• facebook
  • whatsapp
  • telegram

  ఎన్నికల సంస్కరణలు  

(సుప్రీంకోర్టు తీర్పులు)

పారదర్శకతకు మార్గదర్శకాలు!


స్వేచ్ఛాయుత ఎన్నికలు, పారదర్శకత ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రామాణిక కొలమానాలు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తీర్పులు అనేక సందర్భాల్లో ధ్రువీకరించాయి. దాంతోపాటు కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల అధికారాల మధ్య సమతూకాన్ని నిర్ధారించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో కీలకపాత్ర పోషించాయి. ఓటింగ్‌ ప్రక్రియలో స్పష్టతను పెంచి, ఓటరు స్వతంత్రతకు పెద్దపీట వేసి, ప్రజాస్వామ్య విలువలకు భద్రత కల్పించిన  అలాంటి తీర్పులు, అవి తెచ్చిన సంస్కరణలను పోటీ పరీక్షార్థులు కేసుల వారీగా తెలుసుకోవాలి. ఈవీఎం, వీవీప్యాట్‌ల ఉద్దేశం తదితర మౌలిక అంశాలతో పాటు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల వెలువడిన తీర్పులోని ముఖ్యాంశాలను సమగ్రంగా గుర్తుంచుకోవాలి.

లిల్లీ థామస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా: రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ప్రకటించారు. అయితే ఈ సవరణ చట్టం సిటింగ్‌ చట్టసభల సభ్యులకు (అప్పటికే కొనసాగుతున్నవారు) వర్తించదని నిర్దేశించారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు సిటింగ్‌ చట్ట సభల సభ్యులకు ఇస్తున్న మినహాయింపు చెల్లుబాటు కాదని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి వ్యక్తి రషీద్‌ మసూద్‌. ఆ తర్వాత లాలూప్రసాద్‌ యాదవ్, జయలలిత కూడా తమ పదవులు కోల్పోయారు.


కులదీప్‌ నాయర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా: రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారో ఆ రాష్ట్రంలో స్థిర నివాసం ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


సుబ్రమణ్యస్వామి Vs ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా: ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా తాను అనుకున్న అభ్యర్థికి పోలైనదా ? లేదా? అనే అంశాన్ని తెలుసుకోడానికి ముద్రిత పేపర్‌స్లిప్‌ను పొందడానికి వీలుగా EVM లలో  VVPAT (Voter Verified Paper Audit Trial) ను ఏర్పాటు చేయాలని ఈ కేసు సందర్భంగా తీర్పు వెలువడింది.


* వీవీ ప్యాట్‌ల ఏర్పాటుతో ఓటు మీట నొక్కిన తర్వాత, ఆ ఓటు ఎవరికి నమోదైందనే విషయం 7 సెకన్లపాటు పారదర్శక తెరపై కనిపిస్తుంది. దీనివల్ల అక్రమ ఓటింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్‌ను నివారించి ఓటర్ల ప్రయోజనాలను పరిరక్షించవచ్చు. వీవీ ప్యాట్‌లను తొలిసారిగా నాగాలాండ్‌ రాష్ట్రంలో ‘నోక్సన్‌’ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో 2013, సెప్టెంబరులో వినియోగించారు.


ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌): ఎన్నికల ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమర్థ ఎన్నికల నిర్వహణ, సత్వర ఫలితాల వెల్లడి కోసం ఈవీఎంలను వినియోగించాలని సంకల్పించారు. దీనికోసం 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని 1989లో సవరించారు. ఇది 1989, మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చింది. మనదేశంలో ఈవీఎంలకు 1980లో ఎం.బి.హనీఫ్‌ రూపకల్పన చేశారు. ఈ యంత్రాలు బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లలో తయారవుతున్నాయి.


* దేశంలో ఈవీఎంలను తొలిసారిగా 1981లో కేరళలోని ‘నార్త్‌పారవుర్‌’ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో 50 కేంద్రాల్లో ప్రయోగించారు 1998, నవంబరులో మధ్యప్రదేశ్‌లోని 5, రాజస్థాన్‌లోని 5, ఢిల్లీలోని 6 శాసనసభ నియోజకవర్గాల్లో జరిగిన 16 పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించారు. 1999లో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో వాడారు. 2004లో 14వ లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అన్ని నియోజకవర్గాల్లో వినియోగించారు. ఈ యంత్రాల్లో బ్రెయిలీ సంకేతాల సదుపాయాన్ని మొదటిసారిగా 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంలో అమలుచేశారు.


* ఈవీఎంలోని ఒక్కో బ్యాలట్‌ యూనిట్‌లో ఎన్నికల్లో పోటీ చేసే 16 మంది అభ్యర్థుల వివరాలు మాత్రమే నమోదు చేసే వీలుంది. ఒక్కో ఈవీఎంలో ఇలాంటి బ్యాలట్‌ యూనిట్లను గరిష్ఠంగా నాలుగింటిని అనుసంధానం చేయవచ్చు. ఈ లెక్కన గరిష్ఠంగా 64 మంది అభ్యర్థుల వివరాలే నమోదయ్యే అవకాశం ఉంది. 64 కంటే ఎక్కువ అభ్యర్థులు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈవీఎంకు బదులుగా ‘బ్యాలట్‌ పేపర్‌’ పద్ధతి ఉపయోగించాల్సి ఉంటుంది. ఈవీఎంలో గరిష్ఠంగా 3,840 ఓట్లు నమోదవుతాయి.


  పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా:  ఈ కేసులో సు ప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రకారం ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, విభేదించే హక్కు ఉందని, ప్రజలు భిన్నాభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉండవచ్చునని, ఓటును వినియోగించుకునే సందర్భంలో ఓటర్లకు తిరస్కార హక్కును కల్పించకపోవడమంటే భావప్రకటనాస్వేచ్ఛను హరించినట్లేనని పేర్కొంది. అందుకే ఈవీఎంలో NOTA (None of the Above) (పై ఎవరూ కాదు) అనే అంశాన్ని చేర్చాలని జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2013, సెప్టెంబరు 27న తీర్పు ఇచ్చింది.


* ఈవీఎంలో ‘నోటా’ దీర్ఘచతురస్రాకారంలో ‘కొట్టివేసిన బ్యాలట్‌ పత్రం’ గుర్తుతో చివరి ఐచ్ఛికంగా కనిపిస్తుంది. నోటాను మొదటిసారిగా 2013లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వినియోగించారు.

* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో నోటాను పూర్తిస్థాయిలో అమలుచేశారు. నోటా ప్రవేశపెట్టిన దేశాల్లో భారతదేశం 14వది.

* 2014 ఎన్నికల నుంచి నోటాను లోక్‌సభ ఎన్నికల్లో తెలుపు రంగులో, శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగులోను ఈవీఎంలపై ముద్రిస్తున్నారు.

* నోటా ఓట్లు ఎక్కువగా పోలైనప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతలుగా ప్రకటిస్తారు.

* రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో నోటా నిబంధన చెల్లదని, నోటాను ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఉపయోగించాలని 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


  ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం  


రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు సంబంధించి కేంద్రం 2018లో ఎన్నికల బాండ్ల (ఎలక్టోరల్‌ బాండ్స్‌) పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ‘ఆర్థిక చట్టం 2017’కి సవరణ చేశారు. దీంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.

* ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉందంటూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా- మార్క్సిస్ట్‌ (సీపీఎం) సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌  జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం 2024, ఫిబ్రవరి 15న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.


తీర్పులోని ముఖ్యాంశాలు: ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగవిరుద్ధం. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రకారం విరాళం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచడమనేది ప్రాథమిక హక్కు, సమాచార హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.

* ఎన్నికల బాండ్ల జారీని ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ వెంటనే నిలిపివేయాలి.

* రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో తెలియజేయాలి. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే మార్గం కాదు. బాండ్లను కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లఘించడమే అవుతుంది.

* ఎన్నికల బాండ్ల జారీ విధానంలో పారదర్శకత లోపించింది. వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ‘క్విడ్‌ ప్రోకో’కు దారితీసే ప్రమాదం ఉంది. సంస్థల నుంచి అపరిమిత విరాళాలను అనుమతించే విధంగా కంపెనీల చట్టంలో సవరణలు చేయడం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది.

* 2019, ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను (కొనుగోలుచేసినవారు, కొనుగోలు తేదీ, ఎంత మొత్తం కొనుగోలు చేశారు) మార్చి 6 లోగా స్టేట్‌బ్యాంకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. మార్చి 13లోగా సంబంధిత వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.

* ఇప్పటికే స్వీకరించి, ఇంకా ఎన్‌క్యాష్‌ చేసుకోని బాండ్లను రాజకీయ పార్టీలు ఆయా దాతలకు వెంటనే వెనక్కి ఇవ్వాలి.

 


రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌