• facebook
  • whatsapp
  • telegram

భూచలనాలు - రుతువులు

భ్రమణాలు సృష్టించే అద్భుతాలు!


భూమి ఆవిర్భావం నుంచి రాత్రింబవళ్లు ఏర్పడుతూనే ఉన్నాయి. ఒకసారి రాత్రి సమయం, మరోసారి పగలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరో ఆదేశించినట్లు రుతువులు ఏటా దాదాపు ఒకే సమయంలో వచ్చేస్తుంటాయి. ఒక చోట వేసవి ఉక్కపోత ఉంటే, మరోచోట శీతల గాలులు గడగడలాడిస్తుంటాయి. ఒక అంచులో సూర్యుడు ఉదయించడు, మరోవైపు అస్తమించడు, ఆరు నెలలపాటు అక్కడ రాత్రి, ఇక్కడ పగలు ఉంటాయి. ఇవన్నీ సంభవించడానికి కారణాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడినీ చుట్టి  వచ్చే భ్రమణాల వల్ల కలిగే అద్భుత పరిణామాలను అర్థం చేసుకోవాలి. 


భూమికి రెండు రకాల చలనాలు ఉంటాయి. అవి 

1) భూభ్రమణం

2) భూపరిభ్రమణం. 

1) భూభ్రమణం లేదా ఆత్మభ్రమణం: భూమి తన అక్షాన్ని ఆధారం చేసుకుని గంటకు సగటున 1610 కి.మీ.ల వేగంతో పడమర నుంచి తూర్పునకు తనచుట్టూ తానూ తిరిగే చలనాన్ని భూభ్రమణం అని పిలుస్తారు. భూమి ఒక భ్రమణం చేయడానికి పట్టేకాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు. ఆకాశంలో కనిపించే ఏదో ఒక నక్షత్రంతో భూభ్రమణ కాలాన్ని నిర్ణయించవచ్చు అంటే, ఎంచుకున్న నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ కాలాన్ని గుర్తించి అదే నక్షత్రం అదే స్థానానికి చేరడానికి పట్టే కాలాన్ని భూభ్రమణ కాలంగా పరిగణించవచ్చు.


సౌర దినం (సోలార్‌ డే): ఒక రేఖాంశాన్ని సూర్యుడు దాటిన సమయం నుంచి, అదే రేఖాంశాన్ని మళ్లీ సూర్యుడు దాటే సమయం వరకు ఉండే కాలాన్ని సౌర దినం అంటారు. భూమి పరంగా ఇది 24 గంటలకు సమానం.


ఈ రెండింటి కాల నిర్ణయంలో ఉన్న వ్యత్యాసానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరిగే ప్రక్రియలో రోజుకు సుమారు 1ా దూరం కదిలి పోవడమే.


అక్షం (యాక్సిస్‌): ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూమి కేంద్రం ద్వారా వెళ్లే ఊహా రేఖనే అక్షం అని పిలుస్తారు.


భూభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు:

ఎ) రాత్రిపగలు ఏర్పడటం

బి) పోటుపాటులు సంభవించడం

సి) పవనాలు, సముద్ర ప్రవాహాల దిశల్లోనూ మార్పులు కలగడం (భూభ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలాల కారణంగా ఉత్తరార్ధ గోళంలో సహజసిద్ధ మార్గంలో వీచే పవనాలు కొంత కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో కొంత ఎడమ వైపునకు అపవర్తనం చెంది కదలడాన్ని కోరియాలిస్‌ ప్రభావం లేదా ఫెరల్స్‌ సూత్రమని పిలుస్తారు).    

డి) సూర్యుడు రోజులో పలు సమయాల్లో భూమి అక్షానికి వివిధ ఎత్తుల్లో ఉండటం.

ఇ) సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు తూర్పున ఉదయించి   పడమర అస్తమిస్తున్నట్లుగా కనిపించడం.


2) భూపరిభ్రమణం: భూమి తన కక్ష్యామార్గంలో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ స్థానభ్రంశం చెందే బాహ్య చలనాన్ని భూపరిభ్రమణం అంటారు. సూర్యుడి చుట్టూ భూమి ఒక పరిభ్రమణం చేయడానికి పట్టేకాలం 365 రోజుల 6 గంటల 10 సెకన్లు. సాధారణంగా సంవత్సరానికి 365 రోజులు. కానీ మిగిలిన 6 గంటలను ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలుపుతారు. 366 రోజులున్న ఆ నాలుగో ఏడాదిని లీపు సంవత్సరం అని పిలుస్తారు. ఆ సంవత్సరంలో వచ్చే అదనపు రోజును ఫిబ్రవరి నెలకు కలుపుతారు.


తారా వృత్తం లేదా నక్షత్ర నామ సంవత్సరం (సైడేరియల్‌ ఇయర్‌): సూర్యుడి చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణం చేయడానికి ఏ గ్రహానికైనా పట్టేకాలం. భూమి పరంగా ఇది 365 రోజులు ఉంటుంది. అంటే భూమి తన కక్ష్యలో ఒక నిర్ణీత బిందువు నుంచి సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చెంది, అదే బిందువుని చేరడానికి పట్టేకాలం.


భూపరిభ్రమణ సమయంలో భూమిపై సంభవించే మార్పులు:

ఎ) రాత్రి పగటి సమయాల్లో తేడాలు ఏర్పడటం

బి) సంవత్సరంలో పలు కాలాల్లో వివిధ రుతువులు ఏర్పడటం. భూపరిభ్రమణ సమయంలో ఈ రెండు రకాల మార్పులు భూమిపై ఏర్పడటానికి కారణాలు - 

1) భూ అక్షం 23 1/20ల కోణంతో కుడివైపునకు వాలి ఉండటం లేదా  భూ అక్షం తన సమతల కక్ష్యా తలంతో 66 1/20ల కోణం చేయడం.

2) భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ భూమి చుట్టుకొలత తగ్గడం లేదా భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం తగ్గడం.

ఈ రెండు కారణాల వల్ల భూమి తన కక్ష్యామార్గంలో తిరిగేటప్పుడు భూమికి సంబంధించిన నాలుగు ప్రత్యేక స్థానాలను గమనించడం ద్వారా రుతువులు ఏర్పడే విధానాన్ని గురించి తెలుసుకోవచ్చు. అవి.. 


1) అయనాంతాలు: ఇవి సంవత్సరంలో డిసెంబరు 22, జూన్‌ 21న సంభవిస్తాయి.


ఎ) డిసెంబరు 22: ఈ రోజున సూర్యకిరణాలు మకరరేఖపై నిట్టనిలువుగా పడటం వల్ల (నడినెత్తిన సూర్యుడు) దక్షిణార్ధ గోళంలో సుదీర్ఘమైన పగలు, హ్రస్వమైన రాత్రులు ఏర్పడతాయి. ఈ రోజునే ఉత్తరార్ధగోళ పరంగా శీతాకాల అయనాంతం లేదా ఉత్తరాయణ ప్రారంభకాలం అని పిలుస్తారు. ఈ రోజు తర్వాత సూర్యుడు మకర రేఖను వదిలి కర్కటరేఖ వైపు పయనిస్తాడు.సూర్యుడి ఈ పయనాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో సంక్రాంతి పండగ చేసుకుంటారు.


బి) జూన్‌ 21: ఈ రోజున సూర్యకిరణాలు కర్కట   రేఖపై నిట్టనిలువుగా పడటం వల్ల (నడినెత్తిన సూర్యుడు) ఉత్తరార్ధ గోళంలో సుదీర్ఘమైన పగలు, హ్రస్వమైన (చిన్న,) రాత్రులు ఏర్పడతాయి. ఈ రోజునే ఉత్తరార్ధగోళ పరంగా వేసవి అయనాంతం లేదా దక్షిణాయణ ప్రారంభకాలం అని పిలుస్తారు. ఈ రోజు తర్వాత సూర్యుడు కర్కటరేఖను వదిలి మకరరేఖ వైపు పయనిస్తాడు.


2) విష వత్తులు: ఈ రోజుల్లో భూమిపై అన్ని ప్రాంతాల్లో రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. కారణం సూర్యకిరణాలు సంవత్సరంలో మార్చి 21, సెప్టెంబరు 22 లేదా 23న భూమధ్యరేఖపై నిట్ట నిలువుగా పడటమే. ఈ రోజుల్లో లేదా ఈ తేదీల్లో సూర్యుడి ఉన్నతి భూమధ్యరేఖతో 900 లు ఉంది. అంటే ఈ ప్రాంతాల్లో సూర్యుడు నిట్టనిలువుగా ప్రకాశిస్తాడు. భూమధ్యరేఖకు అటూఇటూ ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ సూర్యుడి ఉన్నతి క్రమంగా తగ్గుతూ ధ్రువాల వద్ద 0ా లుగా ఉంటుంది. దీనివల్ల రెండు ధ్రువాల వద్ద సూర్యుడు ఆకాశం అంచువద్ద కనిపిస్తాడు( Cos 900- X0).ఈ సూత్రాన్ని అనుసరించి మిగిలిన ఏ అక్షాంశం వద్ద అయినా సూర్యుడి ఉన్నతిని లెక్కించవచ్చు. ఇక్కడ x  = అక్షాంశం కోణాన్ని తెలియజేస్తుంది.

ఎ) వసంత కాలపు విషవత్తు: ఇది మార్చి 21న ఏర్పడుతుంది.

బి) శరత్కాలపు విషవత్తు: ఇది సెప్టెంబరు 22 లేదా 23న సంభవిస్తుంది.


జూన్‌ 21 వేసవి అయనాంత పరిస్థితులు:


ఉత్తరార్ధ గోళంలో రుతుమార్పులు: 


1) ఈ రోజున ఉత్తర ధ్రువం సూర్యుడి వైపు వాలి ఉంటుంది.


2) సూర్యుడు కర్కట  రేఖపై నిట్టనిలువుగా ఉండటంతో ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది. 


3) ఉత్తరార్ధ గోళంలో పగటి సమయం సుదీర్ఘంగా ఉంటుంది.  


4) ఆర్కిటిక్‌ వలయం, ఉత్తర ధ్రువం మధ్య ఉన్న ప్రాంతంలో ఆరు నెలల పాటు 24 గంటలూ పగలు ఉంటుంది. సూర్యాస్తమయం ఉండదు.


దక్షిణార్ధ గోళంలో రుతుమార్పులు:


 దక్షిణ ధ్రువం సూర్యుడికి దూరంగా ఉంటుంది.


శీతాకాలం ఏర్పడుతుంది.


దక్షిణార్ధ గోళంలో రాత్రి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి.


అంటార్కిటికా వలయం, దక్షిణ ధ్రువాల మధ్య ఆరు నెలల పాటు 24 గంటలూ చీకటి ఉంటుంది. సూర్యోదయం ఉండదు.


డిసెంబరు 22 శీతాకాల అయనాంత పరిస్థితులు:

ఉత్తరార్ధ గోళంలో రుతుమార్పులు:

ఈ రోజున ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా వాలి ఉంటుంది.  

సూర్యుడు మకర రేఖపై నిట్టనిలువుగా ఉండటంతో ఉత్తరార్ధ గోళంలో శీతాకాలం ఉంటుంద

ఉత్తరార్ధ  గోళంలో రాత్రి సమయం సుదీర్ఘంగా ఉంటుంది. 

ఆర్కిటిక్‌ వలయం, ఉత్తర ధ్రువం మధ్య ఉన్న ప్రాంతంలో  ఆరు నెలల పాటు 24 గంటలూ చీకటి ఉంటుంది. సూర్యోదయం ఉండ*దు.


దక్షిణార్ధ గోళంలో రుతుమార్పులు:

దక్షిణ ధ్రువం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది

వేసవికాలం ఏర్పడుతుంది.

దక్షిణార్ధ గోళంలో పగటి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి.

అంటార్కిటికా వలయం, దక్షిణ ధ్రువాల మధ్య  ఆరు నెలల పాటు 24 గంటలూ పగలు ఉంటుంది, సూర్యాస్తమయం సంభవించదు. 

 


రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌