• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో జీవవైవిధ్యం   

భిన్నత్వంతోనే భద్రత.. స్థిరత్వం!
 


వేల రకాల వృక్ష, జంతు జాతులు, ఆవాస వ్యవస్థలను కలిపి జీవవైవిధ్యం అంటారు. జీవావరణ సమతౌల్యతకు ఆ భిన్నత్వం ఒక ప్రకృతి నియమం. ఆహారభద్రతకు, ఔషధాలకు, కోట్లాది ప్రజల జీవనోపాధికి, కరవు, వరదలు మొదలైన విపత్తుల నుంచి రక్షణకు, వాతావరణ స్థిరత్వానికి జీవవైవిధ్యం అవసరం. ప్రపంచంలో అత్యంత జీవివైవిధ్యం ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. అనేక రకాల స్థానీయ వృక్ష, జంతుజాలాలకు నిలయంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని హాట్‌స్పాట్లు, వాటి విస్తరణ పరిధి, ఇక్కడ మాత్రమే నివసించే జీవజాతులు, ప్రత్యేకతల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జీవవైవిధ్యం తగ్గిపోతుండటానికి కారణాలను అర్థం చేసుకోవాలి. 

భూమిపై ఉష్ణమండల ప్రాంతంలోని కేవలం 17 దేశాల్లోనే జీవవైవిధ్యం అత్యధికంగా ఉంది. వీటినే అధిక జీవవైవిధ్య దేశాలు అంటారు. ‘మెగా డైవర్సిటీ నేషన్‌’ అనే భావన మొదటగా 1988లో వాషింగ్టన్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌ సందర్భంగా తెరపైకి వచ్చింది. మెగా డైవర్సిటీ నేషన్‌గా గుర్తించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి.

అవి: 

 * ప్రపంచంలోని మొక్కల్లో కనీసం 5 వేల ఎండమిక్‌ వృక్షజాతులు ఉండాలి.

 * సరిహద్దుల్లో సముద్రావరణ వ్యవస్థలు ఉండాలి.

ఉదా: మడగాస్కర్, ఇండియా మొదలైనవి.

భారతదేశం 32,87,263 చదరపు కి.మీ.ల విస్తీర్ణంతో, ప్రపంచంలో ఏడో పెద్ద దేశంగా, ఆసియాలో రెండో పెద్ద దేశంగా ఉంది. మొత్తం భూభాగంలో మనదేశం వాటా 2.4%, జనాభాలో మాత్రం దాదాపు 18%. దేశ భౌగోళక విస్తీర్ణంలో 23.39% అడవులు, చెట్లు ఉన్నాయి. భారత ప్రధాన భూభాగం 8O4' - 37O6ఉత్తర అక్షాంశంలో, 68O7' - నుంచి  97O25' తూర్పు రేఖాంశంలో విస్తరించి ఉంది.

 15,200 కి.మీ.ల మేర భూ సరిహద్దు, 7,516 కి.మీ.ల మేర తీరప్రాంత సరిహద్దు ఉన్న భారతదేశంలో 4 హాట్‌స్పాట్లు ఉన్నాయి. ప్రపంచ జీవవైవిధ్యంలో 7 - 8% ఇక్కడే ఉంది.

ఎండమిజమ్‌: ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జీవజాతులను ‘ఎండమిక్‌ జాతులు’ అంటారు. ప్రపంచంలోని పుష్పించే మొక్కల్లో 12-15% భారతదేశంలో ఉన్నాయి. వీటిలో 33 శాతం స్థానిక జాతులు.

జీవవైవిధ్య సున్నిత ప్రాంతాలు: జీవవైవిధ్యం అధికంగా ఉండి, స్థానీయ జాతులు ఎక్కువ సంఖ్యలో ఉండి కాలక్రమేణా మానవ ప్రమేయం వల్ల వచ్చిన మార్పులతో సంఘర్షణకు గురై కొన్ని జాతులు అదృశ్యమయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలే జీవవైవిధ్య సున్నిత ప్రాంతాలు. ‘హాట్‌స్పాట్స్‌’ అనే పదాన్ని మొదటగా ‘నార్మన్‌ మేయర్స్‌’ (1988) వాడారు. ఒక ప్రదేశాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించాలంటే 2 కారకాలు ఉండాలి. అవి-  1) అంతర్జాతీయ స్థాయిలో గుర్తించిన స్థానీయ జాతులు కనీసం 0.5% నివసిస్తూ ఉండాలి లేదా కనీసం 1500 స్థానీయ జాతులుండాలి. 2) మానవ చర్యల వల్ల   సహజ సిద్ధమైన ఆవరణ దాదాపు 70% మార్పులకు గురై ఉండాలి.

 మొదటిసారిగా 1999లో 25 హాట్‌స్పాట్లను ‘కన్జర్వేషన్‌ ఇంటర్నేషనల్‌’ గుర్తించింది. ఈ సంస్థ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం హాట్‌స్పాట్‌ల సంఖ్య 36. ఇవన్నీ కలిసి ఆక్రమించే భూభాగం 2.4%. వీటి సంరక్షణకు ‘క్రిటికల్‌ ఎకోసిస్టమ్‌ పార్టనర్‌షిప్‌ ఫండ్‌’ నిధులు అందిస్తుంది.

భారత్‌లో హాట్‌స్పాట్స్‌:  దేశంలో మొత్తం హాట్‌స్పాట్‌ల సంఖ్య 4. అవి   1) హిమాలయాలు 2) పశ్చిమ కనుమలు 3) ఇండో - మయన్మార్‌ ప్రాంతం 4) సుండా ల్యాండ్‌.

హిమాలయాలు: ఈ ప్రాంతంలో 163 అంతరించిపోతున్న జాతులున్నాయి. ఇందులో వైల్డ్‌ ఏషియన్‌ వాటర్‌ బఫెలో, వన్‌-హార్న్‌ రైనో ఉన్నాయి. ఈ ప్రాంతం 10,000 వృక్ష జాతులకు నిలయం. వీటిలో 3,160 స్థానీయ జాతులు. హిమాలయ పర్వత శ్రేణి దాదాపు 7,50,000 చ.కి.మీ. విస్తరించింది.

ఇక్కడ కనిపించే ముఖ్యమైన వృక్షజాలం (ఫ్లోరా): ఎర్మానియా హిమాలయెన్సిస్, నెపంథిస్‌ ఖాసియానా, సప్రియా హిమాలయానా.

ఇక్కడ నివసించే ముఖ్యమైన జంతుజాలం (ఫానా): కశ్మీరీ దుప్పి, రైనో, పిగ్మీ హాగ్, ఆసియా వన్య కుక్క, హిమాలయన్‌ వెట్‌ బెల్లీడ్‌ మస్క్‌ డీర్, సాంగాయ్, రెడ్‌ పాండా.

పిగ్మీ హాగ్‌: అతి చిన్న వన్య పంది. ఇది సంవత్సరం పొడవునా గూడు నిర్మించుకుంటుంది.

మస్క్‌ డీర్‌: మగ మస్క్‌ డీర్‌ నుంచి  ఉత్పత్తయ్యే ‘మస్క్‌’ను పర్‌ఫ్యూమ్‌ తయారీకి వాడతారు.

సాంగాయ్‌: దీన్నే Eid's deer లేదా Tamin లేదా డాన్సింగ్‌ డీర్‌ అంటారు. ఇది ‘కీబుల్‌ లామ్‌జావో’ జాతీయ పార్కులోని లోక్‌తక్‌ సరస్సు ప్రాంతంలో నివసిస్తుంది.

హిమాలయాల్లో జీవవైవిధ్యం తగ్గడానికి  కారణాలు: జనాభా పెరుగుదల, అడవుల  నరికివేత, అటవీభూములను ఇతర అవసరాలకు మార్చడం, కార్చిచ్చు, భూపాతం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వేట మొదలైనవి.

పశ్చిమ కనుమలు:   భారతదేశంలో ఈ ప్రాంతం ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పడమటి కనుమలను సహ్యాద్రి పర్వతశ్రేణులు అని కూడా పిలుస్తారు. అగస్త్యమలై కొండల్లో మొక్కల వైవిధ్యం ఎక్కువ. వాస్తవానికి ఈ ప్రాంతంలోని వృక్ష సంపద 1,90,000 చ.కి.మీ. మేర విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడు 43,000 చ.కి.మీ. ప్రాంతానికే పరిమితమైంది. పడమటి కనుమల్లో కనీసం 325 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.

ఇక్కడ కనిపించే జంతుజాలం: కొండన ఎలుక, మలబార్‌ సివెట్, సింహం తోక కోతి, నీలగిరి తార్‌.

ఈ ప్రాంతంలో మలబార్‌ గ్రే హార్న్‌బిల్‌ అనే పక్షి రబ్బరు, కాఫీ తోటల్లో నివసించే ఒక ఎండమిక్‌ జాతి.

* 2011, ఆగస్టులో పడమటి కనుమల పర్యావరణశాస్త్ర నిపుణుల ప్యానెల్‌ మొత్తం పడమటికనుమలను పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించింది. దీన్నే ‘మాధవ్‌ గాడ్గిల్‌ ప్యానెల్‌’ అని కూడా అంటారు. ఈ ప్యానెల్‌ పశ్చిమ కనుమల్లో నిర్వహించిన పర్యావరణ, మైనింగ్‌ సర్వే తప్పులతడకగా ఉందని, ఆ కనుమల్లోని 60% భాగాన్ని పర్యావరణ సున్నిత ప్రాంతంగా (నిళ్ట్రీ) గుర్తించాలని నివేదికలో పేర్కొంది.

కస్తూరి రంగన్‌ కమిటీ: మాధవ్‌ గాడ్గిల్‌ నివేదికను పరీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ ఇది. ఈ కమిటీ మొత్తం పశ్చిమ కనుమల విస్తీర్ణంలో 37% ESA (ఎకలాజికల్‌సెన్సిటివ్‌ ఏరియా)గా ప్రకటించి ఆ ప్రాంతంలో మైనింగ్‌ ఆపాలని చెప్పింది.

పడమటి కనుమలను రక్షిత ప్రపంచ వారసత్వప్రదేశాల జాబితాలో చేర్చాలని 2006లో యునెస్కో ‘మ్యాన్‌ అండ్‌ ది బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌’కు భారత్‌     దరఖాస్తు చేసింది. 2012లో ఈ ప్రాంతంలోని 48 ప్రాంతాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు.

ఇండో - మయన్మార్‌ హాట్‌స్పాట్‌: ప్రపంచంలోని 36 గుర్తింపు పొందిన హాట్‌స్పాట్‌ల్లో ఇది అతిపెద్దది. మొత్తం వైశాల్యం 23,73,000 చ.కి.మీ. బ్రహ్మపుత్ర నది చుట్టూ మైదానాల్లో వ్యాపించింది. హిమాలయాలను మినహాయించి భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం, థాయిలాండ్, వియత్నాం, దక్షిణ చైనా సరిహద్దులు దాటి విస్తరించి ఉంది.

ఇక్కడి ముఖ్యమైన ఫ్లోరా: ఆర్కిడ్స్, వెదురు, అల్లం జాతులు.

ముఖ్యమైన ఫానా: మంచినీటి తాబేళ్లు, హౌలాక్‌ గిబ్బన్, క్యాట్‌ ఫిష్, సారస్‌ క్రేన్,  ఇరవాడీ డాల్ఫిన్‌.

ఇండో - మయన్మార్‌ ప్రాంతంలో జీవవైవిధ్యం తగ్గడానికి కారణాలు: రోడ్లు, రైల్వేల నిర్మాణం; వంతెనలు, ప్రాజెక్టుల కట్టడాలు; వేట, బ్రహ్మపుత్ర నది వరదలు మొదలైనవి.

సుండా ల్యాండ్‌ హాట్‌స్పాట్‌: పశ్చిమ ఇండో - మలయన్‌ ద్వీపసమూహం మీదుగా హిందూ మహాసముద్రం కింద ఉన్న టెక్టోనిక్‌ పలకల వరకు విస్తరించింది. భారతదేశంలోని నికోబార్‌ ద్వీపం సుండాల్యాండ్‌ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లో ఒక భాగం.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 
 

Posted Date : 06-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు