• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో జలవనరులు - నీటిపారుదల

  భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా అనిశ్చితమైన (uncertain) రుతుపవనాల మీద, అస్తవ్యస్తంగా (uneven) ఉండే వర్షపాతం మీద ఆధారపడి ఉంది. భారతదేశం భిన్న శీతోష్ణస్థితులున్న దేశం. ఈ దేశంలోని రుతువులూ, వాతావరణ పరిస్థితులూ వివిధ రకాలుగా ఉంటాయి. క్షామ, వరద ప్రాంతాలతో పాటు వివిధ రకాల ప్రాంతాలు దేశంలో ఏకకాలంలోనే కనిపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న వరదలు, కరవులే దీనికి నిదర్శనం. రుతుపవనాల కాలంలోనే ప్రధానంగా వర్షాలు కురుస్తాయి. వార్షిక వర్షపాతంలో దాదాపు 80 శాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల కాలంలోనే నమోదవుతుంది. మిగిలిన 20 శాతం శీతాకాలంలో నమోదవుతుంది. కాబట్టి భారతదేశ వ్యవసాయంలో నీటి పారుదల రంగం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. దేశంలో జలవనరులు పుష్కలంగా ఉన్నాయి. అనేక నదులు ప్రవహిస్తూ ఉండటంతో పాటు, భూగర్భ జలాన్ని పట్టి ఉంచే ఒండలి హరివాణాలు కూడా విస్తారంగా ఉన్నాయి. మన జలవనరులను రెండువర్గాలుగా విభజించారు.

అవి: 1) ఉపరితల జలవనరులు, 2) భూగర్బ జలవనరులు. ఇవి హైడ్రోలాజిక్ చక్రం అనే భూ జల ప్రసరణ వ్యవస్థలో భాగమే.

  అందువల్ల అభిలషణీయమైన అభివృద్ధితో పాటు మన జలవనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది.
పూర్వపు నీటి పారుదల విభాగం పేరును 1985 అక్టోబర్‌లో జలవనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు. జాతీయవనరుగా నీటిని అభివృద్ధి పరచి పరిరక్షించే, ప్రధానమైన పాత్రను ఈ శాఖకు అప్పగించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ జల వనరుల మండలి, 1987 సంవత్సరంలో జాతీయ జల విధానాన్ని రూపొందించింది. ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, అమలుకు సంబంధించి, ఒక సంఘటితమైన అనేక విషయాలతో కూడిన దృక్పథాన్ని అనుసరించాలని ఈ విధానం సిఫార్సు చేసింది. ప్రాజెక్టుల ప్రణాళికకూ, నిర్వహణకూ సంబంధించిన ప్రాధాన్య ప్రాంతాలను కూడా ఇది రూపొందించింది. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆ తరవాత వరుసగా నీటి పారుదల, జల విద్యుత్తు, నౌకాయానం, పారిశ్రామిక ప్రయోజనాలు మొదలైనవాటికి ప్రాధాన్యమిచ్చారు. ఉపరితల, భూగర్భజల నాణ్యతను కూడా పర్యవేక్షించాలని ఈ విధానం సిఫార్సు చేసింది.

  1987 తరువాత కేంద్ర ప్రభుత్వం తిరిగి 2002లో జాతీయ జల విధానాన్ని రూపొందించింది. ఇందులోని ప్రధాన అంశాలు 1. అందుబాటులో ఉన్న ఉపరితలజలాలను, భూగర్భ జలాలను అభిలషణీయ స్థాయిలో (Optimum sustainable) వినియోగించుకోవడం, జలవనరుల వినియోగానికి సంబంధించి ఉత్తమ సమాజాల వ్యవస్థను అభివృద్ధి పరచడం, జలవనరులను పరిమాణాత్మకంగా (quantity), గుణాత్మకంగా (quality) అభివృద్ధి పరచడం. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని జలవనరులను వినియోగించుకోవడం జలవనరుల (నీటి) వినియోగంలో , నిర్వహణలో వినియోగదారులను భాగస్వాములను చేయడం. జలవనరుల నిర్వహణలో, అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం. నీటి వనరుల వినియోగంలో సేవల, జవాబుదారీతనాన్ని (accountability)  మెరుగుపరచడం మొదలైనవి.

 

నీటి పారుదల సదుపాయాన్ని పెంపొందించడం (Irrigation Development):

ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే ప్రధాన వ్యూహాల్లో, ఇప్పటికే ఏర్పాటుచేసిన వ్యవస్థలను సుస్థిరం చేయడంతోపాటు నీటి పారుదల సదుపాయాన్ని విస్తరించడం కూడా ఒకటి. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, ఆయకట్టు అభివృద్ధి, చెరువులు, భూగర్భ జలవినియోగం వంటి వాటి ద్వారా నీటిపారుదల సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

 

భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులు (Major Medium and Minor Irrigation Projects):

పదివేల హెక్టార్లకు మించిన ఆయకట్టుతో ఉన్న ప్రాజెక్టులను భారీ ప్రాజెక్టులనీ, రెండు వేలకు పైన పదివేల హెక్టార్లకు తక్కువ ఆయకట్టుతో ఉన్న ప్రాజెక్టులను మధ్యతరహా ప్రాజెక్టులనీ, 2000 హెక్టార్లకంటే తక్కువ ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులను చిన్నతరహా ప్రాజెక్టులనీ వర్గీకరించారు. దీనికే Culturable Command Area (CCA) అని పేరు.

 

వాటర్‌షెడ్ నిర్వహణ (Watershed Managemant):

ఆరో ప్రణాళిక కాలంలో ప్రారంభించిన వర్షాధార ప్రాంతాల వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా వర్షాధార వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రధానమైన కార్యక్రమంలో విస్తృత మార్పులు ప్రవేశపెట్టారు. 30శాతానికి తగ్గకుండా నీటిపారుదల సదుపాయాన్ని కల్పించడానికి, తేమను పరిరక్షించడానికి, ప్రతి సమితిలో సూక్ష్మ వాటర్‌షెడ్ కార్యక్రమాలను నిర్వహించాలని వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులో ఉద్దేశించారు. వ్యవసాయయోగ్యం కాని భూములతోపాటు మురుగునీటి కాలువలను కూడా ఒక సమగ్ర విధానం ప్రకారం నిర్వహించాలని భావించారు.
భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లోని నీటిని సక్రమంగా అభిలషణీయ (Optimum) స్థాయిలో వినియోగించుకునేందుకు 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే 1974-75లో ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం (Command Area Development Programme) ప్రారంభించారు.

  భారతదేశంలో ప్రస్తుతం జలవనరుల మొత్తం శక్మ సామర్థ్యం అంటే పొటెన్షియల్ 1929 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బి.సి.ఎం.) గా అంచనా వేశారు. వాస్తవానికి ఈ మొత్తం శక్మ సామర్థ్యంలో 1123 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పరిమాణాన్ని వినియోగిస్తున్నారు. ఈ మొత్తం జలవనరుల వినియోగంలో 690 బి.సి.ఎం. ఉపరితల జలాలు కాగా, 433 బి.సి.ఎం. భూగర్భ జలాలు.

  దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి (1951-52) దేశంలోని అభివృద్ధి చేసిన మొత్తం నీటిపారుదల సామర్థ్యం 22.6 మిలియన్ హెక్టార్లు కాగా, పదో పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి (2006-07) ఇది 102.77 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఇందులో వాస్తవంగా వినియోగించిన భూమి 87.23 మిలియన్ హెక్టార్లు. దేశంలో నీటి పారుదల అభివృద్ధికి మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 376 కోట్లు ఖర్చు చేయగా, 10వ పంచవర్ష ప్రణాళికలో 71,213 కోట్లు ఖర్చు చేశారు.

  భారతదేశంలో 2005-06 చివరినాటికి అత్యధికంగానీటిపారుదల సౌకర్యం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉపరితల లేదా భూగర్భజలాల లభ్యత వంటి అంశాలకు అనుగుణంగా భారతదేశంలో వివిధరకాల నీటిపారుదల వనరులను వినియోగిస్తున్నారు.
వీటిని ప్రధానంగా నాలుగు వర్గాలుగా విభజించవచ్చు. అవి: 1) కాలువలు, 2) చెరువులు, 3) బావులు, 4) ఇతర వనరులు.

  పై  నాలుగు రకాల నికర నీటిపారుదల వనరుల కింద ఉన్న సాగుభూమి వివరాలు 2005-06 నాటికి కింది విధంగా ఉన్నాయి.
బావుల ద్వారా జరిగే నీటి పారుదలను తిరిగి గొట్టపు బావులు, ఇతర బావుల (ఓపెన్ బావులు మొదలైనవి) కింద జరిగే నీటి పారుదలగా విభజించారు.
కాలువల ద్వారా నీటి పారుదల (Canal Irrigation):  ప్రస్తుతం, కాలువల ద్వారా నికర నీటి సాగు భూమి విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 27.56 లక్షల హెక్టార్లకు నీరందుతూ ఉంది. తరువాత స్థానాలను వరుసగా రాజస్థాన్ (17.06 లక్షల హెక్టార్లు), ఆంధ్రప్రదేశ్ (15.72 లక్షల హెక్టార్లు), హర్యానా (13.30 లక్షల హెక్టార్లు) ఆక్రమిస్తున్నాయి.
చెరువులు (Tanks):  ద్వీపకల్ప భారతదేశం మొత్తం మీద చెరువుల ద్వారా సాగు నీరందించడం విస్తృతంగా వాడుకలో ఉన్న పద్ధతి. ద్వీపకల్పంలోని చాలా చెరువులు పరిమాణంలో చిన్నవి. ప్రవాహాలకు అడ్డుకట్టలు కట్టడం ద్వారా ఈ చెరువులు వ్యక్తులు లేదా వ్యవసాయదారుల వర్గాల ద్వారా నిర్మితమవుతాయి. పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లోని చెరువులు ఎక్కువగా భూమిని తవ్వి ఏర్పాటు చేసినవే. వీటిని సాగునీటి కోసం మాత్రమే కాకుండా, చేపల పెంపకానికి కూడా ఉపయోగిస్తారు. దేశంలోని మొత్తం నికర నీటి పారుదల విస్తీర్ణంలో దాదాపు 3.37 శాతం సాధారణంగా చెరువుల కింద ఉన్నదే.

  దేశంలో మొత్తం దాదాపు 20.34 లక్షల హెక్టార్ల భూమికి చెరువులే నీరందిస్తున్నాయి. చెరువుల ద్వారా నీటి పారుదల సౌకర్యం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం ఆక్రమిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6.62 లక్షల హెక్టార్లకు చెరువులే నీరందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానాలను 5.75 లక్షలతో తమిళనాడు. 1.90 లక్షల హెక్టార్లతో కర్ణాటక ఆక్రమిస్తున్నాయి.

బావులు (Wells): భారతదేశంలో బావులు అతి ముఖ్యమైన నీటి పారుదల వనరులుగా ఉన్నాయి. కాలువలు, చెరువుల మాదిరి కాకుండా బావులు, భూగర్బ జల వనరుల నుంచి నీటిని గ్రహిస్తాయి. దేశంలో మళ్లీ భర్తీ అయ్యే భూగర్భ జలవనరులను సంవత్సరానికి 35.37 మిలియన్ హెక్టార్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. తగినంత భూగర్భ జలం ఉంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా బావుల ద్వారా నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. బావులు చిన్నతరహా రైతులకు కూడా అందుబాటులో ఉంటాయి. గంగానదీ మైదానాల్లో, మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టా ప్రాంతాల్లో, దక్కన్ ట్రాప్‌కు చెందిన శైథిల్య స్తరాల్లో, ద్వీపకల్పంలోని స్ఫటిక శిలలూ అవక్షేప మండలాల్లో, నర్మద, తపతీ లోయల్లో గణనీయమైన పరిమాణాల్లో భూగర్భ జలాలున్నాయి. అందువల్ల ఈ ప్రాంతాలు బావుల ద్వారా భూమి సాగుకు అనువుగా ఉన్నాయి. దేశంలోని మొత్తం నికర సాగుభూమి విస్తీర్ణంలో దాదాపు 58.76 శాతానికి బావులే నీరందిస్తున్నాయి.
      బావుల ద్వారా నీటి పారుదల విషయంలో 102.13 లక్షల హెక్టార్లతో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాలను 44.27 లక్షల హెక్టార్లతో రాజస్థాన్, 36.96 లక్షల హెక్టార్లతో మధ్యప్రదేశ్, 27.45 లక్షల హెక్టార్లతో పంజాబ్ ఆక్రమిస్తున్నాయి.

ఇతర వనరులు (Other Sources): చెరువులు, బావులు, కాలువలు కాని ఇతర వనరుల ద్వారా కొద్దిపాటి విస్తీర్ణమే సాగవుతోంది. ఈ వనరుల్లో దక్షిణ బీహార్‌లో అహర్‌లు (Ahar), పైన్‌లనే (Pines) చిన్న చిన్న తాత్కాలికమైన అడ్డుకట్టలు, తమిళనాడులోని ఊటకాలువలు, వరద మైదానాల్లోని జల రంధ్రాలు మొదలైనవి ముఖ్యమైనవి.
కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఉన్న పర్వత ప్రాంతాల్లో చిన్న చిన్న జల ప్రవాహాల నుంచి నీటిని గ్రహించి, ఉపయోగిస్తుంటారు.
        బ్రహ్మపుత్ర లోయలో, హర్యానాలో, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దక్షిణ కర్ణాటకలో గొట్టపు (బుగ్గ) బావులు సర్వసాధారణం. భారతదేశంలో ఇతర వనరులన్నీ కలసి దాదాపు 73.14 లక్షల హెక్టార్ల భూమికి నీరందిస్తున్నాయి. దేశంలోని మొత్తం నికర సాగు భూమిలో ఈ వనరుల ద్వారా సాగయ్యే భూమి దాదాపు 12.15 శాతం. కాలువల ద్వారా జరిగే నీటి పారుదల సౌకర్యాన్ని ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులే సమకూరుస్తున్నాయి.

Posted Date : 25-02-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు