పొడవు 7516.6 కిలో మీటర్లు (చుట్టూ ఉండే దీవులతో కలిపి). ప్రధాన భూభాగం, సముద్రాన్ని కలిపే తీరం పొడవు 6,100 కి.మీ. సముద్రం మీదుగా వచ్చే విపత్తులను, శత్రువుల దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం సిద్ధంగా ఉంది. నావికాదళానికి యుద్ధ నౌకలు గుర్రాలైతే.. జలాంతర్గాములు (సబ్‌మెరైన్‌లు) రోబోట్‌ల వంటి తిమింగలాలు. ఇవి శత్రువులకు కనిపించకుండా కొన్ని నెలల పాటు నీటిలో మునిగి ఉండగలవు. కొన్ని సంవత్సరాలపాటు ఇంధనాన్ని తిరిగి నింపాల్సిన అవసరం లేని న్యూక్లియర్ జలాంతర్గాములను కూడా కనుక్కుంటున్నారు.

 

జలాంతర్గామి (సబ్‌మెరైన్)

జలాంతర్గామి నీటి ఉపరితలంపైనే కాకుండా.. నీటి అడుగు భాగాన కూడా ప్రయాణిస్తుంది. వేగంగా, నిశ్శబ్దంగా నీటిలో ప్రయాణించే ఈ సబ్‌మెరైన్‌లు.. శత్రువులకు చెందిన నౌకలను, విమాన వాహకనౌకలను, జలాంతర్గాములను కూడా ధ్వంసం చేస్తాయి. క్షిపణి ప్రయోగ వేదికలుగా, పరిశోధన శాలలుగా, పర్యటక వాహనాలుగా కూడా ఉపయోగపడతాయి.

నిర్మాణం: జలాంతర్గామి ఒక పెద్ద స్తూపాకార నిర్మాణం. దీని రెండు చివరలు అర్ధగోళాకారంలో ఉంటాయి. మధ్య భాగంలో పొడవాటి స్తూపాకార నిర్మాణం (టవర్) ఉంటుంది. దీనిలో ప్రధానంగా సమాచార వ్యవస్థ, పెరిస్కోప్ సెన్సింగ్ (గుర్తించే) పరికరాలు ఉంటాయి. సబ్‌మెరైన్ దిశను మార్చేందుకు చేప మొప్పలను పోలిన నిర్మాణాలుంటాయి.

జలాంతర్గామిలోని బ్యాలస్ట్ ట్యాంకులను సముద్రపు నీటితో నింపితే అది పూర్తిగా నీటిలో మునిగి ప్రయాణిస్తుంది. ట్యాంకులను ఖాళీ చేసి గాలితో నింపితే నౌకలా పూర్తిగా నీటిపైకి తేలుతుంది. పాక్షికంగా గాలితోనూ, నీటితోనూ నింపితే సబ్‌మెరైన్ సగం మునిగి, సగం తేలుతుంది. పూర్తిగా మునిగినప్పుడు దాని సాంద్రత పెరుగుతుంది. ట్యాంకులు గాలితో నిండినప్పుడు సాంద్రత తగ్గిపోతుంది.

సైనికులకు ఆక్సిజన్ ఎలా?

నీటిలో మునిగి ఉండే సబ్‌మెరైన్‌లలోని సైనికులు తమకు కావాల్సిన ఆక్సిజన్‌ను నీటిని విద్యుత్ విశ్లేషణం (ఎలక్ట్రాలిసిస్) చేయడం ద్వారా పొందుతారు. ఆధునిక న్యూక్లియర్ ఆధారిత సబ్‌మెరైన్‌లు న్యూక్లియర్ రియాక్టర్లను కలిగి ఉంటాయి. ఇవి సబ్‌మెరైన్‌కి కావాల్సిన విద్యుత్తును సరఫరా చేస్తాయి. కొన్ని కిలోల రేడియోధార్మిక ఇంధనం కొన్ని సంవత్సరాల వరకు సబ్‌మెరైన్‌లను నడిపించగలదు. అందులోని సైనికులు సముద్రపు నీటిని శుద్ధిచేసి తాగునీటిని సమకూర్చుకుంటారు.

జలాంతర్గాముల ప్రయాణానికి గైరోస్కోప్ ఆధారిత జడత్వ మార్గదర్శనం (ఇనర్షియల్ గైడెన్స్), పెరిస్కోప్, శాటిలైట్ ఆధారిత జీపీఎస్ వ్యవస్థ, సోనార్, రాడార్లు తోడ్పడతాయి.

ఇతర సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించిన క్షిపణులు (మిస్సైల్స్), సముద్రంలో దాచిన మందుపాతరలు, సబ్‌మెరైన్‌లలో జరిగే పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు సబ్‌మెరైన్లను ధ్వంసం చేస్తాయి.

 

భారత్ బలగం

ప్రస్తుతం భారతదేశంలో 15 సబ్‌మెరైన్లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను 2020 నాటికి 21కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉన్న సబ్‌మెరైన్లలో 9 కిలోక్లాస్ (డీజిల్-ఎలక్ట్రిక్) రకానికి, 4 జర్మనీ తయారీ (హెచ్‌డీడబ్ల్యూ) రకానికి చెందినవి. ఒకటి రష్యా నుంచి అద్దెకు తెచ్చిన 'అకుల' రకానికి చెందిన కేంద్రక శక్తి ఆధారిత న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్ (ఎస్ఎస్ఎన్). భారత్ దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి న్యూక్లియర్ జలాంతర్గామి 'ఐఎన్ఎస్-అరిహంత్‌'ను ప్రస్తుతం సముద్రంలో పరీక్షిస్తున్నారు.

భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ముంబై, స్కార్పియన్ తరగతికి చెందిన 'కల్వరి' అనే సబ్‌మెరైన్‌ని అభివృద్ధి చేస్తోంది. దీన్ని ఇటీవల జల ప్రవేశం చేయించి విస్తృతంగా పరీక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ 75లో భాగంగా 2020 నాటికి నావికా దళానికి ఇలాంటివి మరో ఐదింటిని సమకూర్చనున్నారు.

 

ప్రధాన యుధ్ధ నౌకలు

ఐఎన్ఎస్ విక్రమాదిత్య

ఇది అతిపెద్ద యుద్ధ వాహక నౌక. ఒకేసారి 36 యుద్ధ విమానాలను తీసుకెళ్లగలదు. 1987లో నిర్మించిన ఈ నౌక యూఎస్ఎస్ఆర్, రష్యా దేశాల్లో సేవలందించి 2014లో భారత్‌కు చేరింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 జూన్ 14న భారత నావికా దళానికి అంకితం చేశారు.

ఐఎన్ఎస్ విక్రాంత్

భారత్ నిర్మించిన తొలి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీన్ని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. 2013 ఆగస్టులో ఇది జలప్రవేశం చేసింది.

ఐఎన్ఎస్ కొచ్చి

భారత్‌లో తయారైన అతిపెద్ద యుద్ధ నౌక. కోల్‌కత క్లాస్‌కి చెందిన మూడింటిలో ఇది రెండో నౌక. దీన్ని నావికా దళం డిజైన్ చేయగా, ముంబైలోని మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. క్షిపణులను ధ్వంసం చేయగల బహుళ యుద్ధ వ్యూహాలను ప్రదర్శించే ఈ నౌక 2015 సెప్టెంబరు 30న జలప్రవేశం చేసింది. ఈ తరహాకి చెందిన ఐఎన్ఎస్ - కోల్‌కత, 2014 ఆగస్టులో జలప్రవేశం చేసింది. మూడో రకమైన ఐఎన్ఎస్ - చెన్నై 2016 నాటికి అందుబాటులోకి రానుంది.

ఐఎన్ఎస్ సహ్యాద్రి

ఇది శివాలిక్ రకానికి చెందిన రహస్య బహుళ పాత్ర పోషించే చిన్న తరహా యుద్ధ నౌక. దీన్ని మజగావ్ డాక్ లిమిటెడ్ 2011లో నిర్మించింది. 2012 జులై 21న జలప్రవేశం చేసింది. 'లుక్ ఈస్ట్', 'యాక్ట్ ఈస్ట్' విధానం (పాలసీ)లో భాగంగా నావికా దళం దీన్ని వియత్నాంలో అక్టోబరు 2 నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ఇందులో దీర్ఘ వ్యాప్తి యాంటీషిప్ మిస్సైల్స్, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే మిస్సైల్స్, శక్తిమంతమైన తుపాలకుతో పాటు రెండు హెలికాప్టర్లు ఉన్నాయి.

ఐఎన్ఎస్ కవరట్టి

యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ రకానికి చెందిన రహస్య చిన్న తరహా నౌక. దీన్ని 2015 మే 19న జలప్రవేశం చేశారు. ప్రాజెక్ట్-28లో నిర్మిస్తున్న నాలుగు యాంటీ సబ్‌మెరైన్ నౌకల్లో ఇది చివరిది. మిగతా మూడూ ఐఎన్ఎస్-కమోర్త, ఐఎన్ఎస్-కడమత్, ఐఎన్ఎస్-కిల్టాన్.

ఐఎన్ఎస్ విశాఖపట్నం

భారతదేశ అత్యధిక శక్తిమంతమైన, భయానక విధ్వంసకారి (డెస్ట్రోయర్). దీన్ని 2015 ఏప్రిల్ 21న నావికా దళాధిపతి అడ్మిరల్ ఆర్.కె.ధోవన్ భార్య మిను ధోవన్ ముంబైలో జలప్రవేశం చేశారు. 2018 నాటికి నావికాదళంలో చేరనుంది. దీనిలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సూపర్‌సోనిక్ క్షిపణులు, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే బరాక్-8 క్షిపణులను అమరుస్తారు.

* భారతదేశంలో ఉత్పత్తి అయిన ఉక్కుతో డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ దీన్ని రూపొందించింది.

ఐఎన్ఎస్ అస్త్రధరణి

దీన్ని ఎన్ఎస్‌టీఎల్ తయారు చేసింది. ఇది ఆయుధాలను నీటిలో పరీక్షించేందుకు, తిరిగి వాటిని పొందేందుకు ఉపయోగపడుతుంది. తొలిసారిగా ప్రైవేటు షిప్‌యార్డ్‌లో తయారైన యుద్ధనౌక. ఇది 2015 అక్టోబరు 6న విశాఖపట్నంలో జల ప్రవేశం చేసింది.

 

ప్రధాన జలాంతర్గాములు

ఐఎన్ఎస్ చక్ర

సంప్రదాయ జలాంతర్గామికి భిన్నంగా న్యూక్లియర్ శక్తితో పనిచేసే ఐఎన్ఎస్ చక్ర సబ్‌మెరైన్‌ని రష్యా నుంచి 10 సంవత్సరాల కాలం పాటు లీజుకు తీసుకున్నారు. దీన్ని 2012 ఏప్రిల్‌లో భారత నావికా దళానికి అప్పగించారు. ఇది శత్రు నౌకలను వేటాడి, చంపే (హంట్ అండ్ కిల్) రకానికి చెందింది.

ఐఎన్ఎస్ కల్వరి

భారత్‌లో తయారైన తొలి స్కార్పియన్ రకానికి చెందిన సబ్‌మెరైన్. దీన్ని ఫ్రాన్స్ సహకారంతో మజగావ్ డాక్ లిమిటెడ్ తయారు చేసింది. 2020 నాటికి ఈ తరహాకి చెందిన మరో 5 జలాంతర్గాములను నిర్మించనున్నారు.

* ఇది సముద్రం లోపల 50 రోజులపాటు సుమారు 12,000 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.

* 2015 ఏప్రిల్ 6న దీన్ని జలప్రవేశం చేయించారు. 2016 జూన్ నాటికి భారత నావికాదళంలో చేరనుంది.

 

 

ఐఎన్ఎస్ అరిహంత్

విశాఖపట్నంలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ దేశీయ పరిజ్ఞానంతో నిర్మించింది. ఇది న్యూక్లియర్ శక్తితో నడిచే తొలి బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్. దీన్ని నడిపించేందుకు వాడే 83 మెగా వాట్ల శక్తి ఉన్న ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ (పీడబ్ల్యూఆర్)ని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) కల్పకంలో అభివృద్ధి చేశారు.

* భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ 2014 డిసెంబరు 15న ఐఎన్ఎస్ అరిహంత్‌ను వైజాగ్‌లో జలప్రవేశం చేయించారు. అణు బాంబులను కలిగిన కె-4 (వ్యాప్తి - 3,500 కి.మీ.), బీవో-5 (వ్యాప్తి - 700 కి.మీ.) రకాల క్షిపణులను అరిహంత్ నుంచి ప్రయోగిస్తారు.

* 2016 సంవత్సరం నాటికి ఇది నావికాదళంలో చేరనుంది.

* అరిహంత్ రకానికి చెందిన మరో రెండు సబ్‌మెరైన్లను తయారు చేయనున్నారు. ఈ తరహాకి చెందిన రెండో సబ్‌మెరైన్‌ని ఐఎన్ఎస్- అరిధమన్ అని పిలవనున్నారు.

ఐఎన్ఎస్ సింధురక్షక్

రష్యాలో తయారైన సంప్రదాయ డీజిల్-ఎలక్ట్రిక్ రకానికి చెందింది. 2006 ఫిబ్రవరి 13న అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇందులో ప్రయాణించారు. 2010లో స్పల్పంగాను, 2013 ఆగస్టు 14న పెను ప్రమాదానికి గురై ముంబై డాక్‌యార్డ్‌లో మునిగిపోయింది.

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌