• facebook
  • whatsapp
  • telegram

దేశంలో నిరుద్యోగిత అంచనాలు

వృద్ధి బాగున్నా ఉపాధి అంతంతే!

 

 

ఏ దేశమైనా ఎదుర్కొనే సాంఘిక, ఆర్థిక సమస్యల్లో ప్రధానమైనది నిరుద్యోగం. అధిక జనాభా ఉన్న దేశాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచి నిరుద్యోగితను తగ్గించడం ప్రభుత్వాలు, విధానకర్తలకు నిరంతరం సవాలే. ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఉపాధి మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. అసలు నిరుద్యోగితను ఎలా అంచనా వేస్తున్నారు? ఇందులో ఉన్న రకాలేమిటి? ఉత్పత్తి పరిమాణం, వృద్ధి శాతానికి, నిరుద్యోగితకు ఎలాంటి సంబంధం ఉంటుంది? వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల శ్రామికులకు ఉన్న వ్యత్యాసాలు, శ్రామికుల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

భారత్‌లో నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి 1969లో ఎం.ఎల్‌.దంత్‌వాలా కమిటీ ఏర్పాటైంది. ఆ తర్వాత 1973లో బి.భగవతి కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రకారం ఒక వారంలో 14 గంటలు లేదా అంతకంటే తక్కువ గంటలు పనిచేసేవారిని నిరుద్యోగిగా, 14 నుంచి 28 గంటలు పనిచేసేవారిని అల్ప ఉద్యోగిగా, 28 గంటలకు మించి పనిచేసేవారిని ఉద్యోగిగా పేర్కొన్నారు

దేశంలో నిరుద్యోగ గణాంకాలను సేకరించే సంస్థ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ. దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక వ్యక్తి రోజుకు 8 గంటలకు తక్కువ కాకుండా, 273 రోజులు పనిచేసే వారిని ప్రామాణిక ఉద్యోగిగా పేర్కొంటారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన కొలమాన పద్ధతిని అనుసరించడం సాధ్యం కాదు. అందువల్ల ఎన్‌ఎస్‌ఎస్‌ఓ మూడు రకాల కొలమాన పద్ధతులను ఉపయోగిస్తుంది. అవి 1) సాధారణ స్థితి నిరుద్యోగిత  2) వారంవారీ స్థితి నిరుద్యోగిత 3) రోజువారీ స్థితి నిరుద్యోగిత

సాధారణ స్థితి నిరుద్యోగిత: సర్వే తేదీకి ముందు ఒక సంవత్సర కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఏడాదిలో ఏ కొద్ది రోజులు పని ఉన్నవారైనా ఈ రకమైన నిరుద్యోగిత కిందకురారు. ఇది 2004-05లో 2.3 శాతం, 2009-10లో 2.0 శాతం, 2011-12లో 2.2 శాతంగా ఉంది.

వారం వారీ స్థితి నిరుద్యోగిత: సర్వే జరిపే రోజుకు ముందు ఏడు రోజుల్లో ఏ ఒక్క రోజు పని దొరకని వారిని వారం వారీ నిరుద్యోగులుగా పరిగణిస్తారు. ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజైనా, ఒక గంట పని దొరికినా వారిని ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఇది 2004-05లో 4.4 శాతం, 2009-10లో 3.6 శాతం, 2011-12లో 3.7 శాతంగా ఉంది.

రోజువారీ స్థితి నిరుద్యోగిత: సర్వే జరిపిన రోజుకు ముందు ఏడు రోజుల శ్రమదినాల్లో ఏ ఒక్క రోజైనా కనీసం నాలుగు గంటలు లేదా ఆపై పనిచేసిన వారిని ఆ రోజు ఉద్యోగిత పొందినట్లు భావిస్తారు. లేకపోతే రోజువారీ నిరుద్యోగిగా భావిస్తారు. ఇది 2004-05లో 8.28 శాతం, 2009-10లో 6.6 శాతం, 2011-12లో 5.6 శాతంగా ఉంది.

* ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఆధారంగా నిరుద్యోగిత నివేదిక (2011-12)లో నాగాలాండ్, త్రిపుర, కేరళ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానాల్లో గుజరాత్‌ (26), సిక్కిం (27), మేఘాలయ (28) ఉన్నాయి.

* 2015-16లో లేబర్‌ బ్యూరో డేటా ఆధారంగా భారత్‌లో నిరుద్యోగిత రేటు 5 శాతం. 29 రాష్ట్రాల్లో నిరుద్యోగిత అధికంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా త్రిపుర, సిక్కిం, కేరళ. తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 23, తెలంగాణ 18వ స్థానాల్లో ఉన్నాయి.


భారతదేశంలో ఉద్యోగిత

ఉపాధి పరిమాణం అభివృద్ధి స్థాయిపై ఆధారపడుతుంది. ఉత్పత్తి పెరిగే కొద్ది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన దేశంలో సంస్కరణల తర్వాత వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ ఉపాధి వృద్ధి రేటు తక్కువగా ఉంది. అందుకే నిరుద్యోగిత పెరిగింది. దీన్ని ఆర్థికవేత్తలు ఉపాధి రహిత వృద్ధిగా పేర్కొన్నారు.

 

గిగ్‌ ఎకానమీ: దీర్ఘకాలిక ఉద్యోగాలకు బదులుగా స్వల్పకాలిక ఉపాధులను అధికంగా అందించే ఆర్థిక వ్యవస్థను గిగ్‌ ఎకానమీ అంటారు. ఉదాహరణకు డెలివరీ బాయ్స్, టెక్నాలజీ ఆధారంగా చేసే ఉద్యోగాలు. ప్రపంచంలో అతిపెద్ద గిగ్‌ ఆర్థిక వ్యవస్థ భారతదేశమే. ప్రముఖ ఆర్థికవేత్త ఓకున్స్‌ ప్రకారం జీడీపీ వృద్ధి రేటు 3 శాతం మించి ఉంటే నిరుద్యోగ రేటు 0.5 శాతం తగ్గుతుంది.

ఉదా: * జీడీపీ వృద్ధి రేటు 4 శాతం ఉంటే నిరుద్యోగ రేటు 0.5 శాతం తగ్గుతుంది.

          * జీడీపీ వృద్ధి రేటు 5 శాతం ఉంటే నిరుద్యోగ రేటు 1 శాతం తగ్గుతుంది.

          * జీడీపీ వృద్ధి రేటు 6 శాతం అయితే నిరుద్యోగ రేటు 1.5 తగ్గుతుంది.

          * జీడీపీ వృద్ధి రేటు 7 శాతం అయితే నిరుద్యోగ రేటు 2 శాతం తగ్గుతుంది.

 

 

 

వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉపాధి

వ్యవస్థీకృత రంగం: ఉపాధి షరతులు ఉండి, నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి. కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాల చట్టం వంటివి ఉంటాయి. కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన అనేక ప్రయోజనాలు ఉంటాయి.

అవ్యవస్థీకృత రంగం: ఎలాంటి ప్రభుత్వ చట్టాలు లేకుండా ఉన్న రంగాన్ని అవ్యవస్థీకృత రంగం అంటారు. చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి. కానీ వాటిని పాటించరు. 2011-12లో దేశ శ్రామికుల్లో 17.3 శాతం వ్యవస్థీకృత రంగంలో, 82.7 శాతం అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. 2017-18లో 19.2 శాతం వ్యవస్థీకృత రంగంలో, 80.8 శాతం అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి పొందుతున్నారు.

 

అవ్యవస్థీకృత రంగంలోని శ్రామికుల సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాలు

1) 2011 - స్వావలంబన పెన్షన్‌: ఇది ఆటోడ్రైవర్లు, వడ్రంగులు, పెయింటర్లకు వర్తిస్తుంది.

2) 2015 - అటల్‌ పెన్షన్‌ యోజన (18-40 సంవత్సరాలు): నెలకు కనీస పెన్షన్‌ రూ.1000, గరిష్ఠ పెన్షన్‌ రూ.5 వేలు

3) 2015 - ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన (18-50 సంవత్సరాలు): ప్రమాదవశాత్తు/అనారోగ్యంతో మరణిస్తే రూ.2 లక్షల బీమా సహాయం లభిస్తుంది. సంవత్సరానికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.436.

4) 2015 - ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (18-70 సంవత్సరాలు): ప్రమాదం వల్ల అంగవైకల్యం ఏర్పడితే రూ.2 లక్షల బీమా సహాయం లభిస్తుంది. సంవత్సరానికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.20.

5) 2019 - ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌: 60 సంవత్సరాలు దాటిన అసంఘటిత శ్రామికులకు నెలకు కనీసం రూ.3 వేలు పెన్షన్‌ ఇచ్చే పథకం.

 

నిరుద్యోగానికి కారణాలు

* ఉపాధి రహిత వృద్ధి  

* జనాభా పెరుగుదల

* సరిపడని సాంకేతిక పరిజ్ఞానం 

* సరిపడని విద్యావిధానం 

* వ్యవసాయంపై అధికంగా ఆధారపడటం

* తక్కువ ఆర్థికాభివృద్ధి

 

నిరుద్యోగితను తగ్గించేందుకు తీసుకునే చర్యలు

* ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేయడం.

* వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం.

* విద్యావిధానాన్ని పునర్‌ వ్యవస్థీకరణ చేయడం.

* జనాభా నియంత్రణ.

* వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం.

* పురా పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయడం.

* ఉపాధి పథకాలు అమలు చేయడం.

* మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం (2009 అక్టోబరు 2).

* నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత్వంపై జాతీయ విధానం (2015) 

* ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (2015) అమలు

* దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన (2014) అమలు

 

 

మాదిరి ప్రశ్నలు

1. నిరుద్యోగాన్ని అంచనా వేసిన బి.భగవతి కమిటీకి సంబంధించి సరైనది?

ఎ) వారం రోజుల్లో 14 గంటల కంటే తక్కువ గంటలు పనిచేసినవారు నిరుద్యోగులు.

బి) వారంలో 14 గంటల నుంచి 28 గంటలు పని చేసేవారు అల్ప ఉద్యోగులు.

సి) వారంలో 28 గంటలకు మించి పనిచేసేవారు ఉద్యోగులు.

1) సి మాత్రమే    2) ఎ మాత్రమే    3) బి మాత్రమే     4) ఎ, బి, సి

జ: ఎ, బి, సి

 


2. 2011 - 12 సంవత్సరంలో సాధారణ స్థితి నిరుద్యోగిత ఎంత?

1) 2.3%    2) 2.0%    3) 2.2%     4) 4.4%

జ: 2.2%

 


3. NSSO ప్రకారం నిరుద్యోగిత ఎక్కువగా, తక్కువగా ఉన్న రాష్ట్రాలు?

1) నాగాలాండ్‌ - గుజరాత్‌    2) త్రిపుర - సిక్కిం   3) నాగాలాండ్‌ - మేఘాలయ   4) త్రిపుర - గుజరాత్‌

జ: నాగాలాండ్‌ - మేఘాలయ

 


4. భారతదేశంలో సంస్కరణల తర్వాత వృద్ధి రేటు పెరిగినప్పటికీ ఉపాధి?

1) పెరిగింది    2) తగ్గింది    3) వేగంగా పెరిగింది  4) వేగంగా తగ్గింది 

జ:  తగ్గింది

 


5. కిందివాటిలో గిగ్‌ ఎకానమీకి సంబంధించి సరైంది?

ఎ) దీర్ఘకాలిక ఉపాధులకు బదులు స్వల్పకాలిక ఉపాధులు సృష్టించడం.

బి) టెక్నాలజీ ఆధారంగా పని చేసేవారు గిగ్‌ ఆర్థిక వ్యవస్థలో ఉంటారు.

సి) భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద గిగ్‌ ఆర్థిక వ్యవస్థ.

డి) శాశ్వత ఉపాధులను సృష్టిస్తుంది.

1) ఎ, సి మాత్రమే    2) ఎ, డి మాత్రమే   3) ఎ, బి, సి మాత్రమే    4) ఎ మాత్రమే 

జ: ఎ, బి, సి మాత్రమే

 


6. ఎవరి ప్రకారం జీడీపీ వృద్ధి పెరిగే కొద్దీ నిరుద్యోగం తగ్గుతుంది?

1) ఆర్ధర్‌ లూయిస్‌     2) ప్రొఫెసర్‌ ఓకున్స్‌    3) అమర్త్యసేన్‌     4) జె.ఎం.కీన్స్‌  

జ:  ప్రొఫెసర్‌ ఓకున్స్‌

 


7. 2011 - 12 నివేదిక ప్రకారం ఏ రంగంలో ఉపాధి తక్కువగా ఉంది?

1) ప్రాథమిక రంగం    2) ద్వితీయ రంగం    3) తృతీయ రంగం  4) ఉమ్మడి రంగం

జ: ద్వితీయ రంగం

 


8. పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ ఆధారంగా 2020 - 21 ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల వారిలో నిరుద్యోగిత ఎంత?

1) 2.7%   2) 4.2%    3) 5.0%     4) 2.1%

జ: 4.2%

 


9. ఏ రంగంలో నమ్మకంగా పని లభిస్తుంది?

1) వ్యవస్థీకృత రంగం   2) అవ్యవస్థీకృత రంగం    3) ప్రైవేటు రంగం   4) వ్యాపార రంగం

జ: వ్యవస్థీకృత రంగం

 


10. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది?

1) 18 - 40 సంవత్సరాలు      2) 18 - 50 సంవత్సరాలు    

3) 18 - 70 సంవత్సరాలు     4) 18 - 60 సంవత్సరాలు 

జ: 18 - 70 సంవత్సరాలు

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 30-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1- భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌