• facebook
  • whatsapp
  • telegram

దక్షిణ అమెరికా

సహజ సుందర పక్షి ఖండం!


  అతి పెద్దదైన అమెజాన్‌ నది, అత్యంత పొడవైన ఆండీస్‌ పర్వతశ్రేణులు, ఎత్తయిన ఏంజెల్‌ జలపాతం, లెక్కలేనన్ని వృక్ష జాతులు, పక్షులు, ప్రకృతి అందాలతో వైవిధ్యానికి చిరునామాగా నిలిచింది దక్షిణ అమెరికా. భిన్న జీవజాతులు, భాషలు, సంస్కృతులతో,  అనేక పర్యావరణ వ్యవస్థలు, భౌగోళిక నిర్మాణాలతో నిండి ఉంది ఆ సహజ సుందర పక్షి ఖండం. ప్రపంచ భూగోళశాస్త్రం అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు ఈ వివరాలను, విశేషాలను తెలుసుకోవాలి.  

 


 


  ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో 12% ఉన్న దక్షిణ అమెరికా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఖండం. త్రిభుజాకృతిలో, ఆకు ఆకారంలో ఉన్న ఖండం. దీన్నే పక్షి ఖండం అంటారు. ఇందులో మొత్తం దేశాల సంఖ్య 13.


ఉనికి: 12ఉత్తర అక్షాంశం నుంచి 55ా దక్షిణ అక్షాంశాల మధ్య, 35o పశ్చిమ రేఖాంశం నుంచి 81o పశ్చిమ రేఖాంశాల మధ్య విస్తరించింది. పూర్తిగా పశ్చిమార్ధ గోళంలో, అధిక భాగం దక్షిణ అర్ధగోళంలో ఉంది.


దక్షిణ అమెరికాను ‘ల్యాండ్‌ ఆఫ్‌ సూపర్‌లేటివ్‌’గా పిలుస్తారు. అంటే అన్నీ అతిశయాలతో నిండిన ప్రాంతమని అర్థం. దీనికి కారణం ఈ ఖండ భూభాగంలో సూర్యుడి దిశను అనుసరించి వర్షపాతం, భిన్న శీతోష్ణస్థితులు, అత్యధికంగా వైవిధ్యభరిత పక్షి జాతులు నివసిస్తుండటమే.

 


ముఖ్యాంశాలు


* ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం బొలీవియా రాజధాని లా పాజ్‌.


* భూపరివేష్టిత దేశాలు బొలీవియా (పెద్దది), పరాగ్వే (చిన్నది).


* పశ్చిమార్ధ గోళంలో అతిపెద్ద దేశం బ్రెజిల్‌.


* ఈ ఖండంలో అతి ఎక్కువ జనాభా ఉన్న నగరం సావోపాలో (బ్రెజిల్‌ రాజధాని).


* మధ్యధరా శీతోష్ణస్థితి ప్రబలంగా ఉన్న ప్రాంతం శాంటియాగో (చిలీ)


* ప్రపంచంలో అత్యంత పొడి ప్రాంతం - అరికా (చిలీ). దీన్నే ‘ఘోస్ట్‌ టౌన్‌’ అని పిలుస్తారు.


* పెరూ తీరప్రాంతంలో పక్షుల రెట్టలను గ్వానో లేదా గుయానో అంటారు.

 


ముఖ్యమైన సింధు శాఖలు, జలసంధులు


1) గుయాక్విల్‌ సింధుశాఖ: ఈక్వెడార్‌ పశ్చిమాన పసిఫిక్‌ మహాసముద్రంలో ఉంది.


2) శానామాటియాస్‌: అట్లాంటిక్‌ సముద్రంలో అర్జెంటీనాలోని వాలెస్‌ ద్వీపకల్పంలో ఉంది


3) మాగల్లాస్‌ జలసంధి: దక్షిణ అమెరికా దక్షిణ సరిహద్దును, అర్జెంటీనాలోని టియర్రా డెల్ప్యూగో నుంచి వేరుచేస్తుంది.


4) బ్రేక్‌ జలసంధి: దక్షిణ అమెరికా, అంటార్కిటికాలకు మధ్య ఉన్న జలసంధి.

 


ముఖ్యమైన సరస్సులు, దీవులు


1) మరకైబో సరస్సు: వెనెజువెలా ఉత్తరాన ఉంది. దక్షిణ అమెరికాలోకెల్లా అతిపెద్దది.


2) టిటికాకా సరస్సు: బొలీవియా, పెరూ దేశాల్లో    విస్తరించి ఉంది. అత్యంత ఎత్తులో (సముద్ర మట్టానికి 12,500 అడుగులకు పైన) ఉన్న నౌకాయాన అనుకూల సరస్సు.


3) గాలపాగస్‌ దీవులు: ఈక్వెడార్‌కు పశ్చిమాన    పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్నాయి.

 


ఆండీస్‌ పర్వతాలు: ఇవి ప్రపంచంలోనే పొడవైన పర్వతాలు. వెనెజువెలా, కొలంబియా, ఈక్వెడార్,  బొలీవియా, పెరూ, చిలీ, అర్జెంటీనా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ శ్రేణిలో అత్యంత ఎత్తయిన శిఖరం అర్జెంటీనాలోని ‘అకాంగ్వా’. ఇది విలుప్త అగ్నిపర్వతం.  ఈ పర్వతాల్లోనే అర్జెంటీనా, చిలీ సరిహద్దులో ‘ఓజోస్‌ డెల్‌ సలాడో’ అనే క్రియాశీల అగ్నిపర్వతం ఉంది.

 


ఇతర విశేషాలు


* ఈ ఖండం ఉత్తర భాగం నుంచి భూమధ్య రేఖ వెళుతుంది  (ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్‌ మీదుగా).


* దక్షిణ మధ్య అమెరికా, మెక్సికో దేశాలను కలిపి లాటిన్‌ అమెరికా అంటారు. ఇవి లాటిన్‌ భాష మాట్లాడే దేశాలు.


* ప్రపంచంలో అతి పెద్ద నది ‘అమెజాన్‌’ దక్షిణ అమెరికాలోనే ఉంది. అతి ఎత్తయిన జలపాతం ‘ఏంజెల్‌’ వెనెజువెలాలో ఉంది.


* ఈ ఖండంలో అటకామా, పెటగోనియా ఎడారులున్నాయి. అటకామా ఎడారిలో నైట్రేట్లు అధికంగా దొరుకుతాయి. ఖండంలోనే అతి శుష్క ప్రాంతం అటకామాలోని ‘ఇ కిక్యూ’.


* లామా అనే పొడవాటి మెడ ఉన్న జంతువులు దక్షిణ అమెరికాలో మాత్రమే ఉన్నాయి.


​​​​​​​* ఇక్కడి మిశ్రమ జాతి ప్రజలను మేస్టిజోలు అంటారు.


​​​​​​​* కాఫీ అధికంగా ఉత్పత్తి చేసే బ్రెజిల్‌ను కాఫీ కుండగా పేర్కొంటారు. ఇక్కడి కాఫీ ఎస్టేట్లకు ఫైజెండాస్‌ అని పేరు.


​​​​​​​* ఉష్ణమండల గడ్డిభూములను లానోష్, కంపాస్‌ అంటారు. ఎగరలేని పక్షి పేరు ఈము.


​​​​​​​* ప్రపంచంలో ఎత్తయిన అగ్నిపర్వతం ఓజోస్‌ డెల్‌ సలాడో.


​​​​​​​* రాగి ఉత్పత్తిలో చిలీ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది.


* ఎత్తయిన రాజధాని నగరం లా పాజ్‌ (బొలీవియా).

 


మాదిరి ప్రశ్నలు

 


1. దక్షిణ అమెరికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది?

1) పశ్చిమ అర్ధగోళం   2) తూర్పు అర్ధగోళం

3) ఉత్తర అర్ధగోళం  4) దక్షిణ అర్ధగోళం

 


2. కిందివాటిలో దక్షిణ అమెరికాను, ఉత్తర అమెరికాను కలుపుతున్నది ఏది?

1) అట్లాంటిక్‌ మహాసముద్రం

2) పనామా జలసంధి

3) టియెర్రా డెల్‌ ఫ్యూగో ద్వీపం

4) భూమధ్యరేఖ

 


3. దక్షిణ అమెరికాలో ఎత్తయిన శిఖరం ఏది?

1) మౌంట్‌ క్వింటో     2) మౌంట్‌ ఎట్నా

3) మౌంట్‌ అకాంగ్వా   4) మౌంట్‌ కోటోపాక్సీ

 


4. దక్షిణ అమెరికాలో అత్యంత చురుకైన           అగ్నిపర్వతం?

1) కిలౌయా      2) హెలెన్స్‌

3) మెరాపి      4) కోటోపాక్సీ

 


5. దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తయిన నౌకాయాన సరస్సు ఏది?

1) టిటికాకా సరస్సు  2) బ్రోకోపొండో రిజర్వాయర్‌

3) మరకైబో సరస్సు  4) లేక్‌ వాలెన్సియా

 


6. ప్రపంచంలో అత్యంత పెద్ద, రెండో              పొడవైన నది?

1) రియో సావో ఫ్రాన్సిస్కో   2) జింగు

3) ఒరినోకో            4) అమెజాన్‌

 


7. ప్రపంచంలోనే ఎత్తయిన జలపాతం ఏది?

1) ఏంజెల్స్‌ ఫాల్స్‌      2) ఇగువాజు జలపాతం

3) గుయిరా జలపాతం     4) స్మోక్‌ ఫాల్స్‌

 


8. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం ఏది?

1) పెరూ          2) అర్జెంటీనా

3) బ్రెజిల్‌         4) వెనెజువెలా

 


9. కిందివాటిలో దక్షిణ అమెరికాలోని 12              సార్వభౌమ దేశాల్లో లేని దేశం?

1) అర్జెంటీనా    2) వెనెజువెలా

3) పెరూ      4) లిబియా

 


10. పక్షి, ఆకు ఆకార ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు?

1) ఉత్తర అమెరికా    2) దక్షిణ అమెరికా

3) ఆఫ్రికా          4) ఐరోపా


సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-4; 5-1; 6-4; 7-1; 8-3; 9-4; 10-2. 

 


రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 09-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌