• facebook
  • whatsapp
  • telegram

 అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు (అంతర్జాతీయ ద్రవ్యనిధి-ఐఎంఎఫ్‌)

సంతులిత వృద్ధికి ద్రవ్య సహకారం! 


ఒకటి కంటే ఎక్కువ దేశాలు కలిసి స్థాపించిన ఆర్థిక సంస్థలే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు.  సభ్య దేశాలే అందులో వాటాదారులవుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మారకపు విధానం సక్రమంగా, సమతూకంగా పనిచేసేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం అభివృద్ధికి ఇవి దోహదపడతాయి. సంక్షోభాల కారణంగా చితికిపోయిన దేశాల పునర్నిర్మాణం, అల్ప ఆదాయ, వెనుకబడిన దేశాలకు ఆర్థిక చేయూత అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఇలాంటి సంస్థల ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం వాటి పనివిధానం, ప్రాధాన్యం వరకు పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. అంతర్జాతీయ ద్రవ్య సహకారం, రుణ వితరణలో కీలకమైన ఐఎంఎఫ్‌ నిర్మాణం, అందులోని కోటాలు, రుణ సహాయం అందించేందుకు అనుసరిస్తున్న విధానాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

అంతర్జాతీయంగా 1870 దశకం నాటికి స్వర్ణ ప్రమాణ స్థిర మారకపు రేట్లు స్థిరపడ్డాయి. ఈ ప్రమాణమే సుమారు 50 ఏళ్ల పాటు అంతర్జాతీయ వ్యాపారాన్ని వృద్ధి చేసింది. 1920 దశకంలో ఈ వ్యవస్థ కుప్పకూలడంతో అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో ఖాళీ ఏర్పడింది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ప్రపంచ దేశాలు దేశీయ నిరుద్యోగిత సమస్యను పరిష్కరించడానికి పోటీ పడి తమ కరెన్సీలను మూల్యహీనీకరణ చేశాయి. దీనినే అర్థశాస్త్రంలో ‘బెగ్గర్‌ మై నైబర్‌’ అంటారు. అదే సమయంలో ప్రతి దేశం దిగుమతి సుంకాలు విధించేది. ఫలితంగా అంతర్జాతీయ వ్యాపారం క్షీణించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా వైట్‌ ప్రణాళికను, బ్రిటన్‌ కీన్స్‌ ప్రణాళికను ప్రతిపాదించాయి. వీటి ఆధారంగా 1944లో బ్రిటన్‌ వుడ్స్‌లో జరిగిన ప్రపంచ దేశాల సమావేశంలో ప్రపంచ బ్యాంకు (ఐబీఆర్‌డీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఏర్పాటుకు నిర్ణయించారు. వీటినే ‘బ్రిటన్‌ వుడ్స్‌ కవలలు’ అంటారు.


ప్రపంచ యుద్ధాల వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సహాయాన్ని పెంపొందించేందుకు ఐఎంఎఫ్‌ కృషి చేస్తాయి. అలాగే అంతర్జాతీయ వ్యాపారంపై ఉండే ఆంక్షలను తొలగించి వ్యాపార విస్తరణకు వీలుగా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (ఐటీఓ)ను కూడా స్థాపించాలని నిర్ణయించారు. అయితే అమెరికన్‌ కాంగ్రెస్‌ ఐటీఓ స్థాపనను ఆమోదించకపోవడంతో ఐఎంఎఫ్, ఐబీఆర్‌డీ మాత్రమే ఏర్పడ్డాయి. ఐఎంఎఫ్‌ ప్రపంచ దేశాలకు స్వల్పకాలిక రుణాలను ఇస్తే, ఐబీఆర్‌డీ దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది.


అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌): ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న స్వతంత్ర సంస్థ. వాషింగ్టన్‌ ప్రధాన కార్యాలయంగా 1945, డిసెంబరు 27న ప్రారంభమైంది. 1947 నుంచి ఇది పనిచేస్తోంది. ఇందులో 30 ప్రారంభ సభ్య దేశాలుండగా, 2020 నాటికి అండోర్రా దేశంతో కలిపి సభ్యదేశాల సంఖ్య 190కు చేరింది. ఐఎంఎఫ్‌ ఆర్థిక సంవత్సరం మే 1 నుంచి ఏప్రిల్‌ 30. ప్రస్తుత ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  బల్గేరియాకు చెందిన క్రిస్టాలినా జార్జివా (2019 నుంచి అయిదేళ్ల వరకు). ఈ సంస్థ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాథ్‌ (2018 నుంచి).


ఐఎంఎఫ్‌ లక్ష్యాలు: 

 * అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని పెంపొందించడం. 


* బీఓపీలో స్వల్పకాల అసమతౌల్యాన్ని సరిదిద్దేందుకు సహకారం అందించడం. 


* వినిమయ రేటు స్థిరత్వాన్ని సాధించేందుకు సహకరించడం.


* అంతర్జాతీయ సంతులిత వ్యాపార వృద్ధికి సహకరించడం.


ఐఎంఎఫ్‌ పాలనా నిర్మాణం (బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌-బీఓజీ): ఐఎంఎఫ్‌లో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ బీఓజీ. దీనిలో ప్రతి సభ్య దేశానికి ఒక గవర్నరు, మరొక ప్రత్యామ్నాయ గవర్నరు ఉంటారు. సాధారణంగా ఆర్థిక మంత్రి/కేంద్ర బ్యాంకు గవర్నరు సభ్య దేశ గవర్నరుగా వ్యవహరించాలి. సభ్య దేశాల కోటాను పెంచడం, ఎస్‌డీఆర్‌లను కేటాయించడం, కొత్త దేశాలను అనుమతించడం, కార్యనిర్వాహక డైరెక్టర్లను ఎన్నుకోవడం లాంటి అధికారాలు బీఓజీకి ఉంటాయి. బీఓజీకి రెండు కమిటీలు సలహాలిస్తాయి. 

1) ఇంటర్నేషనల్‌ మానిటరీ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ 

2) డెవలప్‌మెంట్‌ కమిటీ.


ఎగ్జిక్యూటివ్‌ బోర్డు: 24 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఉంటుంది. బీఓజీ అధికారాలను ఇది అమలుచేస్తుంది. అయిదేళ్ల కాలానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఛైర్మన్‌గా బోర్డు ఎన్నుకుంటుంది.


ఐఎంఎఫ్‌ విధులు:  

1) పర్యవేక్షణ విధులు 

2) రుణాలకు సంబంధించిన విధులు 

3) సాంకేతిక సహాయ విధులు


సభ్య దేశాల కోటా: సభ్య దేశాలిచ్చే కోటా ఐఎంఎఫ్‌కి విత్త వనరుగా ఉపయోపడుతుంది. ఇది ఎస్డీఆర్‌ల రూపంలో ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ సాపేక్ష ప్రాధాన్యం ఆధారంగా కోటా ఉంటుంది. కోటాలో 25% విదేశీ కరెన్సీ రూపం (డాలర్లు, యెన్, యూరో లాంటివి)లో చెల్లించాలి. దీనిని రిజర్వ్‌ ట్రాంచ్‌ (ళి’(’౯్ర’ గి౯్చ-‘్త’్శ అంటారు. ప్రతి అయిదేళ్లకు దీనిని సమీక్షిస్తారు. కోటా ఆధారంగానే ఓటింగ్, రుణం తీసుకునే శక్తులు ఆధారపడి ఉంటాయి. ఒక దేశ జీడీపీ, విదేశీ వ్యాపారస్థాయి, అంతర్జాతీయ రిజర్వ్‌ల ఆధారంగా కోటాను నిర్ణయిస్తారు. ఈ విషయంలో జీడీపీకి 50 శాతం, విదేశీ వ్యాపారానికి 30 శాతం, ఆర్థిక చరత్వం 15 శాతం, అంతర్జాతీయ రిజర్వ్‌లకు 5 శాతం భాజితాన్ని ఇస్తారు. 1971 నుంచి కోటాలను ఎస్డీఆర్‌ఎస్‌లో నిర్ణయిస్తున్నారు. 2015 నుంచి ఎస్డీఆర్‌ నిర్ణయంలో అమెరికా డాలర్, జపాన్‌ యెన్, బ్రిటన్‌ పౌండ్‌తో పాటు చైనా కరెన్సీ రెన్‌మిన్‌బిని కూడా తీసుకున్నారు.


ఐఎంఎఫ్‌ విత్త సహాయం రాయితీ రుణాలు, రాయితీ లేని రుణాలుగా రెండు రకాలుగా ఉంటుంది.


రాయితీ రుణాలు: అల్ప ఆదాయం ఉండే సభ్య దేశాలకు రాయితీ రుణాలను సున్నా వడ్డీ రేటుకు ‘పావర్టీ రిడక్షన్‌ గ్రోత్‌ ట్రస్ట్‌ (పీఆర్‌జీటీ)’ కింద అందిస్తారు. అవి:


1) స్టాండ్‌ బై క్రెడిట్‌ ఫెసిలిటీ (ఎస్‌సీఎఫ్‌): స్వల్పకాల బీఓపీ సంక్షోభాన్ని నివారించేందుకు అల్ప ఆదాయ దేశాలకు రుణాలు అందిస్తుంది.


2) ఎక్స్‌టెండెడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ (ఈసీఎఫ్‌): అల్ప ఆదాయ దేశాలకు బీఓపీ సమస్యల నివారణకు మధ్యకాల, దీర్ఘకాల రుణాలను అందిస్తుంది.


3) ర్యాపిడ్‌ క్రెడిట్‌ ఫెసిలిటీ (ఆర్‌సీఎఫ్‌): అల్ప ఆదాయ దేశాలకు అత్యవసర బీఓపీ అవసరాల కోసం దీన్ని అందిస్తారు.


రాయితీ లేని రుణాలు: సభ్య దేశాలకు మార్కెట్‌ వడ్డీ రేటుకు రుణ సౌకర్యం కల్పిస్తాయి. అవి..


1) స్టాండ్‌ బై అరెంజ్‌మెంట్‌ (ఎస్‌బీఏ): సభ్యదేశాల బీఓపీ సమస్యలకు స్వల్పకాల రుణాలను అందిస్తాయి. ఇది కేవలం అల్ప ఆదాయ దేశాలకు మాత్రమే. ఈ రుణ కాల పరిమితి 12 నెలల నుంచి 18 నెలలు. గరిష్ఠంగా మూడేళ్లు.


2) ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (ఈఎఫ్‌ఎఫ్‌): అల్ప ఆదాయ దేశాలకు మధ్య, దీర్ఘకాల బీఓపీ సమస్యల పరిష్కారాలకు రుణాలను అందిస్తుంది.


3) ర్యాపిడ్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (ఆర్‌ఎఫ్‌ఐ): అత్యవసర బీఓపీ అవసరాలు తీర్చడానికి ఇచ్చే రుణాలు.


4) ఫ్లెక్సిబుల్‌ క్రెడిట్‌ లైన్‌ (ఎఫ్‌సీఎల్‌): విధానాలను అమలు చేయడానికి ఈ రుణాలు అందిస్తుంది. 


5) ప్రికాషనరీ అండ్‌ లిక్విడిటీ లైన్‌ (పీఎల్‌ఎల్‌): విధానాలు బాగా అమలుపరిచే సభ్య దేశాలకు ఈ రుణాలు అందిస్తారు.


* ప్రస్తుతం భారత్‌ అల్ప ఆదాయ దేశం కాదు. అందుకే రాయితీ రుణం లభించడం లేదు.


ఐఎంఎఫ్‌ విత్త వనరులు: 

 1) కోటా: సభ్యదేశాలు అందించే కోటా ప్రధాన విత్త వనరు. 


2) న్యూ అరేంజ్‌మెంట్‌ టు బారో (ఎన్‌ఏబీ): 40 సభ్య దేశాల నుంచి ఎన్‌ఏబీ ద్వారా రుణాలు తీసుకుంటాయి. 


3) ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు: కోటా, ఎన్‌ఏబీల తర్వాత సభ్యదేశాల విత్త అవసరాలు తీర్చేందుకు ఐఎంఎఫ్‌ ఈ రుణ ఒప్పందాలు చేసుకుంటుంది. దీనిలో కూడా 40 దేశాలున్నాయి. 


ఐఎంఎఫ్‌ ప్రధాన నివేదికలు


1) వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ):   సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్, అక్టోబరు) ప్రచురిస్తారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంచనాలను సభ్య దేశాల విధానాలను విశ్లేషిస్తుంది. వృద్ధిపై ప్రభావం చూపే నష్టభయాలను, అనిశ్చితత్వాలను తెలియజేస్తుంది.

2) గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ రిపోర్ట్‌ (జీఎఫ్‌ఎస్‌ఆర్‌): దీన్ని కూడా డబ్ల్యూఈఓ మాదిరిగానే ఏడాదికి రెండు సార్లు ప్రచురిస్తారు, ప్రపంచ విత్త మార్కెట్ల స్థిరత్వాన్ని అంచనా వేస్తుంది. విత్త, నిర్మాణాత్మక అసమతౌల్యాన్ని తెలియజేసి పరిష్కారాలను సూచిస్తుంది.

3) ఫిస్కల్‌ మానిటర్‌ రిపోర్ట్‌: ఇది ప్రభుత్వ విత్త అభివృద్ధిని విశ్లేషిస్తుంది.

4) ఎక్స్‌టర్నల్‌ సెక్టార్‌ రిపోర్ట్‌:  ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల బహిర్గత స్థితిని అంచనా వేస్తుంది.

5) రీజినల్‌ ఎకనమిక్‌ రిపోర్ట్‌: ప్రత్యేక ప్రాంతాల్లో దేశాల ఆర్థికాభివృద్ధి అవకాశాలను తెలియజేస్తుంది.


స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్డీఆర్‌): ట్రిఫిన్‌ ప్రణాళిక, బెర్నెస్టెయిన్‌ ప్రణాళికల ప్రకారం అంతర్జాతీయ ద్రవ్యత్వ సమస్య నివారణకు 1969లో ఎస్డీఆర్‌ను ప్రవేశపెట్టారు. వాణిజ్య బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని సృష్టించినట్లే ఐఎంఎఫ్‌ ఎస్డీఆర్‌లను జారీ చేస్తుంది. వీటిని పేపర్‌ గోల్డ్‌ అంటారు.


ప్రస్తుతం ఎస్డీఆర్‌ అనేది ఐఎంఎఫ్‌ ఖాతాలో ఒక భాగం (Unit of Account) లాంటిది (1SDR = 1.38 డాలర్లు).    అయితే ఎస్డీఆర్‌ విలువ నిర్ణయంలో అమెరికా డాలర్‌ 43.38%, యూరో 29.31% భారాలను కలిగి ఉన్నాయి.


ఎస్డీఆర్‌లోని ముఖ్యమైన దేశాల కరెన్సీల భారితాలు: 

* అమెరికా (డాలర్‌) - 43.38%  


* యూరో దేశాలు (యూరో) - 29.31%  


* చైనా (రెన్‌మిన్‌బి) - 12.28%  


* జపాన్‌ (యెన్‌) - 7.59% 


* ఇంగ్లండ్‌ (పౌండ్‌ స్టెల్లింగ్‌) - 7.40%


ఐఎంఎఫ్‌ జనరల్‌ కోటాలో భారత్‌కు 2.75 శాతం వాటా ఉంది. అధిక వాటా అమెరికా కలిగి ఉంది. 


(అమెరికా 17.69% , జపాన్‌ 6.47%, జర్మనీ 6.12%, యూకే 4.51%, చైనా 4.00%, భారత్‌ 2.75%, కెనడా 2.67%, రష్యా 2.50%.)


వాషింగ్టన్‌ కాన్‌సెన్సస్‌(Washington Consensus): ఐఎంఎఫ్‌ సభ్యదేశాలు కొన్ని విధానాలు, షరతులు అనుసరించినప్పుడే విత్త సహాయాన్ని పొందగలుగుతాయి. వీటిని వాషింగ్టన్‌ కాన్‌సెన్సస్‌ అంటారు. వాటిలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. అవి

 1) కరెన్సీ విలువ తగ్గించడం 

2) కరెన్సీని స్థిరీకరించేందుకు అధిక వడ్డీ రేట్లు

3) వ్యయాన్ని తగ్గించడం, సమతౌల్య బడ్జెట్‌ 

4) ధరల నియంత్రణలను, రాయితీలు తొలగించడం 

5) విదేశీ పెట్టుబడిదారుల హక్కులను పెంచడం

6) వ్యాపార సరళీకరణ 

7) సుంకాల సరళీకరణ


ఈ షరతులను అనుసరిస్తే బీఓపీ (బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) సంక్షోభాన్ని పరిష్కరించుకుని ఐఎంఎఫ్‌ రుణాన్ని తిరిగి తీర్చవచ్చు.


మాదిరి ప్రశ్నలు


1. స్వర్ణ ప్రమాణం పరిణతి చెంది విదేశీ వ్యాపారం ఎన్నేళ్ల పాటు సుస్థిరతను సాధించింది?

1) 40  2) 50  3) 60 4) 70


2. దేశీయ నిరుద్యోగితను పరిష్కరించడానికి దేశాలు తమ కరెన్సీని మూల్యహీనీకరణ చేయడాన్ని ఏమంటారు?

1) బెగ్గర్‌ మై నైబర్‌   2) బెగ్గర్‌ మై కంట్రీ   

3) కాంట్రిబ్యూట్‌ మై నైబర్‌   4) ఫైనాన్స్‌ మై నైబర్‌

 

3. బ్రిటన్‌ వుడ్స్‌ కవలలు అంటే...

1) ప్రపంచ బ్యాంకు, నాబార్డు   2) ఐఎంఎఫ్, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు

3) ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌   4) ఐఎంఎఫ్, రిజర్వ్‌ బ్యాంకు


4. అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించని సంస్థ-

1) ఐబీఆర్‌డీ     2) ఐఎంఎఫ్‌     3) ఐటీఓ     4) డబ్ల్యూటీఓ


5. ఐఎంఎఫ్‌ ఎలాంటి రుణాలు ఇస్తుంది?

1) దీర్ఘకాలిక   2) మధ్యకాలిక   3) స్వల్పకాలిక   4) పైవన్నీ


6. ఐఎంఎఫ్‌లో 190వ దేశం ఏది?

1) సియోల్‌   2) ఇథియోపియా   3) సోమాలియా   4) అండోర్రా


7. ఐఎంఎఫ్‌ కార్యనిర్వాహకవర్గంలో ఎంతమంది సభ్యులు ఉంటారు?

1) 190   2) 24  3) 16  4) 10


8. ఐఎంఎఫ్‌ కోటాను నిర్ణయించేటప్పుడు జీడీపీ ఎంత శాతం భారితం?

1) 30%   2) 50%  3) 15%  4) 5%


9. సభ్య దేశాలకు మార్కెట్‌ వడ్డీ రేటుకు అందించే రుణసౌకర్యాలు ఏవి?

1) రాయితీ రుణాలు   2) రాయితీ లేని రుణాలు   3) వడ్డీ రుణాలు   4) వడ్డీ లేని రుణాలు


10. వాషింగ్టన్‌ కాన్‌సెన్సన్‌ అంటే?

1) విధానాలు, షరతులు అనుసరించి విత్త సహాయాన్ని పొందడం

2) విధానాలు, షరతులు లేకుండా విత్త సహాయాన్ని పొందడం

3) విధానాలు, షరతులు పాటించకుండా ఉండటం

4) ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం పొందడం


సమాధానాలు: 

1-2, 2-1, 3-3, 4-3, 5-3, 6-4, 7-2, 8-2, 9-2, 10-1.

 

 

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

Posted Date : 25-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1- భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌