• facebook
  • whatsapp
  • telegram

భారతీయ రైల్వేలు

  ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ సమైక్యతకు రవాణా, సమాచార వ్యవస్థలే 'జీవనాడులు'. ఇవి లేనిదే పారిశ్రామికీకరణ, వాణిజ్య అభివృద్ధి సాధ్యం కాదు. భారత్ లాంటి సువిశాల దేశంలో అభివృద్ధి, ఆధునికీకరణ సాధించాలంటే చవకైన, సమర్థవంతమైన రవాణా సాధనాలు తప్పనిసరి. దేశంలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణికులను, సరుకులను రవాణా చేయడానికి చవకైన సాధనాలుగా భారతీయ రైల్వేలు గుర్తింపు పొందాయి. దేశంలో అతి ముఖ్యమైన రవాణా సాధనం - రైల్వే వ్యవస్థ.
* భారతీయ రైల్వే ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న పది సంస్థల జాబితాలో 8 వ స్థానంలో నిలిచిందని ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) ప్రకటించింది.
* భారతీయ రైల్వేల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య: సుమారు 14 లక్షలు.
* భారతీయ రైల్వేలు - చారిత్రక ప్రగతి: స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి కాలంలో దేశంలోని వివిధ సంస్థానాధీశులు, రాజుల సహకారంతో రైలుమార్గాలు అభివృద్ధి చెందాయి. రైల్వే వ్యవస్థ నిర్వహణ బ్రిటిష్ వారి అధీనంలోనే ఉండేది. 1853 లో నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని వేయించాడు. మొట్టమొదటి రైలుమార్గం 34 కి.మీ. మేరకు మాత్రమే నిర్మించారు.

 

బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన తొలి రైలు మార్గాలు:
1. 1853 లో ముంబయి (బొంబాయి) నుంచి థానే వరకు
2. 1854 లో కోల్‌కతా (కలకత్తా) నుంచి రాణిగంజ్ వరకు
3. 1856 లో చెన్నై (మద్రాస్) నుంచి అరక్కోణం వరకు రైలుమార్గాలు నిర్మించారు.
* ప్రస్తుతం భారత రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ఆసియా ఖండంలో 2 వ స్థానంలో, ప్రపంచంలో 4 వ స్థానంలో ఉంది.

 

రైలు మార్గాలు - రకాలు

* రైలు పట్టాల మధ్య దూరాన్ని గేజ్ (Gauge) అంటారు. రెండు పట్టాల మధ్య దూరం (వెడల్పు) ఆధారంగా గేజ్‌లను నిర్ణయిస్తారు. భారతీయ రైల్వేలు మొత్తం నాలుగు గేజ్ మార్గాల్లో నడుస్తూ ఉంటాయి. ఈ గేజ్‌లు అన్నీ బ్రిటిష్ వారి కాలంలో రూపుదిద్దుకున్నవే.

 

* భారత ప్రభుత్వం ఈ గేజ్‌లను బ్రాడ్‌గేజ్‌గా మార్చడానికి 1992 లో యూనీగేజ్ పథకాన్ని ప్రారంభించింది.

* భారతదేశంలో రైలుమార్గాల పొడవు 64460 కి.మీ. ఉత్తర భారతదేశంలోని గంగా నదీ మైదానంలో రైలుమార్గాలు బాగా అభివృద్ధి చెందాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో రైలు మార్గాల నిడివి అత్యధికం. ఈశాన్య రాష్ట్రాల్లో అసోంలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో రైలు మార్గాలు అంతగా అభివృద్ధి చెందలేదు. మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో రైలుమార్గాలు అసలే లేవు. దేశమంతటా రైల్వేల విస్తరణ ఒకేవిధంగా ఉండకపోయినా, మొత్తంమీద రెండు రాష్ట్రాలు మినహాయించి రైల్వే నిర్మాణం జరిగింది.

 

రైలు రవాణాకు అనుకూల అంశాలు:

1. భౌగోళిక స్థలాకృతి
2. అధిక జనసాంద్రత
3. ఒక ప్రాంత ఉపరితల లక్షణాలు
4. ఖనిజాల లభ్యత
5. వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రాల విస్తరణ
6. వాతావరణ పరిస్థితులు

 

భారతీయ రైల్వేల ప్రధాన పరిపాలనా కేంద్రాలు: పరిపాలనా సౌలభ్యం కోసం భారతీయ రైల్వే వ్యవస్థను 16 జోన్‌లు/ మండలాలుగా విభజించారు. ఈ మండలాలు అన్నింటిలోకెల్లా అతిపెద్దది ఉత్తర రైల్వే మండలం. భారతీయ రైల్వేల నిర్వహణ, పరిపాలన రైల్వే బోర్డు ఆధీనంలో జరుగుతాయి. రైల్వే బోర్డు రైల్వే మంత్రి పర్యవేక్షణలో పనిచేస్తుంది.

* ఆంధ్ర రాష్ట్రాన్ని దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే మండలాలు పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది.

* కోల్‌కతా మెట్రో రైలు: కోల్‌కతా ప్రధాన కేంద్రంగా కోల్‌కతాలోని డమ్‌డమ్ నుంచి టోలిగంజ్ వరకు భూగర్భ రైలు మార్గాన్ని నిర్మించారు.
రైలుమార్గాల విస్తరణ: ఉత్తర్ ప్రదేశ్‌లో రైలుమార్గాల నిడివి అత్యధికంగా 8917 కి.మీ. పొడవు ఉంది. తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా - మధ్యప్రదేశ్: 5904 కి.మీ., రాజస్థాన్: 5826 కి.మీ., మహారాష్ట్ర: 5440 కి.మీ., బీహార్: 5315 కి.మీ., గుజరాత్: 5281 కి.మీ.

* 1947 నాటికి రైలుమార్గాల పొడవు 53396 కి.మీ. అయితే 2011 నాటికి 64460 కి.మీ. వరకు విస్తరించాయి. ప్రతిరోజు 18000 రైళ్లు 2 కోట్ల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి.

* 1950-51 లో 73.2 మిలియన్ టన్నులుగా ఉన్న సరుకు రవాణా 2009 - 2010 నాటికి 888 మిలియన్ టన్నులకు చేరుకుంది.
కొంకణ్ రైల్వే ప్రాజెక్టు: 1998 లో మహారాష్ట్రలోని 'రోహా' ప్రాంతం నుంచి కర్ణాటకలోని మంగుళూరు వరకు, 760 కి.మీ. మేరకు ఈ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. ఈ రైల్వే ప్రాజెక్టు ప్రధాన కార్యాలయం 'నవీ ముంబయి'లో ఉంది. ఈ ప్రాజెక్టును కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల సంయుక్త భాగస్వామ్యంతో తలపెట్టారు. అయితే కొంకణ్ రైలుమార్గం కేరళలో లేదు. కొంకణ్ రైల్వే 146 చిన్న ప్రవాహాలు, నదులను దాటుతూ సుమారు 2000 బ్రిడ్జిలతో 91 సొరంగమార్గాల మీదుగా ప్రయాణిస్తోంది.

* ఆసియా ఖండంలోని అతిపెద్ద సొరంగ మార్గం కర్బుడే. ఇది కొంకణ్ రైలు మార్గంలో ఉంది. దీని పొడవు 6.5 కి.మీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రయివేట్ రంగంలో నిర్మించిన రైల్వేమార్గం కొంకణ్ రైల్వే మార్గం. దీని ముఖ్య ఉద్దేశం - ముంబయి, కొచ్చి మధ్య దూరాన్ని తగ్గించడం. ఈ మార్గం నిర్మాణం వల్ల ఆ రెండు ప్రాంతాల మధ్య 296 కి.మీ. దూరం తగ్గుతుంది.

* కొంకణ్ రైల్వే - రోహా, రత్నగిరి, పనాజీ, మర్మగోవా, కార్వార్, మంగుళూరు ప్రాంతాలను కలుపుతుంది.

 

రైల్వే పరిశ్రమ - కేంద్రాలు


1. ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ                           - పెరంబూర్, తమిళనాడు
2. వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్                   - ఎలహంక, కర్ణాటక
3. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్                    - వారణాసి, ఉత్తర్ ప్రదేశ్
4. రైల్‌కోచ్ ఫ్యాక్టరీ                                    - కపుర్తలా, పంజాబ్
5. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్               - చిత్తరంజన్, పశ్చిమ్ బంగ
6. మిహిజమ్ అండ్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ వర్క్స్              - జంషెడ్‌పూర్, ఝార్ఖండ్
* Anti Collision Devices (ACDs) ను కొంకణ్ రైల్వే కనిపెట్టింది. రైలు ప్రమాదాలను ఎదుర్కోవడానికి ACDs ను ఏర్పాటుచేశారు. దీన్ని 'రక్షాకవచ్' అని కూడా అంటారు.

Posted Date : 25-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌