• facebook
  • whatsapp
  • telegram

కాంతి - దృక్‌ సాధనాలు (ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌)

నిలువుగా మిథ్య.. తలకిందులుగా నిజం!
 

 


బైక్‌పై వెళ్లేటప్పుడు వెనక వచ్చే వాహనాలు దూరంగా ఉన్నప్పటికీ హ్యాండిల్‌కు అమర్చిన అద్దాల్లో నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. చెవి, ముక్కు, గొంతుల్లోని సూక్ష్మ భాగాలను వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను గుర్తిస్తారు. గడియారాల్లోని అతి చిన్న వస్తువులనూ తేలిగ్గా రిపేరు చేసేస్తుంటారు. కారణం సాధారణ కంటికి సరిగా కనిపించని వాటన్నింటినీ శ్రమలేకుండా చూడటానికి కొన్ని రకాల ప్రత్యేక అద్దాలను ఉపయో గించడమే. కళ్లజోడులు, చరవాణి కెమెరాలు తదితరాల్లో ఉన్నవన్నీ ఆ విధమైన పరికరాలే. అలాంటి  అద్దాలు, కటకాల వినియోగం, ఆకారం, అవసరాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. వివిధ సూక్ష్మదర్శినులు, దర్పణాలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకోవాలి.

1) సరళ సూక్ష్మదర్శిని: దీనిని 17వ శతాబ్దంలో ఆంటోనివాన్‌ లీవెన్‌హుక్‌ కనుక్కున్నారు. ఇది చిన్నగా ఉండే వస్తువులను పెద్దగా చేసి చూపుతుంది. కుంభాకార కటకాన్ని సరళ సూక్ష్మదర్శిని అంటారు.

ఉపయోగాలు: సరళ సూక్ష్మదర్శినిని ప్రయోగశాలలో రీడింగ్‌లు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అతిచిన్న అక్షరాలను కూడా చదవడానికి వాడతారు. చేతి గడియారాలను మరమ్మతు చేసేవారు వినియోగిస్తారు.

2) సంయుక్త సూక్ష్మదర్శిని: దీనిని 1590లో జకారియస్‌ జాన్సన్‌ కనుక్కున్నారు. అధిక ఆవర్తనం కోసం ఉపయోగిస్తారు. దీనిలో రెండు వేర్వేరు నాభ్యంతరాలున్న కుంభాకార కటకాలను ఉపయోగిస్తారు. తక్కువ నాభ్యంతరం ఉండే కటకాన్ని వస్తువు వైపు అమరుస్తారు. దానిని వస్తుకటకం అంటారు. కన్ను వైపు అమర్చే ఎక్కువ నాభ్యంతరం ఉండే కటకాన్ని అక్షికటకం అంటారు.


అనువర్తనాలు:

సంయుక్త సూక్ష్మదర్శినిని సూక్ష్మజీవులను (బ్యాక్టీరియా, వైరస్‌) గుర్తించేందుకు ఉపయోగిస్తారు.

* దీనిద్వారా వేరు, కాండం, పత్రం అడ్డుకోతలను స్పష్టంగా పరిశీలించవచ్చు.

వివిధరకాల వ్యాధుల నిర్ధారణ (డయాగ్నోస్టిక్స్‌)కు ఉపయోగిస్తారు.


3) దూరదర్శిని (టెలీస్కోప్‌): దూరంగా ఉండే వస్తువులను దగ్గరగా చూపే సాధనమిది. 1608లో హాన్స్‌ లిప్పర్హే కనుకున్నారు. ఇది 2 రకాలు 1) వక్రీభవన దూరదర్శిని, 2) పరావర్తన దూరదర్శిని.

భూగోళ దూరదర్శిని: భూమిపై దూరంగా ఉండే వస్తువులను చూడటానికి ఉపయోగిస్తారు. దీనిలో మూడు కటకాలు ఉంటాయి. మధ్యలో ఉండే కటకాన్ని ఉత్తాపక కటకం అంటారు. ఇది తలకిందులుగా ఉండే ప్రతిబింబాన్ని నిటారుగా చేస్తుంది.

ఖగోళ దూరదర్శిని: దీనిని మొదటగా నిర్మించిన శాస్త్రవేత్త కెప్లర్‌. ఖగోళంలోని వస్తువులను చూడటానికి వాడతారు. రెండు కటకాలు ఉంటాయి. ఇందులో ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది.గెలీలియో టెలిస్కోప్‌: దీనిని 1609లో గెలీలియో నిర్మించారు. ఇందులో ప్రతిబింబం నిటారుగా ఏర్పడుతుంది.

ప్రతిబింబాలు:  దర్పణం లేదా కటకంతో ఏర్పడే వస్తు రూపాన్ని ప్రతిబింబం అంటారు.


1) మిథ్యా ప్రతిబింబం: దీనిని తెరపై పట్టడం కుదరదు. కాంతికిరణాల వికేంద్రీకరణం వల్ల ఏర్పడుతుంది. నేరుగా కంటితో చూడవచ్చు. నిటారుగా ఏర్పడుతుంది. ఉదా: సమతల దర్పణం, కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు; పుటాకార కటకంలో ఏర్పడే ప్రతిబింబాలు.


2) నిజ ప్రతిబింబం: దీనిని తెరపై పట్టవచ్చు. కానీ నేరుగా కంటితో చూడలేరు. కాంతి కిరణాలు కేంద్రీకరణం చెందడం వల్ల ఇది ఏర్పడుతుంది. తలకిందులుగా ఉంటుంది. ఉదా: పుటాకార దర్పణం, కెమెరాలో ఏర్పడే ప్రతిబింబాలు; కుంభాకార కటకంలో ఏర్పడే ప్రతిబింబాలు.


పుటాకార దర్పణం: లోపలికి వంచిన, నొక్కు ఆకారంలో ఉండే దర్పణాన్ని పుటాకార దర్పణం అంటారు.

ఉపయోగాలు:  

ENT వైద్యులు, దంతవైద్యుడు, ఆప్తాల్మోస్కోప్‌లో ఈ దర్పణాన్ని ఉపయోగిస్తారు.

దూరదర్శిని, సౌరఘటాల్లో వాడతారు.

టార్చ్‌లైట్స్, ఫోకస్‌ లైట్స్, వాహనాల హెడ్‌లైట్స్‌లో వినియోగిస్తారు

సెలూన్లలో షేవింగ్‌ దర్పణంగా వాడతారు. 


కుంభాకార దర్పణం: బయటకు వంచిన, ఉబ్బెత్తు ఆకారంలో ఉండే దర్పణాన్ని కుంభాకార దర్పణం అంటారు. దీనిని వాహనాల్లో రేర్‌వ్యూ మిర్రర్‌గా ఉపయోగిస్తారు. కూడళ్లు, మెట్ల మలుపుల వద్ద వాడతారు. 


నాభి (ఫోకస్‌): ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కిరణాలు పుటాకార దర్పణం నుంచి పరావర్తనం చెంది ప్రధానాక్షంపై ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి. ఈ బిందువును పుటాకార దర్పణ నాభి అంటారు. కుంభాకార దర్పణం నుంచి పరావర్తనమయ్యే కిరణాలన్నీ దర్పణం వెనుక భాగంలో ప్రధాన అక్షంపై ఉండే ఒక బిందువు నుంచి బయలుదేరినట్లుగా ఉంటాయి. ఈ బిందువును కుంభాకార దర్పణ నాభి (F) అంటారు.

కటకాలు(Lenses):ఒక వైపు లేదా రెండు వైపులా వక్రతలాలున్న పారదర్శక పలకలను కటకాలు అంటారు. కటకాల తయారీలో ప్లింట్‌ గాజును వాడతారు.

1) కుంభాకార కటకం (Convex Lense): రెండువైపులా ఉబ్బెత్తుగా, పారదర్శకంగా ఉండే గాజు పదార్థాలను కుంభాకార కటకం అంటారు. ఇది మధ్యలో మందంగా, అంచుల వద్ద పలుచగా ఉంటుంది. దీనికి ఒకవైపు వస్తువును ఉంచితే రెండో వైపు ప్రతిబింబం ఏర్పడుతుంది. దీనిని కేంద్రీకరణ కటకం అంటారు.

2) పుటాకార కటకం (Concave Lense): రెండు వైపులా నొక్కు ఆకారంలో ఉండి, పారదర్శకంగా ఉండే గాజు పదార్థాలను పుటాకార కటకం అంటారు. ఇది మధ్యలో పలుచగా, అంచుల వద్ద మందంగా ఉంటుంది. దీనిలో వస్తువును ఉంచిన వైపే ప్రతిబింబం ఏర్పడుతుంది. దీనిని వికేంద్రీకరణ కటకం అంటారు.


కటక సామర్థ్యం(P): కటక నాభ్యంతరం విలోమాన్ని కటక సామర్థ్యం అంటారు. దీనిని డయాప్టర్‌లలో కొలుస్తారు.

* కుంభాకార కటక సామర్థ్యం - ధనాత్మకం

పుటాకార కటక సామర్థ్యం - రుణాత్మకం


రామ్స్‌డన్‌ అక్షి కటకం: కొలతలు తీసుకోవడానికి ఉపయోగపడే దృక్‌ సాధనమే రామ్స్‌డన్‌ అక్షి కటకం. దీనిని జోస్‌ రామ్స్‌డన్‌ కనుక్కున్నారు. ఇందులో అడ్డు గీతలు ఉంటాయి.


బైనాక్యులర్‌: రెండు సమాన టెలీస్కోపులను సౌష్ఠవంగా అమర్చిన ఏర్పాటును బైనాక్యులర్‌ అంటారు. దీనిని 1825లో జె.పి.లీమీర్‌ కనుక్కున్నారు. దూరంగా ఉండే వస్తువులను రెండు కళ్లతో ఒకేసారి చూడటానికి వాడతారు. 


కెమెరా: దృశ్యాలను ఫొటోగ్రఫిక్‌ ప్లేట్‌పై చిత్రించే సాధనాన్ని కెమెరా అంటారు. దీనిని 1685లో జోహన్‌జాన్‌ తయారుచేశారు. కెమెరాను ఉపయోగించి 1814లో మొదటి చిత్రాన్ని చిత్రీకరించిన వ్యక్తి - జోసఫ్‌ నిస్ఫోర్‌ నిపిస్‌. కెమెరా కటక నాభ్యంతరం మారదు. కంటి నాభ్యంతరం వస్తు దూరాన్ని బట్టి కొంతమేరకు సర్దుబాటు అవుతుంది.


దృశాతంతువులు (ఆప్టికల్‌ ఫైబర్స్‌): ఇవి వెంట్రుక కంటే సన్నగా ఉండి నమ్యత, పారదర్శకతతో ఉంటాయి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. వీటిని సిలికా/గాజు పీచుతో తయారుచేస్తారు. వీటి రూపకల్పన, అనువర్తనాల అధ్యయనాన్ని ఫైబర్‌ ఆప్టిక్స్‌ అంటారు. వీటిని ఎక్కువగా సమాచార, ప్రసార రంగంలో ఉపయోగిస్తారు. హరోల్డ్‌ హాకిన్స్, నరీందర్‌ సింగ్‌ కపానీలు అనేక సన్నని తంతువులున్న దృశాతంతువును (75 సెం.మీ.) తయారుచేయడంలో సఫలమయ్యారు.


ఉపయోగాలు: దృశా తంతువులు సమాచారాన్ని కాంతి తరంగాల రూపంలో ప్రసారం చేస్తాయి. ఎండోస్కోపీ, ల్యాపరోస్కోపీల్లో దీన్ని ఉపయోగిస్తారు. విద్యుత్తు ఫ్లవర్‌ వాజుల్లో వాడతారు.

 



రచయిత: చంటి రాజుపాలెం 

Posted Date : 07-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌