• facebook
  • whatsapp
  • telegram

 భూపటల కదలికలు

ఖండాలన్నీ ఏకఖండ భాగాలే!


భూ గ్రహంపై ప్రస్తుతం ఉన్న ఖండాల అమరిక, సముద్రాల స్థితిగతులు ఒకప్పుడు ఆ విధంగా లేవు. ఎప్పటికీ అలాగే స్థిరంగా ఉండవు. మందపాటి పలకలుగా ఉండే భూపటలం అధిక సాంద్రత ఉన్న భూప్రావారం మీద తేలుతూ ఉంటుంది. భూకేంద్రం నుంచి వచ్చే ఉష్ణసంవహన ప్రవాహ శక్తితో ఈ పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. సంవత్సరానికి కేవలం సెంటీమీటర్లలో కోట్ల ఏళ్లుగా జరుగుతున్న ఈ పరిణామమే సముద్రాలు,   పర్వతాలు, అగాధాల పుట్టుకకు, భూకంపాల లాంటి ప్రకృతి విపత్తులకు కారణం. ప్రత్యక్షంగా అనుభూతి చెందలేని భూపటల కదలికలపై పోటీ పరీక్షార్థులకు శాస్త్రీయ అవగాహన ఉండాలి. ఆ కదలికల్లో రకాలు, వాటిని వివరించే సిద్ధాంతాలు, ఇతర అంశాలను వివరంగా తెలుసుకోవాలి.


భూపటల కదలికలకు సంబంధించి రెండు సిద్ధాంతాలు ప్రాచుర్యం పొందాయి.

1) వెజినర్‌ ప్రతిపాదిత ఖండ చలన సిద్ధాంతం

2) స్టాన్లీ, మోర్గాన్, హెస్‌లు ప్రతిపాదించిన పలక విరూపక సిద్ధాంతం.


ఖండ చలన సిద్ధాంతం (కాంటినెంటల్‌ డ్రిఫ్ట్‌ థియరీ): 16వ శతాబ్దంలో అబ్రహాం ఆర్టిలియన్‌ అనే శాస్త్రజ్ఞుడు మొదటగా ఖండాలు కదిలి ఉండవచ్చని ప్రతిపాదించాడు. దీనికి అతడు వివరించిన ఆధారం ఆఫ్రికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా తూర్పు తీరం మధ్య ఉన్న సాదృశ్యాలు.

* 1915లో జర్మనీ భూభౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్ఫెడ్ర్‌ వెజినర్‌ జర్మన్‌ భాషలో రచించిన గ్రంథం ‘ద ఆరిజిన్‌ ఆఫ్‌ కాంటినెంట్స్‌ అండ్‌ ఓషన్స్‌’ గ్రంథంలో ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ముడత పర్వతాల పుట్టుక గురించి అధ్యయనం చేసే క్రమంలో దాన్ని ప్రతిపాదించాడు. ఇందుకు పలు ఆధారాలను పేర్కొన్నాడు.

1) జిగ్‌-సా-ఫిట్‌: దక్షిణ అమెరికా తూర్పు తీరం, ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని మనం దగ్గరకు తెస్తే అవి చక్కగా అమరుతాయి. అమెరికా తూర్పున ఉన్న బ్రెజీలియన్‌ బల్జ్, ఆఫ్రికా పశ్చిమాన గినియా తీరంలో చక్కగా అమరుతుంది. దీన్నే వెజినర్‌ ‘జిగ్‌-సా-ఫిట్‌’ (రంపపు అమరిక) అని పేర్కొన్నాడు.

2) శిలలు రకాలు, వాటి నిర్మాణం: దక్షిణ అమెరికా తూర్పుతీరంలో, ఆఫ్రికా పశ్చిమ తీరంలోని శిలలు ఒకే కాలానికి, ఒకే రకానికి చెందినవే. అంటే ఇవి రెండూ ఒకప్పటి ఏకఖండ భాగాలు.

* ఉత్తర అమెరికా తూర్పున అపలేచియన్‌ పర్వతాలను పోలిన శిలా నిర్మాణాలు అట్లాంటిక్‌ సముద్రంలోని న్యూఫౌండ్‌ ల్యాండ్, బ్రిటానీ ద్వీపాల్లో కనిపిస్తాయి.

* మడగాస్కర్‌ ద్వీప తూర్పు భాగంలోని దక్కన్‌ నాపరాతి శిలా నిర్మాణాలు భారత ద్వీపకల్ప పశ్చిమ భాగంలో కూడా ఉన్నాయి.

* ఆఫ్రికా ఆగ్నేయ భాగంలోని రాతి నిర్మాణాలు,    ఆస్ట్రేలియా వాయవ్య భాగంలోని రాతి నిర్మాణాలు ఒకటే.

3) శిలాజాల విస్తరణ: మీసోసారస్‌ అనే మంచి నీటి సరీసృపాల శిలాజాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ భాగాల్లో లభ్యమయ్యాయి. ట్రయసిక్‌ యుగానికి చెందిన సైనోగ్నాథస్‌ అనే సరీసృప శిలాజాలు కూడా ఆ రెండు ఖండాల మధ్య భాగంలో దొరికాయి. లైసోసారస్‌ శిలాజాలు ఆఫ్రికా, భారత ద్వీపకల్ప పీఠభూమి, అంటార్కిటికా,   ఆస్ట్రేలియాలో విరివిగా లభించాయి. ఈ ఆధారాల వల్ల ఖండాలన్నీ ఒకే భూభాగం నుంచి విడిపడినవిగా భావిస్తున్నారు.

4) హిమావరణపు ఆధారాలు: 30 కోట్ల ఏళ్ల (పేలియోజాయిక్‌ యుగం) కిందట గోండ్వానా ఖండ భాగంలోని అన్ని ఖండాల్లో హిమానీనదాల ఉనికికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ప్రధానంగా అంటార్కిటికాలో తప్ప హిమానీనదాల ఉనికి లేదు. అంటే నాటికి, నేటికీ శీతోష్ణస్థితులు మారి ఉండాలి లేదా ఖండాలన్నీ ఉన్నచోటు నుంచి కదిలి ఉండాలి.

5) ఇంధన ఖనిజాల లభ్యత: ప్రస్తుతం పెట్రోలియం దొరికే అనేక ప్రాంతాలు ఎడారి ప్రాంతాలుగా ఉన్నాయి. పెట్రోలియం ఏర్పడాలంటే కోటానుకోట్ల నాచు మొక్కలు, సముద్ర తీరం లాంటి ప్రత్యేక అంశాలు ఉండాలి. అలాగే భూమధ్యరేఖ ప్రాంతపు దట్టమైన అడవులు ఉండే ప్రాంతాల్లోనే బొగ్గు నిక్షేపాలు లభించాలి. చైనా, రష్యా, భారతదేశంలో దొరికే బొగ్గు నిక్షేపాలు ఆ ఉనికిలో లేవు.

సిద్ధాంత ప్రాథమిక భావనలు:

1) పేంజియా (Pangea): ఒకే ఒక ఖండ భాగమని దీని అర్థం. Pan అంటే ఒకటి, gea అంటే భూభాగం.

2) పాంథాల్స: ఒకే ఒక మహాసముద్రం. తలస్సా అంటే జల భాగం.

3) టెథిస్‌: పేంజియా మధ్యలో చీలిక ఏర్పడి ప్రారంభమైన సన్నని పొడవైన సముద్రం.

4) గోండ్వానా: టెథిస్‌కి దక్షిణ భూభాగం. ఇందులో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారత ద్వీపకల్పం, ఆస్ట్రేలియా, అరేబియా, మలేసియా భూభాగాలు ఉన్నాయి.

5) అంగారా: దీన్నే   లారెన్షియా అంటారు. టెథిస్‌ ఉత్తరం వైపు ఉన్న భూభాగం. ఇందులో ఉత్తర అమెరికా, యురేషియా ఖండ భాగాలున్నాయి.

సిద్ధాంత వివరణ: 22 కోట్ల ఏళ్ల కిందట ఖండాలన్నీ ఒకే ఖండంగా ఉండేవి. ఆ మహా ఖండాన్ని ‘పేంజియా’ అని, దానిచుట్టూ విస్తరించిన మహా జలభాగాన్ని ‘పాంథాల్స’ అని  వెజినర్‌ పేర్కొన్నాడు. మధ్య మహాయుగం (మీసోజోయిక్‌ - 15 నుంచి 25 కోట్ల ఏళ్ల పూర్వం)లో ఈ మహాఖండంలో చీలిక ప్రారంభమైంది. అందులో ఉత్తర భాగాన్ని అంగార అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా అని, చీలిక భాగాన్ని టెథిస్‌ మహాసముద్రంగా చెప్పాడు.

* దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలు పశ్చిమ దిక్కుకు   కదలడం ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియా తూర్పు వైపునకు, అంటార్కిటికా దక్షిణం వైపునకు కదలగా; ఆఫ్రికా, అరేబియా, భారత ద్వీపకల్పం, మలేసియా భూభాగాలు.. యురేషియా వైపు పురోగమించాయి. యురేషియాను ఆఫ్రికా, అరేబియా, భారత ద్వీపకల్పం, మలేసియా భూభాగాలు ఢీకొనడం వల్ల మయన్మార్‌లోని అరకన్‌ యోమ నుంచి పైరీనీస్‌ పర్వతాల వరకు ఉన్న ప్రపంచ మధ్య పర్వత మేఖల   ఏర్పడింది. (హిమాలయాలు, హిందుకుష్, జాగ్రాస్, కాకసస్, ఆల్ఫ్స్‌   పర్వతాలు ఈ మేఖలలోనివే).

పలక విరూపక సిద్ధాంతం (ప్లేట్‌ టెక్టోనిక్‌ థియరీ): ఖండచలన సిద్ధాంతంలోని లోపాలను సవరిస్తూ హెస్, జేసన్‌ మోర్గాన్, మెకంజీ, పీటర్‌ పార్కర్‌ లాంటి శాస్త్రవేత్తల ఆలోచనలతో పరిణామ క్రమం చెందిందే పలక విరూపక సిద్ధాంతం.

పలక (ప్లేట్‌): భూమి ఉపరితలాన్ని భూపటలం అంటారు. భూపటలాన్ని ఖండాలుగా కాకుండా పలకలుగా విభజించారు. అంటే పలకల మందం 100 కి.మీ.ల వరకు ఉంటుంది. సముద్రాల  దిగువన తక్కువ మందంగా, ఖండాల దిగువన ఎక్కువ మందంగా ఉంటుంది. పలకలు అంటే కేవలం ఖండ ఉపరితలం ఉన్నవే కావు, సముద్ర ఉపరితలం కూడా ఉండవచ్చు. మొత్తం భూఉపరితలాన్ని 7 ప్రధాన పలకలుగా విభజించారు.  అవి

1) యురేషియా పలక

2) ఆఫ్రికా పలక    

3) ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పలక  

4) ఉత్తర అమెరికా పలక

5) దక్షిణ అమెరికా పలక

6) అంటార్కిటికా పలక

7) పసిఫిక్‌ పలక

సమాంతర పలకలు: ప్రధాన  పలకలతోపాటు అనేక చిన్న   పలకలు ఉన్నాయి.

1) కోకోస్‌ పలక - మధ్య అమెరికా పశ్చిమ భాగం

2) నజ్క పలక - దక్షిణ అమెరికా పశ్చిమ భాగం

3) కరోలిన్‌ పలక - ఇండొనేసియా ద్వీపాల తూర్పు భాగం

4) జువాన్‌ డి ఫ్యుక పలక - ఉత్తర  అమెరికా పశ్చిమం, పసిఫిక్‌ మహాసముద్రంలో        

5) స్కాటియా పలక - దక్షిణ అమెరికా దక్షిణ అగ్రం వద్ద అట్లాంటిక్‌ మహాసముద్రంలో    

6) బిస్మార్క్‌ పలక - న్యూగినియా తూర్పు భాగం

7) అరేబియా పలక, ఫిలిప్పీన్స్‌ పలక - మలేసియా, ఫ్యుజి పలక.

1) అభిసరణ పలక కదలిక: రెండు పలకలు ఒకదానికొకటి అభిముఖంగా కదిలితే, దాన్ని ‘అభిసరణ పలక కదలిక’ అంటారు. ఈ పలక సరిహద్దు వద్ద ముడత పర్వతాలు ఏర్పడతాయి. ఈ నిర్మాణంలోనే అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. ఈ పలక సరిహద్దులను ‘విధ్వంసకర పలక సరిహద్దు’ అని కూడా అంటారు.

ఉదా: i) యురేషియా + ఆఫ్రికా, ఇండో,   ఆస్ట్రేలియా పలక: ఈ పలక సరిహద్దులో హిమాలయాలు, ఆల్ఫ్స్‌తో కూడిన ప్రపంచ మధ్య పర్వత మేఖల ఏర్పడింది.

ii) ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా పలకలు పసిఫిక్‌ పలకను   ఢీకొనడం వల్ల రాఖీ, ఆండీస్‌ పర్వతాలు    ఏర్పడ్డాయి.

2) అపసరణ పలక కదలిక: రెండు పలకలు వ్యతిరేక దిశలో కదలడం. ఈ పలక సరిహద్దును ‘నిర్మాణాత్మక పలక సరిహద్దు’ అని కూడా అంటారు. ఇక్కడ లోయలు, సముద్రాలు, మహా  సముద్రాలు, రిడ్జ్‌లు వరుసగా ఏర్పడతాయి.

ఉదా: ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా పలకలు రెండూ యురేషియా, ఆఫ్రికా పలకల నుంచి విడిపడి పశ్చిమంగా కదులుతున్నాయి. ఈ కదలిక వల్ల అట్లాంటిక్‌ మహాసముద్రం ఏర్పడింది. అట్లాంటిక్‌ మధ్యలో మిడ్‌ ఓషియానిక్‌ రిడ్జ్‌ ''S'' ఆకారంలో ఏర్పడింది.

3) సమాంతర పలక కదలిక: రెండు పలకలు ఒకే దిశలో లేదా వ్యతిరేక దిశలో సమాంతరంగా కదులుతాయి. ఈ పలక సరిహద్దులను ‘కన్జర్వేటివ్‌ పలక సరిహద్దు’ అని కూడా అంటారు.

ఉదా: జువాన్‌ డి ఫ్యుక పలక సరిహద్దు, తూర్పు పసిఫిక్‌ పలక సరిహద్దు.

పలకల వేగం: ఆర్కిటిక్‌ రిడ్జ్‌ వద్ద పలక వేగం అత్యంత తక్కువగా సంవత్సరానికి 2.5 సెం.మీ.లు ఉంటే, అత్యధిక వేగం దక్షిణ పసిఫిక్‌ పలక ఏడాదికి 15 సెం.మీ.లు దూరాన్ని నమోదు చేసింది. చాలా స్వల్పం అనిపించినప్పటికీ భౌమచరిత్రతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అవుతుంది. భూమి వయసు 450 కోట్ల ఏళ్లు. పలకలు    కదలడం ప్రారంభమై 30 కోట్ల సంవత్సరాలైంది.

ఉష్ణ సంవహన ప్రవాహాలు: పలకలు కదలడానికి కావాల్సిన శక్తిని వీటి నుంచే పొందుతున్నాయి. భూకేంద్రంలో 6000ాది ఉష్ణోగ్రత ఉంటుంది. భూపటల సరిహద్దు వద్ద దాదాపు 1200ాది ల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతా వ్యత్యాసం వల్ల భూకేంద్రం నుంచి ఉష్ణసంవహన ప్రవాహాలు వలయాకారంలో ఏర్పడతాయి. ఈ ప్రవాహాలు ఉపరితలం మీద ఉన్న పలకలను నెమ్మదిగా నెట్టడం ప్రారంభిస్తాయి.

సముద్ర భూతల విస్తరణ: ఈ సిద్ధాంతాన్ని  అమెరికా శాస్త్రవేత్త హెచ్‌.ఎన్‌.హ్యారీ 1960లో ప్రతిపాదించాడు. రెండు పలకలు పరస్పర   వ్యతిరేక దిశలో కదులుతున్నప్పుడు మొదట లోయలు తర్వాత సముద్రాలు, మహాసముద్రాలు ఏర్పడతాయి. చివరగా సముద్ర అడుగు భాగం నుంచి ఉబికి వచ్చే లావా వల్ల పర్వతాలు ఉద్భవిస్తాయి. సముద్ర అడుగు భాగం నుంచి ఏర్పడే ఈ పర్వతాలను ‘రిడ్జ్‌’లు అంటారు. అట్లాంటిక్‌ మహా    సముద్ర మధ్యభాగంలో దాదాపు 16,000 కి.మీ.ల పొడవు ఉండే ‘మిడ్‌ అట్లాంటిక్‌ రిడ్జ్‌’ ఏర్పడింది. పలకల సరిహద్దుల మధ్య సముద్ర అడుగు భాగంలో మహా సముద్ర అగాధాలు ఏర్పడతాయి. ఈ మొత్తం నిర్మాణాన్ని ‘సముద్ర భూతల విస్తరణ’ అంటారు.

పసిఫిక్‌ పరివేష్ఠిత ప్రాంతాలు:  పసిఫిక్‌ మహాసముద్రం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతం. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 80% ఇక్కడే ఉన్నాయి. భూకంపాల్లో 68% ఇక్కడే సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘పసిఫిక్‌ అగ్ని వలయం’ అంటారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల పశ్చిమ తీరం, ఆసియా తూర్పు తీరం ఇందులో ఉన్నాయి.

Y - కూడలి: ఆఫ్రికా తూర్పున ఎర్ర సముద్రం, ఏడెన్‌ సింధుశాఖలు, ఆఫ్రికా పగులు లోయ నిర్మాణం పట్ల చీలిపోయి Y - కూడలి  మాదిరి ఉంటుంది. ఈ కూడలిలోని ఎర్ర సముద్రాన్ని  భవిష్యత్తు మహాసముద్రంగా అంచనా వేస్తున్నారు.

 


రచయిత: సక్కరి జయకర్‌ 

 

Posted Date : 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌