• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో ఇటీవలి విజయాలు

అంతరిక్ష శోధనలో భారత ముద్రలు!

భారతదేశ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలు వరుసగా ప్రపంచం ముందు ఆవిష్కృతమవుతున్నాయి. చంద్రుడి మీద జరుగుతున్న ప్రయోగాలు, సూర్యుడిపై చేస్తున్న పరిశోధనలు దేశ ఖ్యాతిని పెంచుతున్నాయి. త్వరలో నిర్వహించబోతున్న గగన్‌యాన్, శుక్రయాన్‌ యాత్రలు భారత శాస్త్రజ్ఞుల నిబద్ధతను చాటుతున్నాయి. వాతావరణ పరిస్థితులపై సమగ్ర అధ్యయనానికీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఇటీవల సాధించిన విజయాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో ప్రధాన శక్తిగా మారుతున్న తీరునూ అర్థం చేసుకోవాలి. 

రోదసి సాంకేతికతలో ఇస్రో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ దూసుకుపోతోంది. చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1, ఇన్‌శాట్‌-3 డీఎస్‌ మిషన్, ఎక్స్‌పోశాట్‌ మిషన్‌ లాంటి విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. భవిష్యత్తులో గగన్‌యాన్, శుక్రయాన్‌ లాంటి యాత్రలకు సిద్ధమవుతోంది.

పీఎస్‌ఎల్వీ- సీ58-ఎక్స్‌పోశాట్‌ మిషన్‌: పీఎస్‌ఎల్వీ-సీ58 వాహకనౌక ద్వారా 2024, జనవరి 1న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి విజయవంతంగా ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహం: దీన్నే ఎక్స్‌-రే పొలారీ మీటర్‌ శాటిలైట్‌ అంటారు. గ్రహంతర గోళాలు, విశ్వం నుంచి వచ్చే ఎక్స్‌ - కిరణాల పోలరైజేషన్‌ను గుర్తించడానికి భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం. దీనిలో రెండు పరికరాలున్నాయి.అవి-

1) పోలిక్స్‌ - పొలారీ మీటర్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఇన్‌-ఎక్స్‌ రేస్‌

2) ఎక్స్‌స్పెక్ట్‌ (ఎక్స్‌ఎస్‌పీఈసీటీ) - ఎక్స్‌ రే స్పెక్ట్రోస్కోపీ అండ్‌ టైమింగ్‌. 

ఆర్‌ఎల్వీ-ఈఎక్స్‌-02 ప్రయోగం: దీన్ని రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ అటానమస్‌ ల్యాండింగ్‌ మిషన్‌ అంటారు. ఈ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2024, మార్చ్‌ 22న కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలో ఉన్న ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌) నుంచి నిర్వహించింది. ఈ ప్రయోగంలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన చీనూక్‌ హెలికాప్టర్‌ రెక్కలున్న రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ (ఆర్‌ఎల్వీ)ను 4.5 కి.మీ. ఎత్తున విడిచింది. దీని తర్వాత వాహనం తనంతట తానుగా రన్‌ వే వైపు తిరిగి క్షేమంగా కిందకు దిగింది. ఈ ప్రయోగం ద్వారా ఆకాశం నుంచి నేలపైకి దిగే సాంకేతికతను, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలు; ల్యాండింగ్‌ గేర్‌ లాంటి వాటిని పరీక్షించారు. ఈ మిషన్‌లో వాడిన వాహనానికి ఇస్రో ‘పుష్పక్‌’ గా నామకరణం చేసింది.

పీఎస్‌ఎల్వీ-సీ57 ఆదిత్య-ఎల్‌ మిషన్‌: సూర్యుడిపై పరిశోధన సాగించడానికి ఆదిత్య - ఎల్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ57 వాహక నౌక 2023, సెప్టెంబరు 2న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాన్ని అనేక విన్యాసాల తర్వాత చివరగా 2024, జనవరి 6న ఆదిత్య - ఎల్‌1 సోలార్‌ అబ్జర్వేటరీని విజయవంతంగా సూర్యుడు భూమి హాలో ఆర్బిట్‌లో ఎల్‌1 పాయింట్‌ వద్దకు చేర్చారు. ఈ స్థానంలో ఉపగ్రహాన్ని ఉంచడం ద్వారా ఎలాంటి అవాంతరాలు, గ్రహణాల ప్రభావం లేకుండా సూర్యుడిని నేరుగా గమనిస్తూ సమాచారాన్ని గ్రహించవచ్చు. ఈ ఉపగ్రహం ద్వారా సూర్యుడి క్రోమోస్ఫియర్, కరోనాను పరిశోధించవచ్చు.

ఈ ఉపగ్రహంలోని పరికరాలు:

1) వీఈఎల్‌సీ - విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌

2) ఎస్‌యూఐటీ - సోలార్‌ ఆల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌

3) ఎస్‌ఓఎల్‌ఈఎక్స్‌ఎస్‌ -  సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌ రే స్పెక్ట్రోమీటర్‌

4) హెచ్‌ఈఎల్‌ఐఓఎస్‌ - హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌ రే స్పెక్ట్రోమీటర్‌

5) ఏఎస్‌పీఈఎక్స్‌ -  ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌

6) పీఏపీఏ - ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య

7) అడ్వాన్స్‌డ్‌ ట్రై - ఎక్సియల్‌ హై రిజల్యూషన్‌ డిజిటల్‌ మాగ్నటోమీటర్‌. ఈ ఉపగ్రహాన్ని భారతదేశ మొదటి సోలార్‌ అబ్జర్వేటరీగా పేర్కొనవచ్చు.

పీఎస్‌ఎల్వీ-సి56/డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ మిషన్‌: 2023, జులై 30న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ - సి56 వాహకనౌక ద్వారా డీఎస్‌ - ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంతోపాటుగా ఆరు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. డీఎస్‌ - ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహం సింగపూర్‌కు చెందింది. దీని బరువు 360 కిలోలు. దీన్ని 535 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహంలో ఇజ్రాయెల్‌ ఎయిరో స్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ) తయారుచేసిన సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ ఉంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో రాత్రి, పగలు వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది.

పీఎస్‌ఎల్వీ - సీ55/టెలోస్‌ - 2 మిషన్‌: పీఎస్‌ఎల్వీ - సీ55 వాహక నౌక ద్వారా 2023, ఏప్రిల్‌ 22న విజయవంతంగా సింగపూర్‌కు చెందిన టెలోస్‌ - 2, ల్యూమిలైట్‌ - 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 

గగన్‌యాన్‌ యాత్రలో పాల్గొనే వారి వివరాల ప్రకటన: భారతదేశ మానవసహిత అంతరిక్షయాత్ర అయిన గగన్‌యాన్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వీరు

1) ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్,

2) అజిత్‌ కృష్ణన్,

3) అగంద్‌ ప్రతాప్,

4) శుబాన్షు శుక్లా.

తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీరికి ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌ను అందించారు. ఈ నలుగురి నుంచి చివరకు ఇద్దరు లేదా ముగ్గురిని ప్రయోగానికి ఎంపిక చేసే అవకాశం ఉంది.

జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌14/ ఇన్‌శాట్‌ - 3 డీఎస్‌ మిషన్‌: శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌14 వాహక నౌక ద్వారా విజయవంతంగా ఇన్‌శాట్‌ - 3 డీఎస్‌ ఉపగ్రహాన్ని 2024, ఫిబ్రవరి 17న కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్‌ఎల్వీకి చెందిన వాహక నౌకల యాత్రలో ఇది 16వ ఉపగ్రహం. జియోస్టేషనరీ కక్ష్యలో ఉన్న ఇన్‌శాట్‌ - 3 డీఎస్‌ ఉపగ్రహం మూడో తరానికి చెందిన వాతావరణ (మెటీరియలాజికల్‌) ఉపగ్రహం. మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ దీనికి నిధులు సమకూర్చింది. ఈ ఉపగ్రహ సేవలను ఇండియా మెటీరియాలజీ  డిపార్ట్‌మెంట్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ (ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ), ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియానిక్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఐఎన్‌సీఓఐఎస్‌) లాంటి సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. భారతదేశంలో వాతావరణ సేవలు అందించడానికి ఇప్పటికే ప్రయోగించిన ఇన్‌శాట్‌ - 3 డీ,     ఇన్‌శాట్‌ - 3 డీఆర్‌ ఉపగ్రహాలు కక్ష్యలో పనిచేస్తున్నాయి.

జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌12/ఎన్వీఎస్‌ - 01 మిషన్‌:  2023, మే 29న జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌12 వాహక నౌక ద్వారా ఎన్వీఎస్‌-  01 ఉపగ్రహాన్ని విజయవంతంగా జియోసింక్రోనస్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఎన్వీఎస్‌ - 01 అనేది నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండో తరానికి చెందిన మొదటి ఉపగ్రహం. సమాచార ప్రసారానికి కావాల్సిన నావిగేషన్‌ ఉపగ్రహాలను ఇస్రో ఇప్పటికే ప్రయోగించింది. ఈ వ్యవస్థనే నావిక్‌గా పిలుస్తున్నారు. ఈ ఉపగ్రహం వల్ల నావిగేషన్‌ సేవలు పెరుగుతాయి. ఎన్‌వీఎస్‌ - 01 ఉపగ్రహం ఎల్‌ 1 బ్యాండ్‌ సిగ్నళ్లను ప్రసారం చేసి నావిగేషన్‌ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఉపగ్రహంలో మొదటిసారిగా స్వదేశీ  పరిజ్ఞానంతో తయారుచేసిన పరమాణు గడియారాన్ని వాడుతున్నారు.

ఎస్‌ఎస్‌ఎల్‌ఎల్వీ - డీ2/ఈఓఎస్‌ - 07 మిషన్‌: స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ - డీ2  (ఎస్‌ఎస్‌ఎల్‌ఎల్వీ-డీ2) ద్వారా 2023, ఫిబ్రవరి 10న మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ మూడు ఉపగ్రహాల్లో ఒకటోది ఈఓఎస్‌ - 07. దీని బరువు 156.3 కిలోలు. ఇస్రో దీన్ని నిర్మించింది. రెండో ఉపగ్రహం జానస్‌ - 1. దీని బరువు 10.2 కిలోలు. ఇది అమెరికాకు చెందిన అంటారిస్‌ సంస్థకు చెందింది. మూడో ఉపగ్రహం ఆజాది శాట్‌ - 2. దీన్ని చెన్నైకు చెందిన ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ సహకారంతో భారతదేశంలోని 750 మంది విద్యార్థినులు తయారుచేశారు.

స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్వీ) డిమాండ్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇది తక్కువ ఖర్చుతో 500 కిలోల బరువు వరకు ఉన్న ఉపగ్రహాలను ‘లోఎర్త్‌ ఆర్బిట్‌’లో ప్రవేశపెడుతుంది.


మాదిరి ప్రశ్నలు


1.  2023, ఫిబ్రవరి 10న ఎస్‌ఎస్‌ఎల్వీ - డీ2 వాహక నౌక సాయంతో వేటిని ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌’ లో ప్రవేశపెట్టారు? 

1) ఈఓఎస్‌ - 07  2) జానస్‌ - 1   3) ఆజాది శాట్‌ - 2  4) పైవన్నీ


2. ఇటీవల కక్ష్యలో ప్రవేశపెట్టిన ఆజాది శాట్‌ - 2 ఉపగ్రహం ప్రత్యేకత- 

 1) దీన్ని ‘స్పేస్‌కిడ్జ్‌ ఇండియా’ సహకారంతో విద్యార్థినులు తయారుచేశారు

 2) ఇది అమెరికా, ఇస్రో సంయుక్త ఉపగ్రహం

 3) రష్యా, ఇండియా కలిసి దీన్ని రూపొందించాయి

 4) స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో దీన్ని రూపొందించింది


3. జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌12 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఎన్వీఎస్‌ - 01 ఉపగ్రహం దేనికి ఉపయోగపడుతుంది? 

 1) సమాచార ప్రసారానికి  2) సముద్రాలపై పరిశోధనకు

 3) నావిగేషన్‌కు        4) భూమిపై వనరుల పరిశీలనకు


4. ఇన్‌శాట్‌ - 3 డీఎస్‌ మిషన్‌ గురించి కిందివాటిలో సరైనవి? 

 1) దీన్ని జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌14 వాహక నౌక ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టారు

 2) ఇది మూడో తరానికి చెందిన వాతావరణ ఉపగ్రహం

 3) దీనికి నిధులు సమకూర్చింది ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌’

4) పైవన్నీ 


5. టెలోస్‌ - 2 ఉపగ్రహాన్ని ఏ వాహకనౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు? 

 1) జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌12   2) పీఎస్‌ఎల్వీ - సీ55    

 3) జీఎస్‌ఎల్వీ - ఎఫ్‌14    4) పీఎస్‌ఎల్వీ - సీ50


జవాబులు:  1-4, 2-1, 3-3, 4-4, 5-2.

 

రచయిత: డాక్టర్‌  బి.నరేశ్‌ 
 

Posted Date : 14-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌