• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ జానపద కళలు

విశిష్ట ఉత్పత్తులు.. విలాస వినోదాలు!

 

 

తెలంగాణ పురాతన కాలం నుంచే కళలు, కళాకారులకు నెలవుగా వర్ధిల్లింది. పల్లె జీవనం నుంచి పుట్టుకొచ్చిన జానపద కళలెన్నో సమాజానికి వినోదం, ఆహ్లాదం పంచేవిగా అభివృద్ధి చెందాయి. ప్రజల అవసరాలు, విలాసాలకు కావాల్సిన వస్తువుల తయారీకి నైపుణ్య వృత్తులు పుట్టుకొచ్చి స్థిరపడ్డాయి. ఈ కళలు, వృత్తులను కొన్ని కులాలు వంశపారంపర్య ఉపాధిగా మలచుకుని జీవనం సాగించాయి. నేటికీ కొనసాగుతున్న ఈ పరంపరపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, అక్కడి ఉత్పత్తులకు ఉన్న ఆదరణ, కళాకారుల నైపుణ్యం గురించి తెలుసుకోవాలి.

 

తెలంగాణ ప్రాంతం అనేక ప్రాచీన కళలు, జానపద కళలకు నిలయం. ఇక్కడ తయారయ్యే వస్తువులు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ప్రధానంగా ఇక్కడి వస్త్రాలు, బొమ్మలు, ఆట వస్తువులు, గృహోపకరణ సామగ్రికి శతాబ్దాలుగా మంచి గిరాకీ లభిస్తోంది.

 


వృత్తి కళాకారులు


చేనేత వస్త్రాలు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లిలో తయారయ్యే పట్టుచీరలు, ప్రత్యేక వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. గద్వాల, నారాయణపేట, కొత్తకోట ప్రాంతాల్లో నేసే పట్టుచీరలు, వస్త్రాలు; వరంగల్‌ రగ్గులు, కంబళ్లు కూడా ప్రసిద్ధి చెందాయి.


లేసు అల్లికల పరిశ్రమ: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ధి. ఈ కళ క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశానికి వ్యాపించింది. సూది నూలు దారం దీని సాధనం. గలేబులకు, అలంకరణ తెరలకు, కిటీకి తెరలకు, పరికిణీల అంచులకు, టేబుల్‌ వస్త్రాలకు వీటిని ఉపయోగిస్తారు. ఇవి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.


అద్దకం పరిశ్రమ: అద్దకం వస్త్రాలకు మెదక్‌ పేరొందింది. ఒకే చిత్రంలో అనేక రంగులు అద్దడం ఈ కళ ప్రత్యేకత. ఈ ఉత్పత్తులకు విదేశాల్లోనూ గిరాకీ ఉంది.


కంచు, ఇత్తడి, రాగి సామగ్రి: తెలంగాణ జిల్లాల్లోని సిద్దిపేట, కురనపల్లి, పాదగల్, పెంబర్తి, పర్కాల ప్రాంతాల్లో ఈ పరిశ్రమలున్నాయి. రాగి, సత్తు మిశ్రమంతో ఇత్తడి తయారవుతుంది. రాగి, తగరాన్ని కలిపి కంచును తయారుచేస్తారు. దేవతా విగ్రహాలు, ఇత్తడి వాహనాల తయారీలో ఇక్కడి కళాకారులు నిపుణులు.


బొమ్మలు, ఆటవస్తువులు: ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ బొమ్మలకు ప్రసిద్ధి. వీటి తయారీకి బూరుగు, పొనుకు కర్ర ఉపయోగిస్తారు. వీటితో ఫర్నిచర్, లాంతరు స్తంభాలు, అందమైన స్క్రీన్లు తయారు చేస్తారు. చదరంగపు బల్లలు, పన్నీరు బుడ్లు, పిల్లలకు పనికొచ్చే లక్కపిడతలు వంటివి ఏటికొప్కాకలో తయారవుతున్నాయి.

 


పూసల పరిశ్రమ: పాపానాయుడుపేట మహిళల నల్లపూసలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కళాకారులు గాజురాయిని కరిగించి పూసలను అత్యంత నైపుణ్యంతో తయారుచేస్తారు.


వెండి నగిషీ పనులు: అందమైన వెండి నగిషీ పనులకు కరీంనగర్‌ జిల్లా కంసాలీలు ప్రసిద్ధి చెందారు. ఇది ప్రాచీనమైన చేతి పని. తమలపాకుల పెట్టెలు, భరిణెలు, చేతి బొత్తాలు, వివిధ రకాల పాత్రలు, పళ్లేలు, ఫొటోఫ్రేములు, పెన్నులు, కప్పులు, ట్రోఫీలు మొదలైన వాటిని అతిసన్నని తీగల అల్లికలతో డిజైన్‌ చేస్తారు.


బీదరు సామాన్లు (బిద్రీ): తుత్తునాగం, రాగి ధాతువులు కలిపిన మిశ్రమ లోహంతో నీళ్ల కూజాలు, పరిమళ వస్తువులు పెట్టుకునే పెట్టెలు, పూల సజ్జలు, భరిణెలు ఇప్పటికీ హైదరాబాద్‌లో తయారవుతున్నాయి. ఈ మిశ్రమ లోహం తుప్పు పట్టదు. ఈ కళ పారశీకుల ప్రాబల్యం వల్ల దక్కన్‌ను పాలించిన బహమనీ సుల్తానుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.జానపద కళలు


తోలు బొమ్మలాట: తోలు బొమ్మలాటలు గ్రామాల్లో ప్రదర్శించేవారు. ఒక తెర కట్టి తెరలోపల దీపాలు పెట్టి తోలుతో చేసిన రంగు రంగుల బొమ్మలను కథలు, యక్షగాన రూపంలో ప్రదర్శించేవారు. తోలుబొమ్మల కాళ్లు, చేతులు, తలకు దారాలు కట్టి మధ్యలో ఒక డబ్బాలో నిలబెట్టి అవసరమైన దారాన్ని లాగుతూ, వదులుతూ బొమ్మలాడించేవారు. తోలుబొమ్మలాటలో హాస్యం కోసం బంగారక్క, కేతగాడి ఉపాఖ్యానాలను ప్రవేశపెట్టారు. ఈ హాస్యం ఒక్కోసారి మొరటుగా, హద్దులు మీరేది.భాగవతాలు: ఆసఫ్‌జాహీల పాలనా కాలంలో భాగవతాలను విరివిగా ఆడేవారు. మాఘమాసం నుంచి వైశాఖ మాసం వరకు తెలంగాణ ప్రాంతం అంతటా తిరిగి ఏటా ప్రదర్శనలిచ్చేవారు. వీరిలో ఎవరి ప్రాంతం వారికే ఉండేది. ఈ భాగవతులు వారి వారి కులాల వారిని ‘వతన్‌’ యాచించేవారు. వీరి ప్రదర్శనల్లో కృష్ణలీలలు, పారిజాతాపహరణం, ప్రహ్లాదచరిత్ర మొదలైన కథలుండేవి. మేళాలు లేనప్పుడు వీరు బుడబుక్కల, అర్ధనారీశ్వర, ఫకీరు, కోమటి మొదలైన పగటి వేషాలు కూడా వేసేవారు. చివరి రోజు ‘శారద వేషం’ వేసి భిక్షాటన చేసేవారు. వారిలో తెలగ భాగవతులు, గంటే భాగవతులు, దాసరి భాగవతులు అనేవారు కులాలవారీగా ఉండేవారు.


భజన: తెలంగాణ గ్రామాల్లో భజనలు జరిగేవి. కొన్ని గ్రామాల్లో భజన మందిరాలు, భజన సమాజాలు ఉండేవి. గ్రామాల్లో ఒక్కోసారి 15 రోజులు లేదా నెల రోజులు లేదా 2 నెలలు భజనలు జరిపించేవారు. పండగ రోజు, దేవుడి ఊరేగింపు రోజుల్లో భజనలు చేయడం ఆనవాయితీగా ఉండేది. కలరా లేదా సాంక్రమిక వ్యాధులు వచ్చినా సంకీర్తన భజనలు చేసేవారు.


కోలాటం: దసరా రోజుల్లో కోలాటం ప్రదర్శించేవారు. దశావతార వర్ణనలతో దసరా పద్యాన్ని కీర్తన బాణీలో పాడుతూ అందుకనుగుణంగా కోలాటం వేసేవారు. కోలాటంలో అనేక పద్ధతులుండేవి. ‘జడ అల్లిక కోలాటం’ అనేది అన్నింటి కంటే కష్టమైనది. వెన్నెల రాత్రుల్లో కూడా కోలాటం జరిగేది.


యక్షిణీ విద్య: విప్ర వినోదులు అయిన వీరు యక్షిణీ విద్య ప్రదర్శించేవారు. అంటే కొన్ని వస్తువులను మాయం చేయడం, కొన్ని వస్తువులను జంతువులుగా మార్చడం కూడా చేస్తారు. వీరు బ్రాహ్మణులను యాచిస్తారు. వీరికి మాన్యాలు కూడా ఇస్తారు. బేతవోలు (ఉమ్మడి నల్గొండ జిల్లా) జమీందారు వీరికి మాన్యం ఇచ్చి పోషించాడు.


గంగిరెద్దుల వారు: గంగిరెద్దులాటను పూజగొల్ల కులానికి చెందిన కళాకారులు నిర్వహిస్తారు. ఒక వ్యక్తి గంట వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తుంటాడు. మరో ఇద్దరు డోలు, సన్నాయి వాయిస్తూ సహకరిస్తుంటారు. గంగిరెద్దుల వారు ప్రదర్శనలిస్తుంటారు. ఎద్దును ఛాతిపై  ఎక్కించుకునే దృశ్యం చాలా కష్టమైంది. వీరు గొల్లలను ఆశ్రయించి యాచిస్తుంటారు.


 
మాదిరి ప్రశ్నలు


1.    కింది ఏ పట్టణం పట్టుచీరలకు ప్రసిద్ధి?

1) పోచంపల్లి      2) సూర్యాపేట      

3) ఆదిలాబాద్‌      4) నిజామాబాద్‌


2.     కింది ఏ నగరం రగ్గులకు ప్రసిద్ధి?

1) గద్వాల      2) నారాయణపేట      

3) కొత్తకోట      4) వరంగల్‌


3.     లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?

1) మహబూబ్‌నగర్‌       2) కరీంనగర్‌  

3) దుమ్ముగూడెం       4) మెదక్‌


4.     కింది ఏ పట్టణం అద్దకం దుస్తులకు ప్రసిద్ధి?

1) నారాయణపేట        2) మెదక్‌   

3) పోచంపల్లి      4) గద్వాల


5.     కింది ఏ పట్టణం ఇత్తడి సామానులకు ప్రసిద్ధి?

1) పెంబర్తి       2) మెదక్‌   

3) నిర్మల్‌       4) కొత్తకోట


6.     బొమ్మలకు ప్రసిద్ధి చెందిన పట్టణం-

1) జనగాం       2) నల్గొండ      

3) నిర్మల్‌       4) మెదక్‌


7.     చదరంగపు బల్లలు ఏ ప్రాంతంలో తయారుచేస్తారు?

1) ఆదిలాబాద్‌       2) ఏటికొప్పాక  

3) పాపానాయుడుపేట       4) పర్కాల


8.     కింది పట్టణం నల్లపూసలకు ప్రసిద్ధి-

1) పాపానాయుడుపేట      2) ఆదిలాబాద్‌  

3) నిర్మల్‌       4) నల్గొండ


9.     తమలపాకుల పెట్టెలు ఏ ప్రాంతంలో తయారయ్యేవి?

1) నల్గొండ      2) వరంగల్‌  

3) కరీంనగర్‌      4) నిర్మల్‌


10. పూల సజ్జల తయారీ కళ ఏ రాజవంశీయుల కాలంలో ప్రాచుర్యం పొందింది?

1) కుతుబ్‌షాహీలు        2) బహమనీలు       

3) ఆసఫ్‌జాహీలు      4) కాకతీయులు


11. ‘బంగారక్క కథ’ ఏ ప్రదర్శన సందర్భంగా ప్రదర్శించేవారు?

1) తోలు బొమ్మలాట        2) భాగవతాలు   

3) భజన       4) కోలాటం


12. శారద వేశాన్ని ఏ కళాకారులు ప్రదర్శించేవారు?

1) భజన       2) కోలాటం  

3) భాగవతులు       4) తోలు బొమ్మలాట


13. దసరా పద్యాన్ని కీర్తన రూపంలో ఏ కళాకారులు ప్రదర్శించేవారు?

1) కోలాటంవారు      2) భాగవతులు 

3) గంగిరెద్దులవారు       4) విప్రవినోదులు
సమాధానాలు: 1-1; 2-4; 3-3; 4-2; 5-1; 6-3; 7-2; 8-1; 9-3; 10-2; 11-1; 12-3; 13-1.


 

రచయిత: మూల జితేందర్‌ రెడ్డి

Posted Date : 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1- తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌