• facebook
  • whatsapp
  • telegram

ఇక్ష్వాకులు

  శాతవాహనుల అనంతరం వారి సామ్రాజ్య శిథిలాలపై సామంతులు స్వతంత్ర రాజ్యాలను ఏర్పరచుకున్నారు. దక్షిణాపథంలోని వాయవ్య ప్రాంతాన్ని ఆంధ్రేతరులు, విదేశీయులైన అభీరులు, దక్షిణ భాగాన్ని చుటు వంశీకులు, తీరాంధ్రలోని కృష్ణకు ఇరువైపుల ఉన్న ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, కృష్ణకి దిగువన గుంటూరు-నెల్లూరు ప్రాంతాన్ని పల్లవులు పాలించారు.

  ఇక్ష్వాకులు దాదాపు 75 సంవత్సరాలు పాలించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది..
శాతవాహన రాజ్యం పతనానంతరం వారి సామంతులైన ఇక్ష్వాకులు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. వీరు ప్రాచీన గణాల్లో ఒకరైన ఇక్షు గణానికి చెందినవారు. పురాణాలు ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని పేర్కొన్నాయి. వీరి కాలంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది.
ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. వీరి వంశంలో ఏడుగురు రాజులు 100 సంవత్సరాలు పాలించినట్లు పురాణాలు చెబుతుండగా.. శాసనాలు మాత్రం నలుగురు రాజులనే పేర్కొన్నాయి. ఇక్ష్వాకుల జన్మస్థలం గురించి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలోని అయోధ్య ప్రాంతంవారని బూలర్, రాప్పన్ పండితులు తెలిపారు. తమిళ ప్రాంతీయులని గోపాలాచారి, కన్నడ ప్రాంతీయులని వోగెల్, కృష్ణాతీరానికి చెందినవారని కాల్‌డ్వెల్ అభిప్రాయపడ్డారు.
విష్ణు పురాణం, జైన ధర్మామృతం వంటి గ్రంథాలు ఇక్ష్వాకులు ఉత్తరదేశం నుంచి వచ్చారని పేర్కొంటున్నాయి. గోదావరి తీరంలోని అస్మక, ములక రాజ్యాలను ఇక్ష్వాక వంశ రాజ కుమారులు స్థాపించారని బౌద్ధ సాహిత్యం చెబుతోంది. ఇక్ష్వాక వంశంలో రెండోవాడైన వీర పురుషదత్తుడు శాఖ్యముని(గౌతమ బుద్ధుడు) వంశానికి చెందినవాడని నాగార్జున కొండ శాసనం తెలుపుతోంది.

 

వాశిష్టపుత్ర శాంతమూలుడు

  ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు వాశిష్టపుత్ర శాంతమూలుడు. అతను వైదిక బ్రాహ్మణ మతాభిమాని, విరూపాక్షపతి భక్తుడు. అశ్వమేథ, అగ్నిహోత్ర, వాజపేయ యాగాలను చేశాడు. అడవులను నరికించి కొత్త భూములను సాగులోకి తెచ్చి, గ్రామాలను నిర్మించాడు. గొప్ప దాత. భూమిని సాగు చేయడానికి రైతులకు లక్షల కొద్దీ నాగళ్లు, గోవులు, వ్యవసాయ క్షేత్రాలను దానం చేశాడు. వైదిక మత విస్తరణకు పాటుపడ్డాడు. అతని గురించి తెలియజేసే శాసనాలు రెంటాల, కేపానపల్లి, దాచేపల్లిలో లభించాయి. అతని కాలానికే చెందిన అశ్వమేథ వేదిక నాగార్జునకొండలో బయల్పడింది. అతనికి 'దక్షిణాపథపతి' అనే బిరుదుండేది. శాంతమూలుడి సోదరి శాంతిశ్రీ బౌద్ధ మతాభిమాని. ఆమె పారావత మహావిహారాన్ని పునరుద్ధరించింది.

 

మాఠరీపుత్ర శ్రీవీరపురుషదత్తుడు

  శాంతమూలుడి కుమారుడు వీరపురుషదత్తుడు. అతను బౌద్ధమతాన్ని ఆదరించాడు. శివలింగాన్ని తన కాలితో తొక్కుతున్నట్లున్న ఒక చిత్రం నాగార్జున కొండలో లభించింది. దీని ఆధారంగా వీరపురుషదత్తుడు బౌద్ధమతాన్ని అభిమానించి, వైదిక మతాన్ని ద్వేషించినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. నాగార్జునకొండకు క్రీస్తు శకారంభంలో శ్రీపర్వతమనే పేరున్నట్లు ఇటీవల దొరికిన శాసనం ద్వారా తెలుస్తోంది. వీరపురుషదత్తుడి రాణులు, అంతఃపుర స్త్రీలు పోటీపడి బౌద్ధమత సంస్థలకు దాన ధర్మాలు చేశారు. అతని పాలనాకాలం తెలంగాణ బౌద్ధమత చరిత్రలో ఒక స్వర్ణయుగం. క్రీ.శ. 250లో నాగార్జునకొండలో మహాచైత్యాన్ని పునరుద్ధరించాడు.
హీనయాన బౌద్ధులకు బుద్ధగయ పుణ్యక్షేత్రమైనట్లు మహాయాన బౌద్ధులకు నాగార్జునకొండ పవిత్ర క్షేత్రమయ్యింది. నాగార్జునకొండ బౌద్ధక్షేత్ర దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు వచ్చేవారు. విదేశీయుల వసతి కోసం సింహళవిహారాన్ని నిర్మించారు. రాజ భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసికబోధిసిరి బౌద్ధ మతాభిమాని. ఆమె బౌద్ధానికి అనేక విరాళాలు, దానాలు చేసింది.

 

వీరపురుషదత్తుడి శాసనాలు - వివాహం

  నాగార్జునకొండ శాసనం, అల్లూరు శాసనం, ఉప్పు గుండూరు శాసనం. వీరపురుషదత్తుడు తన ముగ్గురు మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకుని, మేనత్తల పిల్లలను పెళ్లి చేసుకోవడమనే ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు.

 

ఎహువల శాంతమూలుడు

  వీరపురుషదత్తుడి కుమారుడు ఎహువల శాంతమూలుడు. అతని కాలం నుంచే శాసనాల్లో సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది. అతని కాలంలో వైదిక, బౌద్ధ మతాలను ఆదరించారు. అతని సోదరి కొడబలిసిరి మహిషాసకులనే బౌద్ధమత శాఖీయులకు నాగార్జునకొండలో ఒక విహారాన్ని నిర్మించి ఇచ్చింది. ఒక అంతఃపుర స్త్రీ నోడగిరి స్వామికి దానధర్మాలు చేసింది. రాకుమారుడైన రుద్రపురుషదత్తుడు 'పుష్పభద్రుడు'అనే శివాలయం నిర్మించాడు. అతడి సేనాని ఎలిసిరి సర్వదేవాధివాసం పేరుతో కుమారస్వామికి ఆలయం నిర్మించాడు. ఎలిసిరి తన పేరున కృష్ణానది ఉత్తర తీరంలో ఏలేశ్వర స్వామిని ప్రతిష్ఠించి అక్కడ అనేక దేవాలయాలను నిర్మించాడు. అక్కడ ఒక పట్టణాన్ని, వేదవిద్యా కేంద్రాన్ని నిర్మించి అభివృద్ధి చేశాడు. ఎలిసిరి పేరున వెలిసిన పుణ్యక్షేత్రమే ఏలేశ్వరం, శ్రీశైల దేవాలయానికి ఇది ఈశాన్య ద్వారం. ఎహువల శాంతమూలుడి కాలంలో దేవాలయాల నిర్మాణం విరివిరిగా సాగింది. నవగ్రహ, కుబేర, నోదగేశ్వర, హారతి, కార్తికేయ దేవాలయాలు నిర్మించారు. అలాగే మంచికల్లు, వేల్పూరు, హలంపురి, ఏలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఆలయాలు వెలిశాయి. శాంతమూలుడు నాగార్జునకొండలో ఒక సంస్కృత శాసనం వేయించాడు.

 

రుద్ర పురుషదత్తుడు

  ఎహువల శాంతమూలుడి కుమారుడు రుద్ర పురుషదత్తుడు. అతనే చివరి ఇక్ష్వాక రాజు. అతని శాసనాలు నాగార్జునకొండ, గురజాలలో లభించాయి. పల్లవ రాజైన సింహవర్మ రుద్రపురుషదత్తుడిని ఓడించినట్లుగా మంచికల్లు శాసనం తెలుపుతోంది. పల్లవ రాజైన శివస్కంద వర్మ వేయించిన మైదవోలు శాసనంలో ఇక్ష్వాక రాజ్యం పతనం చెందినట్లుగా తెలుస్తోంది.

 

పరిపాలన

  ఇక్ష్వాక వంశీయులను మహారాజులుగాను, దాన శాసనాల్లో రాజ్ఞ అని పేర్కొన్నారు. స్త్రీలు తమ భర్తల ఉద్యోగనామాలను ధరించే సంప్రదాయం ఉండేది. పాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలుగా, హారాలుగా, పథములుగా విభజించారు. రాష్ట్రాలను సామంత ప్రభువులు పాలించేవారు. వీరి కాలంలో మహాతలవర, మహాదండనాయక అనే బిరుదులు ధరించిన సామంతులు రాజుకు సహాయం చేసేవారు. అమాత్య, సేనాపతి, మహాదండనాయక, కొష్టాగారాది ఉద్యోగులు రాజుకు అండగా ఉండేవారు.

 

ఆర్థిక పరిస్థితులు

  శాంతమూలుడు అడవులను నరికించి వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని పెంచాడు. రోమ్ దేశంతో విదేశీ వాణిజ్యం సాగింది. నాగార్జునకొండలో రోమన్ నాణేలు లభించాయి. విజయపురిలో రోమన్ వర్తక స్థావరం ఉండేది. అక్కడ కొన్ని నిర్మాణాలకు రోమన్‌లే కారణంగా భావిస్తున్నారు. నాగార్జునకొండలో రోమ్ వర్తక స్థావరం బయల్పడింది. రోమ్ వర్తకులు అక్కడ నివసించినట్లు తెలుస్తోంది.
ఇక్ష్వాకుల శాసనాల్లో తరచుగా నిగమ సభల, శెట్టి గహపతుల, శ్రేణుల ప్రస్తావన కన్పిస్తుంది. శాసనాల్లో పర్ణిక శ్రేణి (తమలపాకులు), పూసిన శ్రేణి (మిఠాయిలు) ప్రస్తావన ఉంది. నాగార్జున కొండ తవ్వకాల్లో వృత్తిపనివారి ఇళ్లు బయల్పడ్డాయి. ఒక ఇంట్లో బంగారు ఆభరణాలు, వాటిని తయారుచేసే మూసలు కూడా లభించాయి. రోమ్ నాణేన్ని పతకంగా ఉపయోగించి తయారు చేసిన చెవిరింగులు, కంఠాభరణం కూడా అక్కడ దొరికాయి.
ఇక్ష్వాకుల రాజలాంఛనం సింహం. వీరి నాణేలపై రాజలాంఛనంతో పాటు రాజుల పేర్లు ఉన్నాయి. బంగారం, సీసం, అనే నాణేలు వ్యాప్తిలో ఉన్నాయి. 'సామిన' అనే నాణేలు శాంతమూలుడు వేయించినవే. ఇతడిని ఇక్ష్వాక స్వామి అనేవారు. 'మాడ-స' అనే అక్షరాలున్న నాణేలు వీర పురుషదత్తుడి కాలానికి చెందినవి. దీనార, మాషక అనేవి నాణేల పేర్లు.

 

మత సంప్రదాయం

  వీరకళ్ అనే మత సంప్రదాయం ఈ కాలంలో ప్రసిద్ధి చెందింది. 'వీరకళ్' అంటే రాజు కోసం ప్రాణాలర్పించిన అంగరక్షకులను పూజించడం. రాజ్యస్థాపకుడు శాంతమూలుడు వైదిక మతాభిమాని, ఉజ్జయిని మహాసేనుడి భక్తుడు. ఇతడు బ్రాహ్మణ మత వ్యాప్తికి పాటుపడ్డాడు. హిరణ్యకోటి దాన శిల్పం నాగార్జుకొండలో లభించింది. నాగార్జునకొండలో రాజదుస్తులు ధరించి కుడిచేయిని ఎత్తి, ఎడమ చేతిని కటిపై వేసుకుని ఉన్న శాంతమూలుడి చిత్రం లభించింది. శాంతమూలుడు చేసిన యజ్ఞవాటిక తవ్వకాల్లో బయల్పడింది.
వీరి కాలంలో బౌద్ధమతం విస్తరించింది. శాంతమూలుడి సోదరి శాంతిశ్రీ నాగార్జునకొండలో మహాచైత్యాన్ని పునర్నిర్మించింది. దీని పునర్నిర్మాణాన్ని బదంతానందుడనే బౌద్ధాచార్యుడు పర్యవేక్షించాడు. శాంతిశ్రీ నాగార్జునకొండ మహాచైత్య సమీపంలో చతుశ్శాలయుత శిలామండపాన్ని నిర్మించింది. నాగార్జున కొండలోని విహారాల్లో అపరమహావినశైలీయులు, మహిశాసకులు, బహుశ్రుతీయులనే బౌద్ధమత శాఖవారు నివసించేవారు. వీరపురుషదత్తుడి రాణి మహాదేవి బట్టిని దేవరాణి బహుశృతీయులనే సన్యాసులకు తన పేరున దేవీ విహారాన్ని నిర్మించి ఇచ్చింది. నాగార్జునకొండలో మహా సాంఘికులుండేవారు. ఈ కాలంలో బోధివృక్షారాధన, త్రిరత్న, స్వస్తిక, ధర్మచక్రం మీన లాంఛనాలతో ఉన్న బుద్ధుడి పాదాలను బౌద్ధులు ఆరాధించేవారు. వీరి శాసనాల్లో దిషుని కాయ, వాఝనికాయ, పంచమాతృక లాంటి బౌద్ధగ్రంథాలను ప్రశంసించారు.
ఇక్ష్వాకుల కాలం నుంచి నిర్మాణాలపై శిల్పుల పేర్లను చెక్కే సంప్రదాయం ప్రారంభమైంది. బౌద్ధస్తూపాల నిర్మాణంలో ముడుపు స్తూపాల నిర్మాణం మొదలైంది. అంటే కోరికలు తీరినందుకు కట్టిన నిర్మాణాలు. వీరి కాలంలో బౌద్ధమతంవారు ప్రాకృత భాషను వదిలి, సంస్కృత భాషలో గ్రంథ రచన చేశారు. దాంతో వీరు ప్రజలకు దూరమయ్యారు. భావవివేకుడు అనే బౌద్ధమత తార్కికుడు విజయపురి విహారంలో నివసించినట్లుగా హుయాన్‌త్సాంగ్ రచనల ద్వారా తెలుస్తోంది. నాటి మహాసాంఘికులకు అంధకులనే పేరు వచ్చింది.

 

విద్య, సాహిత్యం

  ఇక్ష్వాకుల కాలంలోనే శాసనాల్లో సంస్కృత భాష వాడకం ప్రారంభమైంది. దీనిలో పంచచామర, వంశస్థ లాంటి వృత్తాలు ఉన్నాయి. దేశంలో సంస్కృతం రాజభాషగా, శాసన భాషగా, పండిత భాషగా గౌరవాన్ని పొందింది. బౌద్ధ వాఞ్మయంలో తమ ఉన్నత విద్యను కొనసాగించడానికి ఆసియా ఖండంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. ఇక్ష్వాకుల పేర్లలో విహువల, అనిక్కి, బాపి, అడవి, రెమ్మణక అనే తెలుగు పేర్లున్నాయి. ఇక్ష్వాకులు బ్రహ్మి లిపిని వాడారు. ఎహువల శాంతమూలుడు నాగార్జునకొండలో ఒక సంస్కృత శాసనం వేయించాడు. ఈ శాసనం తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం.
ధాన్యకటక సంఘారామాన్ని ఆదర్శంగా తీసుకుని టిబెట్‌లోని 'దాపంగ్' సంఘారామాన్ని నిర్వహించేవారు. తిథి, వార, నక్షత్ర, పక్షి, మాసములు, రుతువులతో కూడిన పంచాంగం వాడుకలో ఉండేది. ధర్మామృత కావ్యాన్ని నయసేనుడు అనే జైనమతాభిమాని రచించాడు.

 

ఆలయాలు..

  ఇక్ష్వాకుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలు ఆదరణ పొందాయి. విజయపురిలో శివుడు, విష్ణువు, శక్తి, మహాసేనుడికి ఆలయాలున్నాయి. ఇక్ష్వాకులు శైవులు అయినప్పటికీ వైష్ణవ మతం కూడా ప్రజాదరణ పొందింది. ఎహువల శాంతమూలుడు నిర్మించిన అష్టభుజ నారాయణ దేవాలయం తెలుగు ప్రాంతాల్లోనే తొలి వైష్ణవ దేవాలయం. విజయపురి గొప్ప హిందూక్షేత్రం. అక్కడ ఉన్న 'హారతి' దేవాలయంలో సంతానం కోరుకునే స్త్రీలు గాజులను దానం చేసినట్లు తెలుస్తోంది. 'హారతి' చిన్న పిల్లల దేవత. అమరావతి శిల్ప సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నాటికి చివరి దశకు చేరింది. వేల్పూరులో భారత గ్రాహక స్వామి (యముడు)కి కూడా ఆలయం ఉండేది.
నాగార్జున కొండ ఆలయాలను ఆగమూక్త పద్ధతి ప్రకారం నిర్మించారు. నాగార్జునకొండలో మహాసేన, పుష్పభద్ర, అష్టభుజ నారాయణ, నోదగేశ్వర, హారతి ఆలయాలు వీరి కాలానివే. ఇక్కడి క్లిష్టమైన నిర్మాణంతో కూడిన అవబృథ స్నానవాటిక బయల్పడింది. వీటిలో కొన్ని ఆలయాలను గజపుష్టాకృతిలో నిర్మించారు. వీరి కాలం నాటికే వాస్తు శిల్ప ఆగమాలు తయారై దేవాలయ వస్తువుకు నిర్దిష్ట స్వరూపం ఏర్పడింది. అమరావతి శిల్పాల్లో మొదటిసారి సతీసహగమనం కనిపించింది.

Posted Date : 07-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌