• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ తీరమైదానాలు, దీవులు 

ఉపఖండంలో విశిష్ట భౌగోళిక స్వరూపాలు!

భారత్‌లోని తీర మైదానాలు, దీవులు సాధారణ భౌగోళిక స్వరూపాలు మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను, జీవవైవిధ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభావితం చేసే చిహ్నాలు. అవి సముద్ర వాణిజ్యానికి కీలక రవాణా కేంద్రాలుగా పనిచేయడంతోపాటు ప్రపంచ జీవవైవిధ్యానికి దోహదపడే గొప్ప పర్యావరణ నిలయాలుగా ఉన్నాయి. శతాబ్దాలుగా సాంస్కృతిక  వినిమయానికి సాయపడుతూ హిందూ మహాసముద్రం చుట్టూ భిన్న నాగరికతలు విల్లసిల్లడానికి కారణమయ్యాయి. దేశానికి గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ భౌగోళిక ప్రత్యేకతల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటి నేపథ్యంలో ఉపఖండం విశిష్టతను అధ్యయనం చేయాలి. 

భారత్‌లోని నిమ్నోన్నత స్వరూపాలు ప్రపంచానికి ఈ దేశ ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక్కడి తీర ప్రాంత మైదానాలు (కోస్టల్‌ ప్లెయిన్స్‌), ఖండతీరపు అంచు (కాంటీనెంటల్‌ షెల్‌)లు, చుట్టూ ఉన్న దీవులు ఉపఖండం విశిష్టతను ప్రదర్శిస్తున్నాయి. 

తీరప్రాంత మైదానాలు:  భారత ద్వీపకల్పానికి తూర్పున తూర్పు తీరమైదానం, పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉన్నాయి. 6,100 కి.మీ. తీరరేఖ (ప్రధాన భూభాగం) ఉంది.
తూర్పు తీరమైదానం: ఇది పశ్చిమ తీరమైదానం కంటే ఎక్కువ విశాలంగా, వంపులు తిరిగి ఉంటుంది. 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఈశాన్యంగా ఈ మైదానం వ్యాపించింది. ఇక్కడ వర్షపాతం తక్కువ. అనేక నదుల డెల్టాల వల్ల ఈ మైదానం దిగువ భాగం వెడల్పు ఎక్కువగా ఉంటుంది. చిల్కా, పులికాట్‌ సరస్సులు ఈ తీరమైదానంలోనే ఉన్నాయి. కన్యాకుమారి అగ్రం నుంచి గోదావరి డెల్టా వరకు దీని పొడవు 1,100 కి.మీ.; వెడల్పు 100 - 130 కి.మీ.లు. బాలసూర్‌ తీరమైదానంలో మహానది డెల్టా ప్రాంతం కలుస్తుంది. ఇక్కడ అనేక లగూన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆంధ్ర, తమిళనాడు  సరిహద్దులోని  పులికాట్‌ సరస్సు. ఒడిశా రాష్ట్రంలో తీర మైదానాన్ని ‘ఉత్కళ మైదానం’ అంటారు. దీని పొడవు 400 కి.మీ. ఉత్తరాన సువర్ణరేఖ నుంచి దక్షిణాన రుషికుల్య నది వరకు వ్యాపించింది. మహానది ఈ డెల్టా ప్రాంతంలోనే ఉంది. మహానది డెల్టాకు దక్షిణాన చిల్కా సరస్సు ఉంది. ఈ సరస్సు పొడవు 70 కి.మీ. దీనిలో ఉదయ, భార్గవి నదులు కలుస్తాయి.

ఉత్కళ మైదానం దక్షిణ చివర నుంచి పులికాట్‌ సరస్సు వరకు ఆంధ్ర మైదానం వ్యాపించి ఉంటుంది. గోదావరి, కృష్ణా నదులు ఈ మైదానం నుంచి ప్రవహించి డెల్టాలను ఏర్పరిచాయి. కృష్ణా - గోదావరి నదుల మధ్య కొల్లేరు సరస్సు ఏర్పడింది. గోదావరి నది పాపికొండల్లో పెద్ద గార్జి ద్వారా ప్రవహించి పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఈ నది ధ]వళేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరిగా చీలిపోతుంది. సముద్రంలో కలిసేచోట ఈ రెండు పాయలు ఏడు పాయలుగా విడిపోతాయి. కృష్ణానది కూడా గార్జి ద్వారా ప్రవహించి విజయవాడ వద్ద మైదానంలో ప్రవేశించి 90 కి.మీ. తర్వాత హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణా - మహానదీ మధ్య తీరమైదానాన్ని ఉత్తర సర్కారు తీరమైదానం అంటారు. కృష్ణా - కావేరి నదుల మధ్య తీరాన్ని కర్ణాటక తీరమైదానం అంటారు. తమిళనాడు మైదానం పులికాట్‌ సరస్సు దిగువ నుంచి 675 కి.మీ. పొడవుతో, సగటున 100 కి.మీ.వెడల్పుతో ఉంది. కావేరి డెల్టా ఈ మైదానంలో భాగమే.

తూర్పు ఖండ తీరపు అంచు: ఇది పశ్చిమ ఖండ తీరపు అంచు కంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. గంగా ముఖద్వారం వద్ద మన్నారు సింధుశాఖ కొంత వెడల్పు ఎక్కువ. ఈ భాగంలో రెండు సన్నని భాగాలు సముద్రం కింద నుంచి ఒకటి శ్రీలంక వైపు, మరొకటి భారత్‌ వైపు వ్యాపించి ‘ఆడమ్స్‌ బ్రిడ్జ్‌’ అనే పేరుతో నిమజ్జితమై ఉన్న భిత్తిని కలుస్తాయి. ఆడమ్స్‌ బ్రిడ్జ్‌ సముద్ర మట్టానికి నాలుగు మీటర్ల లోతులో ఉంటుంది.

పశ్చిమ తీర మైదానం: ఈ మైదానం చాలా సన్నగా, 10-25 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. కచ్, కథియావార్‌ అనే రెండు ద్వీపకల్పాలు దీని ఉత్తర సరిహద్దు భాగంలో ఉన్నాయి. పశ్చిమ తీర మైదానాన్ని కొంకణ్, కేరళ, కర్ణాటక అని మూడు భాగాలుగా విభజించారు. పశ్చిమ తీర మైదాన వర్షపాతం ఎక్కువ (200 - 400 సెం.మీ.). కచ్‌కి ఉత్తరాన ఉప్పుతో కూడిన సమతల మైదానం ఉంది. దీన్ని ‘గ్రేట్‌ రాన్‌’ అంటారు. దక్షిణాన విడిపోయిన భాగాన్ని ‘లిటిల్‌ రాన్‌‘ అని పిలుస్తారు. బనాస్, తాని నదుల వరదలకు ఏటా వర్షాకాలం రాన్‌ మునుగుతుంది. సౌరాష్ట్ర ఒకనాటి అగ్నిపర్వత ద్వీపం. కాలానుగుణంగా నదుల నిక్షేపణ క్రియ వల్ల ప్రధాన భాగాన్ని దీంతో కలిపివేశాయి. దీన్నే ‘వాడ్‌వాన్‌ గేట్‌ వే’ అంటారు. కథియ వాడ్‌ ద్వీపకల్ప దక్షిణ భాగంలో ‘గిర్‌ కొండలు’ ఉన్నాయి. వీటిలో ఎత్తయిన శిఖరం ‘గోరఖ్‌నాథ్‌’ (1,117 మీ.) బనాస్, సరస్వతి నదులు ఈ మైదానం ఉత్తర ప్రాంతం నుంచి ‘రాణ్‌ ఆఫ్‌ కచ్‌’ లోకి ప్రవేశిస్తాయి. కాంబే సింధుశాఖలో సబర్మతి, తపతి, నర్మదా నదులు కలుస్తాయి. పశ్చిమ కనుమల్లో కొంకణ్‌ తీర ఉత్తర భాగంలో (గోదావరి దగ్గరగా) వైతరణి నది పుట్టి పశ్చిమంగా ప్రవహిస్తుంది. ఉల్హాస్‌ అనే మరో నది బొర్‌ఘాట్‌కి ఉత్తరంగా ప్రవహించి, 130 కి.మీ. తర్వాత కల్యాణి దగ్గరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. కర్ణాటక మైదానం 275 కి.మీ.లు వ్యాపించింది. ఉత్తరాన సన్నగా, దక్షిణాన వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ శరావతి నదిపై ‘గోర్సెప్పా’ జలపాతం ఉంది. మంగళూరు ఓడరేవు ఈ తీరంలోనే ఉంది. కేరళ మైదానం కన్ననూర్‌ (ఉత్తర భాగం) నుంచి కన్యాకుమారి అగ్రం (దక్షిణ) వరకు 500 కి.మీ. పొడవుతో, వెడల్పు 10 - 20 కి.మీ. వాలుతో ఉంది. ఈ తీరంలో అనేక సరస్సులు, పృష్టజలాలు (చీలికల ద్వారా సముద్ర జలాల భూభాగంలోకి వచ్చిన జలాలు) ఉన్నాయి. 80 కి.మీ.ల పొడవుండే వెంబనాడ్‌ సరస్సు కూడా ఇక్కడే ఉంది. 

పశ్చిమ ఖండ తీర అంచు: సముద్రంలో 100 మీటర్ల లోతులో ముంబయి నుంచి 350 కి.మీ.లు వ్యాపించి ఉంది. కన్యాకుమారి అగ్రం వరకు ఇది వ్యాపించి ఉంది.

సరిహద్దు సముద్రాలు, ద్వీపాలు

క్రిటేషియన్‌ యుగం చివర గోండ్వానా మహాఖండం చీలిపోయినప్పుడు వివిధ భాగాలుగా విడిపోయి బంగాళాఖాతం, అరేబియా సముద్రం ఏర్పడ్డాయి. కొంతభాగం కిందకు దిగిపోగా హిందూ మహాసముద్రం ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంది. సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతం ఖండ తీరపు అంచు. ఇది పశ్చిమ దిక్కున కథియవార్‌కు దక్షిణంగా 350 కి.మీ.లు, తూర్పున గంగానదికి దక్షిణాన 220 కి.మీ.లు వ్యాపించి ఉంది. మిగతా పశ్చిమాన 50 కి.మీ.లు, తూర్పున 100 కి.మీ. ఉంది.

దీవులు: భారత దేశానికి రెండు వైపుల్లోని సముద్రాల్లో అనేక దీవులున్నాయి. వీటిలో తూర్పు దిక్కున ఉన్న బంగాళాఖాతంలోని దీవుల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఈ దీవులు సముద్ర గర్భం నుంచి సముద్ర ఉపరితలానికి వ్యాపించిన పర్వతాలు. అరేబియా సముద్రంలోనివి మాత్రం పగడపు దీవుల వల్ల ఏర్పడిన ప్రవాళ భిత్తికలు. పోర్ట్‌   బ్లేయర్‌కు ఈశాన్యంగా 140 కి.మీ.ల దూరంలో బేరన్‌ ద్వీపం (క్రియాశీలక అగ్నిపర్వతం) ఉంది. దీనికి 150 కి.మీ. దూరంలో ఉన్న నార్కోండం ద్వీపం విలుప్త అగ్నిపర్వతం.

అండమాన్‌ దీవులు: వీటిని ఉత్తర, మధ్య, దక్షిణ అండమాన్‌ దీవులుగా విభజించారు. వీటి చుట్టూ ఉన్న దీవులతో కలిపి   అండమాన్‌ దీవుల సమూహంగా చెబుతారు. ఈ రెండింటి మధ్య డంకన్‌ మార్గం ఉంది. ఉత్తర అండమాన్‌ ద్వీపం పొడవు   80 కి.మీ.లు, వెడల్పు 20 కి.మీ.లు, మధ్య అండమాన్‌ ద్వీపం పొడవు 70 కి.మీ., వెడల్పు 30 కి.మీ.లు. మధ్య అండమాన్‌ దీవుల్లో ముఖ్య రేవు పట్టణం పోర్టు బ్లేయర్‌. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఎత్తయిన శిఖరం సాడిల్‌ శిఖరం (738 మీ.). ఇది ఉత్తర అండమాన్‌లో ఉంది. దక్షిణ అండమాన్‌ దీవుల్లో ఎత్తయిన శిఖరం మౌంట్‌ హరియెట్‌. 

నికోబార్‌ దీవులు: నికోబార్‌ ద్వీప సమూహంలో 19 దీవులుండగా, 12 దీవుల్లో మనుషులు నివసిస్తున్నారు. 862 చ.కి.మీ.ల విస్తీర్ణంతో గ్రేట్‌ నికోబార్‌ దీవి ఈ దీవుల్లో పెద్దది. ఇక్కడి ఎత్తయిన శిఖరం మౌంట్‌ తుల్లియర్‌. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం గ్రేట్‌ నికోబార్‌ దీవి. భారతదేశ చివరి అంచు ఇందిరా పాయింట్‌ గ్రేట్‌ నికోబార్‌లో ఉంది.

లక్ష దీవులు: ఇవి అరేబియా సముద్రంలో 80 ఉత్తర అక్షాంశం నుంచి 12ఉత్తర అక్షాంశం వరకు వ్యాపించి ఉన్నాయి. 
110 నుంచి 120 అక్షాంశాల మధ్య ప్రధానంగా దీవులున్నాయి. లక్షదీవుల రాజధాని కవరట్టి. అధికార భాషలు మలయాళం, ఇంగ్లిష్‌. ప్రధాన పంట కొబ్బరి. దేశంలోని అతిపెద్ద ప్రవాళ భిత్తికలు. లక్షదీవుల్లో పెద్దది ఆండ్రోత్, చిన్నది భిత్రాదీవి. లక్షదీవులను, మాల్దీవులను వేరుచేసేది 80 చానెల్‌. భారత్‌లో పర్యావరణ హిత (బ్లూప్లాగ్‌ ప్రమాణాల)ను పాటించే బీచ్‌లుగా గుర్తించినవి.

తూర్పు తీరంలోని డెల్టాలు:

* సుందర్బన్‌ డెల్టా - పశ్చిమ బెంగాల్‌

* సువర్ణ రేఖ, మహానది డెల్టాలు - ఒడిశా

* కృష్ణా, గోదావరి డెల్టాలు - ఆంధ్రప్రదేశ్‌ 

* కావేరీ డెల్టా -  తమిళనాడు

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 
 

Posted Date : 16-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌