• facebook
  • whatsapp
  • telegram

విష్ణుకుండినులు

  శాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల్లో విష్ణుకుండిన వంశం ముఖ్యమైంది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉండి వారి తర్వాత కళింగతో సహా మొత్తం ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశం విష్ణుకుండినులది. క్రీ.శ. 5, 6 శతాబ్దాల దక్షిణాపథ చరిత్రలో విష్ణుకుండినుల సామ్రాజ్యం ప్రముఖ పాత్ర వహించినదని శ్రీరామశర్మ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు.విష్ణుకుండినుల చరిత్రను తెలుసుకోవడానికి వారు వేయించిన శాసనాలు, సాహిత్యం, గ్రంథాలు, దేవాలయాలు, గుహాలయాలు, దుర్గాలు, నాణేలు, శిల్పసంపద మొదలైనవి ఉపయోగపడుతున్నాయి. వీరి చరిత్ర రచనలో శాసనాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

* ఈవూరు తామ్రశాసనం
* రామతీర్థ తామ్రశాసనం
* చిక్కుళ్ల తామ్రశాసనం
* తుండి తామ్రశాసనం
* ఇంద్రపాల నగర తామ్రశాసనం
* పొలమూరు తామ్రశాసనం
* ఖానాపూర్ తామ్రశాసనం
* వేల్పూరు శిలాశాసనం
* చైతన్యపురి శిలాశాసనం
* విష్ణుకుండిన రాజులు దక్షిణాపథపతి, శ్రీపర్వతస్వామి పాదానుధ్యాతస్య, త్రికూటవులయాధిపతి అనే బిరుదులను ధరించినట్లు వారి శాసనాల ద్వారా తెలుస్తుంది.

మహారాజేంద్రవర్మ: విష్ణుకుండిన వంశస్థాపకుడు మహారాజేంద్రవర్మ. ఇతడు తొలుత అచ్చంపేట తాలూకాలోని 'అమరాబాద్' రాజధానిగా పరిపాలనను ప్రారంభించాడు. తర్వాత ఏలేశ్వరం, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, కీసర, ఇంద్రపాలనగరం ప్రాంతాలను ఆక్రమించి, ఇంద్రపురి రాజధానిగా రాజ్య విస్తరణను కొనసాగించాడు.

మొదటి మాధవవర్మ: మహారాజేంద్రవర్మ కుమారుడు మొదటి మాధవవర్మ. ఇతడు అమరాబాద్, కీసర, భువనగిరి ప్రాంతాలతోపాటు మహబూబ్‌నగర్, కొల్లాపూర్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను తన అధికారంలోకి తెచ్చుకున్నాడు.

గోవిందవర్మ I: మొదటి మాధవవర్మ కుమారుడే మొదటి గోవిందవర్మ. ఇతడు ఇంద్రపాల నగర తామ్ర శాసనాన్ని వేయించాడు. గోవిందవర్మ యుద్ధ విజేత, పరిపాలనాదక్షుడు. బౌద్ధమతాభిమాని. కృష్ణా - గోదావరి నదుల మధ్యనున్న భూభాగాలను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న గుంటూరు ప్రాంతాన్ని సైతం జయించాడు.

* ఇతను పృథ్విమూలుడి కుమార్తె అయిన మహాదేవిని వివాహం చేసుకున్నాడు. అతడి సహాయంతో శాలంకాయనులను ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించాడు. మహాదేవి ఇంద్రపురిలో బౌద్ధభిక్షువులకు మహా విహారాన్ని నిర్మించింది. ఆ విహారానికి గోవిందవర్మ 'పేణ్కపర' గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. (ఆ పేణ్కపర నల్గొండ జిల్లా మోత్కూరు తాలూకాలోని పనకబండ గ్రామం). హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మూసీతీరంలో లభించిన ప్రాకృత శాసనం ఇతడి పేరుమీద వెలసిన విహారాన్ని గురించి తెలుపుతుంది. గోవిందరాజ విహారం, చైత్యాలయాలు శిథిలంకాగా శాసనం మాత్రమే మిగిలిన ఆధారం.
* గోవిందవర్మ కాలంలో ఇంద్రపురి పరమమహాదేవి విహారం, చైతన్యపురి గోవిందరాజ విహారం, ఫణిగిరి, గాజులబండ, తిరుమలగిరి, జగ్గయ్యపేట, నేలకొండపల్లి, వర్థమానుకోట ప్రాంతాల్లో బౌద్ధారామ విహారాలు, చైత్యాలయాలు, స్తూపాలు ప్రసిద్ధి చెందినవి. ప్రస్తుతం అవి శిథిలరూపంలో ఉన్నాయి.

II మాధవవర్మ: I గోవిందవర్మ కుమారుడు II వ మాధవవర్మ. ఇతడు వైదికమత నిరతుడు. అగ్నిస్టోమ, వాజపేయ, అశ్వమేథ, రాజసూయ యాగాలు, వేయి క్రతువులను నిర్వహించాడు. శాలంకాయన, ఆనందగోత్రిక, పల్లవ దక్షిణదేశంలో ఉన్న రాజ్యాలను, వాకాటక చక్రవర్తి అయిన రెండో పృథ్విసేనుడిని ఓడించాడు. ఇతడు రాజధానిని ఇంద్రపాల నగరం నుంచి పశ్చిమ గోదావరిలోని దెందులూరుకు మార్చాడు.

వవర్మ: II వ మాధవవర్మ జ్యేష్ఠపుత్రుడు. ఇతడి పరిపాలన విశేషాలు ఏవీ తెలియడంలేదు. కొద్దికాలం మాత్రమే పాలించినట్లు భావించవచ్చు.

III మాధవవర్మ: ఇతడు దేవవర్మ కుమారుడు. వీరి రాజధాని గుంటూరులోని అమరావతి. ఇతడికి 'త్రికూటమలాయాధిపతి' అనే బిరుదు ఉంది. తూర్పున మలయ పర్వతాలు, పశ్చిమాన త్రికూట పర్వతం ఇతడి రాజ్య సరిహద్దులని డా|| నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయం. ఇతడు వేయించిన 'ఈవూరు తామ్రశాసనం' ఇంద్రశర్మ, అగ్నిశర్మ అనే బ్రాహ్మణులకు 'మ్రోతుకలి' గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చినట్లు తెలుపుతుంది.

ఇంద్రభట్టారకవర్మ: ఇతడు I విక్రమేంద్రవర్మ కుమారుడు. ఇతడు దానాలు చేయడమేకాకుండా ఎక్కువ ఘటి స్థానాలను నెలకొల్పాడు. కీసర సమీపంలో ఉన్న ఘటకేశ్వరం ఇంద్రభట్టారకవర్మ నెలకొల్పిన ఘటిక స్థానమే.

విక్రమేంద్ర భట్టారకవర్మ: ఇతడు క్రీ.శ. 566 లో వేయించిన 'తుమ్మలగూడెం' శాసనంలో I వ గోవిందవర్మ నుంచి ఇంద్రభట్టారకవర్మ వరకు వరుసక్రమం స్పష్టంగా ప్రస్తావించాడు.
¤ ఇతడు పృథ్విమూలరాజు సహాయంతో పల్లవులను ఓడించాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఇంద్రపురికి వచ్చి గతంలో గోవిందవర్మ తన భార్యపేరిట నిర్మించిన మహాదేవి విహారానికి 'ఇఱుణ్డెరో' గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇతడి బిరుదు ఉత్తమాశ్రయుడు.
¤ విక్రమేంద్ర భట్టారకవర్మ తర్వాత గోవిందవర్మ II రాజ్యాన్ని పాలించాడు. ఇతడి గురించి పెద్దగా విశేషాలేమీ అందుబాటులో లేవు. ఇతడి తర్వాత ఇతడి కుమారుడయిన నాలుగో మాధవవర్మ సింహాసనాన్ని అధిష్ఠించాడు.

నాలుగో మాధవవర్మ: ఇతడు జనాశ్రయ బిరుదాంకితుడు. న్యాయ, ధర్మాచరణ నిరతుడు, భక్తిపరుడు, ప్రజారంజకంగా పాలించడం వల్ల ప్రజలు ఇతడి మాటను వేదవాక్కుగా భావించేవారు. మాధవవర్మ న్యాయపాలన గొప్పది. న్యాయం చేయడంలో తన కుమారుడిని సైతం శిక్షించడానికి వెనుకాడనివాడు. నాలుగో మాధవవర్మ దుర్గామల్లీశ్వరుల భక్తుడు.
మంచన భట్టారకుడు: ఇతడు చాళుక్యులతో పోరాటం సాగించినప్పటికీ జయసింహవల్లభుని చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతడితో విష్ణుకుండిన రాజ్యం అంతరించింది.

 

పరిపాలన విధానం 

  విష్ణుకుండినులు పరిపాలనా సౌకర్యార్థం తమ రాజ్యాలను రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రానికి అధిపతి 'రాష్ట్రికుడు', విషయానికి అధిపతి విషయాధిపతి. వీరు రాజు ఆజ్ఞలకు లోబడి పాలన సాగిస్తారు. మంత్రులు, సామంతులు సామ్రాజ్యపాలనలో రాజుకు సహకరించేవారు.

* విష్ణుకుండిన ప్రభువులు తమ వంశాభివృద్ధికి దేవాలయాలు నిర్మించేవారు, వేద పండితులకు, విప్రులకు భూములు, అగ్రహారాలను దానమిచ్చేవారు. విజయయాత్రకు బయలుదేరినప్పుడు, యుద్ధవిజయానంతరం, సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో బ్రాహ్మణులకు భూ, సువర్ణ, అగ్రహారాలను దానం చేసేవారు.
న్యాయపాలన: విష్ణుకుండినుల కాలంలో న్యాయం, ధర్మం... ధనిక, పేద, కుల, మత, వర్గ వివక్ష లేకుండా అందరికీ సమానంగా ఉండేది. నాలుగో మాధవవర్మ విజయవాడ రాజధానిగా పాలిస్తున్న కాలంలో న్యాయాధికారి అయిన ప్రాడ్వివాక్కుల తీర్పును అనుసరించి తన కుమారుడికి మరణదండనను విధించాడు. ఈ విషయం తాను వేయించిన పాలమూరు శాసనంలో నాలుగో మాధవవర్మ పేర్కొన్నాడు.

 

మత పరిస్థితులు 

  విష్ణుకుండినుల కాలంలో వైదిక మతం ఉచ్ఛస్థితిలో ఉంది. ఈ వంశీయులు వైదిక మతాన్ని ఆదరించి యజ్ఞయాగాలు నిర్వహించారు. విష్ణుకుండిన రాజులు వైదిక మతవ్యాప్తికి అనేక దేవాలయాలను నిర్మించారు. కీసరలో ఉన్న కీసర రామలింగేశ్వరాలయం విష్ణుకుండినుల నాటిదే. ఇక్కడ విష్ణుకుండినులనాటి కట్టడాలు, దేవాలయాలు, దుర్గాలు, నాణేలు లభించాయి. మాధవవర్మ ఇక్కడ కొన్ని యజ్ఞాలు చేసినట్లు ఆధారాలున్నాయి. దేవాలయ స్తంభాల అడుగుభాగంలో పూలకుండి, దాని నుంచి పుష్పాలు బయటకు వచ్చే విధంగా చెక్కారు. మండపాల అడుగుభాగంలో గోడలపై పంజా ఎత్తి లంఘించడానికి సిద్ధంగా ఉన్న సింహాల ప్రతిమలున్నాయి. వీరి శాసనాలపై కేసరి ముద్ర కనిపిస్తుంది.

బైరవ కొండ: నల్లమల కొండల్లోని ఒక కొండ చరియను బైరవకొండ అంటారు. ఇందులో ఎనిమిది గుహాలయాలున్నాయి. దీనిలోని శిల్ప సంపద అద్భుతమైంది. శిలాస్తంభాలు, ఆజానుబాహులు, భయంకర ముఖాలు, జటాధారులైన ద్వారపాలకుల విగ్రహాలు ఆలయ ముఖద్వారానికి ఇరువైపులా నిలబడి ఉంటాయి.
* బెజవాడ - ఇంద్రకీలాద్రి పర్వతంపై అక్కన్న - మాదన్న గుహాలయాలున్నాయి. విజయవాడ సమీపంలో మొగల్రాజపుర గుహాలయాల్లో శివతాండవ సంబంధిత గుహాలయం ముఖ్యమైంది.
* జైన - బౌద్ధ మతాలు వీరి కాలంలో క్షీణదశలో ఉండేవి. I గోవిందవర్మ బౌద్ధమతాభిమాని అయినప్పటికీ బౌద్ధమత క్షీణదశ ప్రారంభమయ్యింది. విజయవాడలోని ఉండవల్లి బౌద్ధ గుహాలయం - హిందూ దేవాలయంగా మారింది. (అనంతశయన పద్మనాభస్వామి విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించారు), మొగల్రాజపురం బౌద్ధగుహాలయంలో - శివున్ని పార్వతీ సమేతంగా అర్ధనారీశ్వర రూపంలో మలిచారు. ఇది సుందరమైన శిల్పం. బౌద్ధంలో వజ్రాయన శాఖ ఏర్పడటం వల్ల బౌద్ధం పూర్తిగా ప్రజాదరణను కోల్పోయింది.

 

వాణిజ్యం

  విష్ణుకుండినుల కాలంలో వర్తక వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు విరివిగా కొనసాగాయి. వీరి నాణేలు నల్గొండ, కీసర, గుంటూరు, కోస్తా తీరాల్లో లభించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కళింగ మొదలైన రాజ్యాల్లో కూడా వీరి నాణేలు లభ్యమయ్యాయి. వీరి నాణేల్లో పంజాఎత్తి లంఘించే సింహపు బొమ్మ కింద వేలాడేదీపాలు ఉంటాయి. 

* నల్గొండలోని దొండపాడు ప్రాంతంలో వేలసంఖ్యలో ఈ నాణేలు లభించాయి. వీరు బర్మా, కంబోడియా, చైనా, జపాన్, సిలోన్, సుమిత్ర, జావా, మలయ, ఈజిప్ట్, గ్రీకు, రోమ్ మొదలైన దేశాలతో వర్తక వ్యాపారాలు కొనసాగించారు. 2 వ మాధవవర్మ త్రిసముద్రాధిపతి అనే బిరుదాంకితుడు.
సాహిత్యం 

* విష్ణుకుండినులు ప్రాకృత భాషను ఆదరించి, తర్వాత సంస్కృతాన్ని రాజభాషగా స్వీకరించారు. తెలుగు వ్యవహార భాషగా ఉండేది. నాలుగో మాధవవర్మ 'జనాశ్రయ చంధోవిచ్ఛిత్తి' అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. 
* బౌద్ధ పండితులలో 'దశబలబలి' అనే పండితుడు సర్వశాస్త్ర పారంగతుడని గోవిందవర్మ ఇంద్రపాల నగర శాసనం తెలుపుతుంది. విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన చిక్కుళ్ల శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుళ్' అనే తెలుగు పదం ఉంది.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌