• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలోబ్యాంకింగ్ వ్యవస్థ-రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్ బిఐ)


ఆర్‌బీఐ విధులు

* కరెన్సీ నోట్ల ముద్రణ, జారీ 

* ప్రభుత్వానికి బ్యాంకరు 

* బ్యాంకులకు బ్యాంకు

* విదేశీ మారకద్రవ్య నిధుల సంరక్షణ

* పరపతి నియంత్రణ

* అంతిమ రుణదాత

* క్లియరింగ్‌ హౌస్‌ (పరిష్కార నిలయం)

* విదేశీ మారకద్రవ్య నిల్వల పరిరక్షణ

* పర్యవేక్షక విధులు

* అభివృద్ధిపరమైన విధులు

* ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చట్టాల నిర్వహణ

* ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించడం


కరెన్సీ నోట్ల ముద్రణ, జారీ


* భారతదేశ ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్‌ రూపాయి. ఇది కాగితాలు, నాణేల రూపంలో ఉంటుంది. రూపాయి సాంకేతికంగా కరెన్సీ నోటు కాదు, దీన్ని నాణెంగానే పరిగణిస్తారు.

* ఆర్‌బీఐ కంటే ముందు మనదేశంలో తొలిసారి కరెన్సీ నోట్లను జారీచేసిన బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌ అండ్‌ బిహార్‌(1773-75), బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌(1770-1832), బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా(1806), బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే(1840), బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌(1843). 

* 1861లో కాగితపు కరెన్సీ చట్టాన్ని(paper curency act) ప్రవేశపెట్టారు. దీనిద్వారా భారత ప్రభుత్వానికి కాగితం కరెన్సీని జారీ చేసే అధికారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి 1938 వరకు భారత ప్రభుత్వమే కరెన్సీ నోట్లు జారీచేసింది.

* కరెన్సీ నోట్ల పంపిణీకి బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా, బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే, బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌  ఏజెంట్లుగా పనిచేశాయి. 

* 1935, ఏప్రిల్‌ 1న ఏర్పాటైన ఆర్‌బీఐ 1938 నుంచి కరెన్సీ నోట్లను జారీచేస్తోంది. 

* ప్రస్తుతం మనదేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ: 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 (రూపాయల్లో). 

* ఆర్‌బీఐ చట్టం - 1934, సెక్షన్‌ 22 లోని నిబంధనల మేరకు రూపాయి నోటు, నాణేలను మినహా అన్ని కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ముద్రిస్తుంది.

* రూపాయి నోటును భారత ఆర్థిక (విత్త) మంత్రిత్వశాఖ ముద్రిస్తుంది. ఈ నోటుపై భారత ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. అయితే రూపాయి నోట్లు, నాణేలను ఆర్‌బీఐ మాత్రమే సప్లయ్‌ చేస్తుంది. ఈ పంపిణీ మొత్తాన్ని ఆర్‌బీఐ జారీ విభాగం నిర్వహిస్తుంది. 

* ప్రస్తుతం ఆర్‌బీఐ ముద్రిస్తున్న 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం ఉంటుంది.


కరెన్సీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం: ద్రవ్యాన్ని ఆర్‌బీఐ మాత్రమే జారీ చేయడం వల్ల దేశమంతా కరెన్సీలో సారూప్యత ఉంటుంది. 

* కరెన్సీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండటానికి ఆర్‌బీఐ నోట్ల జారీ పరిమాణానికి అనుగుణంగా కొంత మొత్తాన్ని రిజర్వ్‌ ఫండ్‌గా ఉంచుతుంది. దీనికోసం ఆర్‌బీఐ 1956 వరకు అనుపాత నిల్వల పద్ధతి లేదా నైష్పత్తిక రిజర్వ్‌ పద్ధతిని పాటించింది. 

* అనుపాత నిల్వల పద్ధతి అంటే మొత్తం కరెన్సీ విలువలో 40 శాతం బంగారు నాణేల రూపంలో మిగతా 60 శాతం ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో ఉంచడం. అయితే ఆర్‌బీఐ 1957 నుంచి కరెన్సీ నోట్ల జారీ విషయంలో కనిష్ఠ రిజర్వ్‌ పద్ధతిని అనుసరిస్తోంది. 

* కనిష్ఠ రిజర్వ్‌ పద్ధతి అంటే ఆర్‌బీఐ బంగారం, బంగారు నాణేలు, విదేశీ మారకద్రవ్యాన్ని నిధుల రూపంలో రూ.200 కోట్ల వరకు ఆస్తులుగా ఉంచుతుంది. అందులో రూ.115 కోట్లు బంగారు నిల్వలు మిగిలిన రూ.85 కోట్లు విదేశీ మారకద్రవ్య నిల్వలు.

కరెన్సీ ముద్రణాలయాలు: భారతదేశంలో కరెన్సీ నోట్లు, నాణేలు కింది ముద్రణాలయాల్లో ముద్రిస్తారు.

నాసిక్‌ (మహారాష్ట్ర): మన దేశంలో కరెన్సీ ముద్రణ కేంద్రాన్ని మొదటిసారి 1928లో నాసిక్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 1, 2, 5, 10, 100, 2000 (రూపాయలు) విలువైన కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారు. 

దేవాస్‌ (మధ్యప్రదేశ్‌): 1974లో బ్యాంక్‌ నోట్‌ (కరెన్సీ) ముద్రణ కేంద్రాన్ని దేవాస్‌లో నెలకొల్పారు. ఇందులో 20, 50, 100, 500, 2000 (రూపాయలు) విలువైన కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. 

మైసూరు (కర్ణాటక), సాల్బోని (పశ్చిమ బెంగాల్‌): 1995లో మైసూరు, సాల్బొనిలో ఆధునిక కరెన్సీ ముద్రణ కేంద్రాలను ఏర్పాటుచేశారు. భారత ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఈ శాఖల్లోనే కొత్త రూ.500, రూ.2000 నోట్లను ముద్రించారు.  

* మన దేశంలో నాణేల ముద్రణా కేంద్రాలు ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలో ఉన్నాయి.

ప్లాస్టిక్‌ కరెన్సీ: మనదేశంలో ప్లాస్టిక్‌ కరెన్సీని చెలామణిలోకి తేవాలని ఆర్‌బీఐ భావిస్తోంది. అందుకు అనుగుణంగా భారత్‌లో ప్రయోగాత్మకంగా అయిదు చోట్ల ప్లాస్టిక్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలనుకుంటోంది. అవి: మైసూర్, కొచ్చి, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్‌. ఇక్కడ రూ.10, రూ.100 ప్లాస్టిక్‌ నోట్లను చెలామణిలోకి తెస్తారు.

* ఆర్‌బీఐ 2009లో ప్లాస్టిక్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా తొలిసారి ప్లాస్టిక్‌ కరెన్సీని చెలామణిలోకి తెచ్చింది. 

* 2011 నాటికి ఏడు దేశాలు పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నోట్లను చెలామణి చేస్తున్నాయి. బంగ్లాదేశ్, బ్రెజిల్, కెనడా, హాంగ్‌కాంగ్‌  దేశాలు కూడా వీటిని వినియోగిస్తున్నాయి.

కెనడా తొలిసారి 2011 నవంబరులో 100 డాలర్ల ప్లాస్టిక్‌ నోటును విడుదల చేసింది. 

* ఆర్‌బీఐ ఏటా 2000 కోట్ల కరెన్సీ నోట్లను తయారు చేస్తోంది. వీటి తయారీ వ్యయంలో దిగుమతి చేసుకున్న కాగితం, సిరా ఖర్చే 40 శాతంగా ఉంటోంది. ప్రస్తుతం కరెన్సీ ముద్రణకు మనం జర్మనీ, జపాన్, బ్రిటన్‌ నుంచి కాగితం, సిరాను దిగుమతి చేసుకుంటుంన్నాం.

కరెన్సీ ముద్రణ - నిర్ణయం

*మనదేశంలో కరెన్సీ ముద్రణ అంశాన్ని ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఎంత ఉండొచ్చనే లెక్క తేలాక నగదు నిష్పత్తిని లెక్కిస్తారు. దీనిప్రకారమే ఎంత కరెన్సీ ముద్రించాలనేది నిర్ణయిస్తారు. 

2023, ఫిబ్రవరి 24 నాటికి మనదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల వద్ద చెలామణిలో ఉన్న నగదు రూ.33.31 లక్షల కోట్లు. 

ఎంత కరెన్సీని చెలామణిలోకి తేవాలనే అంశాన్ని నిర్ధారించే ముందు, డిజిటల్‌ చెల్లింపుల తీరు తెన్నులు ఎలా ఉన్నాయి, నగదు వినియోగం ఏ మేరకు పెరుగుతుంది, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, నగదు సరఫరాపై ప్రభావం చూపే ఇతర అంశాలు ఏమిటి మొదలైన అంశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తుంది. 


పెద్దనోట్ల రద్దు

మనదేశంలో ఇప్పటివరకు మూడు సార్లు పెద్దనోట్లను రద్దు చేశారు. 1946లో మొదటిసారి రద్దు చేశారు. 1978లో జనతా ప్రభుత్వ హయాంలో రెండోసారి; 2016 నవంబర్‌ 8న మోదీ ప్రభుత్వం హయాంలో మూడోసారి (రూ.500,  రూ.1000) జరిగింది.
ప్రభుత్వానికి బ్యాంకరు

ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాలకు 90 రోజుల కాలవ్యవధికి  ways and means advances రుణాలు ఇస్తుంది.

* కేంద్రప్రభుత్వం తన అవసరాలకు ఎంత మొత్తాన్నైనా ఆర్‌బీఐ నుంచి రుణంగా పొందొచ్చు. ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేస్తుంది.

విదేశీ మారకద్రవ్యనిధుల సంరక్షణ

మనం తరచూ రూపాయి మారకం విలువ అమాంతం పడిపోయిందని లేదా పెరిగిందని వింటుంటాం. విదేశీ మారకమే ఇందుకు కారణం. 

వివిధ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, రాజకీయ పరిస్థితులు కరెన్సీపై ప్రభావం చూపుతాయి

ఉదా: అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మన రూపాయలు చెల్లవు. కాబట్టి వాటిని డాలర్లుగా మార్చుకోవాలి. అలాగే వారు మన దగ్గరకి వచ్చినప్పుడు డాలర్లను రూపాయల్లో మార్చుకుంటారు.

* ఈ విధంగా మార్కెట్లో ఆయా కరెన్సీ లభ్యత, డిమాండ్‌ ఆధారంగా ఇతర కరెన్సీలతో పోలిస్తే దాని విలువ మారుతూ ఉంటుంది. బి డాలర్‌కి డిమాండ్‌ పెరిగితే రూపాయి బలహీనపడుతుంది. అలాగే రూపాయికి డిమాండ్‌ పెరిగితే అది బలపడుతుంది.

* రూపాయి హెచ్చు తగ్గులకు అనేక ఆర్థికాంశాలు కారణమవుతాయి. 

* ఎగుమతులు పెరిగినప్పుడు కంపెనీలకు ఆదాయం కింద ఎక్కువ డాలర్లు వస్తాయి. సహజంగానే వీటిని దేశీయంగా రూపాయల్లోకి మార్చుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో డాలర్ల లభ్యత ఎక్కువై రూపాయల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా రూపాయికి డిమాండ్‌ పెరిగి బలపడుతుంది. మరోవైపు దేశీ కంపెనీలు వేటినైనా దిగుమతి చేసుకుంటే వాటికి డాలర్లలో చెల్లించాలి. కాబట్టి దిగుమతులు ఎక్కువైతే డాలర్‌కి డిమాండ్‌ పెరిగి, అది బలపడుతుంది. 

* విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులను రూపాయల్లోనే పెట్టాలి, దీంతో డాలర్‌ విలువ తగ్గి రూపాయికి డిమాండ్‌ పెరుగుతుంది. అదే ఆ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులను విక్రయిస్తే, వాటికి డాలర్లలో చెల్లించాలి. కాబట్టి డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుంది.

* ఈ విధంగా తరచూ డాలర్, రూపాయి డిమాండ్‌లో మార్పుల వల్ల ఒకదానితో మరొకదాన్ని పోలిస్తే వాటి విలువలు మారుతూ ఉంటాయి.

2022-23 ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుతం మనదేశ మార్కెట్‌లో డాలర్‌కి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఒక డాలర్‌ విలువ రూ.81.88గా ఉంది. ఎగుమతులు ఆశించినంత లేకపోవడం, కరెంట్‌ ఖాతా లోటు పెరగడం దీనికి కారణం.

*ఆర్‌బీఐ అంచనాల ప్రకారం, వాణిజ్య లోటు పెరగడం వల్ల కరెంట్‌ ఖాతాలోటు 2022, సెప్టెంబరు చివరి నాటికి జీడీపీలో 4.4 శాతానికి చేరింది. 

*ఆర్‌బీఐ దగ్గర అనుమతి పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వేర్వేరు కరెన్సీలను రూపాయల్లోకి మార్చుకోవచ్చు లేదా రూపాయలిచ్చి ఆయా దేశాల కరెన్సీలను తీసుకోవచ్చు.

*ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంటి బ్యాంకుల్లో, కార్పొరేట్‌ స్థాయిలో ఎక్సిమ్‌ బ్యాంక్‌ (ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ బ్యాంక్‌), ఐడీబీఐ మొదలైనవాటిలో కరెన్సీ మార్చుకోవచ్చు. ఇవే ఆయా కరెన్సీలను కొనడం, అమ్మడం చేస్తుంటాయి. ఇందుకోసం కొంత కమీషన్‌ వసూలు

చేస్తాయి. 

* షేర్ల తరహాలో పెద్దస్థాయిలో రూపాయి లావాదేవీలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు ఉన్నాయి. వీటిలో రూపాయి విలువ ఇంతకు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని ట్రేడింగ్‌ జరుగుతుంది. ఎంసీఎక్స్, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో రూపే ట్రేడింగ్‌ జరుగుతుంది.

 

Posted Date : 12-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1- భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌